సౌల్ బెల్లో 1976లో నోబెల్ ప్రైజ్ సంపాదించిన అమెరికన్ రచయిత. National book award for fiction మూడు సార్లు సంపాదించిన ఏకైక ప్రపంచ రచయిత. వీరి నవలిక THE ACTUAL మానవ సంబంధాలను అద్భుతంగా చిత్రించిన నవల. జీవితంలో మనం ఎందరిని కలిసినా, ఎన్ని బాధ్యతలను నిర్వహించినా మన మనసుకు దగ్గరయిన వ్యక్తులు మన మధ్య లేకపోయినా, మన జీవితంలో వారి ప్రమేయం లేకపోయినా వారితో ఏర్పడ్డ మానసిక అనుబంధం, మనల్ని చాలా విషయాలలో నడిపిస్తూ ఉంటుంది. మనిషిని ప్రభావితం చేసేవి ఆ మానసిక అనుబంధాలే. మిగతావి అన్నీ కూడా స్టేజీ మీద నటుడు పాత్ర పోషించినట్లు మన జీవితం అనే నాటకంలో ప్రపంచం అనే స్టేజీ మీద మనం పోషించే పాత్రలే. మన మనసు మాత్రం కేవలం దానికి దగ్గరయిన వ్యక్తుల ప్రభావంలోనే ఉండిపోతుంది. ఆ ప్రభావమే జీవితాంతం తోడుంటుంది. ఈ విషయాన్ని ఈ నవలికలో ప్రతి పాత్ర ద్వారా రచయిత చెప్పించే ప్రయత్నం చేస్తారు.
కన్న తల్లిదండ్రులు బాధ్యత తీసుకోలేకపోతే హారీ అనే ఒక వ్యక్తి అనాథ శరణాలయంలో పెరుగుతాడు. చిన్నప్పటి నుండి అందువలన అతనిలో ఎంతో అభద్రతా భావం నిండి ఉంటుంది. చైనీస్ పోలికలతో ఉన్న అతన్ని తోటి వ్యక్తులు తమతో సమానంగా స్వీకరించరు. షికాగో నగరంలో ఈ మొత్తం కథ నడుస్తుంది. హారి మేధస్సు విశిష్టమైనది. అపారమైన తెలివితేటలు అతని సొంతం. అతనిలోని ఆ మేధో సంపత్తి కారణంగా కూడా మామూలు వ్యక్తులు అతన్ని అర్థం చేసుకోలేరు. అతను ఎవ్వరితో కలవలేడు. అందువలన ఒంటరిగానే స్నేహితులు లేకుండా తన చిన్న ప్రపంచంలో మిగిలిపోతాడు హారీ. ఆమీ ని చిన్నప్పటినుండి ప్రేమిస్తాడు. కాని తన మనసులో ఆమెపై ఉన్న ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరచడు. అది అతనికి చేతకాదు. ఆమి వివాహం ఇంకొకరితో జరిగిపోతుంది. భర్త నుండి విడాకులు తీసుకుని హారీ మిత్రుడు జై ని ఆమె మళ్ళీ వివాహం చేసుకుంటుంది. జై ఒక తిరుగుబోతు. వివాహం పట్ల అతనికి పెద్ద బాధ్యత ఉండదు. ఎందరో స్త్రీలతో వివాహం తరువాత కూడా అతనికి సంబంధాలు ఉంటాయి. కాని ఆమీ తనను మోసం చేసిందని ఒక కథ సృష్టించి దాని ఆధారంగా ఆమీ నుండి విడాకులు కోరుకుంటాడు. కొన్ని ఆడియో టేపులను సంపాదించి ఆమికి మరొక వ్యక్తితో సంబంధం ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. కోర్టులో ఆ టేపులను చూపించి సులువుగా విడాకులు సంపాదిస్తాడు. కొన్ని రోజుల తరువాత అతను జీవితంలో అన్నీ ఓడిపోయిన వ్యక్తిగా మిగిలిపోయి ఆ దుఃఖంతో మరణిస్తాడు. లాయర్‌గా తన పేరు, పరపతి కేవలం తన నడవడిక, అహంకారం కారణంగా పోగొట్టుకుని ఒంటరిగా మరణిస్తాడు జై. అమీ జై నుండి విడిపోయాక ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తూ పేరు సంపాదించుకుంటుంది. కొత్త జీవితం ఆమెకు ఆనందంగా సాగిపోతూ ఉంటుంది.
అడ్లెస్కీ దంపతులు ఇద్దరి వయసు తొంభైకి దగ్గరగా ఉంటుంది. ఆ వయసులో వారు తమ కోసం ఒక కొత్త ఇంటిని అన్వేషిస్తూ ఉంటారు. వారు జీవితాన్ని ఆఖరి దాకా ఆనందంగా గడపాలనుకునే జంట. వయసు వారికి అడ్డం కాదు. ఆ జంట ఒక ఇంటిని చూసి దాని ధర నిర్ణయించమని అమీని తమ అడ్వైజర్‌గా నియమిస్తారు. ఆ ఇల్లు బోడొ అనే ఒక వ్యక్తిది. అతని భార్య మాడ్జ్ జైలులో ఉంటుంది. తన స్నేహితుడితో భర్తను చంపే ప్రయత్నం చేసి, పట్టుపడి ఆమె శిక్ష అనుభవిస్తూ ఉంటుంది. జైలు నుండి విడుదలయిన తరువాత భర్త మీద ఆమెకు ప్రేమ పెరిగి అతని వ్యక్తిత్వం అర్థం అయ్యి వారి ఇద్దరూ మళ్ళీ వివాహం చేసుకుంటారు.
హారి మరో సారి అమీని కలుసుకుంటాడు. ఆమె రెండు వివాహాలు చేసుకున్నా గాని, తన జీవితంలో ఎన్నో మార్పులు జరిగినా కాని, తానిప్పటికీ ఆమెనే ప్రేమిస్తున్నానని అతనికి అర్థం అవుతుంది. ఆమీ భర్త శవ పేటికను మరో చోటకి తరలించవలసిన ఒక అవసరం ఏర్పడుతుంది. కోర్టు అతని సమాధి మార్చమని ఒక సందర్భంలో అమీకు నోటిస్ పంపుతుంది. ఆ పని జరుగుతున్నప్పుడు మరో సారి ఆమీతో ఒంటరిగా ఉండే అవకాశాం రాదని గ్రహించి హారి ఆమెకు స్మశానంలో తన ప్రేమను విన్నవించుకుంటాడు.
చాలా వరకు పాశ్చాత్య జీవన శైలిని ప్రతిబింబించినా ఈ నవలలో మానవ సంబంధాలలోని సంక్లిష్టత పై రచయిత చేసిన అధ్యయనం కనిపొస్తుంది. ప్రేమ అనేది చాలా గొప్ప భావన అని, ఒక వ్యక్తిపై కలిగిన అ భావం ఎన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా సజీవంగా నిలిచి ఉంటుందని హారి, బోడొ పాత్రల ద్వారా రచయిత చెప్పే ప్రయత్నం చేస్తారు. భర్త శవపేటిక ఒక చోటూ నుండి మరో చోటికి తరలిస్తున్న ఆమీ అక్కడ నిర్వర్తించేది తన బాధ్యత మాత్రమే. అ భర్త ఆమె నుండి విడాకులు పొందడానికి చేసిన మోసం, దాని వల్ల ఆమె హృదయానికి అయిన గాయం అపారం. అక్కడ ప్రేమ లేదు. అందుకే ఆ సమయంలో హారి ఆమీకి తన ప్రేమ విషయం చెప్పడం తప్పుగా అనిపించదు. ప్రపంచంలో ప్రేమ కాకుండా కేవలం బాధ్యత కోసం మనిషి చేసే పనులు, ప్రేమకు అడ్డు రావు. బోడొ కూడా తనను చంపాలని ప్రియునితో కలిసి విఫలం అయి జైలు శిక్ష అనుభవించి ఒంటరయిన తన భార్యను మళ్ళీ అంతే ప్రేమతో తన జీవితంలోకి మరల ఆహ్వానిస్తాడు. ఆమెపై అతనికి ఉన్న ప్రేమ ఆమె హత్యా ప్రయత్నంతో కూడా తగ్గిపోదు. ఆమెతో తరువాత కూడా ఆనందంగా జీవించడానికి సిద్ధపడతాడు. నిజమైన ప్రేమ ఎటువంటి పరిస్థితులలో కూడా తగ్గదని ఈ రెండు పాత్రలూ నిరూపిస్తాయి. మిగతావన్ని మనం నిర్వర్తించే బాధ్యతలే.
అదే గొప్ప భావన వృద్ధుడయిన అడ్లెస్కీకి తన భార్య పట్ల ఉంటుంది. తొంభయ్ ఏళ్ళు పైబడ్డాక కూడా అమెతో జీవితాన్ని గడపడానికి తమకో సొంత ఇల్లు కావాలని అతను కోరుకుంటాడు. ఆ ఇల్లు ఆమె ఆభిరుచితో ఉండాలని ప్రయత్నిస్తాడు. ఈ నవలలో ప్రేమ అనే భావం మనిషిని తనను తాను ఇతరులకు ఎలా సమర్పించుకోవడానికి ప్రేరేపిస్తుంది అన్నది చూపించే ప్రయత్నం చేసారు రచయిత. నిజమైన ప్రేమ ఒకరి పట్ల జనిస్తే దాని ముందు, అన్ని అహంకారాలు, ఆలోచనలు, ఈగోలు ఎంత తక్కువగా అనిపిస్తాయో చెబుతుంది ఈ నవల. అలాగే వివాహేతర సంబంధాలలో ఉండని స్థిరత్వాన్ని కూడా ఈ నవల చర్చిస్తుంది. ఎన్ని అనుభవాలు ఉన్నా ఒక స్థిరమైన బంధం కోసం మానవ మనసు పడే తపనను గొప్పగా చూపించే నవల ఇది. మానవ సంబంధాలను ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలలో ప్రేమ లేకపోతే అవి ఎంత నిర్వీర్యంగా మారతాయో చెప్పిన నవల ఇది. భిన్న సంస్కృతుల మధ్య కూడా విభిన్నమయిన జాతులు మతాల నడుమ కూడా ఈ ప్రేమ కోసం మానవ మనసు పడే తపన ఒకేలా ఉంటుంది. ఈ భూమి పై జన్మించిన ప్రతి వ్యక్తి ప్రేమకోసం ఒకే రకంగా స్పందిస్తాడు. హృదయ భాష, వేదన ప్రతి మానవుడిలో ఒకేలా ఉంటుంది. అందుకే పూర్తి పాశ్చాత్య జీవనవిధానాన్ని వర్ణిస్తున్నా ఈ నవలతో మనం అందరం కనెక్ట్ కాగలుతాం. THE ACTUAL మనిషి నిజంగా తన జీవిత ప్రయాణంలో ఏం కోరుకుంటాడో దేని కోసం అన్వేషిస్తాడో, ఎక్కడ మానసిక ప్రశాంతత పొందగలడో చర్చించిన నవల. అందుకే ఇది ఎప్పుడో చదివినా, ఎక్కువగా ఎవరూ ప్రస్తావించకపోయినా నాకు గుర్తుండి పోయింది. చిన్న నవల ఇది. 1997లో వ్రాసిన ఈ నవల కేవలం 104 పేజీలే ఉంటుంది. కాని మంచి ప్రేమ కథగా దీన్ని గుర్తుపెట్టుకుంటాం.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™