[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


అయోమయంలో.. సామాన్యుడు..!!
“కనీసం ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడైన ఉండాలా..” అన్నాడొక పెద్దాయన. గుడ్డ, నీడ, సంగతి ఎలా వున్నా మనిషి బ్రతికి బట్టకట్టడానికి కూడు తప్పని సరి. ఆ కూడు లేదా తిండి విషయంలో సామాన్యుడి పరిస్థితి అయోమయంలో పడింది. తమ సంపాదనకు, బయటి వస్తువుల ధరలకూ పొంతన లేకుండా పోయింది. కష్టజీవికి కడుపు నిండా కూడు తినే రోజులు పోయాయి. ‘ఆకాశం అందుకునే ధరలొకవైపు..’ అని మహాకవి శ్రీశ్రీ ఎప్పుడో ఊహించి చెప్పాడు. అది అప్పటికీ, ఇప్పటికీ, మరి ఎప్పటికీ చెప్పుకోవలసిన మాటే!
మరి ఈ పరిస్థితిని అదుపు చేసేది ఎవరు? వస్తువుల ధరలను నియంత్రించలేని అధికారులు, ప్రభుత్వం ఎవరి కోసం, ఎందుకు పని చేస్తున్నట్టు? ఎవరి సంక్షేమం కోసం వారు పాటుపడుతున్నట్టు?
ఉద్యోగస్థులకు జీతం భరోసా ఉంటుంది, ఇబ్బంది లేదు. వ్యాపారస్థులకు అసలు ఇబ్బంది లేదు. ఉద్యోగస్థుల జీతాలు పెరిగినప్పుడల్లా స్వేచ్ఛగా వీరు రేట్లు పెంచేస్తారు. అందుచేత బయటి వస్తువుల రేటు ఎంత పెరిగినా, వీరు దాని గురించి పట్టించుకోరు, పెద్ద ఇబ్బంది కూడా పడరు. ఎటొచ్చీ, కూలీనాలీ చేసుకునే సామాన్య, పేద ప్రజానీకానికి అసలు సమస్య. వారి దినసరి కూలీరేట్లు పెరగవు, కనీస అవసర వస్తువుల ధరలు తగ్గవు. మరి ఈ ప్రజలు బ్రతికి బట్టకట్టేదెలా? వాళ్ళు తిండి లేక పస్తులు పడుకోవలసిందేనా? ఇంత సమస్యాత్మక విషయాన్ని ప్రజా ప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాయి? రైతును అందరూ కలసి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
నిత్యావసరాల్లో అవసరమైన కూరగాయల పరిస్థితి ఇప్పుడు ఎలా వుందో అందరికీ తెలిసిన విషయమే! ఈ రోజున అన్ని రూపాల్లోనూ చర్చకు వస్తున్నది ‘టమాటో’ అన్న విషయం అందరికీ తెలిసిందే! అయితే అన్ని రేట్లు పెరుగుతున్నప్పుడు టమాటో రేట్ల ప్రస్తావన ఎందుకు? అని కొందరు మహానుభావులకు అనిపించవచ్చు. అయితే, కోటీశ్వరులనుండి అతి సామాన్యుల వరకూ వాడేది ‘టమాటో’. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఊహించని రీతిలో ధరలు పెరిగినప్పుడు, కనీసం టమాటో లాంటి కూరగాయ కూడా ఆకాశాన్ని అంటే ధరకు చేరుకున్నప్పుడు సామాన్యుడు బ్రతికేదేలా?
మొన్నటి వరకు ఉల్లిపాయ ధర ఒక ఊపు ఊపింది. కొద్ది శాతం మంది ఉల్లిపాయ తమ వంటకాల్లో ఉపయోగించనప్పటికీ, ఎక్కువ శాతం ప్రజానీకం ఇష్టంగా ఉల్లిపాయ తింటారు. ఉల్లి ధర అంచనాలకు మించి దేశవ్యాప్తంగా పెరిగిపోయినప్పుడు, దాని ప్రభావం ప్రజల మీద, ప్రజా జీవితం మీదా ఎంత పడి ఉంటుందో ఊహించవచ్చు.
అప్పట్లో ఉన్న కొద్దీ ఇంటిస్థలంలోనూ కొంత భూమిలో కూరగాయలు పండించుకునేవారు. సరిహద్దు దడుల మీద, సొర, బీర, గుమ్మడి, పొట్ల, కాకర వంటి పాదులు పెంచి కూరగాయలు పండించుకునేవారు. తమ అవసరాలకు సరిపడా ఉంచుకుని, మిగతావి ఇతరులకు పంచేవారు. ఆకుకూరలు పుష్కలంగా పండించేవారు. ఇప్పుడు పల్లెల్లో సైతం ఈ సంస్కృతికి చెల్లుచీటీ పలికేసారు. అందరూ రైతులమీద ఆధారపడుతున్నారు. దురదృష్టవశాత్తు పెట్టుబడులు పెట్టలేక చాలా మంది రైతులు పండించడం మానుకుంటున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పక్క ప్రాంతాలు కూడా పంటలకు స్వస్తి పలికి, రొయ్యల కయ్యలతో లాభాల ఆర్జనలో పడి, ధాన్యం కూరగాయలు పండించడం మానేయడం వల్ల ప్రకృతి సిద్ధమైన భూమి బలం తగ్గిపోవడమే కాకుండా కాలుష్యానికి తెర లేపుతున్నారు. భవిష్యత్తులో మనం ధాన్యమే కాదు, కూరగాయలు సైతం దిగుమతి చేసుకోవలసిన దురదృష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ రోజున, పచ్చిమిరపకాయలు, టొమాటోలు కిలో 150/- రూపాయలకి కొనుక్కునే పరిస్థితి ఏర్పడడం దానికే సంకేతంలా కనిపిస్తున్నది. రూపాయి విలువను గురించి కూడా ఆలోచించవలసి వస్తున్నది.
1965లో అనారోగ్య రీత్యా నేను మా స్వగ్రామం దిండి నుండి హైద్రాబాద్‌లో ఉంటున్న పెద్దన్నయ్య శ్రీ కె. కె. మీనన్ దగ్గరకి వచ్చ్హాను. అప్పుడు అన్నయ్య కుబ్దిగూడా (చాపెల్ బజార్ – కాచిగూడ దగ్గర) ఉండేవాడు. అప్పుడు కూరగాయల మార్కెట్‌కు నన్ను కూడా తీసుకువెళ్ళేవాడు. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం, కిలో టొమాటోలు కేవలం పది పైసలు!
కూరగాయల అమ్మీ ఇంకో కిలో తీసుకోమని బ్రతిమాలేది. అప్పటి పది పైసల విలువ అంతటిది. అప్పటి నుండి ఇప్పటి వరకూ మా ఇంట్లోకి కావలసిన కూరగాయలు నేనే తెస్తాను. ఇతరులమీద అసలు ఆధారపడను. అందుచేత వాటి పెరుగుతున్న విలువ నాకు బాగా తెలుసును. ఒక ప్రక్క రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదనే బాధ, మరో వైపు, సామాన్యుడికి కూరగాయలు అందుబాటులో ఉండడం లేదన్న వ్యథ ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. అందుచేత, ఇంటి ప్రాంగణంలో వున్న కొద్ది నేలలో పూలమొక్కలకు బదులు, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు పండించాలి, స్వంతంగా ఉపయోగించుకోవాలి. నేల పరిస్థితిని బట్టి, అరటి చెట్లు, జామపండ్లు, మామిడికాయల చెట్లు పెంచుకోవాలి. దీనివల్ల ఎవరికైనా కొంతలో కొంత ప్రయోజనం ఉంటుంది.
నా మట్టుకు నేను హన్మకొండలోని నా ఇంటి ప్రాంగణంలో, అరటి చెట్లు, జామచెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు పెంచుకుంటున్నాను. మనం పండించుకున్నవి మనం తినడం ఎంతో తృప్తిని కలిగిస్తుంది కదా!


రచయిత ఇంట్లో అరటి చెట్టుకు మెగా అరటి గెల(హన్మకొండ)


రచయిత ఇంటి ప్రాంగణంలో, అరటి చెట్టుకు మామూలు అరటి గెల
ప్రముఖ ప్రపంచ నాస్తికవాది స్వర్గీయ శ్రీ గోరా (గోపరాజు రామచంద్రరావు, నాస్తిక కేంద్రం, విజయవాడ) పూలమొక్కలకు బదులు కూరగాయలు పండించమని ప్రోత్సహించేవారు. వారి ఇంటి పెళ్లిళ్లకు పూలదండలకు బదులు, కూరగాయ దండలు వాడేవారు.
నిత్యావసర వస్తువులు నిలకడ ధరలుగా కొనసాగడానికి, ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవలసిందే! జనాలను ఉచితాల వైపు ప్రలోభపెట్టకుండా, ధరల విషయంలో శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టాలి. ఎలెక్షన్లలో వట్టి హామీలను కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడే పథకాలు చేపట్టాలి.
ప్రజలను పక్కదారి పట్టించే పథకాలు ఎక్కువకాలం మనలేవు.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
28 Comments
Sagar
సామాన్యుడి ఘోష మీలాంటి వారికే తప్ప ప్రభుత్వాలకు ఎందుకుంటుంది సర్. మీరన్నట్లు రైతు గురించి ప్రభుత్వం పట్టించుకొనే పని ఉంటే ఈరోజు రైతుకు ఇన్ని బాధలెందుకు? చూద్దాము భవిష్యత్తు లో నైనా మార్పు వస్తుందేమో? మంచి వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యొస్మీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Good morning
అయోమయంలో అల్ప జీవులు
మనుగడ మరింత భారం
ప్రస్తుత కాలానికి తగ్గట్టు
రచన భూత భవిష్యత్ వర్తమాన జ్ఞాపకాలకు ఒక నెలవు
శుభాకాంక్షలు
అభినందనలు
—-ప్రొ. నాగులు
USA
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు గురూజీ…
డా కె.ఎల్.వి.ప్రసాద్
కూరలు, తిండి గింజలూ నిత్యావసరాలు. పంట మనకి సరిపోక ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దాంతో అమెరికాలో షాపుల్లో బియ్యం కొనుగోలు చెయ్యడానికి ఎగబడి లూటీల చేస్తున్నంత పరిస్థితి వచ్చినట్లు టీవీల్లో చూస్తున్నాం. పంట పొలాలు ఇళ్లకి, పరిశ్రమలకి, ఇతర అవసరాలకు వాడేస్తూవుంటే ఇక పంట ఎలా పెరుగుతుంది. రైతు అమ్మిన పంటకు సకాలంలో డబ్బు చెల్లించకుండా ఆంధ్రలో రైతుల్ని ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఇదా రైతులను, పంటలనూ ప్రోత్సాహించడం? రైతు కష్టపడితే తిండి దొరకదు. వ్యవసాయాన్ని ప్రోత్సాహించకపోతే భవిష్యత్తులో సంక్షోభం తప్పదు.
—–సరసి
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు సరసి గారూ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd Mng Doctor garu,
Govt/politicians are unable to cintain the price rise because the Blackmarkateers are the main source of income for them.
There is no surprise if they encourage this activity.
This could be a delebrate act by the politicians.
—Suryanarayana Rao
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you for responding sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శుభోదయం
సామాన్యుడిని అయోమయంలో కాదు అగాథంలో పడేయడమే నేటి పరిస్థితిగా కన్పిస్తుంది. నేను వరంగల్ కృష్ణ కాలేజీలో చదివేపుడు మార్కెట్ నుండి కూరలు తెచ్చేదాన్ని. అప్పుడు చాల కూరలు ఎత్తుల్లో ( రెండున్నర కిలోలు ) అమ్మేవారు. టమాటాలు 20 పైసలకు ఎత్తు ఉండేవి. నేటి రేటు సామాన్యుడికే కాదు మధ్య తరగతి వారికీ అందుబాటులో లేదన్నది వాస్తవం. ఆలోచింపచేసే మీ ఙాపకాల పందిరి బాగుంది. 


—-డా.విద్యాదేవి.ఆకునూరు
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ సహ్రుడయ స్పందనకు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజమే 1975 – 80 సంవత్సరాల సమయంలో కూడా టమాటా ధర కిలో పది పైసలు.
అతిశయోక్తి కాదు అనుకుంటే 15 పైసలకు ఎత్తు (రెండున్నర కిలోలు) కొన్న అనుభవం కూడా నాకు ఉన్నది.
ఆలోచిస్తే
తప్పు ప్రభుత్వందేనా అధికారులదేనా …?
ఇంకా ఇతర కారణాలు అనేకం ఉన్నాయా అని కూడా అనిపిస్తుంది.
——అనిల్ ప్రసాద్.
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మీకు.
bnim
అభినందనలు సుశీలగారూ .. విహంగ వీక్షణంలో సూక్ష్మదర్శనం చేయించినందుకు అబినందనలు
Shyamkumar Chagal
నిత్యావసర, అత్యవసర వస్తువులధరల పెరుగుదల ప్రజల కొనుగోలు శక్తి అనబడే ఈ రెండిటి మధ్య ఉండే. వ్య త్యాసమే మన కష్టాలకి కారణం.
వ్యవసాయ ఉత్పత్తి ధరలు పెరగకపోతే రైతులు గగ్గోలు పెడతారు.
ఏదైనా ఒకటి రెండు పెరగగానే ప్రజలు గోల పెడతారు.
ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో కొత్తేం లేదు గాని రచయిత గారు అన్నట్లుగా ఎవరి ఇంటి పరిసరాల్లో వాళ్ళు కాస్త కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటే ఉత్తమం.
వ్యవసాయ ఉత్పత్తి ధరలకు ప్రభుత్వం కనుక అతిగా మద్దతు ధర ప్రకటిస్తే మార్కెట్లో వాటి ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందుల పాలు పడతారు. ఇవ్వకపోతే ,దళారులు వ్యవసాయదారులను మోసం చేసి లాభాలు దండుకుంటారు. ఇదొక విష వలయం.
అడపాదడపా ఏదైనా ఒక వస్తువు ధర అతిగా పెరిగినప్పుడు, ఆ కొద్ది రోజులు దాని వాడుకో వడం మానేస్తే దాని ధర అదంతా కదే దిగివస్తుంది.
మనం ఎలాగో అదే చేస్తున్నామనుకోండి.
పల్లెటూర్లలో జనాలకి చాలావరకు ప్రభుత్వం నుంచి అందే తాయిలం , రుణమాఫీలు వగైరాలతో వారి జీవితం కష్టపడకుండా సాగిపోతున్నదని మనం గమనిస్తున్నాం. కూరగాయలు పండించడం అనేది కొద్దిగా శ్రమ తో కూడిన పని. వాటి పంట విస్తీర్ణం తగ్గిందని తెలుస్తుంది.
అంతేకాక వాతావరణం లో ఊహించని అకస్మాత్తు తేడాల వల్ల పంట దిగుబడిపోయి ధరలు పెరగడం అనేది సహజం. ప్రకృతి, దీన్ని ఎవరు ఆపలేరు. ఈ సమయంలో వేరే దేశాల నుంచి లేదా వేరే రాష్ట్రాల నుంచి వాటిని దిగుమతి చేసుకోక తప్పదు. అదొక ఖర్చుతో కూడిన వ్యవహారం కనుక వాటి ధరలు పెరగక తప్పవు. ఫ్రీగా వచ్చే వాటిని అనుభవిస్తూ కష్టపడడం మానేసే ప్రజలకు త్వరలో ఇబ్బందులు తప్పవు. అటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటరు మహాశయుడు తన విజ్ఞతను అనుసరించి ఓటు వేసినప్పుడే ఇటువంటి ప్రజాస్వామిక రుగ్మతలు ఆగిపోతాయి. అంతవరకు మనం వేచి చూడాల్సిందే.
ప్రతి ఆదివారం మంచి విషయాన్ని మన ముందుకు చర్చకు నిలుపుతున్న రచయిత డాక్టర్ కె. ఎల్ వి ప్రసాద్ గారికి నా అభినందనలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమా…ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నా జోడిoపు:
కచ్చితంగా వ్యవసాయ – మార్కెటింగ్ ప్రభుత్వ విధానాల్లో లోపం ఉంది. ఒక ప్రభుత్వం అని కాదు. అన్ని ప్రభుత్వాలు.
నినాదానికి రైతు కావాలి.
నిర్లక్ష్యానికీ రైతే కావాలి.
ఎవరికి వారు కొంత పండించుకోడం ఒక మంచి మార్గమే కానీ కేవలం ఆదర్శమే అది.
ఎందరికి విడి విడి ఇళ్ళు ఉన్నాయి?
Apartments culture లో ఎలా సాధ్యం?
పండిoచుకొనేంత స్థలాలు ఏవీ?
మొదలైన అనేకం.
ఉత్పత్తి – డిమాండ్ – మార్కెట్
లను సమన్వయo చేస్తూ ఉండే వ్యవస్థ కావాలి.
అవి ప్రభుత్వ వ్యవస్థల ద్వారా మాత్రమే ఎక్కువగా సాధ్యం అవుతుంది.
—–చక్రవర్తి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రైతు పండించిన ధాన్యం, పప్పులు, కూరగాయలు మార్కెట్ కి అక్కణ్ణించి వినియోగదారులకు చేరేటప్పటికి రేటు విషయంలో ఎంత తేడా ఉంటుందో మనం గుర్తిస్తున్నామా. రైతు బడ్జెట్ వేసుకొని వ్యవసాయం చేస్తే ఒక్కడు కూడా వ్యవసాయం చేయడు అని ఘంటాపథంగా పల్లెటూరిలో ఉంటున్న నేను చెప్పగలను. రేట్లు పెరగడం మార్కెట్ మాయాజాలమే. వినియోగదారుడు చెల్లించే డబ్బులో కనీసం 25 శాతం రైతులకు అందుతుందా అంటే సందేహమే. ఆ మొత్తంతోనే ఇంటిల్లిపాది బతకాలి. దిగంబరకవులు ఏనాడో చెప్పినట్టు కొత్తరకం కొజ్జాలు దేశం మీద పడ్డారు. ధన్యవాదాలండి.
—-ప్రొ.ఎన్.భక్తవత్సల రెడ్డి
తిరుపతి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు సర్ మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిత్యావసర ధరలు ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగటం ఆందోళనకరమే.నియంత్రణ చేయవలసిన ప్రభుత్వం చేతులెత్తేసింది, మీమానాన మిరు చావండని.1966 లో ఖమ్మలో నేను ఉద్యోగించానప్పుడు బియ్యం90రూ// బస్తా.ఇవాళ కాలోకి అంతధరపెట్టవలసివస్తున్నది. 60 _ 62 కు కిలో అనగూడదుగానీ డి ఏ లు పెంచమని ఆందోళన చేస్తున్నం ఉద్యోగులం కాని ధరలు తగ్గించమని ఎన్నడైనా ఆందోళన చేసినమా? రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనిప్రతిపక్షాలు ధర్నాలు చేస్తవికాని ఉద్యోగులం చేసినమా? మనకు రైతుల సమస్యలు పట్టవు
మనకు నెలతిరిగేవరకు అటో ఇటో జీతం చేతిలో పడుతున్నది కనుక మాట్లాడం లిక్కర్ ధర లెంతపెరిగినా బార్లు కలకల లాడుతునేవున్నవి. కొనుగోలు శక్తి వున్నది కనుక బార్లకు పోతున్నరు వేతన జీవులుకూడా.
కూరగాయలు ఇండ్లల్లో పండించూకోవడానికి వ్యక్తిగత ఇండ్లుండాలెగదా ! అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చినాక ఎట్ల. ఇండివిజువల్ ఇండ్ల వాళ్ళు కూడా చిన్నజాగా మిగిలితే చిన్నగదివేసి కిరాయలకు ఇస్తున్నరు .తమ బండ్లు రోడ్డు మీద పెట్టుకుంటున్నరు .
మీ , నా( మన) వయసున్నవారికి కూరగాయలు ఇంట్లో పండించుకోవచ్చని తెలుసు.బియ్యం ఏచెట్లకు కాస్తవి అని అడిగేతరం వచ్చిందిప్పుడు .వారు ఏమీచేయరు.అంతా రడేమేడ్ కావాలె వారికి.ఇంట్ల టిఫానేనచ్చదువస్విగ్గీయో జొమాటోనోటమాటోనోఆర్డరిచ్చి తెచ్చుకుని తినాలె.ఆరోగ్యంసంగతీపట్టదు.
ఏది ఏమైనా takecit easy policy generation వచ్చింది.ఏదీ సిరియస్ కాదు వారికి.వాండ్లలో ఏమైనా మారుపువస్తే అప్పుడేమైనా బాగుపడ్తమేమో.
పాలకులకు రాజకీయంతప్ప మరోటిపట్టదు. చరణ్సింగ్ కాలంలో ఉల్లిగడ్డల ధర పెరిగిందనే కారణం ఆయన ప్రభుత్వం కూలిపోవటానికిగల కారణాల్లో ఒకటి.అప్పుడింత అధ్వానంగా పెరగలే .
మిత్రుడన్నట్టు “విషస్ సర్కిల్”
—–నాగిళ్ళ రామశాస్త్రి
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ సుదీర్ఘ విశ్లేషణకు
స్పందనకు ధన్యవాదాలు సర్.
Bhujanga rao
సమాజంలో సామాన్య మానవుని పరిస్థితి ఏమంత అనుకూలంగా లేదు.నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా లేకుండా పోయింది. మన ప్రభుత్వాలు వాటిపై ఆలోచన చేయకుండా ప్రజలకు ఉచితాలు అలవాటు చేసి,పంట పొలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి వ్యవసాయం లేకుండా చేసి ఆ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ఘనత మన ప్రభుత్వాలదే. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించకపోతే భవిష్యత్తు లో కష్టాలు తప్పనిసరి. భవిష్యత్తులో నైనా అన్ని రంగాలను,అన్ని వర్గాలను సమన్యాయం చేసే ప్రభుత్వం వస్తుందని ఆశిద్దాం.మంచి విషయాలు అందిస్తున్న మీకు నమస్కారములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
అవును సర్.నేడు ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు అన్నట్టు ఉంది నేటి సామాన్య జీవనం.మీరు ప్రస్తావించినట్టు నేడు పెరటి తోటలు లేవు.అసలు జనాభా పెరుగుదలతో నివాస స్ధలం తగ్గిపోవడమే కాక,పొలాలన్నీ చెరువులవ్వడం కరువుకు కారణం అవుతుంది.రైతు స్థితి మెరుగుపడితే అంతకు మించిన సంతోషం ఏమీలేదు కానీ …మధ్య దళారుల దౌర్జన్యం తో రైతు గిట్టుబాటు ధర లేక …సామాన్యుడు ధర అందుబాటులో లేకా డీలా.నేటి స్థితికి పరిస్థితి చక్కబడి…అందరి నోళ్ళూ సంతోషాన్నం భుజించాలని ఆశిద్దాం సర్.వర్తమాన సమస్యను ప్రస్తావించి కర్తవ్యాన్ని కూడా గుర్తుచేసినందుకు ధన్యవాదాలు సర్



—–నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు.
Rajendra Prasad
Your analysis on raising prices of vegetables is quite understandable with high prices nowadays. Time for us to make use of smallest soil groundvtongrow fruits or vegetables
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 172 లో చక్కటి అంశంపై రాశారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు మండిపోతున్నా పట్టించుకునే నాయకులే కరువు. టమాటో ధర ఆకాశాన్ని తాకుతున్నా ఏ నాయకుడు స్పందించరు. టమాటో పండించే రైతులకు దక్కేది తక్కువ, దళారులకే లాభాల పంట. అభినందనలు.
—-జి.శ్రీనివాసాచారి
కాజీపేట
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు చారిగారు.