(Flash Back పూర్తయి, తిరిగి రంగస్థలం పైన పండిత్ శ్రీ కంఠ వౌఖలు గారి ఢిల్లీలోని గదిని చూపించే పాత దృశ్యమే! రాజ్ కుర్చీపైన, టాఠాజీ మంచంపైన కూర్చుని ఉన్నారు. శిబన్ కూడా అక్కడున్నాడు. రూప, శారిక లిద్దరూ కళ్లనీళ్లు నింపుకుని వంటింటి తలుపు వద్ద ఒకరి వెనక ఒకరు నిల్చుని రాజ్‌నే చూస్తున్నారు. రూప తన చీర కొంగుతో కళ్లు తుడుచుకుంటుంది. శారిక రూప భుజాన్ని ఓదార్చుతున్నట్టు చేత్తో తడుముతూ ఉంటుంది. రాజ్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. శిబన్ గంభీరంగా ఉన్నాడు. టాఠాజీ కళ్లు కూడా కన్నీరు నిండి, తడిగా ఉన్నాయి. ఆయనా కన్నీటిని తడుచుకుంటూనే ఉన్నారు.)
రాజ్ : (రోదిస్తూ) మనుష్యులు అనుకునే దేమిటి? ఆఖరికి జరిగేదేమిటి? నాకున్న ప్రతి రూపాయి తీసి ఖర్చు చేసి ఆ కొత్త ఇంటిని కట్టించాను.. రూపకున్న నగల్లో కొన్ని నగలు కూడా దానికే… (కన్నీళ్లు తుడుచుకుంటూ) ఎన్నెన్ని కలలు కన్నాను… ఆ ఇంటి పైన ఎవరి చెడు దృష్టి పడకుండా దిష్టిబొమ్మను కూడా వేలాడగట్టాము. కాని… ఆ దిష్టిబొమ్మ… (దుఃఖంతో భావుకతలో కొట్టుకుపోతూ) ఆఖరికి ఆ దిష్టిబొమ్మ కూడా… అదీ ఉండిపోయింది టాఠాజీ… అక్కడే ఇంటికి వేలాడుతూ… అదీ చేజారిపోయింది…..
టాఠాజీ : నాయనా రాజ్!…..
రాజ్ : అవును టాఠాజీ! దిష్టిబొమ్మ కూడా అక్కడే ఉండిపోయింది… అక్కడే…
శిబన్ : ఇప్పుడు ఏడ్చి ఏం లాభం?… ఈ కన్నీళ్లని మనం మన దౌర్బల్యంగా కాదు, ఒక ఆయుధంగా మల్చుకోవాలి. ప్రయత్నించాలి!
టాఠాజీ : మొదటిసారి శిబన్ కాస్త తెలివైన మాట చెప్పాడు…. నిజం చెప్పాడు… ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
శిబన్ : మీరు చెప్తున్న ప్రయత్నాలని నా ఉద్దేశం కాదు.
టాఠాజీ : అంటే?
శిబన్ : మీరు, రెండు దేశాల ప్రభుత్వాలూ ఈ సమస్య పైన చర్చిస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఒక్కటే… నష్టపోయింది మనం, ఆ ప్రభుత్వాలు కాదు… ఈ చర్చల్లో భాగంగా మనం ఎక్కడయినా ఉన్నామా – అసలు ఉంటామా?
టాఠాజీ : (వ్యంగ్యంగా) పిసరంత పిట్టతో… పిసినంత వంటకం అన్నట్లు… అసలు నిన్ను నువ్వు ఎవరనుకుంటున్నావు? నిన్ను ఎందుకు సలహా చెయ్యాలి? చెప్పు…. అబ్బో! దొరగారు ఏమనుకుంటున్నారో తన గురించి…. ఇప్పుడు ప్రభుత్వం వారు స్వయంగా విచ్చేసి, ‘అయ్యా! మహారాజశ్రీ శిబన్ కృష్ణ వౌఖలూ గారూ రండి! రండి! వచ్చి దయచేసి ఈ సమస్యపైన మీ ఉద్దేశాలేవో తెలియ చెయ్యండి అని అడగాలి కాబోలు!
శిబన్ : సరే! సరే! నేను ఏమీ కాను! కాని వాళ్లు మాటలు తప్ప అసలేం చేస్తారన్నట్లు?… ఇప్పటివరకూ ఏం చేసారు గనక?… నా ఉద్దేశ్యంలో వారు చేస్తున్నవన్నీ చేతగాని వారి ప్రయత్నాలే… కేవలం మాటలు చెప్పటమే… వారి మాటలు విను… వారి మాటలు తిను… వారి మాటల్నే ఒంటికీ కప్పుకుని సంతోషించి… ప్రయత్నాలు జరుగుతున్నాయిట ప్రయత్నాలు మహాగొప్పగా….
శారిక : శిబన్… నీకేమయింది?
టాఠాజీ : నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
శిబన్ (లేచి నిల్చుని) : నేనేం చెప్పాలనుకోవటం లేదు… కనీసం మీతో మాత్రం కాదు…. మీరు గడచిన దినాల జ్ఞాపకాలు, కోరికలని తలగడలుగా చేసుకుని, సుఖంగా కూర్చోండంతే…..
రూప : శిబన్! కాస్త నోటిని అదుపులో ఉంచుకో!
టాఠాజీ : (మహాకోపంగా) అయితే నువ్వు కొండలమీదున్న మంచును తవ్వి దార్లు చేస్తున్నావా?
శిబన్ : (వెళ్తూ…. వెళ్తూ) ఔను… దారి చేస్తానొక రోజు… తప్పక దారినీ చేస్తాను, దానితోబాటే….
(శిబన్ వెళ్లిపోతాడు. శారిక కూడా వెంట వెళ్తూ)
శారిక : శిబన్ ! …శిబన్! … విను…..
టాఠాజీ : (దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో) అది వాడి తప్పుకాదు… నా అదృష్టంలోనే లోపం….
రూప : (కాస్తంత మార్చుతున్న ధోరణిలో) వదిలేయ్యండి టాఠాజీ!… అసలు మీరు వాడితో ఎందుకు వాదిస్తారు చెప్పండి….?
టాఠాజీ : మీరంతా కూడా ఇక్కడే కూర్చున్నారు కదా… చెప్పండి… మీరే చెప్పండి… నేను అంత కానీ మాట ఏమన్నానని నా మీద అలా విరుచుకు పడ్డాడు?…. ఢిల్లీలో పడే వడగళ్లలా… ఎక్కడయినా… ఎప్పుడయినా… హఠాత్తుగా… మహాజోరుగా…
రాజ్ : ఇందులో మీ తప్పూ లేదు, శిబన్దీ తప్పు లేదు…. పరిస్థితులే అలా ఉన్నాయి. మరి… ఒక్కొక్కసారి మనిషి ఎదురుగా ఎవరూ పోట్లాడటానికి లేకపోతే, తనలో తనే పోట్లాడుకుంటూ ఉంటాడు.
టాఠాజీ : నిజమే… పరిస్థితులు అలా ఉన్నాయని ఒప్పకుంటాను… అందుకే కదా! సంప్రదింపుల ద్వారా…
రాజ్ : (మాట మధ్యలోనే) టాఠాజీ! ఒకమాట చెప్పండి… ఏదైనా సమస్యకి పరిష్కారం సంప్రదింపులతో చూపించగలవా ఈ ప్రభుత్వాలు? మీరే చెప్పండి…
టాఠాజీ : రాజ్… నువ్వు కూడా శిబన్లా…
రాజ్ : అబ్బెబ్బే! అది కాదు… సరే ఈ ప్రభుత్వాలు భూమీ – నేలకు సంబంధించిన సమస్యలకి పరిష్కారం చూపించవచ్చు, లేదా చూపించగలదేమో! కాని… మానవతా సంబంధాలు, కాశ్మీర్ వాసుల మనసులకు తగిలిన గాయాలు ఏమవుతాయి? వీటికి పరిష్కారం ఏమిటి టాఠాజీ? చెప్పండి… మీరే…
టాఠాజీ : సరే, నువ్వేం తప్పుగా అనటం లేదు… కానీ, మాటలు చర్చలు అన్న ఒక క్రమం మొదలయింది కదా, అదీ ఏం తక్కువ కాదే! ఆలోచించి చూడు! ఎలక్షన్లు జరిపించక పోతే జరిపించ లేదని కంప్లయింట్ చేస్తారు.. ఎలక్షన్లు జరిపిస్తేనేమో, అంతా గందరగోళం జరిగిందని గొడవ. పరిస్థితులు ఎప్పటికి బాగుపడతాయన్నది ఎవరూ చెప్పలేరు కాని ఇవాళ కాకపోతే రేపయినా పరిస్థితి మారుతుంది కదా… నేను చెప్తున్నా చూడు… ఈ మార్గంలోనే బాగుపడతాయి… ఈ చర్చల వలనే పరిస్థితి బాగుపడుతుంది… ఎప్పటికయినా!
రాజ్ : బహుశా మీరు చెప్పేది నిజమే కావచ్చు! కాని నాకే ఏవిధమయిన పరిష్కారం కనిపించటం లేదు…. ఏది ఏమైనా మన జీవితాలయితే చెదిరి చిందర – వందరగా మారిపోయాయి కదా! ఎక్కడెక్కడో చెదిరిపోయిన దారపు పోగులను కూర్చుకుంటూ బతకవలసి వస్తోంది… (లేచి) ఆనందం అంతా అక్కడే తప్పిపోయింది. మనసుకు లభించే సంతోషమూ అక్కడే తప్పిపోయింది. అంతా అక్కడే తప్పిపోయింది…. అక్కడే….
టాఠాజీ : తప్పిపోయిన వాటిని ఎక్కడని వెతుక్కోగలం? (గొంతులో వ్యాకులత)
(అలా మాట్లాడుతూనే ఆయనా రంగస్థలం పైనుండి తప్పుకుంటారు…)
రూప : (భారమైన మనసుతో) అవును! అన్నీ తప్పిపోయాయి… తప్పిపోయాయి… ఎక్కడో తెలియదు… నిజంగా అసలు తప్పిపోయాయా? వెయ్యి ప్రయత్నాలు చేసినా తప్పించుకోవటం ఎంత కష్టం? ఎక్కడ… వదలవే?… (రూప తన ఆలోచనల్లో పడీ ముందుకు నడిచి, చీనార్ చెట్టు మొదలుపైన కూర్చుంటుంది. ఆమె తన పాత జ్ఞాపకాలో కొట్టుకు పోతూ ఉండగా, నేపథ్యంలో హబ్బాఖాతూన్ గీతంలోని కొన్ని పంక్తుల భావానువాదం వినవస్తుంది)
పాట
గుండెల్లో గూడు కట్టుకున్న ఈ అగ్ని మెల్ల.. మెల్ల…గా రగులుతోంది. అయ్యో ఎవరికీ బాల్యం తప్పిపోకూడదు… బాల్యం తప్పిపోకూడదు…
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™