[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


కలిసొచ్చిన మరో అదృష్టం..!!
మన నిత్య జీవన గమనంలో, అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు. అలా కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. అవన్నీ మనకు కలసిరాని అంశాలు. అలా ఎందుకు జరిగిందని విశ్లేషించుకుంటూ సమయం వృథా చేసుకోవడం వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఇక్కడ.. మన స్థాయిని మించిన కోర్కెలు ఎలానూ ఫలప్రదం కావు. కానీ చిన్న చిన్న కొర్కెలు కూడా అనుకున్నవి జరగకపోతే తప్పకుండా నిరుత్సాహం ఒళ్ళంతా చుట్టుకుంటుంది. ఇది సహజం! దీనికి మనం చేసేది ఏమీ ఉండదు, తలచుకుని బాధపడడం తప్ప. ప్రయోజనం శూన్యం.
ఒక్కోసారి మనం అనుకోనివి, మనం వూహించనివి మనకు ఎదురు వస్తుంటాయి. అవి చెప్పలేని అనందాన్ని, తృప్తిని అందిస్తాయి. అలాంటిదే ఒక సందర్భం నాకు ఎదురొచ్చి కలిసొచ్చింది. మా వియ్యంకుడు విజయకుమార్ గారు, అనుకోకుండా ఒక రోజు తన విశాఖపట్నం ప్రయాణం గురించి చెప్పారు. అగష్టు ఏడో తారీఖున విశాఖలో ఒక శుభకార్యానికి హాజరుకావాల్సి ఉంది. ఇదే అదనుగా “నేనూ వస్తాను” అనేశాను ఆయనతో.
ఒంటరిగా ఉంటున్న అన్నయ్యతో కొద్ది రోజులు గడపాలన్నది నా ఆశ. అలా నాలగవ తేది విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు బుక్ చేసుకుని బయలుదేరాం. అర్ధరాత్రి రైలులో నాకు కంటి సమస్య మొదలైంది. కళ్ళుపుసులూ కట్టడం, కళ్లు మంట దురద. కనురెప్పలు మూసుకుపోవడం విశాఖపట్నం చేరుకునేసరికి సమస్య జటిలం అయింది. చిన వాల్తేరులో అన్నయ్య ఇంటికి వచ్చాక, వరంగల్ నేత్ర వైద్య మిత్రుడు డా. గిరిధర్ రెడ్డికి ఫోను చేసి విషయం వివరించాను.
ఆయన రెండు రకాల కంటి చుక్కల మందు సూచించడంతో ఆ వైద్యం మొదలుపెట్టాను. దీని వల్ల బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అన్నయ్య మధుకి ఈ ‘కళ్ళకలక’ అంటుకుంటుందేమోనని భయం.. రెండు రోజులకి చాలామట్టుకు నా కంటి సమస్య తగ్గుముఖం పట్టింది. ఈలోగా నా ఫేస్బుక్ మిత్రుడు నన్ను కలవడానికి వస్తానని ఫోన్ చేశాడు. ఈయన ‘ప్రియమైన రచయితలు’ గ్రూపు సభ్యుడు. చాలా సంవత్సరాలుగా పరిచయం. పేరు శ్రీ కోరాడ నరసింహరావు (విశాఖపట్నం.) ఈయన పెద్దగా చదువుకొనకపోయినా, మంచి కవి, కథకుడు, గీతరచయిత, గాయకుడు. ఆయన సాహితీ తృష్ణ అనంతం. ఆయనతో ఒక గంటసేపు అనందంగా గడిపే అవకాశం ఈ విజిట్‌లో నాకు దొరికింది.


ఫేస్బుక్ మిత్రుడు కవి, రచయిత,గాయకుడు శ్రీ కోరాడ నరసింహ రావు (విశాఖపట్టణం)
మరో రోజు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, సువార్తికుడు, సోదర పాత్రుడు, నాకు హైస్కూలులో సీనియర్, శ్రీ బందిల అరుణకుమార్ వచ్చాడు. ఈయన నా స్వగ్రామానికి (దిండి..తూ.గో.జి) చెందినవాడు. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్టిరపడ్డాడు. ఆయనతో కొన్ని గంటలు గడపటం, బాల్య విశేషాలు సరదాగా సింహావలోకనం చేసుకోవడం, కలిసి భోజనం చెయ్యడం మరచిపొలేని మధుర అనుభూతి. ఆయనకు నా అయిదవ కథా సంపుటి ‘లేడీస్ సీట్’ బహుకరించాను.


ఆత్మీయ బంధువు శ్రీ బందిల అరుణకుమార్ (విశాఖపట్టణం/దిండి)
పదకొండవ తేదీన మిత్రుడు, దంత వైద్యంలో నాకు సీనియర్, డా. ఆనంద్ రాక నాకు మరింత ఆనందం కలిగించింది. ఈయన ప్రవృత్తి కూడా సాహిత్యమే! ఇద్దరం కాలేజి పత్రికకు రాస్తూండేవాళ్ళం. ఆ రోజుల్లో ఇతను ‘ఆంధ్రభూమి’ వారపత్రిక క్రమం తప్పకుండా చదివేవాడు, మా చేత చదివించేవాడు. పాత జ్ఞాపకాలు, గౌలీగూడలో, మేము విద్యార్థులుగా గొప్పరోజులు గుర్తుచేసుకున్నాం. అలా ఈసారి నా విశాఖ రాక ఎంతో తృప్తిని కలిగించింది.


మిత్రుడు, రచయితకు సీనియర్ డా. ఆనంద్ (విశాఖపట్నం)
నిజానికి, నేను ఏడవ తేదీన హైద్రాబాద్‌కు తిరిగి రావాలి. ఈలోగా మరో సంతోషకరమైన వార్త తెలియడంతో, పదకొండు తేదీ వరకూ విశాఖపట్నంలో ఉండిపోవలసి వచ్చింది. ఆ వార్త ఏమిటంటే, నా మిత్రమణీ, రచయిత్రి, శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టికి, శ్రీ మక్కెన ఫౌండేషన్ వారి అవార్డు ప్రదాన కార్యక్రమం.
ఈ కార్యక్రమం విశాఖ పౌరగ్రంధాలయంలో, విశాఖ సంస్కృతి మాసపత్రిక సౌజన్యంతో కన్నుల పండుగగా ఘనంగా జరిగింది. అన్నయ్య, నేను హాజరయ్యాము. ఝాన్సీ గారి ‘చీకటి వెన్నెల’ కథా సంపుటికి ఈ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో నేను ఇప్పటివరకూ చూడని అనేక గొప్ప రచయితలని చూసే అవకాశం కలిగింది.


మక్కెన ఫౌండేషన్ (విజయవాడ) అవార్డు గ్రహీత (చీకటి వెన్నెల) శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి (హైదరాబాదు)
అంతమాత్రమే కాదు నాకు తెలిసిన స్థానిక రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారు, ఎన్. హన్మంతరావు గారు, డా. బండి సత్యన్నారాయణ గారూ, కోరాడ నరసింహా రావు గారు, నా మిత్రులు డా. ఆనంద్, శ్యామకుమార్ – శ్రీమతి లీల, డా.రామచందర్ రావు తదితరులు హాజరుకావడం ఆనందం అనిపించింది.


శ్రీమతి కొప్పిశెట్టి సన్మాన చిత్ర మాలిక
ఈమధ్య కాలంలో రెండవసారి నా విశాఖ ప్రయాణం నాకు ఎంతో తృప్తిని ఆనందాన్ని కలిగించింది. అన్నింటికి మించి, ఇన్ని రోజులు అన్నయ్యతో గడపటం నిజంగా ఒక మధుర అనుభూతి, అదృష్టమును!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
18 Comments
sagar
మొత్తానికి మొదట కొంచెం ఇబ్బంది కలిగించినా అటుపై ఆత్మీయుల కలయిక, మరియు కార్యక్రమాలతో మీ విశాఖ పయనం ఆనందాన్ని కలాగించిందన్నమాట. మీకు శుభాకాంక్షలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు
Shyamkumar Chagal
రచయిత డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి జ్ఞాపకాల పందిరి శీర్షికను చాలా కాలంగా చదువుతూ ఉన్నాను. పాత జ్ఞాపకాల సందర్భంగా చేస్తున్న ఈ రచనలు కాలానుగుణంగా మారిపోతూ సరికొత్త అనుభవాల పందిరిగా మారిపోతున్నాయి.
రచయిత గారి మనస్తత్వానికి అనుగుణంగా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అక్కడ తన మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులను కలిసి ఆనందాన్ని పంచుకోవడం మనం ఈ శీర్షికలలో చూస్తూనే ఉన్నాం.అదొక అదృష్టంగా భావిస్తాను.కొన్ని మార్లు అలా మనకు నచ్చిన ప్రదేశాలకు వ్యక్తుల దగ్గరికి కార్యక్రమాలకి వెళ్ళటం యాదృచ్ఛికము ఆకస్మికము లేదా ప్రణాళిక ప్రకారం జరుగుతుందో తెలియదు కానీ అలా జరగడం ఒక శుభ పరిణామం.
విశాఖ సంస్కృతి మాస పత్రిక వారు నిర్వహించిన ఆ యొక్క కార్యక్రమానికి నేను సైతం వెళ్లి శ్రీ సన్యాసిరావు గారిని కలవడం మరియు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారి సన్మానం వీక్షించడం జరిగింది. కార్యక్రమం చాలా పొందికగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన డాక్టర్ కేఎల్ వి ప్రసాద్ మరియు ఝాన్సీ కొప్పిశెట్టి గార్లకు నా ధన్యవాదములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
‘ జ్ఞాపకాల పందిరి ‘ వరుసగా వెలువరించడం అంత సులభమైన పని కాదు. అలాంటి పనిని అలవోకగా చేస్తున్న డా. కెఎల్వీ గారికి అభినందనలు. అంతేకాదు ఈ శీర్షిక చాలా ఉపయుక్తంగా ఉంది. ఆసక్తికరంగా ఉంది. కొత్త విషయాలతో నిత్యనూతనంగానూ ఉంది.
మెట్టు మురళీధర్
హన్మకొండ
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు మురళీధర్ గారూ…
డా కె.ఎల్.వి.ప్రసాద్
సరదా ప్రవాసంలో మీరు వైద్యవర్య! అనుకన్నదానికంటే ఎక్కువగనే ఆనందాన్ని అనుభవించారుగా .కండ్లకలక బాధపెట్టినా మిత్రుల కలయికతో అది ఆవిరైపోయింది.
శుభమస్తు
—-ప్రొ.జనార్ధన రావు
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సర్
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
Jhansi koppisetty
మీ జ్ఞాపకాల పందిరి ఎపిసోడ్ లో నేనూ చోటు చేసుకున్నందుకు నాకు ఆనందంగా వుంది. మీ విశాఖ ప్రయాణం నాకు అనుకోని అదృష్టమనే చెప్పాలి… నా కార్యక్రమం అయ్యేవరకూ మీ తిరుగు ప్రయాణాన్ని పొడిగించుకున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు


డా కె.ఎల్.వి.ప్రసాద్
ఉభయ తారకం అనుకోవాలి.
చాలా కాలం తర్వాత జ్ఞాపకాల పందిరి కి
స్పందించినండుకు
హృదయపూర్వక ధన్యవాదాలు.
Dr.Harika
Good evening sir,
I felt thrilled while reading the story that the unplanned visit to Vizag of you had so many unexpected memories to cherish except the eye issue like a mark on the moon and it’s good to know that you recovered soon from it.
Initially it started with the frown lines & ended up with smile on my face.
Thank you sir for energizing people around you with your stories every time.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch
For your good response.
Dr.Harika.
Jogeswararao Pallempaati
కల్పించిన కథలకంటే … ఊహల్లో మాత్రమే విహరించగలిగే కాల్పనిక కథలకంటే … నిత్య జీవిత విశేషాలతో కూడిన సంఘటనలే గొప్ప పాఠాలవుతాయని నేను గాఢంగా నమ్ముతాను, డాక్టర్ గారూ! తప్పకుండా వీలునుబట్టి అప్పుడప్పుడూ మీ జ్ఞాపకాల పందిరి కింద కాసేపు కూర్చుని చదివి స్పందిస్తుంటాను!
దూరాభారాన్ని సైతం గుర్తుకి రానివ్వనంత గొప్ప అనుభూతుల్ని మూటగట్టుకుని రావడం నిజంగా ఎంత ఆరోగ్యకరమో, ఓ ఇఎన్ రోజులకి సరిపడా బూస్టింగ్ అన్నది నిజం! Wish you all the Best! ఇలాంటి వారతావరణాన్ని సృష్టించుకోవడమే భూలోక స్వర్గమనీ మన ఆయుస్సుని పెంచుతుందనీ తరచూ నేను పెట్టే పోస్టుల్లో గుర్తు చేస్తుంటాను, ఎవరికివారు తమదైన స్వర్గాన్ని సృష్టించుకోమని! మీరు ప్రత్యక్షంగా ఆ స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది! Very Good Feel!
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ విశ్లేషణ అద్భుతం సర్.
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్.
Bhujanga rao
జ్ఞాపకాల పండిరి 175 సంచిక కల్సివచ్చిన అదృష్టం..! బాగుంది.మీరు ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ మీ స్నేహితులు,బంధువులు మరియు శ్రేయోభిలాషులను సంపాదించిన మీకు అభినందనలు సర్.మీ అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి,అవే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోలను జాగ్రత్తపరచడమే కాకుండా ఆయొక్క పరంపర సన్నివేశాలు మర్చిపోకుండా రికార్డు చేసుకొని మాకు అందిస్తున్న డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీరు వెళ్ళిన ప్రతి చోటా బంధుమిత్రులని, సాహితీవేత్తలని కలిసి అనేక విషయాలని చర్చిస్తారు. హాయిగా, ప్రశాంతంగా జ్ఞాపకాలను పంచుకుంటారు. వాటినిజజ్ఞాపకాలను దారంలో బంధించి మాలికలల్లి సంచిక ద్వారా పాఠకులకు అందించడం ముదావహం.కొన్ని సాహితీ కార్యక్రమాలను గురించి మీ వల్లనే తెలుసుకుంటున్నాం, అభినందనలు మీకు..
—–పుట్టి నాగ లక్ష్మి
గుడివాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీకు కృత జ్ఞత లు
మేడం.