[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


ఓటూ.. నీ రేటెంత..!?
మన ‘భారత రాజ్యాంగం’ ఈ దేశ పౌరుడికి కల్పించిన ఓటు హక్కు ద్వారా, ఎన్నికల ప్రక్రియ ద్వారా, తమకు నమ్మకమైన, ఇష్టమైన నాయకుని ఎన్నుకునే అవకాశం కల్పించింది. అలా మన దేశంలో మొదటి ఎన్నికల ప్రక్రియ 1951-52, సంవత్సరంలో జరిగింది. అంటే, మొదటి మన దేశ సార్వత్రిక ఎన్నికలన్న మాట! అప్పుడు దేశం కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తులే ఎన్నికలలో నిలబడే సాహసం చేశారు. అలంటి వారినే ప్రజలు ఎన్నుకునే ప్రయత్నం చేశారు. రెండు ప్రధాన పార్టీలు మాత్రమే (కొన్ని ఇతర పార్టీలు ఉన్నప్పటికీ) ఎన్నికల పోటీలో నిలబడ్డాయి. అప్పటికి, ఇప్పుడున్నన్ని ప్రాంతీయ పార్టీలు గాని, ఇతరపార్టీలు గానీ లేనందున ప్రజలలో (ఓటర్లలో)కూడా ఎలాంటి తికమక లేకుండా, ప్రజలు తమ ఓటు హక్కును అతి స్వేచ్ఛగా వినియోగించుకోగలిగారు. అప్పుడు నాయకుడిని ఎన్నుకోవాలంటే అతని మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని, సేవాదృష్టిని పరిశీలించి, పార్టీలు అభ్యర్థులను ఎంచుకోవడం, ప్రజలు అటువంటివారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే నిరక్షరాస్యులు, ఓటు విలువ తెలియనివారు, అప్పుడూ, ఇప్పుడూ వున్నారు. వారు ఓటు వేయడానికి ఎవరో ఒకరిమీద ఆధార పడవలసిందే! అందుచేతనే ఇటువంటి వారి ఓట్లు, తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో, సలహాలు ఇచ్చే స్వార్థపరుల వల్ల, మార్గదర్శనం చేసే పోలింగ్ సిబ్బంది మూలాన నిరుపయోగానికి గురి అయ్యాయి. అంటే ఓటరు అనుకున్నది ఒకటైతే, దానికి భిన్నంగా ఓటు పోల్ అయ్యేది. ఎన్నికలలో నిలబడే నాయక అభ్యర్థులకు, మూడు రకాల ఓటర్లతో అవసరం ఉంటుంది. వాళ్ళు ఎవరంటే,1) అక్షరాస్యులు 2) నిరక్షరాస్యులు 3) స్త్రీమూర్తులు.
ఈ మూడు కేటగిరీలలోనూ, పోలింగ్ బూత్‌కు వచ్చి తప్పనిసరిగా, బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు, నిరక్షరాస్యులు, మహిళలు (అభ్యర్థుల బంధువులు కూడా) అక్షరాస్యులు అంటే ముఖ్యంగా ఉద్యోగులు, ఓటు హక్కు వినియోగించుకోని వారిలో, ముందు వరుసలో వుంటారు. అందుచేతనే, ఎన్నికల నిలబడే తెలివైన అభ్యర్థుల గురి, మహిళ/నిరక్షరాస్య ఓటర్లను ప్రభావితం చేయడంపై ఉంటుంది. అందుకే ఆయా వర్గాలకు ఓటుకు నోటు, ఇతర తాయిలాలు అందించి, ప్రలోభ పెట్టి ఆయా ఓటర్లను తమవైపు తిప్పుకునే విశ్వప్రయత్నం చేస్తారు. కాలం మారడంతో పాటు, ప్రజల ఆలోచనా విధానాలు మారిపోయాయి.


నాటి కేంద్ర ఎన్నికల అధికారి స్వర్గీయ టి.ఎన్.శేషన్ గారు.
ఎన్నికల ప్రక్రియ దీనికి అతీతం కాదు. ఓటు వేయడానికి ఇప్పుడు అనేక మార్గదర్శక సూత్రాలను పాటించవలసిన అవసరం ఏర్పడింది. అభ్యర్థి ఎలాంటివాడైనా, అతని వ్యక్తిత్వం ఎలాంటిదైనా, పార్టీ, కులం, మతం, ప్రాంతం, బంధుత్వం ప్రాతిపదికలయ్యాయి. పేదవారిలోనే కాదు, వున్నవారిలోనూ ఓటుకు రేటు కట్టే రోజులు అమలుకు నోచుకున్నాయి. అందుచేత, ఎన్నికల కమిషన్ ఎన్ని కట్టుబాట్లు చేసిన ఎన్ని మార్గదర్శక సూత్రాలు జారీచేసినా, డబ్బు ప్రధానంగా, ఎన్నికలపై అత్యధిక ప్రభావం చూపిస్తున్నది. కొన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్న తాత్కాలిక ఉచిత పథకాలు, ఆయా పార్టీల/మనుగడకు తప్ప, ప్రజా సంక్షేమానికి, దేశ/రాష్ట్రాల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. సరికదా, అప్పుల భారం పెంచి, పౌరుడు బ్రతికినంతకాలం, అప్పులు తీర్చే పనిలో పడక తప్పడం లేదు. దీనికి తోడు రకరకాల టాక్సులు సామాన్యుడికి తలకు మించిన భారం అవుతున్నది.
ప్రజలను ఆకర్షించడానికి చేసే గిమ్మిక్కులకున్న శ్రద్ధ, దేశ/రాష్ట్ర అభివృధ్ధి కోసం లేకపోవడం బాధాకరం. ఇలా ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకల వల్ల, డబ్బు ఖర్చుచేసినవాడే ఎన్నికల్లో నెగ్గుకు రావడం అనే తంతు మొదలైన తర్వాత ప్రజాసంక్షేమం మూలాన పడి, ప్రజాధనం దోచుకోవడం పైననే నాయకులు దృష్టి పెట్టడం ,ప్రజాభివృద్ది పట్టాలు తప్పుతుందనడానికి ప్రధాన సంకేతంగా మనం ఊహించవచ్చు. నాయకులు, పదే పదే, వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు మారడం, ప్రజలలో అయోమయాన్ని సృష్టించి, ఎవరికీ ఓటు వేయాలన్న విషయంలో తికమక పడిపోవడం జరుగుతున్నది. స్నేహ పూర్వకంగా, సుఖంగా బ్రతుకుతున్న ప్రజలు ఎన్నికల వేళ, కులాల వారీగా, మతాలవారీగా విడిపోవలసి వస్తున్నది. ఈ ప్రక్రియ ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నది. ఇది చాలా బాధాకరమైన విషయం. అధికారంలో వున్నప్రభుత్వాలు ఇటువంటి వాటికి కొమ్ముకాయడం మరింత దురదృష్టకరం. ఇంతకు మించిన దరిద్రం మరొకటి వుంది.


స్వగ్రామంలో రచయిత ఏర్పాటు చేసిన దంతవైద్యశిభిరం ప్రారంభిస్తున్న నాటి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీ కానేటి మోహనరావు గారు
ఎన్నికల వేళ ఎంత డబ్బుతో ఓటరును ప్రలోభ పెట్టినా, ఇంటింటికి తిరిగి ఓటు అర్థించడం ఆనవాయితీగా మామూలు విషయమే! ఇళ్లకు వచ్చి వాళ్ళువేసే విచిత్ర వేషాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇళ్లల్లో దూరి అన్నం పెట్టమనడం, పిల్లల్ని ఎత్తుకోవడం, కాఫీ హోటల్‌కు వెళ్లి కాఫీ తయారుచేస్తున్నట్టు, ఇస్త్రీ షాపుకు వెళ్లి ఇస్త్రీ చేసినట్టు నటించడం, ఒక్కటికాదు. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు అన్నట్టు మరునాడు ఆ గొప్ప ఫోటోలు దినపత్రికలలో రావడం, ఇంతకుమించిన ప్రహసనం ఇక ఏముంటుంది?
ఎన్నికలంటే కొందరికి పండుగ రోజులే! ముఖ్యంగా కాలనీలలో పెద్దమనుష్యులుగా పోజు కొట్టేవారు, చలామణి అయ్యేవారు, ఏ పార్టీవాళ్ళు వచ్చినా, మొత్తం కాలనీ జనం తమ చెప్పుచేతల్లోనే ఉన్నట్టు, తాము ఎవరికీ ఓటు వెయ్యమంటే వారికే వేస్తారని నమ్మ బలికి, ఆయా నాయకులను కాలనీ లోపలికి పోకుండా చేసి, వాళ్ళ దగ్గర కొంత సొమ్ము వసూలు చేస్తారు. ఇన్ని సమస్యల మధ్య జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయని ఎలా అనుకుంటాం. ఇటువంటి రాజకీయ పరిస్థితుల మధ్య తమ గెలుపే ధ్యేయంగా పెట్టుకునేవారు, తమపార్టీ అభివృధ్ధి కోసం, తాము ఆర్థికంగా బలపడటం కోసం శ్రమిస్తున్నారు తప్ప, ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం, నాయకుల కృషి శూన్యమనే చెప్పాలి. ఎన్నికల కమిషన్‌లో, అవసరమైన మార్పులు, కఠినమైన చర్యలు ఉంటే తప్ప, ఎన్నికల సంస్కరణలు సజావుగా సాగవు. దానికోసం నాటి ఎన్నికల కమిషనర్ స్వర్గీయ శేషన్ వంటివారు కొంతకాలం ఎన్నికల కమిషనరేట్‌లో పనిచేస్తే తప్ప ఆశించిన ఫలితాలు మనకు దక్కక పోవచ్చును. అలాగే ప్రజలలో కూడా మార్పు రావలసిన అవసరం వుంది. తాత్కాలిక తాయిలాలను వ్యతిరేకించే పరిస్థితి ప్రజలలో రావాలి.


రాజమండ్రి మొదటి పార్లమెంట్ సభ్యులు రచయిత సోదరులు (కజిన్) స్వర్గీయ కానేటి మోహనరావు (ఎడమ), రచయిత మేన బావ స్వర్గీయ రాపాక విశ్వనాధం (కుడి)
ఇకపోతే, ఎన్నికలకు, నాకు, కొన్ని గుర్తు పెట్టుకోవలసిన దగ్గర సంబంధాలు వున్నాయి. 1951-52 సంవత్సరంలో మనదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగితే నేను 1953లో పుట్టానట! ఆ ఎన్నికలలో, దేశం మొత్తం మీద నేషనల్ కాంగ్రెస్ ఎక్కువ పార్లమెంటు సీట్లను గెలుచుకున్నా, ఉభయగోదావరి జిల్లాలలో మాత్రం కమ్యూనిస్టులు విజయభేరి మ్రోగించారు. దానికి కోస్తా ప్రాంతం అతీతం కాదు. ఈ ఎన్నికలలో మా అన్నయ్య (కజిన్) కమ్యూనిస్ట్ టికెట్‌తో, పార్లమెంటుకు, అసెంబ్లీకీ ఎన్నిక కావడం విశేషం. అలా ఆయన అసెంబ్లీ సీటు వదులుకుని, రాజమండ్రికి మొదటి యువ పార్లమెంట్ సభ్యునిగా రికార్డుల్లో నమోదు అయ్యారు. ఆయనే స్వర్గీయ కానేటి మోహన్ రావు గారు. అయన మేనకోడలే మా వదినగారు శ్రీమతి కె. శిరోరత్నమ్మ (అన్నయ్య కె. కె. మీనన్ భార్య).


ఎన్నికల డ్యూటీలో రచయిత బావమరిది (మధ్య) రాజబాబు.
ఇకపోతే, నాకు ఓటు హక్కు వచ్చే సమయానికి నేను హైదరాబాద్‌లో అన్నయ్య కె. కె. మీనన్ సంరక్షణలో, కాకతీయనగర్‌లో వున్నాను. ఆ సంవత్సరం గుర్తులేదు కాని, మొదటిసారి ఓటు వేయాలన్న మహదానందంతో, పోలింగ్ బూత్‌కు, అన్నయ్యవాళ్ళతో కలిసివెళ్ళాను. అయితే మమ్ములను ఆశ్చర్యపరుస్తూ, మా ఓట్లన్నీ అప్పటికే పోల్ అయిపోవడం విశేషం. ఎన్నికలలో ఎలాంటి అవకతవకలు జరుగుతాయో మొదటిసారి తెలుసుకున్నాను. తర్వాత ఎప్పుడూ ఇప్పటివరకూ అలా జరగలేదు.


కానీ నేను ఓటేసినవారు ఎవరూ ఇప్పటివరకూ ఎన్నికల్లో నెగ్గలేదు. ఇది కూడా ఒక రికార్డుగా (యితర రికార్డులు ఏమీ లేవు కనుక) చెప్పుకోవచ్చునేమో! తెలంగాణా రాష్ట్ర శాసన సభ ఎన్నికలు 2023, నవంబరు 30న జరగనున్నాయి. మేము హన్మకొండలో ఓటు వేయవలసి వుంది. సికింద్రాబాద్ నుండి దీనికోసం హన్మకొండ వెళ్లడం అవసరమా? అనిపించినప్పటికీ ‘విద్యావంతులే ఎక్కువశాతం ఓటింగ్‌లో పాల్గొనడం లేదు’ అన్న అపవాదు తప్పించుకోవడానికైనా, ఆ రోజు ఓటింగ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. ఈసారి మేము ఓటు వేసిన అభ్యర్థి తప్పక నెగ్గుతాడనే నమ్మకంతో కూడా వున్నాము.


గత ఎన్నికల్లో (హన్మకొండ) వోటు వేసిన తరువాత రచయిత, వారి అమ్మాయి –నీహార కానేటి
చివరగా చెప్పే విషయం ఏమిటంటే, చిన్న చిన్న తాత్కాలిక ప్రలోభాలకు లొంగకుండా, మంచి వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. ఇందులో పార్టీ, కులం, మతం, ప్రాంతం ప్రమేయం వుండకూడదు. అయితే, మంచి వ్యక్తి అంటే ఎవరు? ప్రజలకు సమస్యలు సృష్టించకుండా, ప్రజాసమస్యలు తెలుసుకుని, తన వంతు పరిష్కార మార్గాలు చూపించేవాడు, అన్నిరకాలుగా ఆయా నియోజకవర్గాలను అభివృద్ధి పరచగల సత్తావున్నవాడు, పార్టీలకతీతంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యే వారిని మంచి వ్యక్తులుగా భావించి, అలాంటి వారినే ఎన్నుకునే ప్రయత్నం చేయాలి.
మాయమాటలు చెప్పి, ఊహాలోకంలో విహరింపజేసి, ఓట్లు తన్నుకుపోయే దగాకోరులపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఓటు అమ్ముకోవడం అంటే, మనల్ని మనం అవమాన పరచుకోవడమే, మన అభివృద్ధిని మనం చేతులారా పాడు చేసుకోవడమే! దేశ అభివృద్ధిలో ‘ఓటరు’ పాత్ర కీలకం అన్న విషయం మరువ కూడదు. అలాగే, ఓటు హక్కు వున్న ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకుని, ఉత్తమ పౌరుడిగా నిలవాలి. ఓటింగ్‌లో పాల్గొనడం ఈ దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలి. ఈ సందర్భంలో మన దేశ రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్, ఎన్నికలకు సంబందించి చెప్పిన ఒక మంచి మాటను ఉటంకించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
‘నేను నా దేశప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు!
ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి
రాజులు అవుతారో, అమ్ముకుని బానిసలు అవుతారో,
అది వారి చేతుల్లోనే వుంది..!’
–డా. బి. ఆర్. అంబెడ్కర్.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
25 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
—–డా కె.ఎల్.వి.ప్రసాద్.
సుగుణ అల్లాణి
సర్ ! ఎన్నికల పండగను విస్తారంగా వివరించారు.
రాజకీయాలు తెలియని నాలాంటి వారికి బాగా తెలుస్తుంది…
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాద లండీ
apsaravalisha8869@gmail.com
నమస్తే సార్
సందర్భాన్ని బట్టి సమాజానికి చక్కని సందేశాన్ని సూచనలను అందించటం మీ గొప్ప తనం సార్. ఎన్నికల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక పౌరులుగా వారి కర్తవ్యమేమిటో చాలా చక్కగా చెప్పారు సార్. మీ గత జ్ఞాపకాల ఫోటో చాలా బాగుంది. సదా సమర్ధవంతమైన మీ అడుగుజాడలలో నడిపిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మంచి మంచి సమాజహిత వ్యాసాలను అందిస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 













డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
ధన్యవాదాలు.
sagar
మంచి సందేశాన్మి ఇచ్చే వ్యాసం. అందునా ఇప్పటీ సమయానికి తగినది. నిజమే మీరన్నట్లు శేషన్ లాంటి నిక్కచ్ఛి ఆఫీ సర్ ఉంటేనే సజావుగ జరుగుతాయి. ఇక విద్యావంతులు తమ పాత్ర పోషిస్తేనే ఎన్నికలకు అర్ధం. మంచి సందేశాన్ని అందించినందుకు మీకు ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందనకు ధన్యవాదాలు .
J Mohan Rao
నమస్తే sir. వ్యాసం ప్రస్తుతము సమాజము యొక్క తీరుకు అద్దం పడుతున్నది. జరగబోయే
ఎన్నికలు కూడ అదే మూస పద్ధతిలో జరిగే తంతు
ప్రజలు వారి అర్హతను బట్టే పాలించే రాజు దొరకుతాడు . ఒక సామెత వుంది . మీకు తెలిసినదె. అర్ధం / భావం క్రింద వున్నది.
People get the king they deserve for.
J Mohan Rao
Sir, నమస్తే. మీరు వ్యాసం లో తెలియ జేసిన విషయములు అన్నీ ప్రస్తుత సమాజ పరిస్థితికి దర్పణము పడుతున్నది. ఎన్నికలు ఒక తంతు గా
మారినవి. ప్రజలకు వుచితములు పధకములు
తాయిలములు ఆశ చూపుటలో party లు పోటీ
పడుచున్నవి. ఎక్కడో చదివినట్లు
People get the king they deserve for
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మీకు
అల్లూరి Gouri Lakshmi
Very apt memories then n now..relating to Elections.
Today’s scenario needs this awareness to every citizen of our State..hope this useful article alerts our responsibility.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you madam garu
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you madam garu
N.Bhujanaga Rao
ఎన్నికల వేళ మంచి సందేశం ఇచ్చారు.ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని,ఎటువంటి ప్రలాభాలకు లొంగకుండా నిర్భయంగా వినియోగించుకొని మన దేశ రక్షణ కోసం బాధ్యతాయుతమైన పాలకులను ఎన్నుకొని మన దేశ స్థితిగతులను మార్చే అవకాశం ఉంది. ఎన్నికల వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక పౌరుని బాధ్యత మరియు కర్తవ్యం చక్కగా చెప్పారు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ
ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
మొదటి ఎలక్షన్లలో ఎంతమంది అభ్యర్థులుంటే అభ్యర్థి పేరు గుర్తుతో అన్ని డబ్బాలుండేది..వోటరుకు కార్డు వంటిది ఇచ్చి ఎవరికి వృటువేయదల్చుకున్నడో ఆతనికి కేటాయించిన డబ్బాలో వేయవలసివుండేది.వోటు వేసినాకఆ slit నుండి ఆకార్డు డబ్బాలో పూర్తిగా లోపలికిపోకపోతే తలువాత వచ్చిన వోటరు ఆకార్డు తీసుకొని తనికిష్టమైన వారిడబ్బాలో వేసేవాడు.
తరువాత ప్లస్ గుర్తు చుట్టూ వలయం ఉన్న స్టాంపులతో ఎవరికి వోటు వేయదలచుకున్నాడో ఆతని గుర్తుమీద బాలెట్ పేపరుమీద స్టాంపు వేయటం వచ్చింది .బ్యాలెట్ పేపరు సరిగ్గా మడతపెట్టకపోతే ఆగుర్తువఇంకో అభ్యర్థిగుర్తుమీదకూడా పడినట్టై ఇద్దరికిశవేసినట్టైవవోటువచెల్లకుండా పోయేది..తరువాత స్వస్తిక్క్ గుర్తు వచ్చింది.పొరపాటున మడిచినప్పుడుశఇంకో గుర్తుమీదవఅంటినా సవ్య అపసవ్యముద్రలను బట్టి గుర్తించి వోటుచెల్లుబాటు చేయించేవారు.
పాతరోజులలో ఊరి రాజకీయాలను ఊరి సర్పంచో దొరనోవనడిపించేవాడు.ఆయన ఎటుచెప్తేఅటే ఊరు మొగ్గు చూపేది.
ప్రజలలో అవగాహన పెరిగినా కొద్దీ రాజకీయాలు పెరిగి ముఠాలేర్పడి చెత్త రాజకీయాలైనాయి
అధికారం ధన బలం ఇప్పుడు ఎన్నికలలో రాజ్యంవచేస్తున్నదశ ఇవాళ. రాజకీయులు ఎన్నికలనువపూర్తిగా కరప్ట్ చేసినార. శేషన్ లాంటి వాడు వచ్చి గందరగోళాన్ని శాసించినా రాజకీయుల కుట్రజరిపి ఎలక్షన్ కమీషన్ అధికార్లకు కత్తెర వేసినారు. పాలీవర్గం తమ చెప్పుచేతలలో వుండే అధికార్లనుకోరుకుంటున్నది .వారినేప్రోత్సహిస్తున్నది.
వోటింగ్ పట్ల నిరక్షరాస్యునికున్నశ్రద్ధ
విద్యా వంతులకూ సోకాల్డ్ మీధావివర్గానికీ లేదు.ఎవడొచ్చినా ఏంచేయడు అందరూ దొంగలే అని వోటింగ్‌కు దూరంగా వుండటంతోమైనారిటీ ప్రజలచే ఎన్నుకనబడ్డ వారు మెజారిటీని పరిపాలిస్థున్నారు.పదిమందిలో అయిదుగురు ఎన్నికలలో వోట్లు వేస్తేమూడు వోట్లు వచ్చినవాడు ఎన్నికైనట్టువప్రకటిస్తున్నరు.
మొత్తం వోటర్లలోయాభై శాతం వోట్లు తెచ్చుకున్నవాడే ఎన్నికయ్యేటట్టు వోటింగ్ పద్ధతి మారితే…బాగుంటదేమో ఎన్నికలపద్ధతిలో సంస్కరణలు రావాలె.అట్లనే వోటిఅంగ్ను తప్పనిసరిచెయ్యాలె.
అప్పుడ ఏమైనా మారుతదేమో పరిస్థితి.
ఇప్పటికే ఎక్కువ వాగినానేమో .అధికార, ధన, ప్రభావం పోతే తప్ప బాగుపడవేమో?
—-రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
శాస్త్రి గారు.
Rajendra Prasad
Good to know you have successful political back ground through your ancestors. Atleast this time try to break your record by voting to a winner! Before that check your vote still exists at హన్మకొండ. Yes it’s responsibility of a citizen to vote.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you prasad garu
Shyamkumar Chagal. Nizamabad
ఎన్నికల సమయంలో సందర్భానుసారంగా ఆగిన ఈ వ్యాసం దాదాపుగా అన్ని కోణాలను స్పృశించింది.
ఎన్నికల తంతులో కొత్త కొత్తగా చోటు చేసుకుంటున్న బలహీనతలు బలాలు వాటి ద్వారా జరిగే లాభనష్టాలను చాలా అద్భుతంగా వివరించారు రచయిత గారు.
మొత్తం మీద ఇదొక విహంగం వీక్షణం లాగా ఉంది. పరిపూర్ణం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మిత్రమా
పుట్టి నాగలక్ష్మి
మెుదటి సార్వత్రిక ఎన్నికల నుండి నేటి ఎన్నికల వరకు –అభ్యర్థులు, ఓటర్లు, పార్టీలు, సమాజంలో వచ్చిన మార్పులను గురించి, దిగజారి పోతున్న విలువల గురించి,విద్యావంతులు ఓట్లు వెయ్యడానికి ముందుకు రావడంలేదన్న కఠోర సత్యంతో సహా (మొన్నటి ఎన్నికలలో కూడా చూశాం) వివరించిన మీకు అభినందనలు. ఓటుహక్కు పౌరుల బాధ్యత అనే విషయాన్ని సమయానికి గుర్తు చేసారు. అభినందనలు, ధన్యవాదాలు మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
G Srinivasa chary
భారత రాజ్యాంగం ఇచ్చిన వజ్రాయుధం ఓటు. ఓటు హక్కు గురించి చక్కటి విషయాలు తెలిపారు. ఆభ్యర్ధులు ఓటర్లను నోటుతో మరియు ఉచిత హామీలతో ప్రభావితం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం నిజంగా బాధాకరం. చక్కటి కథనంతో సాగింది.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
చారి గారూ.