[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


స్వంత గూటికి..!!
మనుష్యులైనా, పశుపక్ష్యాదులయినా, స్వంతగూటికి ఇచ్చే ప్రాధాన్యత ఎలా వుంటుందో అందరికీ అనుభవమే! కొంతమంది, పుట్టి పెరిగి, అక్కడే ఉద్యోగం చేసి, అక్కడే పదవీ విరమణ చేసిన వ్యక్తులు, మరో ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఎన్ని వసతులు వున్నా, ఎన్ని వసతులు కల్పించినా, సాధ్యమైనంత త్వరగా స్వంత గూటికి చేరుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. పశుపక్ష్యాదులు దీనికి అతీతం కాదు. స్వంత గూటికి వున్న విలువ అలాంటిది! స్వంత గూటితో వుండే అనుబంధం అలాంటిది.
అలాగే, ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, పుట్టిన వూరు వదలి, మరో ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకుంటే, ఆ ప్రాంతానికి, వాతావరణానికి అలవాటు పడిపోయి, అక్కడి స్నేహాలు పెరిగిపోయి, ఆ వూరు వదలి రావడానికి ఎవరూ ఇష్టపడరు. చదువు రీత్యానో, ఉద్యోగ రీత్యానో, వూరు విడచి, తాలూకా కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు, రాష్ట్ర కేంద్రాలకు, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లి స్థిరపడిపోయిన వారికి ఇది అనుభవమే!
ఇలా స్వంతగూటికి పోవాలని తహతహ లాడేవారు కొందరైతే, అలవాటు పడ్డ స్వంత గూటికే పరిమితం అయ్యేవాళ్ళు మరికొంతమంది. ఇలాంటి వాళ్లకు పెద్ద సమస్య ఉండదు. వలస వెళ్లిన వాళ్ళకే మనసు స్వంత గూటివైపు లాగుతుంటుంది.
అయితే కొందరికి అప్పుడప్పుడూ స్వంత గూటిని దర్శించే అవకాశం ఉంటుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరి కొందరికి ఆ వకాశం ఉండదు/రాదు.
పుట్టిన స్థలాన్ని, స్వంత గూటిని మరచిపొయ్యేవాళ్ళు బహు కొద్దిమంది, మరచిపోలేక అదే ధ్యాసలో ఉండేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడూ స్వంతగూటి చుట్టూనే తిరుగుతుంటాయి. వాళ్ళ జీవితాలు స్వంత ఊరితో, స్వంతగూటితో పెనవేసుకునిపోయి ఉంటాయి. పుట్టిన వూరికి, స్వంత ఇంటికి వున్న విలువ అలాంటిది. సున్నితమైన మనసున్నవారికి ఇది దారుణమైన సమస్య. ఇలాంటి వారు ఏదో కోల్పోయిన భావనతో సతమతమవుతుంటారు.
నేను 1968లో అనుకుంటాను, అనారోగ్య రీత్యా, స్వంత వూరు, స్వంత ఇల్లు వదలి హైద్రాబాద్‌కు అన్నయ్య మీనన్ దగ్గరకు రావడం జరిగింది. 1971-72లో మెట్రిక్యులేషన్, 1972-74లో అక్క దగ్గర వుండి ఇంటర్మీడియెట్ పూర్తిచేయడమూ జరిగింది. అలాగే, 1975-80లో బి.డి.ఎస్. పూర్తి చేయడమూ తర్వాత ఉద్యోగం 1994లో ఉద్యోగరీత్యా హన్మకొండలో స్థిరపడడం జరిగింది. పదవీ విరమణ తర్వాత ప్రస్తుతం, కూతురు, మనవలతో సికింద్రాబాద్‌లో నేనూ, నా భార్యా ఉంటున్నాం.
ఇవన్నీ చెప్పడం వెనుక విషయం ఏమిటంటే, ఇప్పుడు తరచుగా, నేను పుట్టి పెరిగిన మా దిండి గ్రామం గానీ, పాక్షికంగా చదువుకున్న నాగార్జున సాగర్ గానీ, స్థిరపడిన హన్మకొండకు గానీ తరచుగా వెళ్లలేని పరిస్థితి.
హన్మకొండ కొంతలో కొంత నయం, కనీసం అప్పుడప్పుడూ అందరం (అబ్బాయి ఎట్లాగూ అమెరికాలో ఉంటున్నాడు) అక్కడికి వెళ్లి కనీసం రెండు రోజులైనా అక్కడ గడిపే వెసులుబాటు వున్నది. ఈ విషయంలో ఒక్కోసారి, తెల్లవారుఝామున మెలుకువ వచ్చి, రకరకాల ఆలోచనలు మనసును చుట్టుముడుతుంటాయి. ఆయా ప్రాంతాలతో క్రమంగా అనుబంధం తెగిపోతుందేమోనన్న బెంగ వేధించడం మొదలు పెడుతుంది. ఇలాంటి జబ్బు నాకేనా.. ఇంకెవరికైనా ఉంటుందా? అన్న అనుమానం కూడా అప్పుడప్పుడూ నన్ను తికమక పెడుతుంటుంది. చెప్పలేని ఆవేదనతో మనసు మూలుగు తుంటుంది.
ఇక అసలు విషయానికొస్తే, గత నెల 28వ తేదీన మనవరాలికి క్రిస్మస్ సెలవులు ఇవ్వడంతో, అందరం కారులో హన్మకొండకు బయలుదేరి వెళ్లాం. చూడండి నా ఆనందానికి అవధులు లేవు. స్వంత ఇల్లు కట్టుకుని గడిపిన ప్రదేశం. అనేకమంది సాహితీ బంధువులతో కలిసి నడిచిన ప్రదేశం. అనేకమంది స్నేహితులు, సాహితీ పెద్దలు పరిచయం వున్న ప్రదేశం హన్మకొండ/వరంగల్. చాలా రోజుల తర్వాత స్వంత ఇంటికి వెళుతుంటే, ఏదో చెప్పలేని ఉద్వేగం/ఆనందం నన్ను చుట్టుముట్టాయని చెప్పాలి. ఆ రోజు అనుకోకుండా ఒక ప్రత్యేకతను సంతరించుని వుంది. అదేమిటంటే, ఆ రోజు ధ్వన్యనుకరణ సామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి 92వ జన్మదినోత్సవం. వేణుమాధవ్ గారి పుట్టినరోజు కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా జరుపుతారు.


పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారు
అది కూడా పబ్లిక్ గార్డెన్లో ఆయన పేరుమీద వున్న ‘శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణం’లో జరుగుతుంది. అంతమాత్రమే కాదు, వేణుమాధవ్ గారి పేరుమీద ప్రతియేటా సాహిత్యకారులకు, వివిధ కళారంగాలో కృషి చేసినవారికి అవార్డులు కూడా ఇస్తారు. వేణుమాధవ్ గారి శిష్యులు (మిమిక్రీలో) అనేకమంది వచ్చి ఆయన గౌరవార్థం ప్రదర్శనలు ఇస్తుంటారు. హన్మకొండలో ఉండగా ఆ.. ప్రేక్షక జనసందోహాన్ని తట్టుకోలేక నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యేవాడిని కాదు. కానీ, ప్రస్తుత పరిస్థితిలో సాహిత్య/సాంస్కృతిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం వల్ల, ఈసారి అదే రోజు హన్మకొండలో ఉండడం మూలాన 28/12/2023 రాత్రి, కార్యక్రమానికి హాజరయ్యాను. తెలిసినవాళ్ళు ఎంతోమంది అక్కడ కనిపించి పలకరించడంతో, స్వంతగూటికి చేరుకున్న అనుభూతి కలిగింది. పైగా నాకు ఇష్టమైన నవలా రచయిత డా. అంపశయ్య నవీన్ గారిని అవార్డుతో సన్మానించడం, అది చూసే అవకాశం నాకు కలగడం నాకు ఆనందం అనిపించింది.


డా.అంపశయ్య నవీన్ గారికి సన్మానం
పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి మిమిక్రీ ప్రదర్శన, నా విద్యార్థి దశలోనే, రవీంద్ర భారతిలో చూసాను. నవీన్ గారిని జనరల్ నాలెడ్జి పాయింట్‌గా చదివాను. నిజానికి వీరిద్దరినీ నా జీవితకాలంలో కలుస్తానని, చూస్తానని అనుకోలేదు. కానీ అదృష్టవశాత్తు వీరిద్దరూ నివశించే హన్మకొండ/వరంగల్‌లో నేను స్థిరపడతానని కానీ, వారితో స్నేహం ఏర్పడుతుందని గానీ, వారితో కలసి వివిధ సందర్భాలలో వేదిక పంచుకుంటానని గానీ ఎప్పుడూ అనుకోలేదు. కానీ అది సాధ్యమయింది. అందుకే వరంగల్ నాకు ఇష్టమైన ప్రదేశం అయింది.


పత్రికా ప్రకటన
వేణుమాధవ్ గారి 92వ జన్మదినోత్సవాలలో పాల్గొన్నందుకు, అంపశయ్య నవీన్ గారితో పాటు, మిత్రులు శ్రీ వనం లక్ష్మీ కాంతారావు, శ్రీ వరిగొండ కాంతారావు, శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు, శ్రీ మల్యాల మనోహరరావు, శ్రీ రామా చంద్రమౌళి, శ్రీ రాజమౌళి వంటి ప్రముఖులే కాకుండా, నేను మరచిపోయిన అనేకమంది స్థానికులు కలవడం ఎంతో సంతోషం అనిపించింది. శరీరంలో ఏదో కొత్త శక్తి ప్రవేశించిన అనుభూతి కలిగింది. ఇష్టమైన ప్రదేశంలో, ఇష్టమైన వారిని కలిస్తే ఎవరికైనా ఇలానే ఉంటుందేమో!


నవీన్ గారితో రచయిత.. వారి కుమార్తె నిహార కానేటి
వయస్సును అడ్డంపెట్టుకుని, భయంతో ఇంట్లోనే ముడిచి పట్టుకోవడం అంత మంచిది కాదేమో సుమా! ఓపిక చేసుకుని ఇష్టమైన ప్రదేశాలు దర్శించడం ఆరోగ్యకరం మాత్రమే కాదు, అదొక రకమైన మానసిక సంతృప్తి కూడా! పిల్లలూ.. మీ తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారు కదూ!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
19 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
సుగుణ అల్లాణి
మీ జీవితపు మజిలీలు అన్నీ చక్కగా వివరించారు సర్! ఈ జీవిత ప్రయాణం లో క్కడి నుండి మొదలై ఎక్కడ స్థిరపడతామో తెలియదు…. ఒక్కసారి మన ప్రమేయం లేకుండా గాలివాటంగా సాగుతుంది. అన్నిటిని అనుభవించి జ్ఞాపకాలుగా
భద్రపర్చుకుంటాము…. మీకు అభినందనలు…
డా కె.ఎల్.వి.ప్రసాద్
సుగుణ గారూ ధన్యవాదాలు .
J మోహన్ రావు
మీయొక్క జీవన యాన గమనం ఆసక్తి దాయకము. ఎన్నో మజిలీలు పూర్తి చేసుకొని విశే స అనుభవంతో మీరు రాసిన అనేక సంగతులు
అనుభూతిని కలిగించే విషయములు . ముఖ్యముగా నేరెళ్ల వేణుమాధవ్
అంపశయ్య naveen వంటి వారితో మీకున్న పరిచయము , హనుమకొండ తెలుగు సాహితీ సేవ సమితి ద్వార మీరు చేసిన అక్షర సేద్యం
మరువలేనివి . మరువరానివి. సహాజముగానే
వక association , సాహితీ సేవ సమితి యేర్పాటు చేసి సుమారు 15
సంవత్సరములు అధ్యక్షులుగా నిరాటంకంగ నడుపుట మీకు మాత్రమే సాధ్య మయినది .
చాల కొద్ది మందికే అటువంటి బాధ్యత వహించే అవకాశం సాధ్య పడును. మరియు పట్టుదలతో నిర్వహించుట తేలిక విషయము కానే కాదు
మీకున్న commitment అపార మయినది..
Naturally, when you are associated with a cause / purpose, you get honours, recognition for the good work done as well as contacts with
People of the stature of Late వేణుమాధవ్ and present Naveen గారు.
Your feelings and sentiments about the native place, initial upbringing and desire to settle down there after retirement are well expressed, natural and becomes reality in some cases. Nonetheless, we also tend to get attached to the various place s where we worked on job / studied.. . more particularly if the particular place /location changes ur
Life’s journey (course of life) altogether.
Better we balance all these things and continue to keep in touch with our family roots and native village.
( కన్నవూరు) .
మంచి వ్యాసం . అభినందనలు
ధన్యవాదములు. అందరికీ.
నమస్తే.
డా కె.ఎల్.వి.ప్రసాద్
హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు.
చాలా బాగా చెప్పారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Sir.mee jnapakala pandiri. Nakuu jnapakalanu anubgavalani jnapakam chesindi.
Mee prathi vakyam nenu
Anukuntunna,andariki chepthunna vishayam.
Nene rasenemo annattuga undi.
Ma amma amalapuram
Daggara munganda (ippudu as illu alage undi.)lo unna inti meedane manasu undedi.
Vayasulo unnapudu(ante practical
Alochana lenappudu)
Pillalu ga anukuntamu
Andaram ikkada unnamu okkalle yela untaru ani manam unna
Place ki techesthu untamu.adi chala thappu anipisthondi.
Rama chiluka ni bandhinchinatle..
Inka cheppalante naku
Oka vyasam antha ayipothundi sir.
—-smt.sujana panth
Bheemaaram.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మేడం
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అన్ని విషయాలు గుర్తుంచుకోవడం .. అందరికీ అనుభూతి ని పంచడం.. సూపర్ అండి. చాలా బాగుంది..

—డా.ఝాన్సీ నిర్మల
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఆత్మీయతలు పంచిన ప్రదేశాలను ఎవ్వరుకూడ మనస్పూర్తిగా దూరం చేసుకోలేరు సర్. అలాగే వయసు పెరిగిన తరువాత తరచూ ప్రయాణాలు కుదరకపోయినా, వీలున్నంతలో సందర్శించడం ఒక ఉపశమనం. శ్రీశ్రీ గారు అన్నట్లు నడవలేని పరిస్ధితి వచ్చినా పాకే ప్రయత్నంచేయి. అంతేకానీ ఊరికే కూర్చోకు అన్నట్లు, ఓపిక ఉన్నన్నిరోజులు ఈ సంచారం జరగాల్సిందే. అందులోప్రత్యేకంగా మీకు ఉన్న స్నేహాలు అన్నిదిక్కులా ఉన్నందున మీరు ఆరోగ్యంగ ఓపిక ఉన్నన్ని రోజులు ఆస్వాదించిలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదములు సర్.
—–సాగర్ రెడ్డి
చెన్నై.
డా కె.ఎల్.వి.ప్రసాద్
హృదయ పూర్వక కృతజ్ఞతలు సాగర్.
Shyamkumar... Nizamabad
సొంత ఊరు ఒక స్వర్గం అన్న నానుడి ఊరికే రాలేదు. ఉద్యోగరీత్యా బ్రతుకు తెరువుకై దేశాలకు, విదేశాలకు వెళ్లే వారు తక్కువ అదృష్టవంతులని చెప్పాలి.
వయసు మళ్ళిన తర్వాత దాదాపుగా ప్రతి ఒక్కరూ అలవాటైన ప్రదేశానికి జీవితం కొనసాగించిన ఇంటికి తిరిగి వెళ్ళిపోవడానికి తహతలాడటం సహజమే. గడిచిన తరం వారి ఈ యొక్క బాధను తర్వాతి తరం వారు అర్థం చేసుకోవడం చాలా కష్టం.
ఇకపోతే ఇంటిని వదిలి కొత్త ప్రదేశాలకు స్నేహితుల వద్దకు వేరే ఊర్లకు బంధువుల ఇండ్లకు, గుడి గోపురాలకు, ఇతరత్రా అన్ని కార్యక్రమాలకు వీలైనంతవరకు మనం పాల్గొనడమే మన ఆరోగ్యానికి మంచి మందు.
ఈ విషయమై ఒక పాట విన్నాను, నడుస్తూ వెళ్ళిపోతూ తిరగడమే జీవం. నిలిచిపోవడం మృత్యువు అని.
ఇది అక్షర సత్యం. బయటకు ఎటు వెళ్లలేని పరిస్థితి జీవితపు ఆఖరి రోజుల్లో ఎలాగో తప్పదు.
కాళ్లు చేతులు శరీరం సహకరించిన రోజుల్లోనే ప్రకృతిని ఆరాధిస్తూ స్నేహితులతో బంధుమిత్రులతో కలిసి గడపడం ఉత్తమం.
ఈ సత్యాన్ని మనకు అందించిన మరియు అనుసరిస్తున్న రచయిత , గురువై న డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
నీ స్పందనకు ధన్యవాదాలు
మిత్రమా.
విశ్లేషణ బాగుంది కృతజ్ఞతలు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఉన్న ఊరు కన్నతల్లి అని అంటరు .తల్లి ఎంత ప్రాముఖ్యత?గలదో ఉన్న ఊరు కూడాఅంతే ( స్వస్థలం) మీరన్నట్టు ఎంత అనుకుంటామో అంత డిసపాయింట్మెంట్ అవుతదిఒక్కొక్కసారి.
నోస్టాల్జియా– పురాస్మృతులు- మనిషిని బాగా ప్రభితం చేస్యని అనిపిస్తది.ఈస్మృతులన్నీ మనలను కొంతవరకు రీచార్జ్ చేస్తయి.
మీజ్ఞాపకాలకు అభినందనలు.
—రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు ధన్యవాదాలండీ .
G Srinivasa chary
జ్ఞాపకాల పందిరిలో పుట్టిన ఊరు, ఉద్యోగరీత్యా నివసించిన క్వార్టర్లతో అనుబంధం విడదీయరానిదే. మాటల్లో వివరించలేము.
నేను వరంగల్ లో పుట్టి పెరగడం వలన పదవీవిరమణ చేసిన తరువాత కాజీపేటలో సెటిల్ అయ్యాను. సింగరేణిలో పనిచేసినప్పుడు 30 సంవత్సరాలు గోదావరిఖనిలో నివసించాను. ఆ పట్టణంతో అనుబంధం విడదీయరానిది. అప్పుడప్పుడు వెళ్ళివస్తుంటాను. మనం పుట్టిన ఊరితోనూ, ఉద్యోగరీత్యా నివసించిన ఊరితోను మనుషులతో బంధం సహజం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు శుభోదయం
అల్లూరి Gouri Lakshmi
మీరు చెప్పింది చాలా నిజం..శ్రమ పడి అయినా గడిపిన ప్రదేశాలకు వెళ్ళి మిత్రులను కలవడం అనేది సున్నిత హృదయాలకు తృప్తి నిచ్చే అంశం..we too follow your ideas..Thanku Sir..
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
మీ సహ్రుదయ స్పందనకు.