హాస్యం.. అంటే వాడే..!!
‘భలే.. భలే.. మంచి రోజులులే
మళ్ళీ.. మళ్ళీ.. ఇక రావులే …
స్టూడెంట్ లైఫ్ సౌఖ్యములే …
చీకూ చింతకు దూరములే…!.’
ఎంత బాగా చెప్పాడో చూడండి ఒక సినిమా కవి గారు. నిజంగా ఆ రోజులే వేరు! తలచుకుంటేనే మది పులకించి పోతుంది. మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఆలోచిస్తే ఇది అత్యాశే గానీ ఆ.. కాలం.. ఆ రోజులు.. జరిగిన సంఘటనలు, ఆనందించిన సందర్భాలు, వేసిన వెర్రివేషాలూ, చూసిన వింతలూ – విడ్డూరాలూ, మూటగట్టుకున్న అనుభవాలూ, చేసిన సాహస కృత్యాలూ అలాంటివి మరి! కొన్ని కొంటె పనులు కావాలని చేస్తే, మరికొన్ని అనుకోని రీతిలో ఎదురైన వింత -వింత సమస్యలూను!. ఆ.. రోజులు మంచివైనా చెడ్డవైనా, వయసు పెరిగాక అనుకోకుండా సందర్భానుసారంగా సింహావలోకనం చేసుకోవలసి వస్తే మనసు తేలికై కాసేపు యవ్వనం మనసులో చిందులు వేస్తుంది. అసలు ఆ వయసులో ఏమాత్రం మన గురించి మనం అప్రమత్తంగా లేకున్నా జీవితం తారుమారు అయిపోతుంది, తల్లిదండ్రుల ఆశలన్నీ తలక్రిందులైపోతాయి. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటీ.. అన్న తీరులో జీవిత గమనం మారిపోతుంది. అల్లర్లు, క్లాసులు ఎగగొట్టడాలూ, ప్రేమ – దోమ.. అంటూ అమ్మాయిల వెంట తిరగడాలూ, అమ్మాయిలను ఏడిపించడాలు, అన్నీ ఈ వయసులోనే. ఆ వయసు,ఆ కాలం, ఆ పరిస్థితులు అలాంటివి. వాటిని అధిగమించి బయటకు వచ్చినవాడే, జీవితంలో ఒక ఉన్నత శ్రేణి పౌరుడిగా స్థిరపడగలడు. విద్యార్థి దశలో ఎన్ని వెర్రి వేషాలు వేసినా చదువులో శ్రద్ధ చూపించి అగ్రగాములుగా నిలిచిన వాళ్ళు చాలా మంది వుంటారు. అయినా ఆ నాటి విషయాలు గుర్తు చేసుకుంటే ఏంతో మధురానుభూతిని అందిస్తాయి. అందుకే జీవితంలో విద్యార్థి దశ గొప్పది, ప్రత్యేకమైనదీనూ. అప్పటి విషయాలు కొన్ని అందరిలోనూ చెప్పుకుని ఆనందించేవి గానూ, మరికొన్ని చెప్పుకోలేనివిగానూ మిగిలిపోతాయి. ఆ రోజులు ఎలాంటివైనా చాలా గొప్పరోజులు. అందుకే నాటి విద్యార్థి దశలోని జ్ఞాపకం ఒకటి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను.
నేను దంత వైద్య విద్యార్థిగా వున్న రోజులు. మాది కలగూరగంప క్లాసు. అంటే, వివిధ ప్రాంతాలు/రాష్ట్రాలూ, కులాలూ, మతాలూ, భాషలూ, సంస్కృతులు గల వాళ్ళు ఉండేవారు. హిందీ, తమిళం, మలయాళం, ఆంగ్లం, తెలుగు, ఇన్ని భాషల మధ్య ఇతర భాషల పట్ల అవగాహన లేని తెలుగు విద్యార్థులు, అందరితో కలవలేక పోయేవారు. దీనికి భాషే కారణం. తెలుగు భాష తప్ప ఏ ఇతర భాషలలో ప్రావీణ్యత లేనివారు పూర్తిగా ఇతర తెలుగు విద్యార్థుల తోనే కలసి ఉండడానికి ప్రయత్నం చేసేవారు.
అలాంటి వారిలో నాకు అత్యంత ప్రేమ పాత్రుడు, మంచి స్నేహితుడు, దురదృష్టవశాత్తు అకాల మరణం చెందిన నా ప్రాణ మిత్రుడు డా. జి. డేవిడ్ రాజు ఒకరు. జి. డి. రాజు గా ప్రసిద్ధుడు. పశ్చిమగోదావరి జిల్లా వాసి. ఒక్క భాషలో తప్ప ఎన్నో విషయాలలో అతడికి మంచి కళాభిరుచులు ఉండేవి. పొట్టిగా వున్నా అందంగా ఉండేవాడు. హాస్యం వాడికి ప్రవృత్తి. వాడి మాటలకూ చేష్టలకూ కడుపుబ్బ నవ్వే వాళ్ళం. వాడు ఎక్కడవుంటే అక్కడ నవ్వుల పువ్వులు విరబూసేవి. అందుచేత మెడికల్ కాలేజీ హాస్టల్లో వాడికి మంచి డిమాండు ఉండేది. మా క్లాసులో నన్ను కాస్త ఎక్కువగా ప్రేమించేవాడు. వాడితో ఎక్కడికైనా వెళితే ఎప్పుడు ఏమి చేస్తాడో తెలీదు. వింత వింత చేష్టలతో కడుపుబ్బనవ్విస్తాడు. అందుకే అందరూ వాడి సహవాసం కోరుకుంటారు.




ఒకసారి ముగ్గురం మిత్రులం కలసి ఆదివారం కదా అని సరదాగా తిరగడానికి వెళ్ళాము. మేము వెళ్ళవలసింది కాస్త దూరం కాబట్టి బస్సులో వెళదామని నిర్ణయించుకున్నాము. మా అందరి దగ్గరా స్టూడెంట్ బస్సు పాసులు ఉండేవి కనుక ఆయా రూట్ల లోనే ప్రయాణం చేసేవాళ్ళం. కోఠీ (హైదరాబాద్) లోని మెడికల్ కాలేజీ హాస్టల్ నుండి బస్సు స్టాప్ దగ్గరికి వచ్చాము. ఆదివారం కావడంతో సందర్శకుల హడావిడికి బస్సులు కిటకిట లాడుతున్నాయి. రెండు మూడు బస్సులు వెళ్ళిపోయాక, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో, అలాంటి సీటు దొరకని బస్సు లోనే ప్రయాణం చేయాలని నిర్ణయించుకుని, నిలబడి ప్రయాణం చేయడానికి మానసికంగా సిద్ధపడి మేము వెళ్ళవలసిన రూట్ బస్సు రాగానే అందరం డోర్ దగ్గరికి పరిగెత్తి బస్సు ఎక్కాము. మిత్రుడు రాజు మాత్రం అప్పటి వరకూ బాగానే నడిచివచ్చిన వాడు, మావెనక కుంటుతూ నడిచి అతి కష్టంగా బస్సు ఎక్కి స్త్రీలు కూర్చునే సీట్ల వైపు కష్టపడుతూ కుంటుతూ నడిచి వెళ్లి, రాడ్ పట్టుకుని నిలబడ్డాడు. మొదటినుంచి అతనిని గమనిస్తున్న ఒక పదహారేళ్ళ అమ్మాయి గబుక్కున లేచి నిలబడి, మావాడికి సీటు ఆఫర్ చేసింది. మనవాడు కాస్త మొహమాటంగా, ‘వద్దులెండి, కాసేపు ఇలా నిలబడతాను..’ అని ఆ అమ్మాయి దగ్గర మరింత సానుభూతిని పొందాడు. కాసేపు ఆ అమ్మాయి చేత బ్రతిమాలించుకుని అప్పుడు కూర్చున్నాడు. మాకు నవ్వు ఆగడం లేదు. నవ్వు ఆపుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నాము. వాడు మమ్మల్ని చూడకుండా ఎటో చూస్తున్నాడు. సీటు ఇచ్చి నిలబడ్డ అమ్మాయి, ఏదో పుస్తకం చదువుకుంటూ రాడ్‌ను ఆధారం చేసుకుని నిలబడి తన లోకంలో తానూ నిమగ్నమైపోయింది. రెండు స్టేజిలు పోయాక మేము దిగవలసిన స్టేజి వచ్చింది. మిత్రుడు రాజు కుంటుకుంటూనే దిగి, మామూలుగా నడుస్తూ ఒకటే నవ్వడం మొదలు పెట్టాడు. ఆ.. అమ్మాయి ఎక్కడ వీడి నడకను గమనిస్తుందోనని మేము తెగ సిగ్గుపడిపోయాము. అలా వుండేవి వాడు చేసే పనులు. రాజు మూఖాభినయమే కాదు, ధ్వన్యనుకరణ (మిమిక్రి)లో కూడా సిద్ధహస్తుడే! క్రైస్తవ కుటుంబంలో పెరిగి పెద్దవాడు కావడంవల్ల, ఆ వాతావరణం ప్రతిబింబించే అంశాలను మిమిక్రీ చేసి చూపించేవాడు. ఉదాహరణకి, పల్లెటూర్లలో పాస్టర్లు ఎట్లా బోధ (సువార్త) చేస్తారు,తాలూకా స్థాయిలో,జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎలా చేస్తారో,అభినయంతో సహా చేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవాడు.
ఒకసారి నేను చార్మినార్ సూపర్ ఫాస్ట్ రైల్లో ప్రయాణం చేయవలసి వచ్చింది. నాకు వీడ్కోలు చెప్పడానికి రాజు నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. నా కంపార్ట్మెంట్ వెతుక్కుని,నా బేగ్ సీటు మీద పెట్టి ఇద్దరం బయటికి వచ్చి డోర్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఆ రైలులో డైరెక్ట్ గా తమిళనాడుకు వెళ్ళేవాళ్ళే ఎక్కువ వుంటారు. నాలాంటి ప్రయాణికులు తక్కువగా వుంటారు. మా మాటల మధ్యలో మావాడు భాష మార్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. తమిళంలా మిమిక్రీ చేస్తూ మాట్లాడుతున్నాడు. కానీ, అది తమిళం కాదు. నాకు నవ్వాగడం లేదు.
నాతో పాటు రాజు కూడా నవ్వడం మొదలు పెట్టాడు. మళ్ళీ అలాగే మిమిక్రీ మొదలు పెట్టాడు. రైలులో కూర్చున్న అసలు తమిళులు మనవాడివంక వింతగా చూడడం మొదలుపెట్టారు. తమిళులు అసలే భాషాభిమానులు! తప్పుగా అర్థం చేసుకుంటే కొంపలు అంటుకుపోతాయి. అందుకే మిత్రుడిని కాస్త దూరంగా తీసుకుపోయి, నచ్చజెప్పి మళ్ళీ అట్లా మాట్లాడకుండా అరికట్టగలిగాను. రైలు కదలగానే నాకు వీడ్కోలు పలికి హాస్టల్‌కి వెళ్లి పోయాడు. మా అందరిలోనూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం డా. రాజుది. అతనిలో ఎన్ని వ్యధలు మనసును రగిలిస్తున్నా, పక్కవాడిని మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుండేవాడు. అంతమాత్రమే కాదు, అతని పెళ్ళికి నేను గుడివాడకు వెళ్ళినప్పుడు, నా చేత గ్రీటింగ్స్ చెప్పిస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టాడు. అలా నాచేత మాట్లాడించి ఎంతో సంతోషం పొందాడు. నేను అప్పటికే కవితలూ,వ్యాసాలూ రాస్తూండేవాడిని, అందుకని నన్ను ‘మహా కవీ’ అని సంబోధించేవాడు. నా పట్ల డా.రాజుకి వున్న అభిమానం, ప్రేమ గురించి చెప్పడానికి ఇవి కొద్ది ఉదాహరణలు మాత్రమే! నాతో పాటు రాజును అభిమానించే వాళ్ళు, రాజు అభిమానాన్నిపొందిన వాళ్ళూ ఇంకా చాలా మంది వున్నారు. అందులో డా.తోట ప్రసాద్, డా.హరనాధ్ బాబు, డా.హరిప్రసాద్ వంటి వాళ్ళు కొద్దిమంది ముఖ్యులు.






డా.డేవిడ్ రాజు చనిపోవడానికి రెండు రోజుల ముందు (అప్పుడు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్నాడు, రాజు కొలీగ్‌గా నా కజిన్ బ్రదర్ డా.పార్ధసారధి పని చేస్తున్నాడు) మేము ఫోన్లో సుమారు ముప్పై నిముషాలపాటు మాట్లాడుకున్నాం, కాలేజీ కబుర్లు ముచ్చటించుకున్నాం, తిట్టుకున్నాం, పగలబడి నవ్వుకున్నాం. మేము మాట్లాడుకున్నరెండు రోజుల తర్వాత డా.పార్ధసారధి ఫోన్ చేసి రాజు మరణవార్త చెప్పాడు. అది విని కొద్ది నిముషాల పాటు మనిషిని కాలేక పోయాను. సుమారు అయిదు సంవత్సరాలపాటు హాస్యానందంలో మమ్ములను ముంచి తేల్చినవాడు అకాస్మాత్తుగా మా అందరినీ దుఃఖ సాగరంలో ముంచి పోయినాడు.
నేను బ్రతికి ఉన్నంత కాలం డా.రాజును మరచి పోవడం అసాధ్యం! అతని జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. డా.రాజు అమరుడు! నా జ్ఞాపకాలలో ఆతను చిరంజీవి!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
46 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
50..ఎపిసోడ్ లు నా చేత రాయిన్చిన ఘనత
సంచిక దే.ఈ స్ఫూర్తి తో ఇన్కా ఎన్ని ఎపిసోడ్ లు రాస్తానో నాకే తెలియదు. ప్రోత్సాహం ఇస్తున్న సంచిక సంపాదక వర్గానికి, ఇతర సాంకేతిక నిపుణుల కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
sagar
తుళ్ళింతలతో గడిపే ఆరోజుల్లోని కల్లాకపటం తెలియని ఆ విలువైన సమయంలోని మిత్రులను మరవడం అంత సామాన్యం కాదు సర్ . అందులో అలాంటి మిత్రుడు చదువూ తరువాతకూడ మీతో సంబంధాల నెరపడం, పెళ్ళిలో మీ గ్రీటింగ్స్ కి ప్రాముఖ్యత ఇవ్వడంలోనే తెలుస్తుంది ఆమిత్రుడు మీకెంత దగ్గరివాడో? అంత ఆప్తమిత్రుడిని కోల్పోయిన మీకు ప్రగాఢ సానుభూతి. మదురస్మృతులను పంచుకున్నందుకు ధన్యవాదములు సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగుంది డాక్టర్ గారు, అభినందనలు.
—–లీలా కృష్ణ
తెనాలి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
Manchi mithrudi parichayam goppaga undi sir.Anubhavalu aksharabaddam cheyadam eppatiki gurthundi poye sanghatanalu ..grt feeling.thanks for sharing

—–డా.సుజాత
విజయవాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఎవ్వరికైనా కాలేజీ లో విద్యార్ధి దశ మరపురాని దశ , అందులో డా. రాజు లాంటి మిత్రులు ఉంటే అది ఇంకా మధ్రస్మృతం గా నిలుస్తుంది. మంచి మనుషులు , సహృదయులు త్వరగా పరలోకానికి వెళ్ళిపోతారు, అనడానికి డా.జి. డేవిడ్ రాజు గారి కథ ఇంకొక ఉదాహరణ సర్.
—–డా. డి.సత్యనారాయణ
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
గడిచిన గతం తలచుకొంటే మరిచి పోతం అన్నీ!బాగుంది
రావులపాటి సీతారామ రావు
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సర్
ధన్యవాదాలు.
Bhujanga rao
50 ఎపిసోడ్ లో మంచి మిత్రుడు,మరియు మీకు అత్యంత ప్రీతి పాత్రుడు,శ్రేయభిలాషి అయినటువంటి డేవిడ్ రాజు గారిని పరిచయం చేసినారు.కానీ వారు ఇపుడు లేరు,చాలా బాధాకరం సర్.విద్యార్థి దశలో ఎన్నో చిలిపి చేష్టలు,అల్లరి వేషాలు,స్నేహితులతో ఆనందంగా హాయిగా కల్మషము లేని జీవితం గడుపుతాము.అందుకే విద్యార్థి దశ చాలా గొప్పది మరియు ప్రతేకమైనది. ధన్యవాదములు డాక్టర్ గారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
భుజంగరావు గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Very realistic story brother
—Prasad.Thota.
Tenali.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Brother.
డా కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారు నమస్కారం
మీరన్నట్లు బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటుంటే మనసే కాదు శరీరం కూడా ఎంతో తేలిక పడుతుంది .ఈ సన్నివేశ వర్ణన చదివి ఆనందిస్తూ ఉన్న మరు నిమిషంలోనే ఆ వ్యక్తి యొక్క మరణ వార్త విని మనసు బరువెక్కింది .వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ…
మీ అభిమాని.
బి.ఎన్.కృష్ణా రెడ్డి
సికింద్రాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రెడ్డి గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
Dr. Raju gari gurinchi meeru
cheputunte, manasu yenduko
Kasta,bada tho nindindi. Manchi
vallaki yepudu yepudu ante. Olden days never again.”college
days gnapakalu
Vachai.
—–డి.చంద్రశేఖర్
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శేఖర్
నీ స్పందన కు ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
కాలేజీల్లో రోజులు..ఆనాటి అనుభవాలను..అనుభూతులను కమనీయంగా వర్ణించారు. అందరిని నవ్వించిన నవ్వుల రేడు అర్థాంతరంగా మరణించడం విషాదకరమే.
—–జి.శ్రీ నివాసాచారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డి.వి.శేషాచార్య
హాస్యప్రియత్వం గల వ్యక్తి కి స్నేహితులు ఎక్కువ అంటారు. అందుకే కాబోలు డేవిడ్ రాజు గారు ఇవ్వాల్టి జ్ఞాపకాల పందిరి కి నాయకుడు అయ్యారు. మీ మైత్రీ బంధానికి వందనం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమా
మీ స్పందన కు ధన్యవాదాలండీ
Shyam
మనతో గడిపిన చిన్ననాటి స్నేహితులు ఉన్నంత వరకే మనకు ఆనందం.కలిసి ఉండి మనకు పంచ నా సుఖసంతోషాలు వారిని ఎక్కడినుంచి రావు.ముఖ్యంగా చిన్నప్పుడు మనతో చాలా దగ్గరగా ఉన్న స్నేహితులు మనం ఉన్నంతవరకూ బ్రతికే ఉండాలి.వారితో పాటే మన చిన్ననాటి సుఖసంతోషాలు విశేషాలు మాయమైపోతాయి .60 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే వారి వయస్సు 30 కి మారుతుందట.ముగ్గురు కలిస్తే అది ఇరవై సంవత్సరాలకు మారుతుందట. ఇది ఈ మధ్య చదివాను ఎంత నిజమో కదా. పాత స్నేహితులు ఇచ్చే ఆనందము సుఖము స్వర్గంలో కూడా దొరకదు. మన స్నేహితుల మధ్య తప్పనిసరిగా ఒక హాస్య ప్రియత్వం కలవారుఒకరు కోపం కలవారు ఇంకొకరు మధ్యస్థ మనసు గల వారు ఒకరు విరివిగా స్నేహం గురించి స్నేహితుల గురించి త్యాగం చేసే వారు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం కలవారై ఉంటారు కానీ అందరూ కలిసి ఉంటారు అదే కదా స్నేహం మరి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శ్యామ్
నీ స్పందన కు ధన్యవాదాలు.
Girijamanoharababu
జారిపోతున్న కాలాన్ని ఒడిసి పట్టుకోవటానికి జ్ఞాపకాలే ముఖ్ఆయ ధారలు ….
బాల్యం ఎంత మధురమో యౌవనమూ అంతేమధురం , కాకపోతే అనుభవాలూ అనుభూతులూ వేరుకావచ్చు …
ఇవ్వాళ మీ కథనానికి మీరందించిన “ఇంట్రో” స్నేహమధురిమల పునాదుల్లో శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞాపకాలఆనవాళ్ళను చెప్పి అసలు విషయం లోకి రావటం విషయానికి మరింత బలాన్నిచ్చింది , కారణం ??ప్రతివాడిగుండెలోనూ ఏదో ఒక రూపంలో ఇట్లాంటి జ్ఞాపకాలు గూడు కట్టుకొని ఉండటమే …
స్నేహం మనిషిజీవితాన్ని సంపూర్ణంగా పండించి శాశ్వత స్మృతిగా నిలిచిపోయే గొప్ప సందర్భం … కారణాలూ , సంఘటనలూ , సన్నివేశాలూ , సందర్భాలూ వేరుకావచ్చు కాని ఫలితం మాత్రం మరచిపోని , మరపురాని స్మృతులేనన్నది మీ కథనం మరోసారి తెలిపింది
జీవితం లో మరచిపోలేని సన్నిహిత స్నేహితుల జ్ఞపకాలు మీ జ్ఞాపకాల పందిరిని పచ్చబరచాయి .. అభినందనలు సర్…
డా కె.ఎల్.వి.ప్రసాద్
గురువుగారు
మీ స్పందనకు ధన్యవాదాలు.
Sambasivarao Thota
Prasad Garu!

Dr.Davidraju Gari viyogamtho meerentha kalatha chendaaro ..
Baadanipisthundi..
Manchi snehithulu dorakadam oh adrushtam..
Alaanti vaarini pogottukovadam athyantha baadhakaram…
డా కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
Jai ho Dr David Raju garu.
——surya narayana rao
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir
డా కె.ఎల్.వి.ప్రసాద్
It shows your friendship values regarding your friends Mr. David raju and others. Great experience. Good
—–kj srinivas
Hyderabad
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Srinivas garu.
Jhansi koppisetty
మంచి sense of humour వున్న మిత్రులుంటే ఎంత సమయమైనా చిటికెల్లో గడిచిపోతుంది… అలాంటి వారి మాటలు, జోకులు మన స్మృతుల్లో అజరామరమే.. మీరు అదృష్టవంతులు… వారి జ్ఞాపకాలు అమరము…
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
50వ సంచిక చదివినాను సర్ .మంచైనానచడ్డైనా విద్యార్థి దశ మనిెషి జీవితంలొ అత్యంత ప్రియమైంది బాల్యం తర్వాత. మధురస్మృతులు. విస్మరించలేని మిత్రులు. బాగున్నది డాక్టర్ గారూ !
—-రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు ధన్యవాదాలండీ.
Naccaw Sudhacaraw Rau
School days and college life are memories of great pleasure…. the histrionics of David are really funny and mischievous…. the sudden departure is a sad thing.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Yes sir
Thank you somuch.
ఎన్.వి.ఎన్.చారి
బార్ బార్ఆతాహై ముజ్ కో మధుర యాద్ బచ్ పన్ తేరీ
అన్న హిందీ కవితా పంక్తులు గుర్తుకు వచ్చాయి
క్షణాల్లా సినిమా రీళ్ళలా కరిగిపోయిన గతం సుఖదుఃఖాల మానస సరోవరం మీ స్మృతుల్లో మృతులుండరు సజీవులై.యుంటారు
డా.ఎన్.వి.ఎన్.చారి
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ
Dr. O. Nageswara Rao
The Article, In loving memory of Dr.G.David Raju BDS, Civil Surgeon (Dental ) Rajahmundry,East Godavari District .
It’s a Real story, very much thanks to Drklv for remembering n sharing to all our friends. I am also one of his best friends n we were in the Hostel, Osmania Medical College, koti, Hyderabad.He was senior to me in the Govt. Dental College, Hyderabad.
Dr.G D Raju Is really great Comedian n mimcrian , suddenly he did something n surprised the group of students.
I got very good opportunity to introduced him on the stage at College day function as a Vice president of the Students union at that time, may be 1981.
He received appreciation n Merit certificate from principal Dr. B.Seshadri garu , Govt. Dental College, Hyderabad. You can see my photo also in middle, the above photograph in this article.
Any how we missed very good friend Dr. GDRaju. May his soul rest in peace
My deepest condolences to all the family members , friends, welwishers n others.
Once again thank you sooo much to
Dr. Klv Prasad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Brother rao
For your heartfelt
Review of this article
About our friend
DR G D Raju.
మొహమ్మద్. అఫ్సర వలీషా
చాలా మంచి మధురానుభూతుల ఎపిసోడ్ సార్ ఇది చదువుతుంటే ఆనాటి సన్నివేశాలను మా కళ్ళ కు కట్టి నట్టు అనిపించింది. మిమ్మల్ని ఆనంద తరంగాలలో ముంచిన ఆ నేస్తం ఎప్పటికీ మీ గుండె గదిలో అజరామరుడే సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు










డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
ముందుగా మీ జీవిత పుస్తకంలో 50 ఆకుపచ్చని జ్ఞాపకాలను నిర్విఘ్నంగా మాతో పంచుకున్నందుకు శుభాభివాదాలు సర్


చదువుకొనే రోజులు మీరు చెప్పినట్టు ఎంత రంగుల హరివిల్లులు.హాయిగా సీతాకోకచిలుకల్లా స్వేచ్ఛగా ఉండే రోజులు.ఆనాటి అనుభూతులు ఎవ్వరం మర్చిపోలేము.మీ కళాశాల జీవితంలో తారసపడ్డ ఒక మంచి హాస్యప్రియులైన శ్రీ రాజు గారి గూర్చి చెబుతూ మీరు పంచుకున్న ప్రేమ వాక్యాలు చాలా చిక్కగా ఉన్నాయి.అన్నేళ్ళల్లో మీరు వారి వల్ల పొందిన ఆనంద క్షణాల్లో కొన్ని మాకూ పంచి మా పెదవులపై చిరునవ్వులు పూయిమ్చిన మీకు ధన్యవాదాలు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా గొప్ప లక్షణం. వారితో పాటు చుట్టూ ఉన్న వారిని నవ్వుల వానలో ముంచెత్తడం చాలా ఆనందించదగ్గ అంశం నాదృష్టిలో.కన్నీళ్ళైతే పుట్టించడం సులువు కానీ ఒక నవ్వుని విరబూయించడం చాలా కష్టం. అంతటి చక్కని వాతావరణాన్ని సృష్టించే మిత్రుడు ఆ రోజుల్లో మీకు దొరకడం మీ అదృష్టం.ఇన్నేళ్లయినా మర్చిపోని జ్ఞాపకంగా మీ మనస్సులో మిగిలిపోవడం మీ రాజు గారి అదృష్టం.చివర్లో ఆయన లేని విషాదం మనసుకి బాధ కలిగిస్తున్న…ఆయన పంచిన నవ్వుల జ్ఞాపకాలను మేము పంచుకోవడం మాత్రం సంతోషాన్ని ఇచ్చింది.స్నేహానికి మీరిచ్చే విలువను మరోసారి దర్శించుకోగలిగాము.ఏ లోకాన ఉన్నా రాజు గారి ఆత్మ కూడా సంతోషిస్తుందని నమ్ముతూ…ధన్యవాదాలు సర్
——నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగా రాసావమ్మా.మొదటి విషయం నువ్వే రాసావు.50 ఎపిసోడ్లు ఎలా రాసానో నాకే తెలీదు.దానికి కారణం సంచిక సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ, చదువుతున్న మీరందరూను.కృతజ్ఞతలు అమ్మా.