జుడా (JUDA)లో బాబాయ్..!!
జీవితంలో ఉద్యోగపర్వం కూడా ప్రత్యేకతను సంతరించుకుని ఉంది. బాల్యం, యవ్వనం, విద్యాపర్వం ఎన్నో ప్రత్యేకతలను కలిగివుండి లెక్కలేనన్ని అనుభవాలను మూటగట్టుకొంటుంది. ఎందరో స్నేహితులను దరి చేర్చుకుంటుంది, ఎన్నెన్నో సాహసాలకు స్వప్నాలకు వేదిక అయిపోతుంది. అదొక ప్రత్యేకమైన కాలం. కులం మతం ప్రాంతాలకు అతీతంగా కలిసి ఆనందంగా గడిపిన రోజులు. చదువు సంధ్యలు, క్రీడలు, స్నేహాలూ, విహారయాత్రలు, ప్రేమలూ, విరహగీతాలు, విజయాలూ, వైఫల్యాలూ, ఇలా ఎంతో వింతగా గమ్మత్తుగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడిచిపోతుంది విద్యాపర్వం. ఐతే ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారా? అంటే అది వేరే విషయం!
ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించేసరికి ఒక రకమైన బాధ్యత మెడకు చుట్టుకున్నట్టు అవుతుంది. సమయపాలన, సమయం విలువ తెలిసివస్తుంది. జీవన శైలిలో పెనుమార్పులు మనకు తెలియకుందాని జీవితంలోకి చొచ్చుకుని వచ్చేస్తాయి. ఉద్యోగంలో స్థిరపడితే తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లల పెళ్ళి వైపు, వాళ్ళ సంసారిక జీవిత నిర్మాణం వైపు సాగిపోతాయి. సమయం వృత్తికి ప్రవృత్తికి సమాన నిష్పత్తిలో వినియోగించవలసిన అవసరం ఏర్పడుతుంది. దీనితో సరదాలకూ, సాహిత్య, సాంస్కృతిక వినోదాలకూ సమయం కేటాయించ లేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు సరదాలూ వినోదాలూ, వీలైన సమయాలలోనే వినియోగించుకోవాలి.
ఉద్యోగ పర్వంలో స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు ప్రయాణ సమయం ఎంతో విలువైనది. ఆ సమయంలోనే ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ శ్రమను అలసటనూ మరిచిపోయే అవకాశం వుంది. అది కూడా నలుగురితో కలిసి ప్రయాణించినప్పుడే సాధ్యం అవుతుంది. అది కూడా బస్సు ప్రయాణాలలోకాక రైలు ప్రయాణంలోనే ఇది బాగా సాధ్యం అవుతుంది. అయితే రైలు ప్రయాణం చేసేవాళ్ళు పైగా ఉద్యోగులు అందరూ ప్రయాణాన్ని ఏదో రకంగా సద్వినియోగం చేసుకుంటారు. కొందరు హాయిగా నిద్రపోతే, కొందరు పుస్తక పఠనంలో మునిగిపోతారు. కొందరు పేకాటలో పడితే, మరికొందరు సరదాగా జోకులు కబుర్లు చెప్పుకుంటూ ఆ కొద్దికాలన్నీ హాయిగా గడిపేస్తారు. దీనివల్ల అసలు ప్రయాణ బడలిక ఉండదు. రైలు దిగి ఎవరి ఆఫీసులకు వెళ్లి వాళ్ళ పనులు హాయిగా చేసేసుకుంటారు. గతంలో ఉద్యోగులు రవాణా సౌకర్యాలు అంతగా లేకపోవడం మూలాన ఎక్కువ శాతం స్థానికంగానే కాపురం ఉండేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యాలు అధికంగా ఉండడం వల్ల, కుటుంబపరమైన అనేక సాంకేతిక కారణాల వల్ల చాలామంది ఈరోజుల్లో ఉద్యోగ నిమిత్తం నివాస ప్రదేశం నుండి ఉద్యోగ స్థలానికి ప్రయాణం (అప్ అండ్ డౌన్) చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ముంబై, చెన్నై, కలకత్తా వంటి మహానగరాలలో ఈ పరిస్థితి ఎప్పటినుండో వుంది.
నా ఉద్యోగ పర్వానికి సంబంధించి సగం కంటే ఎక్కువ కాలం అప్ అండ్ డౌన్ లతోనే గడిచిపోయింది. పన్నెండు సంవత్సరాలు స్థానికంగా (మహబూబాబాద్) ఉంటే, పది సంవత్సరాలు రైలు ప్రయాణం (కాజీపేట – జనగాం), ఏడు సంవత్సరాలు బస్సు ప్రయాణం (హన్మకొండ – కరీంనగర్) చేయవలసి వచ్చింది. ఈ ప్రయాణాలలో నేను మిత్రులతో కలిసి ఆనందంగా గడిపింది రైలు ప్రయాణాలలోనే.
ఉదయం ఏడున్నరకు కాజీపేటలో సిరిపూర్ కాగజ్ నగర్ నుండి సికింద్రాబాద్‌కు వెళ్ళే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉండేది. ఇంచుమించు అన్ని శాఖలకు సంబందించిన సిబ్బంది జనగాం వెళ్ళడానికి కాజీపేట స్టేషన్‌కు వచ్చేవాళ్ళు. బండి ఎక్కువ శాతం రెండో నంబరు ఫ్లాట్‌ఫార్మ్‌కు వచ్చేది. బండి రాగానే కొందరు పరుగుప రుగున బండి ఎక్కడం, కొందరు బయటినుంచే కర్చీఫ్ విసిరి సీటు రిజర్వ్ చేసుకోవడంతో మా ప్రయాణం ప్రారంభం అయ్యేది. ఇంచుమించు వైద్య సిబ్బంది అంతా ఒకేచోట కూర్చునేవారు నాతో పాటు డా. తుకారాం బాబాయ్, డా. రాజ్ కుమార్, డా. రాజేశ్వరరావు, డా. సుబ్బులక్ష్మి, డా. భోజ, డా. సారంగం, డా. ఎల్. సత్యనారాయణ, డా. గిరిధర్, డా. రవీందర్ (హోమియో), డా. శ్యామ్ సుందర్ (ఆయుర్వేద), సాంబయ్య (రేడియోగ్రాఫర్), రవీందర్ రెడ్డి (ఆప్తాల్మిక్ అసిస్టెంట్), డా. రాజు వంటివారు ఉండేవారు. అందరిలోనూ డా. తుకారాం బాబాయ్ పెద్దవాడు, ఆయనకు జీతం ఎక్కువ ఉండేది. నేత్రవైద్యంలో సివిల్ సర్జన్ ఆయన. మా అందరికీ ఆయన ప్రధాన ఆకర్షణ. ఆయనతో అందరం చాలా సరదాగా గడిపేవారం. ఎవరు ఎన్ని జోకులు వేసినా హాయిగా నవ్వేవాడు తప్ప నొచ్చుకునేవాడు కాదు. ముఖ్యంగా నేనంటే చాలా ఇష్టపడేవాడు. బాబాయ్‌తో మేము గడిపిన ఆనంద క్షణాలు వివరించే ముందు, మీకు ‘జుడా’ అంటే ఏమిటో చెప్పాలి కదా! అదే, ‘జనగాం అప్ అండ్ డౌన్ అసోసియేషన్’ అన్న మాట!


జుడా…సభ్యులు
మేమందరం ఇందులో సభ్యులం. డా. తుకారాం బాబాయ్ చాలా సాధారణ దుస్తులు ధరించేవాడు. అప్పుడప్పుడూ అప్పట్లో ఒక వెలుగు వెలిగిన సఫారీ దుస్తులు ధరించేవాడు. ఇన్‌షర్ట్ చేసేవాడు కాదు. ఈ విషయంలో బాబాయ్‌ను ఆట పట్టించాలనుకున్నాం. సరదాగా నేనే ఒక రోజు “బాబాయ్ రేపటినుంచి ఇన్‌షర్ట్ చేయాలి, లేకుంటే మిమ్ములను రైలు ఎక్కనివ్వం” అన్నాను. దానికి ఆయన హాయిగా నవ్వేసి “ఈ వయసులో నేను ఇన్‌షర్ట్ చేస్తే అందరూ నవ్వుతారేమో!” అన్నారు. “లేదు బాబాయ్, దానికి వయసుతో పనిలేదు” అన్నాను. దానికి ఆయన పొడిగా నవ్వేసి ఊరుకున్నాడు. అది సీరియస్‌గా తీసుకుని చెప్పిన మాట కాదు. సరదాగా అలా ఆయనను ఆట పట్టించాం అంతే! ఆ సంగతి మరచిపోయాం. అయితే ఒక సోమవారం రోజున మా అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాబాయ్ ఇన్‌షర్ట్‌తో దర్శనం ఇచ్చారు. మేము ఆ రోజు ఆయనతో తెగ ఎంజాయ్ చేశాము. అయితే ఆయనలోని ఈ మార్పుకి బాబాయ్ శ్రీమతి గారు ఆశ్చర్యపోయి, ఈ విషయం అప్పటికే విదేశాల్లో వున్నకొడుకు, కూతురికి సందేశం పంపిస్తే పిల్లలు కూడా ఆశ్చర్యపోయి సంబరపడిపోయారట. ఈ వేషధారణ ఆయన ఇంచుమించు పదవీ విరమణ చేసినంతవరకూ కొనసాగించారు.


డా.తుకారం బాబాయ్, రిటైర్డ్ సివిల్ సర్జన్, హైదరాబాద్
మరో సందర్భంలో బాబాయ్‌కి మరో పరీక్ష పెట్టాం. అదేమిటంటే ఆయన బూట్లు వేసుకున్నా వాటిని వెనుకభాగం నొక్కిపట్టి చెప్పులు మాదిరిగా వాడేవారు. అది చూడ్డానికి అసలు బాగుండేది కాదు. ఒకరోజు మళ్ళీ నేనే “బాబాయ్, రేపటినుంచి కొత్త బూట్లు వేసుకురావాలి. లేకుంటే ఇప్పుడు వాడుతున్న బూట్లు లాగి పారేసి ‘స్టేషన్ ఘనాపూర్’ రైల్వే స్టేషన్లో బయటికి పారేస్తాం” అన్నాను. ఆయన వెంటనే “అయ్యో కొంచెం టైం ఇవ్వండి” అన్నారు నవ్వుతూ. “కుదరదు అలా” అన్నాను నేను. మళ్ళీ మా అందరినీ ఆశ్చర్య పరుస్తూ మరునాడు ఆయన కొత్త బాటా షూ ధరించి ప్రత్యక్షమయ్యారు. అంతమాత్రమే కాదు ఆ రోజు రైల్లో మా అందరికీ సమోసాలు కొనిపెట్టాడు.


జండా వందనం…. కుడినుండి రెండవవారు డాక్టర్ బాబాయ్
జనగాంలో రైలు దిగి పట్టాలు దాటి కొంచెం దూరం నడిస్తే రోడ్డుకి ఎడమవైపు పోస్టాఫీసుకు ఎదురుగా ‘షబ్బీర్ హోటల్’ ఉండేది. అక్కడ కాసేపు కూర్చొని టీ తాగేవాళ్ళం. ఒక్కోసారి ముందు చెప్పకుండానే, టీ తాగేసిన తర్వాత “ఈవాళ బాబాయ్ స్పాన్సర్ చేస్తారు” అనేవాళ్ళం. అంతే, మరోమాట లేకుండా బాబాయ్ బిల్లు కట్టేసేవారు.


డాక్టర్ గిరిధర్ రెడ్డి, రచయిత
బాబాయ్ సహృదయత గొప్పది. చిన్నవాళ్ళం అయినా, మేము ఎంత ఆటపట్టించినా, మాతో కలసి ఆనందించేవారు, మాతో ఎప్పుడూ కలిసి వుండాలని కోరుకునేవారు. ఎవరిపైనా కోపం పెట్టుకునేవారు కాదు. నేను ఆయనను సరదాగా ‘బాబూభాయ్ పటేల్’ అని పిలిచేవాడిని. పదవీ విరమణ చేసిన తర్వాత ఒక సందర్భంలో బాబాయ్ మళ్ళీ కలిశారు. మళ్ళీ పూర్వపు వస్త్రధారణతో చాలా డల్‌గా కనిపించారు బాబాయ్.


డాక్టర్ మదన్ మోహన్, రచయిత
“బాబాయ్ ఏంటి మళ్ళీ ఈ అవతారం?” అంటే, ‘’ ఇప్పుడు మీరు, మీ స్నేహం నాకు లేవుగా!” అన్నారు. అది చాలా కాలం బాధపెట్టింది. తప్పదు కాలమూ పరిస్థితులను బట్టి మనమూ బ్రతకవలసిందే.


జనగామ ఆసుపత్రి
బాబాయ్ ఆరోగ్యంగా అప్పుడప్పుడూ పిల్లలదగ్గరకి విదేశాలకు వెళ్ళివస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. నా జీవన యాత్రలో బాబాయ్ పాత్ర ఎప్పటికీ సజీవం!!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
28 Comments
Sagar
మరచిపోలేని అలాంటి వ్యక్తుల సాంగత్యం ఎన్నటికీ మధురమే సర్. వయసు బేషజం లేకుండా మీతో కలసిపోవడం వారి సహృదయ వ్యక్తిత్వానికి నిదర్శనం. చివరిలో ఒక్కమాట కదలించేలా ఉంది. మీ స్నేహం ఇప్పుడు లేదుగా అనే మాట మనస్సును మెలిపెట్టేలా, మీ స్నేహానికి ఉన్న విలువను తెలుపుతుంది. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
సాగర్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
నిజమే… అలాంటి జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవమే


కోరాడ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
Shyam kumar chagal . MA astrology. Hyd
ఉద్యోగపర్వం ప్రయాణం పర్వం , తుకారం గారి తో స్నేహ పర్వం,… ఈ మూడింటి మేలుకలయిక తో జరిగిన డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి రచనా వ్యాసంగం మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేలా ఉంది. స్నేహం లో ఉన్న మాధుర్యాన్ని గ్రొలడం ఎలాగో రచయితకు బాగా తెలుసు. స్నేహితుల జీవితాలను అధికంగా ప్రభావితం చేయగల గేది స్నేహితుడు మాత్రమే. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా స్నేహ పర్వంలో కుటుంబ సభ్యులతో సరిసమానంగా స్నేహితులతో గడిపిన క్షణాలు మధురమైన ఘట్టాలు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారి జీవితంలో మరెన్నో. ఇప్పటికే ఎన్నో మనకు తెలుసు, ఇంకా తెలియనివి మరి ఎన్ని ఉన్నాయో కదా. వేచి చూద్దాం


డా.కె.ఎల్.వి.ప్రసాద్
మిత్రమా
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మంచివాడు మా బాబాయి.. మాతోనే ఉంటాడోయి.. అనే పా త
పాట గుర్తుకు
వచ్చింది..
—-వెంకట్రామనర్సయ్య
మహబూబాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
కొన్ని స్నేహాలు ఎప్పటికీ మరచిపోలేము … ముఖ్యంగా “ అప్ & డౌన్ “ ఫ్రెండ్స్ ను అసలేమరువలేం , అదీ రైలు ప్రయాణ సహచరుల్నైతే మరీ …
నాకూ కొంత కాలం ఈ యోగంపట్టింది … రైల్లో కర్చీఫ్ వేసి సీటు సంపాదించటం మనం సాధించిన గొప్పవిద్యే… రైల్లో తిరిగినన్నాళ్ళూ ఏరోజు సీటు లేకపోవటమన్నదే లేదు ..అంటే మన “ స్కిల్ “ ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తుంది , నన్నెవరో మీ ప్రయాణం ఎలా ఉంటుంది ? అని అడిగినప్పుడు కూడా సీటు సంపాదించడం నేర్చుకున్నాం ! అని చెప్పాను …. మంచి జ్ఞాపకాలు సర్ !!!
జుడా బాబాయ్ గారు ఎంతటి సహృదయులో మీ కథనం తేల్చింది … అట్లా ఉండటానికి చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండాలి , తమను తాము నియంత్రించుకునే ఆత్మవిశ్వాసం ఉండాలి , మానవ సంబంధాలపై ముఖ్యంగా స్నేహంపై గొప్ప ఆభిమానం ఉండాలి … ఇవన్నీ ఉండటమే కాదు ఇవన్నీ నాకున్నాయనే గర్వమూ ఉండరాదు … అప్పుడే బాబాయ్ గారిలాగా చిరునవ్వు మొలుస్తుంది , లేకుంట్ ముఖంపై గర్వరేఖ చోటుచేసుకుంటుంది … అవేవీ లేవంటేనే వారెంతటి సహృదయు లో అర్థమౌతుంది … పదవీవిరమణ తరువాత తమ సహజప్రవృత్తి తో జీవితాన్ని ప్రశాంతంగా స్థిరచిత్తత తో గడపగలగడం గొప్ప ఆదర్శం !!!
మంచి అనుభవాలు పంచారు సర్ , హార్దికాభినందనలు …
—-గిరిజా మరోసారి బాబు
హన్మకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఉద్యోగ పర్వంలో రైలు ప్రయాణంలో మీ స్నేహితులతో సరదాలపై చక్కటి జ్ఞాపకాల పందిరి. చక్కటి కథనంతో సాగింది. అభినందనలు
—జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డి. వి. శేషాచార్య
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. మీరనుభవించిన స్నేహమాధుర్యాన్ని ఇలా అక్షరం చేసిన మీకు అభినందనలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అయ్యా
మీరన్నది నిజంగా నిజం
కృతజ్ఞతలు.
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 81 పూర్తిగా చదివాను సర్ మీ అనుభవాలు బాగా రాసారు……బాగుంది.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
Dr.Harika
As it said, ‘One of the most beautiful qualities of friendship is to understand and to be understood.’
Genuine friends are one of the valuable assets of life.
Very happy to know that you have very beautiful memories of life and We know how much efforts it takes to have such memories sir.
Thank you sir for sharing.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Dr.Harika
Thank you so much
Rajendra+Prasad
స్థాయి ఏదయినా సరదాగా ఉండటం మనిషిని చురుగ్గా ఉంచుతుంది. మీ బాబాయి తో మీ సరదా అనుభవాలు బాగున్నాయి. ఆయన సహృదయత ఆదర్శనీయం. మంచి సంగతులు పంచి నందుకు ధన్యవాదాలు సర్
– రాజేంద్ర ప్రసాద్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ప్రసాద్ గారూ
ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీరు స్మృతులను భలేగా నెమరు వేసుకోవడమే కాకుండా అందరికీ పంచుతున్నారు చదివినవారు కూడా వారి స్మృ తులను తలచుకుంటుంటూన్నారు
—–విజయలక్ష్మి.కస్తూరి
హైదరాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Jeevithamlo vividha parvaala gurinchi chaalaa chakkagaa vivarinchaaru…
Meeku manchi Baabaayi dorikaaru..kaalamshepaaniki……
Baagundandi…
Dhanyavaadaalandi
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Gd Afternoon Doctor garu,
Hi to JUDA & pranamams to Dr Tukaram Babai.
—Suryanarayana Rao
Hyderabad.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir.
మొహమ్మద్+అఫ్సర+వలీషా
ఒక మనిషిని ఏ వయసులో ఉన్నా ఎంత ఆరోగ్యంగా , ఆనందంగా, యాక్టివ్ గా ఉంచ వచ్చునో మీ సుదీర్ఘ వ్యాస జ్ఞాపకాల పందిరి చదివితే అర్థం అవుతుంది సార్. స్నేహం దేవుడిచ్చిన వరం దానికి వయసుతో సంబంధం లేదు. మనసులను ముడి పెట్టి సంతోషం సాగరాన్ని ఈదారు.నిజం గా ఆ అనుభూతిని మీరు స్వయంగా అనుభవించి అందరిని గుండె గది గదిలో దాచి తీసి తాజా గా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా గుర్తు పెట్టుకున్న మీ గుండె చాలా గొప్పది సార్. ఇది వ్రాసే టప్పడు కూడా మీ గుండె అంతే సంతోషం తద స్పందించి వ్రాసి మాకు అందించటం సో….గ్రేట్ మరియూ హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీకు.ఇప్పుడు వీలైతే అందరూ అప్పుడప్పుడూ కలిస్తే ఆ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది అని నా నమ్మకం. చాలా మంచి మనుషుల మనస్తత్వాలతో మీ అనుబంధాలను మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందిసార్ మీకు హృదయపూర్వక శుభాభినందనలు















డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ సుదీర్ఘ స్పందనకు
ధన్యవాదాలు.