గతం నుంచి వర్తమానం వరకూ..!!
వృత్తికి అంకితం అవ్వడం, వృత్తికి న్యాయం చెయ్యడం, వృత్తిని జీవితంలో ప్రధాన అంశంగా భావించి, అన్నిరకాలుగా పేరు తెచ్చుకోవడం, కేవలం వృత్తికే కాదు దేశ అభివృద్ధికి కూడా దోహద పడినట్టు అవుతుంది. అమూల్యమైన ఆ కొద్ది గంటలూ ప్రభుత్వం, లేదా యాజమాన్యం మన దగ్గర నుండి డబ్బు చెల్లించి కొనుక్కున్నట్లు భావించవలసి ఉంటుంది. అందుచేత పనివేళల్లో పని మాత్రమే చెయ్యడం, పని విషయంలో సమయపాలన పాటించడం, పనిలో ఉండగా, రాజకీయాలకు, సాహిత్య చర్చలకు, ఇతర పిచ్చాపాటి ముచ్చట్లకూ అక్కడ చోటు వుండకూడదు. అయితే అది ఎంతమంది ఎలా పాటిస్తున్నారో కొన్ని కార్యాలయాల పరిస్థితి చూస్తే తెలుస్తుంది. ప్రజాసమయం, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న జ్ఞానం లేని కొందరు, ప్రభుత్వ ఉద్యోగాలు అడ్డం పెట్టుకుని, పక్క వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, బినామీ వ్యక్తులతో తమ స్థానంలో పనిచేయిస్తూ, పూర్తి స్థాయిలో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇలా వృత్తిపరంగా ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల సమయాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు మనకు కనిపించినా, మన అవసరాలను దృష్టిలో వుంచుకుని అలాంటి వారి గురించి ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ఆయా ఉద్యోగులకు, స్థానిక పెద్దల లేదా రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడం మూలంగా, వారు ఆడింది ఆటగా పాడింది పాటగా నడుస్తూ ఉండడం మనం గమనిస్తూనే వున్నాం. ఇప్పటికీ చాలామందిలో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఎలా నడిపించినా సరిపోతుందన్న భావనలో ఉండడం దురదృష్టకరం!
ప్రభుత్వ పరమైన కొన్ని విభాగాలలో లేదా కార్యాలయాలలో జంకు-గొంకు లేకుండా బాహాటంగా అవినీతికి/లంచాలకు అలవాటు పడడం సమాజానికి రాచపుండులా తయారయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే సాహిత్యకారులైన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమైన స్థానాలలో వుండి లంచాలు తీసుకుంటూ, లంచాలకు వ్యతిరేకంగా కవిత్వం రాయడం, కథలు/నవలలు రాయడం మనం చూస్తూనే వున్నాం. అలా అని ప్రభుత్వ ఉద్యోగులంతా ఇలాంటి వారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ బీదవాడిని ఆర్థికంగా హింసిస్తూ, బీదరికం గురించి కవిత్వం, కథలు రాస్తే ఎలా వుంటుంది? అందుకనే ప్రజాసేవ చేయగల సహృదయులు మాత్రమే, తాము తీసుకునే జీతభత్యాలకు న్యాయం చేకూర్చ గలవారే ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలి. ఇందులో వెలుగు చూస్తున్న లోపాల వల్లనే ముఖ్యంగా ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రజల దృష్టిలో వేళాకోళంగా మారాయి.
ఇలాంటి నేపథ్యంలో నేను పనివేళల్లో ఇతరులను ఎవరినీ రానిచ్చేవాడిని కాదు. నా మిత్రులను, శ్రేయోభిలాషులను కూడా పనివేళల తర్వాతనే కలవమనేవాడిని. చికిత్సాపరమైన, వైద్యపరమైన పనులకు తప్ప పని వేళల్లో నా దగ్గరికి ఎవరూ వచ్చే సాహసం చేసేవారు కాదు. పేషేంట్స్ ఒత్తిడి లేనప్పుడు చదువు కోవడమో, వ్యాసాలు రాసుకోవడమో (నిజానికి పని వేళల్లో ఈ పనులు కూడా చేయకూడదు) చేసేవాడిని. అలా, వృత్తి -ప్రవృత్తి, క్రమశిక్షణతో నడుస్తుండేవి. పత్రికలలో వ్యాసాలూ, కథలూ రావడం, పని చేసిన చోటల్లా ప్రజల్లో ‘మంచి డాక్టర్’ గా పేరు రావడం చాలా తృప్తి నిచ్చేది.
1994 లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా జనగాం ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. మహబూబాబాద్‌లో పనిచేసినప్పుడు స్థానికంగా ఉండేవాడిని. నా శ్రీమతి ఉద్యోగిని కావడం, ఆమెకు హన్మకొండలో పోస్టింగ్ రావడం మూలాన, పిల్లలను కూడా హన్మకొండ పాఠశాలలో చేర్చి నివాసం హన్మకొండ ఫిక్స్ చేయడం మూలాన, నేను రోజూ కాజీపేట నుండి రైలులో జనగాం అప్ అండ్ డౌన్ చేసేవాడిని. తొమ్మిది గంటల కల్లా డ్యూటీలో సిద్ధంగా ఉండేవాడిని. స్థానికంగా ఉండడం లేదన్న అపవాదు తప్ప, పనివేళల్లో ఎంతో నిబద్దతతో పని చేసి స్థానిక ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నాను. అప్పుడు జనగామ ఆసుపత్రి తాలూకా ఆసుపత్రి స్థాయిలో ఉండేది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాడిన తర్వాత జనగామ జిల్లాగా మారడం వల్ల, అది జిల్లా ప్రధాన ఆసుపత్రిగా మారింది.
ఒకరోజు యధావిధిగా ఉదయం నా డెంటల్ ఓ.పి. (అవుట్ పేషేంట్ విభాగం) లో నా పని సీరియస్‌గా చేసుకుంటున్నాను. ఆ రోజు పేషేంట్స్ కూడా ఎక్కువ మంది లైన్లో నిలబడి ఒక్కొక్కరూ వచ్చి చూపించుకుంటున్నారు.
కొంచెం సమయం అయ్యాక ఒక వ్యక్తి లైన్లో కాకుండా పక్కనుండి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. గేటు దగ్గర వున్న అటెండర్ అతడిని లోనికి రానివ్వడం లేదు. అయినా అతను పదేపదే లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వీలు పడ్డం లేదు. అది గమనించిన నేను అతడి వంక చూసి ‘పంటి నొప్పా?’ అన్నట్టుగా మైమ్ కళను ప్రదర్శించాను. “కాదు”.. అన్నట్టు అతను సైగ చేసాడు. ‘మరి ఎందుకు?’ అన్నట్టు నేను సైగ చేసాను. ‘పేస్ రీడింగ్’ అన్నట్టు నుదురు చూపించాడు. అంటే జాతకం లాంటిదన్నమాట. అతను కోయదొరలా వున్నాడు. అసలే అలాంటివాళ్ల కబుర్లు, పైగా జాతకం వంటివి నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకే ‘నాకు వద్దు’ అన్నట్టు సైగ చేసాను. అయినా అతను అక్కడినుండి కదలలేదు, అలాగే లోపలికి వచ్చే ప్రయత్నమూ మానలేదు. అలా.. ఆలా.. మధ్యాహ్నం పన్నెండు అయిపొయింది. పేషేంట్స్ అయిపోయారు. నేను లంచ్ చేసే సమయం కూడా అయింది. కానీ ఆ కోయదొర అక్కడే నిలబడి వున్నాడు. అతను అలా నిలబడి ఉండడం నాకూ జాలి బాధ కలిగాయి. అందుకే లోపలి రమ్మన్నట్టు సైగ చేసాను. అతను లోపలికి వస్తూనే నా గురించి కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. పేషేంట్ కూర్చునే స్టూల్ మీద కూర్చోమన్నాను. కూర్చొని నా ముఖం వంక చూసి చిన్నప్పటి నుండి నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఆ.. మాటల ప్రవాహం అసలు ఆగడం లేదు. నా ఆశ్చర్యానికి అంతులేదు. ఏ మాత్రం తేడా లేకుండా అన్నీ చెప్పేస్తున్నాడు. ఇంకా అతనిని అలా చెప్పనిస్తే ఇంకేమి చెబుతాడోనని ఇక ముగించే ప్రయత్నం చేసాను. కానీ అతను కదలడం లేదు. పైగా “నువ్వు కారు కొంటావు దొరా” అన్నాడు. “నాకు ఆ ఆశలు లేవు” అన్నాను (అప్పటికి నేను స్కూటర్ తోనే కాలక్షేపం చేస్తున్నాను). అప్పుడు అతను ఒక స్ప్రింగ్ లాంటి తీగను నా టేబుల్ పై పెట్టి “ఈ తీగ కదిలితే నువ్వు కారు కోనబోతున్నట్టు” అన్నాడు. దానివంక కాసేపు చూసాడు. అది కదలడం మొదలు పెట్టింది. అది నాకు మరింత ఆశ్చర్యాన్ని,ఆరాటాన్ని కలిగించింది.
(కోయదొర చెప్పిన కొద్ది నెలలలోనే నేను కారు కొనడం జరిగింది,ఇది యాదృచ్ఛికం కావచ్చు!). నా ఆనందానికి అంతులేకుండా పోయింది. పర్సులోనుంచి పాతిక రూపాయలు చేతిలో పెట్టాను. చాలా సంతోషించాడు.
ఒక పొడుగు పుస్తకం తీసి నా పేరు, చిరునామా రాసి సహకరించామన్నాడు. దానిని వేరేవాళ్లకు చూపించడం ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆతని కోరిక మేరకు నా పేరు చిరునామాతో పాటుగా నా కామెంట్ కూడా రాసాను. అతను అంతటితో తృప్తి పడలేదు. ఆ పుస్తకం లోనే నాకు బాగా తెలిసిన ఇద్దరి పేర్లు చిరునామా రాసి ఇచ్చాను. అందులో ఒకాయన అక్కడ లోకల్‌గా వుండే డాక్టరు. పైగా ఆయన ఇల్లు హాస్పిటల్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల మన కోయదొర ముందు ఆయన దగ్గరకే వెళ్ళాడు.
భోజనం చేసి శ్రీమతితో ఆయన మాట్లాడుతున్న సమయంలో కోయదొర అక్కడికి వెళ్ళాడు. జాతకాల మీద జ్యోతిష్యం మీద వాళ్లకు అపారమైన నమ్మకం ఉండడం మూలాన, అతనికి మర్యాద చేసి కూర్చోబెట్టారు. ముందు డాక్టర్ గారి శ్రీమతికి జరిగిన కొన్ని సంఘటనలు చెప్పడంతో అతనిమీద ఆవిడకు మంచి నమ్మకం ఏర్పడింది. తర్వాత డాక్టర్ గారి వంతు వచ్చింది.
ప్రారంభంలోనే డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టే సమాచారం చెప్పాడు. దానితో ఆయన కొంచెం ఇబ్బందిలో పడ్డట్టు అయింది. అప్పటికే స్త్రీలోలుడుగా పేరు పడ్డ ఆయన వ్యవహారం కోయదొర వ్యాఖ్యానం రూడీ చేయడంతో, ఆయన ఇంకెన్ని వినాలోనన్న భయంతో అతని చేతిలో వంద రూపాయల కాగితం చేతిలో పెట్టి త్వరగా మరోమాటకు తావివ్వకుండా పంపించేశారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి “గురువా, నా కొంప ముంచావుకదా!” అన్నాడు. ఆయన చెప్పిన విషయాలు విని నేను కూడా ఖంగు తిన్నాను. అలా జరుగుతుందని నేనూ అనుకోలేదు. అతడిని వదిలించుకోవడానికి నేను చేసిన పని ఇలా బెడిసి కొడుతుందని ఊహించలేదు. వాళ్ళ సంసారంలో తెలియకుండానే చిచ్చు పెట్టినట్టైంది.
ఇక్కడ విషాదం ఏమంటే, ఇది జరిగిన కొద్ది నెలలకే ఆ మేడం ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నన్ను బాగా బాధపెట్టిన సంఘటనలో ఇదొకటి. గుర్తుకు వస్తే మనసు వికలం అవుతుంది.
ప్రస్తుతం ఆ డాక్టర్ గారు బ్రతికే వున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ మాత్రం మరణించింది. కొన్ని జీవితాలు అంతేనేమో!!
కోయదొర కనిపిస్తే ఇప్పటికీ భయపడుతుంటాను నేను.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
27 Comments
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక
Sagar
నిజమైనా, అబద్దమైనా విధిని నమ్మకుండా ఉండలేం కదా సర్ ? అదే వారి బలహీనత కాకుండా మంచి విషయం కోయదొర చూప్పి ఉంటే మురు బాధపడవలసిన అవసరం లేదు కదా? యాదృచ్చికమైనా అంతా విధి చేతిలోనే కదా అందరి జీవితాలు? మీకు ధన్యవాదములు సర్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్ ధన్యవాదాలు
Shyam kumar chagal . MA astrology. Hyd
ఈ మారు రచయిత గారు తీసుకున్న ఇతివృత్తం విశేషమైనది . . పైగా కోయ దొర అలాగే చెపుతారు. ..అందులో సందేహం లేదు. కాని ఆవిడ ఎందుకు చనిపోయినది తెలీదు..పాపం. అక్రమ అని పేరు పెడతామ కాని వారు కావాలని చేయరు. నిజానికి అది .. వారి జీవిత పరిస్థితే ..కారణం. బాధ సర్ప ధ ష్ట లు. I pity the women. సాధారణంగా వీటిలో..మగాడు ఎప్పుడూ చావడు. కాని ఆ రకంగా వాడుకొని..తర్వాత పెళ్లాం తో హాయిగా వుండే వారి కి. దేవుడు.శిక్ష శిక్షించాలని కోరుతూ.. శ్యామ్ కుమార్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
నీ స్పందన కు
ధన్యవాదాలు మిత్రమా
Bhujanga rao
ఈ ఎపిసోడ్ గతం నుంచి వర్తమానం వరకు…. ప్రభుత్వ ఉద్యోగాలు అడ్డుపెట్టుకొని కొందరు వ్యక్తులు పక్క వ్యాపారాలు చేసుకునేవారు,బినామీ పేర్లతో పని చేయించేవాళ్ళతో ప్రజా ధనం ఎలా దుర్వినియోగం అవుతుందో మరియు పని వేళల్లో పని చేయటం,పని విషయంలో సమయపాలన పాటించడం గురించి ఇప్పటి తరానికి మరియు రేపటి తరానికి చక్కని సందేశం ఇచ్చారు.కోయదొరలాంటి వారు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే వస్తారని నా అభిప్రాయం. వాళ్లకు అదే వృత్తి కనుక అందులో ఆరితేరి ఉంటారు.వాళ్ళ మాటలు విన్న తరువాత ఎంతో కొంత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కోయదొర చెప్పినా చెప్పకపోయినా విధి వ్రాత తప్పదు అంటారు. కావున ఆవిడ చనిపోవడం డాక్టర్ గారి జీవితంలో వారు కొనితెచ్చుకున్న పరిస్థితులే అలా జరిపించాయి.ధన్యవాదములు సర్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు సర్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అదే కదా కోయదొర గొప్పతనం. దాన్ని మైండ్ రీడింగ్ అందామా అంటే వీలుకావడం లేదు. పోనీ సహదేవుడిలాగా సర్వం తెల్సిన వాడా – తెలిస్తే ఇలా ఎందుకు ఊరూరా తిరుగుతాడు. మనం ఏదయినా ఒక కథ చెబితే జానపద గాయకులు దాన్ని ఒక కథాగానంగానే, వస్తువుని బట్టి వీరగాథ గానో అప్పటికపుడు తన బాణీలో పాడడమో, చెప్పడమో చేయగలడు. అంటే విషయం ఏదయినా తన చట్రంలో ఇముడ్చుకోగలడు అన్నమాట. అలాగే మన కోయ దొర కూడా వ్యక్తులు వేరయినా తన బాణీ ని వినిపిస్తున్నాడు. మీ రన్నట్టు అవి నిజం కూడా అవుతున్నాయి. మరి హేతువాదులు ఏమంటారో చూడాలి. ధన్యవాదాలు సార్.
—డాక్టర్. భక్తవత్సల రెడ్డి
నెల్లూరు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Gd Aftn Doctor garu.
Koya doralu cheppe konni vishyalu nijangane untayi.
–suryanarayana Rao
Hyderabad.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సర్
మీ స్పందనకు
ధన్యవాదాలు.
Rajendra+Prasad
కోయ దొర నిజాలు చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది. ఇకపోతే, తప్పు మనస్సాక్షి గల వారు, చెప్పేది ఒకటి , చేసేది ఒకటి. వృత్తికి మీరు ఇచ్చిన గౌరవం మీకు మంచి పేరు తెచ్చింది అనటంలో ఆశ్చర్య మేమీ లేదు.మన ఉద్దేశాలు కు భిన్నంగా మన వల్ల మేలు బదులు కీడు జరిగితే కలిగే బాధ అంతా ఇంతా కాదు. మీ స్నేహితుడి విషయంలో జరిగింది చాలా బాధా కరం.
– రాజేంద్ర ప్రసాద్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
Sarasi
నిజ జీవితంలో జరిగే కొన్ని అనుభవాలు కథలకు ఏమాత్రం తీసిపోవు. తప్పకుండా ఇది కధ రాయండి ఇప్పటికే రాసి వుండకపోతే.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
మొహమ్మద్+అఫ్సర+వలీషా
మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన మధురమైన జ్ఞాపకాలు వ్రాసే ముందు ప్రతి సారి మంచి అందరికీ ఉపయోగ కరమైన ఉపోద్ఘాతము వ్రాస్తారు సార్ మీరు . ఈ సారి అలాగే చాలా చక్కని విషయాలు వ్రాశారు. ఇక కోయదొర సంగతి అంటారా ఫేస్ రీడింగ్ వస్తే చాలు సగం జాతకం చెప్పేస్తారు చాలా మంది.అందులో చాలా వరకూ కోయవాళ్ళ మాటల్లో నిజాలు ఉంటాయి . ఎందుకంటే నాకు చాలా భయం జాతకాలు చూపించుకోవాలంటే ఇంటర్ నేను శ్రీశైలం లో చదివేటప్పుడు కోయవాళ్ళు ఎక్కువ అక్కడ జాతకం చెబుతామని కాలేజ్ దగ్గర వచ్చేవాళ్లు. నేను భయంగా వచ్చేస్తుంటే నీ చేతిలో డబ్బుఉంటుంది కానీ ఆగదు అన్నాడు.యాదృచ్ఛికంగా ఈనాటి వరకూ అదే జరుగుతున్నది.అతని మాటలు అబద్ధం చేయాలని చాలా ప్రయత్నం చేస్తుంటాను సార్. ఎవరికో ఒకరికి ఉపయోగించేస్తూ ఉంటా.మన్నించాలి మీ జ్ఞాపకాలతో నా పాత జ్ఞాపకం పునరావృతం అయినందుకు
మీ సహ డాక్టర్ గారి భార్య మరణానికి కారణం మీ వైపు నుండి ఏమాత్రం కాదు సార్. నిజం నిప్పులాంటిది.ఏనాటికైనా తప్పకుండా తప్పు బయటకు రాక మానదు.నమ్మకం అనే పునాది మీద నిర్మించలేని వివాహం ఏనాటికైనా కూలక మానదు.మీలాంటి సహృదయులు ఒకరికి మేలు చేయడమే తప్ప కీలెరగని మహాత్ములు.మీరు కోయవానికి నాలుగు డబ్బులు వస్తాయనే మంచి మనసుతోనే కదా వాళ్ళ పేర్లు చెప్పింది. జీవితంలో జరిగే విభిన్న జ్ఞాపకాలతో సదా మమ్మల్ని జాగరూక పరుస్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 


















డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ సుదీర్ఘ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
జీవితంలో జరిగిన ఘటనను హృద్యంగా వివరించారు. మీకు ఎంత నమ్మకం లేకపోయినా మీ ఇద్దరి విషయంలో ఆ కోయదొర చెప్పింది నిజమే కద!
వాడివిద్య గొప్పదే కద!
ఆచార్య తంగెడ జనార్ధనరావు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 82 లో కోయదొర జరిగిన సంఘటనల గురించి చెప్పడం మరియు మీరు ఇద్దరి వివరాలు ఇవ్వడంవరకు బాగుంది. చివరలో ఒక మహిళ మరణంతో ముగించారు. ఒక్కసారి మన ప్రేయం లేకుండా కొన్ని సంఘనలు జరుగుతాయి. మనం నిమిత్తమాత్రులం.
—-జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఉపోద్ఘాతమ్ ప్రభుత్వ,ప్రజల సమయాన్ని దుర్వినియోగం చేసే ఉద్యోగుల కు విద్యుత్ఘాతంలా ఉంది సర్…..చాలా విచిత్రమైన సన్నివేశాల కలబోత జీవితం అనేది మీ ఈ జ్ఞాపకం చదువుతుంటే అక్షరాలా నిజం అనిపిస్తుంది సర్….ఒక కోయ వాని మాటలు ఒక మహిళ మరణానికి కారణమవ్వడడం చాలా విషాదకరం.ఆయా వ్యక్తుల మానసిక స్థితి కూడా దీనికి కారణం అని అనుకుంటున్నాను.మీరు ఆ బాధకు బాద్యులు కాబోరని నాకనిపిస్తుంది.ఏదేమైనా జీవితంలో ని ప్రతి సంఘటనలో జాగురుకత అత్యవసరం అని మాకు అందరికీ తెలియ చేసిన మీ జ్ఞాపకానికి ధన్యవాదాలు సర్




—నాగజ్యోతీ శేఖర్
కాకినాడ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ విశ్లేషణ తో కూడిన స్పందన
చాలా బాగుంది.
ధన్యవాదాలు మీకు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
82 వ సంచిక చదివినాను సర్.
మీ ప్రొలాగ్ బాగుంటుందని ఇదివరకే చెప్పిన మళ్ళీ మళ్ళీచెప్పవలసి వస్తున్నది.
ప్రహుత్వ ఉద్యోగుల్లో మీరుదహరించినట్లాటి వారిని ఖురించి ఎంత మాట్లాడినా తక్కువే.ఐతే ఉన్నతోద్యోగాలలో వుండే వారు కొందరు ( even ias) కూడా ఇట్లా వుండేవారంటే ఆశ్చర్యమే.
ఇక జ్యోతిషాలు ముఖ పఠనం వంటి వాటి మీద నాకు విశ్వాసం లేదు.వాళ్ళు గతం ఎట్లా చెప్తారన్న దాని ఖురించి నేనేమీ చెప్పను భవిష్యత్తు బాగావజరుగుతుందనే చెప్తాడు.
జీవన గమనంలో చిత్రమైన విషయాలు జరుగుతవి . అవన్నిటినీ స్వీకరించటం తప్ప ఏమీ చేయలేము.
–రామశాస్త్రి. నాగిళ్ళ
హన్మకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
ధన్యవాదాలు మీకు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సార్ నమస్కారం!
మీరు వ్రాస్తున్న జ్ఞాపకాల పందిరి శీర్షికలోని అన్ని భాగాలలో ఉపోద్ఘాతము చాలా సందేశాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఆనాటి తరంవారు వారి వృత్తి పట్ల ఉన్న అంకితభావం, నిజాయితీ నేటి యువతలో కొంతవరకైనా తీసుకురావాలనే మీ దృఢసంకల్పం ప్రశంసనీయము. మీకు ఎదురైన సంఘటనలు ప్రజా సంబంధాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ,అలాగే ఇతర రంగాల్లోని ప్రముఖులకు సాధారణమే అయినప్పటికిని మీరు తెలియజేసే క్రమము ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఈ వారం జ్ఞాపకంలోని కోయదొర ప్రవేశము, తదనంతర పరిణామాలు, యాదృచ్చికమే అయినప్పటికీ కొన్ని నమ్మకాలను పూర్తిగా కొట్టిపారేయలేమని తెలియవస్తోంది .
—-బి.రామకృష్ణా రెడ్డి
సికింద్రాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రెడ్డి గారూ
ధన్యవాదాలు మీకు.