ఆమెలో… ఆమెనై..!
స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆస్ట్రేలియా వలస వచ్చేసాక తెలుగుతనం కోసం తపిస్తూ తరుచూ ఒంటరిగా ఫీల్ అవుతుండేదానిని. ఒంటరితనం అంటే తోడు లేకపోవటం అనుకునే నాకు అప్పుడే ఒంటరితనానికి అసలు కారణం తెలిసింది. ఎఫ్ఎంలో తెలుగు పాటలు లేకపోవటం, చెవులకు తెలుగు మాటలు వినిపించక పోవటం, కళ్ళకు తెలుగుతనం కనిపించకపోవటం, లైబ్రరీలో తెలుగు పుస్తకం దొరకకపోవటం, ఈ నేల, ఈ గాలి అన్నీ తెలుగు లేమితో బాధపడటమే నా డిప్రెషన్‌కు, నాలో ఒంటరి భావనకు కొంత కారణం. అలాంటి ఒంటరితనంలో ఒక రోజున ఒక రెస్టారెంట్‌కు వెళ్ళి ఏకాంతంగా ఓ మూల కూర్చున్నాను.
ఒంటరితనానికి ఏకాంతానికి మధ్య అంతరాన్ని బేరీజు వేసుకుంటూ ఒక్కర్తినీ జూస్ సిప్ చేస్తూ చుట్టూ పరిసరాలు గమనిస్తున్న నా దృష్టి ఎదురుగా వున్న కోజీ కార్నర్లో క్లోజ్‌గా వున్న ఇద్దరమ్మాయిల మీద పడింది. ఇద్దరూ లిప్ టు లిప్ కిస్ ఇచ్చుకుంటున్నారు. రెస్టారెంట్ మొత్తం ఎక్కువ జంటలు అటు లెస్బియన్సో లేదా ఇటు గేసో వున్నారు. ఈ ప్రాంతంలో అమ్మాయి అబ్బాయిల జంటలు తక్కువ. కలికాలపు స్వలింగ సంపర్కాలు ఎక్కువ. చిత్రంగా ఆ క్షణం నాకు హై స్కూల్ రోజుల్లోని నా ప్రాణ స్నేహితురాలు క్వీనీ గుర్తొచ్చింది. క్వీనీతో పాటు ఎక్కడో చదివిన ఒక ఆంగ్ల కోట్ కూడా గుర్తొచ్చింది.
“Friendship marks a life even more deeply than love. Love risks degenerating into obsession, friendship is never anything but sharing.”
నా బ్లాక్ బ్యూటీ తలపులతో మనసు గతంలోకి పరుగులు తీసింది.
తెల్ల తోలు కోసం వెర్రిగా ఎగబడతాం కాని కాంతివిహీనంగా వున్న చర్మం తెలుపైనా వ్యర్ధమే. పాలిష్ చేసిన మెషీన్ కట్ నగలా తళతళలాడే క్వీనీ మొహం చామనఛాయలో కూడా మెరిసిపోతుండేది. హై స్కూల్లో ఆరో క్లాసులో చేరిన మొదటి రోజే తన మృదుభాషణం, సహజత్వం, సౌశీల్యం నన్నాకట్టుకున్నాయి. క్వీనీ పొందికగా, కాసింత బెరుగ్గా, బితుకు బితుకుమంటూ భానుప్రియ కళ్ళలాంటి కళ్ళను టపటపలాడిస్తూ, తుమ్మెద రెక్కల్లాంటి కన్రెప్పలను అల్లల్లాడిస్తూ కళైన మోముతో కాంతులీనుతుండేది.
అందం వేరు. ఆకర్షణ వేరు. అందం అందరినీ ఆకర్షించక పోవచ్చేమో గాని ఆకర్షణ ఏ ఒక్కరి దృష్టిని తప్పించుకోలేదు. అందం, ఆకర్షణ రెండూ ఒకరినే వరిస్తే అది అద్భుతం. క్వీనీ నా కళ్ళకు ఒక అద్భుతం. తనో మిడిల్ క్లాస్ క్రిష్టియన్ అమ్మాయి. ప్రతి శనివారం స్పోర్ట్స్ రోజున శ్వేత వస్త్రాల్లో నా కళ్ళకు శాంతిదూతలా ప్రశాంతంగా ప్రసన్నంగా కనిపించేది. తనతో స్నేహం అపురూపంగా అనిపించేది.
అప్పట్లో హిందీలో “Guddi” అనే సినిమా రిలీజయ్యింది. అచ్చు ఆ సినిమాలో జయ బాధురిలా క్వీనీ ముచ్చటగా ముద్దొస్తుండేది. నేను తనపై చూపే ప్రేమాభిమానాలకు పదింతలుగా తనూ నన్నెంతగానో ఆరాధించేది. పాలంత స్వచ్చమైన స్నేహం మా మధ్య. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. తను నా విషయంలో పొసెసివ్‌గా ఫీలయ్యేది. నేను తనను చాలా ప్రొటెక్టివ్‌గా చూసుకునేదానిని.
క్వీనీ చదువులో ఏవరేజ్. నేను క్లాసు ఫస్టు, స్కూలు ఫస్టు, మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్ని. అవతలి వ్యక్తిపైనున్న అపారమైన ప్రేమ మనలో సహనాన్ని పెంచుతుంది. తనకు చాలా సహనంతో అనునయంగా పాఠాలు అర్ధమయ్యేట్టుగా వివరించి నేర్పేదానిని. సహనంతో కూడిన నా టీచింగ్ స్కిల్స్‌కి అప్పుడే పునాది పడింది. నా నోట్సు తనకు ఇస్తుండే దానిని. కంబైన్డ్ స్టడీస్ కోసం క్వీనీ మా ఇంటికొస్తుండేది. అమ్మతో తనకిష్టమైన వంటలు చేయించేదాన్ని. వెళ్ళిపోయేప్పుడు రిక్షా ఎక్కించి, చార్జీలు ఇచ్చి, రిక్షావాడికి వంద జాగ్రత్తలు చెప్పి పంపేదాన్ని. ఎంతో ఓవర్ ప్రొటెక్టివ్‌గా ప్రవర్తించేదాన్ని. తను పొట్టిగా ముద్దుగా పసిపాపలా వుంటే తనకన్నా ఓ అడుగు బారుగా వుండే నేను నన్నొక హీరోలా ఫీలయేదాన్ని.
ఒక స్త్రీ మరో స్త్రీ పట్ల ఆకర్షితమవటానికి ఇప్పటి రోజుల్లో వేరే పేర్లు వున్నాయి. అయితే అప్పటికి ‘లెస్బియన్’ అనే పదమొకటి వుందని కూడా తెలియని రోజుల్లో చేసిన సక్రమ స్నేహం అది. చెబితే నమ్మరు కాని ఏ అక్రమ ఆలోచనలూ లేకుండానే పెద్దయ్యాక ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో వుందామనుకునేవాళ్ళం.
బక్కపలుచగా చిన్నగా వుండే తను ఎప్పుడూ ఓపిక లేనట్టుగా తన బరువంతా నాపై వేసేసి నా మీదకు ఒరిగిపోయి నాలోకి ఒదిగినట్టు వుండేది. అలాంటప్పుడు తల్లికి బిడ్డపై కలిగే మమకారం, అక్కకు చెల్లెలిపై ఉప్పొంగే అనురాగం నాలో వెల్లివిరిసేవి. ఇద్దరి వయసు ఒకటే అయినా తను పసిది, తన బాధ్యత నాది అనే ఫీల్ కలిగేది నాకు. అదొక అవినాభావ స్నేహబంధం. తన స్పర్శ, తన నుండి వచ్చే క్యూటిక్యుర పౌడరు వాసన చాలా ఇష్టంగా వుండేవి.
ఐదేళ్లు సాగిన ఆ స్నేహబంధం టెన్త్ క్లాసుకి వచ్చేసరికి మరింత పటిష్టమయ్యింది. అయినా పెద్దల చాటు పిల్లలం. పెద్దవాళ్ళమవ్వటమే కాకుండా పెద్దమనుషులం కూడా అయ్యాము. శరీరంలో వచ్చిన మార్పులతో పాటు పెద్దలు చెక్కిన అడుగుజాడల్లో నడుస్తూ భావోద్వేగాలు తగ్గించుకుని పరిణితి చెందాము. ఆ క్రమంలో మా జీవన గమ్యాలు మారి మా దారులు వేరయ్యాయి. మేము నా కాలేజీకి దగ్గరగా ఇల్లు మారాము. ఇళ్ళ స్థానాలు మారి మా మధ్య దూరాలు పెరిగాయి. ఉద్యోగార్ధమై జీవనోపాథికి తనేదో ITI కోర్సు లో చేరింది. నేను ఇంటరు, డిగ్రీ, పిజి, ఆర్మీ. మా మధ్య కలయికలు తగ్గాయి. క్రమంగా బిజీ బ్రతుకులో పూర్తిగా ఎడమై పోయాము.
స్నేహాన్ని కొనసాగించే స్వేచ్చలో అబ్బాయిలెప్పుడూ స్వతంత్రులే. అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడికయినా వెళ్ళి స్నేహితులను కలిసే వెసులుబాటు జన్మతః వాళ్ళకుంటుంది. ఈ ఒక్క విషయంలో మాత్రమే నేను అబ్బాయిగా పుట్టనందుకు చింతించేది.
క్వీనీ సమాచారం ఏమీ తెలియకపోయినా దాదాపు మూడు దశాబ్దాలు దాటినా ఈ రోజుకీ క్వీనీ తలపు నా మదిలో ఆనందాన్ని, పెదవులపై చిరునవ్వును అరవిచ్చుకొనేలా చేస్తుంది. ఓ పురుషుడికి తన ప్రియురాలి తీపి స్మృతిలా అప్పటి ఆ ఆకర్షణ, ఆ స్నేహ మాధుర్యం ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో ఫ్రెష్ గానే వుంది. ఎక్కడయినా క్యూటిక్యుర పరిమళం ముక్కుకి తగిలితే మనసులో క్వీనీ మెదులుతుంది.
అప్పటి ఆ స్నేహంలో పరిపక్వత లేకపోవచ్చేమో గాని స్వచ్ఛత వుండేది. ఆడా మగా తారతమ్యం లేకుండా ప్రతి మనిషికి వయోవృద్ధ భేదం లేకుండా భార్యా, భర్తా, తల్లి, బిడ్డలతో పాటుగా కనీసం ఒక స్వచ్చమయిన స్నేహబంధం వుండాలని నేను బలంగా నమ్ముతాను. ఎటువంటి భేషజాలు లేకుండా, ఏ విషయమైనా నిర్మొహమాటంగా నిస్సంకోచంగా చర్చించుకునే చనువు గల ఒక స్నేహం ప్రతి ఒక్కరికి వుండాలి. అప్పుడే కదా ఆ జీవితం పరిపూర్ణమయ్యేది.
నా ఆలోచనాస్రవంతికి ఆనకట్ట వేస్తూ బేరర్ పిలిచిన పిలుపుతో నాస్టాలజీ నుండి ప్రస్తుతంలోకి వచ్చాను…
(మళ్ళీ కలుద్దాం)

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
17 Comments
Kopparapu narasimha kumar
ఒక చట్రం లాంటి భావాల్ని చిన్నప్పుడే చొప్పించేశారు
మెదుళ్లలోకి ఇప్పటికి ఆడవారితో మాట్లాడాలి అంటే నే ఒకరకమైన బెరుకు టీన్ ఏజ్ లో అన్ని అనుభవించెయ్యాలి అని గోల చేసే హార్మోన్స్ ని తట్టుకునేల పెంపకాలు ఉండేవి
ఇప్పుడు మీరు చెబుతున్న స్వలింగ లెస్బియన్ అనే అనుభావలు కూడా అందంగా అనిపిస్తాయేమో
నకు తెలిసి 30+ వాళ్ళు ఎవరు లేరు అనుకుంట లెస్బియన్ లు అలా ఉన్నట్లు అయితే వివరించండి
తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస మాత్రమే
Jhansi koppisetty
లెస్బియన్ల గొడవ నాకేమీ తెలియదండి బాబూ… ఇక్కడ ఎప్పుడైనా పార్కుల్లో రెస్టారెంట్లలో విచిత్రంగా ప్రవర్తించేవారిని చూస్తే ఏవో నా చిన్నప్పటి స్నేహానుభవాలు గుర్తొచ్చాయంతే….
Sagar
అది ఆకర్షణలేని స్నేహం కాబట్టి. ఎడబాటు ఉన్నా మీరు తలచుకునే అర్హత ఉన్న బందం అయింది మేడమ్ . మీకు అభినందనలు
Jhansi koppisetty
మీ అర్ధవంతమచన స్పందనకు ధన్యవాదాలండీ సాగర్ గారూ…
Sambasivarao Thota
Jhansi Garu!
Swatchamaina SnehaBandhaanni Chakkagaa theliyajeshaaru …
Dhanyavaadaalu
Jhansi koppisetty
Thank you for your response Sir….
Jhansi koppisetty
ధన్యవాదాలండీ సాంబశివరావు గారూ
Geeta Vellanki
A normal friendship.. Well explained about apart of the LGBT society. But everything because of insecurity and ప్రేమరాహిత్యం… This is my feeling about the so called friendships. But now society accepted it.

Jhansi koppisetty
Yes, mine was just a normal loving friendship… I really don’t know the feelings of LGBTs and never ever tried to know about


చిట్టె మాధవి
మంచి సబ్జెక్ట్ వ్రాశారు.మనకు తెలియకుండానే మనసులో ఓ ఆకర్షణ ఇంకొకరిపై ఉంటుంది మన రోజుల్లో ఈ విపరీత ఆలోచనలు మన మనసుల్లో ఉండేవి కావు.ఎంతో స్వచ్ఛమైన ప్రేమతో కూడిన అభిమానం మాత్రమే ఉండేవి.

వెల్ రైట్ అప్ జాన్సీ గారూ
Jhansi koppisetty
Thank you Madhavi garu
మొహమ్మద్ అఫ్సర వలీషా
ఆనాటి స్నేహాలకై ఈ నాటి స్నేహాలకు చక్కని కల్మషం లేని మీ స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ మాకు అందించిన కధనం అద్భుతం, హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు





Jhansi koppisetty
Thank you Valisha dear fir your nice response
Lalitha Chitte
మీ అందమైన జ్ఞాపకాలు బావున్నాయి. మీ క్యుటిక్యుర పరిమళాన్ని మాకూ అందించారు. అభినందనలు.
Jhansi koppisetty
హహహ…ధన్యవాదాలండీ మీ అద్భుతమైన స్పందనకు

డా.కె.ఎల్.వి.ప్రసాద్
స్నేహం అనేక రకాలుగా సమకూరు తుంది.ఒకరికొకరు
స్నేహితులుగా మారడానికి అనేక అంశాలు ముడిపడి వుంటాయి.దీనికి కులం తో,మతం తో ,వర్గం తో,
ప్రాంతమ్ తో,పనిలేదు.
మనసులు కలవాలి,అభిరుచులు క లవాలి,ఆలోచనా విధానం ఒకటి కావాలి.ఇలా ఎదో అంశం స్నేహ బందాన్నీ కట్టి పడేస్తుంది.దీనికి పేరేదైనా పెట్టండి,అది వేరే విషయం!
ఇలాంటి స్నేహబంధం మగవాళ్ళలో కంటే,ఆడవాళ్ళలొనె
ఎక్కువగా కనిపిస్తుంది.పైగా అది కలకాలం నిలిచిపొయె ది గా వుంటుంది.
ఝాన్సీ గారు మంచి అంశాన్ని గుర్తు చేసారు.ఇలా గొంతు విప్ప గలి గే ది ఏ..కొందరొ మాత్రం వుంటారు.రచయిత్రికి అభినందనలు.
Jhansi koppisetty
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ డాక్టరుగారూ

