రూములోకి నన్ను షిఫ్ట్ చేసేసరికి దావానలంలా రాజుకున్న నా ఏక్సిడెంట్ వార్త తెలిసిన బంధుమిత్రులంతా హాస్పిటల్‌కి చేరిపోయారు. ఒకరు ఇద్దరు కాదు.. ఎమెర్జెన్సీ వార్డ్ బయట కనీసం పాతిక ముప్పై మంది బంధువులు లోనికి ప్రవేశం కోసం స్టాఫ్‌తో గొడవ పడుతున్నారు.
ఫార్మాలిటీ కోసం అటెండెన్స్ వేయించుకోటానికి వచ్చిన బంధుమిత్రులు కారు వారు. వార్త విన్న కలవరంలో అల్లకల్లోలమైన మనసుతో షాకును తట్టుకోలేక కంపించిన హృదయంతో దుఃఖంలో గుండె చెదిరి ముసిరిన అనుబంధాల తుంపరలు వారు.
ఒక్కసారి చూసి వెళ్ళిపోతామని బతిమాలుకుంటున్నారు. అదేమీ షాపింగ్ మాల్ కాదని సెక్యూరిటీ నిరాకరించింది. క్రమంగా గొడవ సర్డుబాటుగా మారింది. ఒకేసారి ఇద్దరి కన్నా ఎక్కువ మంది వెళ్ళమని అంతా కలిసి రాజీకి వచ్చారు. వంతులవారీగా ఇద్దరేసి లోపలికి రావటం మొదలెట్టారు. ఆ ప్రేమపూరిత పలకరింపుల వెల్లువకు నా మనసు తడిచి ముద్దయి పోయింది.
మన శ్రేయస్సు కోసం కన్నీరు కార్చే నాలుగు జతల కళ్ళు, మనం పోయినప్పుడు మోసే నాలుగు భుజాల కన్నా కోరుకునేదేముంటుంది ఎవరైనా. ఈ విషయంలో నేను సుసంపన్నురాలిని. మానవతానుబంధాల విలువ అర్థమవసాగింది.
విజయ్ నన్ను డాక్టర్ గురవారెడ్డి కేసుగా రాయించటంలో కృతకృత్యుడయ్యాడు. ఎక్స్‌రే, MRI లు తీసాక డాక్టరుగారు నాకు జరిగినది ట్రైమేలియోలార్ ఫ్రాక్చర్ అని నిర్ధారించారు. గురవారెడ్డి టీం మెంబర్లు ఒక్కొక్కరుగా వచ్చి నా కాలుని చూసి వెళ్ళసాగారు. మరుసటి రోజు సర్జరీ చేయటానికి నిర్ణయించారు. ఈ లోపు కదిలిపోయిన, చిట్లిపోయిన ఎముకలను సరిగ్గా అలైన్ చేసి కట్టు కట్టాలి.
భోజనానికి అనవసరంగా పిలిచానని దుఃఖంతో కుమిలిపోతున్న మా వదిన, నేను వాళ్ళ ఇంట్లో పడిపోయినందుకు తనే బాధ్యురాలిగా బాధపడుతూ పరిహారంగా నాతో ఆసుపత్రిలో తనే వుంటానని వుండి పోయింది.
ఒక కుర్ర డాక్టరు కాలిని అలైన్ చేసి పట్టీ వేయటానికి వచ్చాడు. అంతవరకూ చీలమండలో మల్టిపుల్ ఫ్రాక్చర్లయినా పెయిన్ కిల్లర్స్ మీద వున్న నాకు పెద్దగా నొప్పి తెలియలేదు. ఆ డాక్టరు మరో నర్సు సాయంతో కాలిని లాగి పట్టుకుని బోన్స్ అలైన్ చేసే ప్రయత్నం చేసాడు. అసలు నొప్పికి నిర్వచనం ఆ క్షణంలో తెలిసింది. గిలగిలలాడిపోతూ ఆసుపత్రి దద్దరిల్లిపోయేలా గావుకేకలు పెట్టాను. వదిన అమాంతం లేచి ఆ కుర్ర డాక్టరు పైన విరుచుకుపడింది.
“ఏమి డాక్టరీ చదివావయ్యా.. పిల్లను చంపేస్తున్నావు. నీకు నొప్పి తెలియకుండా కట్టేయటం చాత కాకపొతే వేరే డాక్టరుని పంపించు. నువ్వు వెయ్యకు…” అంటూ వదిన అడ్డుకుంది.
“చెదిరిన ఎముకలను సరి చేసేటప్పుడు నొప్పి అలాగే ఉంటుందమ్మా ఎవరు చేసినా…” వదిన దబాయింపుకి బెదిరిపోయిన డాక్టరు బేలగా అన్నాడు.
నర్సు వదినను బయటకు పంపేసింది.
నా గావుకేకలకు వదిన శోకండాలు శృతి కలిపాయి.
డాక్టరు వెళ్ళిపోయాక లోపలికి వచ్చిన వదిన నా తల నిమురుతూ డాక్టరుని శాపనార్థాలు పెట్టింది. నీరసపడిపోయిన నేను వదిన నోటికి ఆనకట్ట వేయలేక నిస్సహాయంగా చూస్తూండిపోయాను.
కన్న తల్లి, కన్న బిడ్డ, కట్టుకున్న మొగుడూ… వీటిలో ఏమీ కాని బంధం కోసం ఇంత ప్రేమతో అంత తపన పడుతూ రోదించటం వదినకు ఎలా సాధ్యం..? నా పెళ్ళిలో కన్యాదానం చేసిన పాశమా అది..?
ఎంత ప్రాణప్రదమైన బంధుమిత్రులైనా ఇంత స్వచ్ఛంగా బాహాటంగా ఏడవాలంటే ఎంత నిర్మలమైన అమాయక మనసుండాలి..?
నేను పరిపరి విధాల ఆలోచిస్తూ అలిసిపోయి నిశ్శబ్దంగా రోదిస్తున్న వదిన వంక చూసాను.
కట్టు కట్టాక ఎక్స్‌రే తీసారు. గురవారెడ్డి గారు ఎక్స్‌రే రిపోర్టు చూసి అతని టీం సభ్యులకు ఏవో సూచనలు ఇచ్చాడు. మళ్ళీ మరో ఇద్దరు డాక్టర్లు వచ్చారు. అలైన్మెంట్ కుదరలేదట. కట్టు విప్పి మళ్ళీ అలైన్ చేసి కట్టు వేయటానికి వదిన ససేమిరా ఒప్పుకోలేదు. నేను లోకల్ అనీస్తీషియా ఇచ్చి కట్టు వేయమన్నాను. వాళ్ళు నవ్వి కట్టు వేయటానికి అనీస్తీషియా ఇవ్వరని ఒక్క నిముషం వాళ్ళతో కోపరేట్ చేయమని అర్థించారు.
మా వదినతో అనుభవమైన నర్సు ముందు మా వదినను బయటకు వెళ్ళమన్నది.
వదిన నా మీదున్న ప్రేమనంతా డాక్టర్ల మీద అక్కసుగా మార్చుకుని భాషా సంస్కారాన్ని కూడా మరిచిపోయి డాక్టర్లను దూషించటం మొదలెట్టింది.
నాకు భూలోక నరకాన్ని మరోసారి చవి చూపించారు వాళ్ళు. గావుకేకలతో ఒరుసుకు పోయి బొంగురుపోయిన గొంతుతో ‘సర్జరీ కూడా ఇలాగే వుంటుందా’ అని అడిగాను.
“లేదు. సర్జరీ అనీస్తీషియా ఇచ్చి చేస్తారు. నొప్పి తెలియదు” అన్నాడు ఓ డాక్టరు.
కళ్ళ చివర్ల నుండి నీరు కారుతూండగా నొప్పిని పంటి బిగువున అదిమిపెట్టి కళ్ళు మూసుకున్నాను.
ఆపరేషను రోజున నా బందుమిత్రులంతా ఆసుపత్రి ముంగిట్లోనే వున్నారు. అమ్మాయిలిద్దరూ మాటి మాటికీ ఫోనులు చేసి నా అప్డేట్స్ తీసుకుంటున్నారు. పెద్దమ్మాయి తన పేషెంట్లందరినీ కాన్సిల్ చేసుకుని ఇండియాకి టికెట్ బుక్ చేసుకుంది.
డాక్టర్ చెప్పినట్టుగా లోకల్ అనీస్తీషియా వలన సర్జరీ ఏమంత బాధనిపించలేదు. కేవలం కాలు భాగం మాత్రమే స్పర్శ తెలియటం లేదు తప్ప నేను పూర్తి స్పృహలో వున్నాను. అరడజను ఆర్ధోపెడిక్ స్టూడెంట్ డాక్టర్లు, డాక్టర్ గురవారెడ్డితో పాటు నా పాదం చుట్టూ చేరి వున్నారు.
నా మొహానికి అడ్డు తెర కట్టారు. అసలు ఆపరేషన్ ఎవరు చేసారన్నదీ నాకు అర్థం కాలేదు. వాళ్ళ మెడికల్ టెర్మినాలజీలో వైర్లు, స్క్రూలు, నట్టులు లాంటి పదాలు విని ఆశ్చర్యపోయాను. నా బయోలాజికల్ బాడీలో హార్డువేర్ సామగ్రి చేరుతోందని తెలిసింది.
చిత్రంగా స్క్రూలతో బిగింపబడి కదులుతున్న రోబోలు నా కళ్ళ ముందు కదలాడాయి. సృష్టికి ప్రతిసృష్టి చేసే డాక్టర్ల ప్రతిభా పాటవాలను సంభ్రమంగా అభినందించుకుంటూ భవిష్యత్తులో నా నడక ఎలా వుంటుందోనని ఆలోచనలో పడ్డాను.
“నెమలికి నేర్పిన నడకలివీ….” ఎప్పుడో ఎవరో నా నడకకు అభినందన పూర్వకంగా పాడిన పాట మనసులో మూలిగింది.
“ఎంత దర్పంగా నడుస్తారండీ వ్యక్తిత్వాన్నంతా వ్యక్తపరుస్తూ…” ఒకప్పటి నా సహోద్యోగి ప్రశంస వెక్కిరించినట్టనిపించింది. నడతలోనే కాకుండా నడకలో కూడా వ్యక్తిత్వం వెల్లడి అవుతుందని తెలియని నేను అప్పుడు అతని మాటలకు ఆశ్చర్యపోయాను.
ఒకప్పుడు “క్యా మస్త్ చల్తీ హై యార్.. ” అనే కుర్రకారు ఇప్పుడు “బెచారీ లంగ్డీ…” అంటూ ఏమి పేలతారో ఊహించటానికే భయం వేసింది.
“ఎంత ఫ్లెక్సిబుల్ బాడీ అండీ… టీనేజర్స్ కూడా మీలా ఆసనాలు వేయలేరు” అంటూ ఎప్పుడూ మెచ్చుకునే యోగా టీచరు కళ్ళ ముందాడింది.
“భలే కూర్చుంటావే నేలమీద బాసింపెట్టు వేసుకుని చిన్న పిల్లలా” ఆనంద పడే స్నేహితులు గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది.
“యాభై దాటినా సిన్న పోరి లెక్క ఎప్పుడూ ఉర్కులాడ్తనే ఉంటది” అక్కసు పడే పక్కింటావిడ వంకరగా నవ్వుతున్నట్టనిపించింది.
అసలు మత్తు కాలికి కాకుండా నా మెదడుకి ఇచ్చి వుంటే బావుండేది.
పిచ్చి ఆలోచనలను నిద్రపుచ్చలేకపోయాను.
సర్జరీ అయిన వెంటనే రూములోకి పంపేశారు.
వెన్నుపూసకు పొడిచిన అనీస్తీషియా పోటుతో వీపులో విపరీతంగా నొప్పి.. సెలీన్, బ్లడ్ కోసం కుళ్ళపొడిచిన చేతి నరాలన్నీ పచ్చి పుళ్ళయిపోయాయి.
పురుటి నొప్పులు తప్ప మరే నొప్పులు ఎరుగని ప్రాణం. కనీసం జలుబు, జ్వరం కూడా తెలియనిదాన్ని.
అప్పట్లో ఆయనతో అంటుండేదాన్ని… ‘నాకోసారి జ్వరం వస్తే బావుండు… మీరెలా సేవ చేస్తారో చూడాలని వుంది’ అని.
ఈ రోజున ఇంత పెద్ద ఆపరేషను అయ్యింది.. తను లేరు. నా జ్వరం కోరికయినా తీరకుండానే వెళ్ళిపోయారు. మంచం మీద నిస్సహాయంగా కదిలాను.
అరవై నాలుగు కేజీల బాడీ కాలికి ముప్పయి కేజీల కట్టు కట్టారు. కాలుని ఎత్తులో కట్టి పెట్టారు. ఓ పర్వతాన్ని మోస్తున్నట్టే వుంది. నిద్ర పట్టని నేను తెల్లవార్లూ గాలిలోకి కాలి వంకే చూస్తూండిపోయాను.
హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక కజిన్ మంచం పైనే కూర్చోబెట్టి కాలకృత్యాలు చేయిస్తుంటే మొదటిసారి మొగుడు లేనితనం మనసును కృంగదీసింది. కట్టుకున్నవాడి కొరత కొట్టొచ్చినట్టుగా కనపడింది.
ఏవేవో రిలేషన్స్… ఎవరో బంధువర్గం ఇష్టంగానే సేవలందిస్తున్నారు. అయినా మనస్సెందుకో మూగగా రోదిస్తోంది. ఎంత మంది వచ్చి చూసి పోయినా ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా రాత్రింబవళ్ళు పక్కనుండాల్సిన మొగుడి స్థానం భర్తీ కాదు. ఆ వెచ్చని కౌగిలి ఇచ్చే స్వాంతన దొరకదు. తల్లి స్థానాన్ని భర్తీ చేయలేమంటారు కాని నా వరకూ భర్త స్థానం కూడా భర్తీ చేయలేనిదే…
(మళ్ళీ కలుద్దాం)
ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
నా గొంతు విప్పిన గువ్వను ధారావాహికంగా ప్రచురిస్తున్న సంచిక సంపాదకులకు, ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻
ఆసుపత్రి వాతావరణం చక్కగా చెప్పారు. మీ బాధను సైతం కవితాత్మకంగా సెలవిచ్చారు. ఆ..సమయంలో భర్త తోడు అవసరాన్ని బాగా గుర్తు చేసుకున్నారు. మీ..ఈ ఎపిసోడ్ చదుతున్టే 1965 ప్రాంతంలో ఉస్మానియా లో నా ఆ సు పత్రి జీవితం గుర్తు కు వచ్చి ఆ రోజులు సింహావలోకనం చేసుకున్నాను. మీరు అందించిన కథనం సినిమా స్క్రిప్ట్ మాదిరిగా వుంది. అభినందనలు.
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు డాక్టరుగారూ🙏🏻🙏🏻🙏🏻
మనసుని హత్తుకునేలా రాస్తున్నారు
ధన్యవాదాలు నాగలక్ష్మిగారూ😍😍😍
మీ రచన ఆర్దో పెడిక్ ఆపరేషన్ చేస్తే పేషెంట్ పరిస్ధితి ఎలా ఉంటుందో చాలా సుదీర్ఘంగా వివరించారు మేడమ్ . మీకోసం పరితపించే అంతమంది స్నేహితులు కలిగి ఉన్నందుకు మీకు అభినందనలు. చివరిగా మీరన్నట్లు అలాంటి పరిస్దితిలో మనిషికి స్వాంతన కలిగించేది జీవన సహచరుడు లేదా సహచరి అనే విషయంలో అనుమానం లేదు. మీకు ఆ లోటు అంతమంది బంధుమిత్రుల పరామర్శలతో కాస్త ఊరటనిచ్చిందని నా అభిప్రాయం. మీకు ధన్యవాదములు.
మీ అభిమానానికి ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻
“అయినా మనస్సెందుకో మూగగా రోదిస్తోంది. ఎంత మంది వచ్చి చూసి పోయినా ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా రాత్రింబవళ్ళు పక్కనుండాల్సిన మొగుడి స్థానం భర్తీ కాదు. ఆ వెచ్చని కౌగిలి ఇచ్చే స్వాంతన దొరకదు. తల్లి స్థానాన్ని భర్తీ చేయలేమంటారు కాని నా వరకూ భర్త స్థానం కూడా భర్తీ చేయలేనిదే…”
కళ్ళు చెమ్మగిల్లేలా చేశారు ఝాన్సీ గారూ..
….అల్లసాని వంశీకృష్ణ శర్మ
ధన్యవాదాలు వంశీకృష్ణ గారూ…
“హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక….”
దీనికి ముందు పేరా వరకు నాకు మీరు హాస్పిటల్ bed పై కాలికి కట్టుతో కనిపించారు ఈ లైన్స్ చదవగానే….కన్నీళ్లు ఆగకుండా చెంపలపై జరిపోయాయి. నిజం madam భర్త స్థానం భర్తీ చేయలేనిదే…
…….రమాదేవి
నిజమే రమగారూ…థ్యాంక్యూ
ఆపరేషన్ ముందు.. తర్వాత పడిన బాధ.. మీది నాదీ సేమ్.. ఆత్మీయుల పరామర్శ కూడా సేమ్.. ఇక భరించే భర్త లేడు అన్న బాధ పడే కన్నా.. ఇందరు అయిన వారి మధ్య సేద తీరడమే.. నాకైతే తమ్ముడు.. కొడుకు…ఆసుపత్రిలో ఉండి అన్ని సేవలు ఏ వేళలో అయినా అందించడం కొంత ఊరట ఇచ్చింది
….Chatrapati Yaddanapudi
ధన్యవాదాలు ఛత్రపతిగారూ….
Jhansi Garu! Your sufferings and pains in the Hospital … Chaalaa Baadhaakaram.. Baagaa vicarinchaaru.. Dhanyavaadaalandi 🙏
మీ స్పందనకు ధన్యవాదాలు సాంబశివరావు గారూ…
చదువుతుంటేనే మనసు విలవిలలాడింది ఝాన్సీ, నిజానికి అంత మంది ఆదుకోవడం నువ్వు చేసుకున్న పుణ్యం అనుకోవాలి
……మన్నెం శారద
Thanks Sharadakka😍😍
భర్త ఉన్నా,అలా ఎంతమంది సేవలు చేస్తారు? చేయాలని ఉన్నా, ఎప్పుడూ ఏ పనీ నేర్పని మనవల్లే వాళ్ళు చేయలేరు కూడా.ఏ సోదరో , తల్లో చేయాల్సిందే.
……Sathi Padma
అవును పద్మా, మీరన్నది నిజమే..Thank you
జరిగిన దారుణాన్ని కళ్ళకు కట్టి చూపించారు. నిజమే అమ్మ స్థానం భర్త స్థానం ఎవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు.
మీరు ప్రతీ అక్షరం మనసులో నిలిచిపోయేలా రాయడం నాకు భలే నచ్చుతుంది
Thanks a lot Rupa dear, మీ ప్రేమపూర్వక స్పందనకు ధన్యవాదాలు😍😍
ఎంతో గొప్పగా రాసారండి అనుభవానికి అక్షర రూపం ఇచ్చి, పాఠకుణ్ణి అనుభవంలోకి లిఫ్ట్ చేసిన మీ రచనా సామర్థ్యానికి హ్యాట్సాఫ్, ప్రతి చిన్న అనుభవానికి అక్షర రూపం ఇవ్వడం మహా రచయితలకు మాత్రమే సాధ్యం, అది మీ రచనల్లో ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది.
….Saleem Mohammad
Thank you Saleem ji….
మీరు మీ బాధను కూడా ఇంత అందంగా అక్షరీకరించారు! 40 ఏళ్లక్రితం చెల్లెలితో స్కూటర్ మీద వేడుతుంటే కోటి సెంటర్ లో జీప్ గుద్దేసింది.వెనకాల కూర్చున్న చెల్లి కాలు ఫ్రాక్చర్ అయింది.guilty consciousness.. మీ వదిన గారిలాగే ఇప్పటికి బాధ పడుతూనే ఉన్నాను నా వల్ల జరిగింది అని. నా రెండు knee joints replacement procedures గుర్తొచ్చాయి 30kgs బరువు కట్టిన మీ కాలిని చూశాక.. అబ్బో నాకు కూడా ఒంట్లో hard ware store ఉందిలేండి. బాగుంది మీ రచన..
…. Vempati Kameswararao
ధన్యవాదాలు అన్నయ్యగారూ….
మీ అక్షరాలు అనుభవాలనే కాదు, జ్ఞాన భాండాగారాల ను కూడా మోసుకో స్తాయి. నిజంగా మీ రచనలు అద్భుతమైన మీ వ్యక్తిత్వానికి నికార్సైన వీలునామా.
……Saleem Mohammad
Thanks a lot Saleem ji🙏🏻🙏🏻🙏🏻
అక్షరాల వెంట కళ్ళు కళ్ళతోనే కన్నీరు… మనసుకి కన్నీటికి ఉన్నంత అనుబంధం బహుశా ఏ బంధంతో ఉండదేమో… శరీరం ఎంత ఫ్లెక్సీబుల్ ఐనా… రిజిడ్ మనసుతో మనిషికి కష్టమే మేడం…
…..బంగారు కల్పగురి
చాలా ఆర్ద్రంగా సాగింది ఎపిసోడ్ కానీ ప్రతి అక్షరం పరుగులు పెట్టించింది మీ అలవోక కధనం నిజం గా మీ బాధ వర్ణనాతీతం ప్రతి లైను ఓ జలపాతం మీ అందమైన నడకలాగే పరుగుల కెరటం చివరి లో కన్నీటి చుక్కలు కలవర పెట్టాయి ఎవరు ఎంత ఓదార్చినా ఆ అనుభూతే వేరు మీ హృదయ స్పందన అర్థం అయింది ఏమీ చేయలేని పరిస్థితి ఫ్రెండ్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 🤝🤝🤝🤝🤝
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™