మబ్బు తెర… మంచు పొర..!
వెన్నెల భయంభయంగా వెనక్కి తిరిగి చూసింది.
విమానం లాంటి పెద్ద నల్లటి కారు తనను ఫాలో చేస్తూ ఆ వీధిలోకి రావటానికి ప్రయత్నిస్తోంది. వెన్నెలకు ముచ్చెమటలు పోసాయి. తను కొంటున్న కూరగాయల కొట్టులో అన్ని రకాల కూరగాయలు వున్నప్పటికీ, అప్పటికి తూకం అయిన వంకాయలు మాత్రమే తీసుకుని చేతికందిన వంద రూపాయల నోటు కూరగాయల వాడికి ఇచ్చేసి తిరిగి చిల్లర తీసుకోకుండా హడావిడిగా అక్కడి నుండి ఆమె ముందుకు కదిలిపోయింది.
తడబడే అడుగులతో పరుగులాంటి నడకతో కలవరంగా ముందుకెళుతూ వెనక్కి తిరిగి చూసింది. ఆ సందు సన్నగా ఉండటంతో ఇరుకైన వీధిలోకి రాలేక ఆ బుల్లెట్ ప్రూఫ్ ఇంపోర్టెడ్ నల్ల కారు అక్కడే ఆగిపోయింది. ఆ వెనుకే సిగ్నల్స్ వెనుకగా మొత్తం ట్రాఫిక్కును జాం చేస్తూ వరుసగా ఒకేలా వున్న ఇరవై కారులు ఆగిపోయాయి.
‘హమ్మయ్య’ అనుకుని వెన్నెల బలంగా శ్వాస తీసుకుని వడివడిగా నడవ సాగింది.
ఆగిన ఆ నల్ల కారులో నుండి గులాబీ వన్నెలో వున్న స్పురద్రూపి అయిన ఒక ఆజానుబాహుడు దిగాడు.
ది బెస్ట్ అండ్ మోస్ట్ హాండ్సమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా…
ది గ్రేట్ రాజీవ్ గాంధీ.
మగాడికి అందంతో పనిలేదంటారు. ఒడ్డూ పొడవూ వుంటే చాలంటారు. ఒడ్డూ పొడవుకి అందం తోడయితే ఎంత అందంగా వుంటుందో అతనిని చూస్తే తెలుస్తుంది. నిజానికి మగాడు మరీ అంత అందంగా వుంటే పక్కనున్న సుందరాంగులు ఎంత అప్సరసలైనా చిన్నబోవటం ఖాయం.
ఏ చారిత్రాత్మక పాత్ర అతని ఠీవి, దర్పాలకు సరితూగదు. ఏ హాలీవుడ్ హీరో వర్చస్సు అతని తేజస్సుకి సాటి రాదు. ఏ బాలీవుడ్ హీరోల ముఖ కవళికలు అతని సౌందర్యాన్ని మించి వుండవు. తాత, తండ్రి తల్లుల ప్లస్లన్నీ ప్రోది చేసుకుని పుట్టిన డిజైనర్ బిడ్డడు అతను. మెలిపెట్టే మీసాల మగాళ్ళందరి జుట్టు పట్టుకుని ఆడిస్తూ ఏక చత్రాధిపత్యంగా దేశాన్ని ఏలిన మహారాజ్ఞి ఇందిరమ్మ సమర్ధవంతుడైన పుత్రుడు అతను.
హుందాగా కారు దిగి వెన్నెల వెళ్తోన్న దిశగా వెళ్ళనారంభించాడు. అతను దిగిన వెంటనే వెనకున్న ఇరవై కారుల్లో నుండి ఇరవై బ్లాక్ కాట్ కమెండోలు తృటిలో ఏక కాలంలో దిగి కవచంలా అతనిని చుట్టి ముట్టి అనుసరించసాగారు.
సందు మలుపు తిరుగుతూ వెనుతిరిగి చూసిన వెన్నెల గుండె ఝల్లుమంది. తనను కారు ఫాలో కావట్లేదని తేలిగ్గా ఊపిరి తీసుకుందే గాని, తనను కారులో వ్యక్తి ఇంకా వెంబడించటం మాననే లేదు. ఆమె రక్త ప్రసరణ వేగం హెచ్చింది. కంగారులో గుండె చప్పుడు లయ తప్పి గందరగోళంగా కొట్టుకోవటం మొదలెట్టింది. గొంతు తడారిపోయింది. అరచేతుల్లో చిరు చమటలు పోసాయి. కాళ్ళల్లో సన్నగా వణుకు మొదలయ్యింది.
వెన్నెల అతనిని దారి మళ్ళించే ఉద్దేశ్యంతో తప్పు దోవ పట్టుకుంది. ఇప్పుడు తను సరైన దారిలో ఇంటికి వెళితే అతను తన ఇల్లు కనిపెట్టేస్తాడు. రెండు మూడు సందులు తిరిగి ఓ సారి మెడ తిప్పి వెనక్కి చూసింది. దరిదాపుల్లో అతని జాడ లేదు.
‘హమ్మయ్య’ అని గుండెల మీద చెయ్యి వేసుకుని గబుక్కున వెనుక గేటులో నుండి తన అపార్ట్ మెంట్ వున్న కాంపౌండ్ లోకి వెళ్ళిపోయింది. పరుగున లిఫ్ట్ లోకి వెళ్ళి లిఫ్ట్ తలుపులు మూసేసింది. ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఫ్రిడ్జిలో నుండి ఒక నీళ్ళ సీసా తీసుకుని గడగడా తాగేసి సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. అయినా ఆమె గుండె దడ ఇంకా తగ్గనే లేదు.
అలా కళ్ళు మూసుకున్న వెన్నెల రెండోసారి డోర్ బెల్ మోగేసరికి అదురుబాటుగా కళ్ళు తెరిచింది. తన భర్త విజయ్ ఆఫీసు నుండి వచ్చే సమయం ఇంకా కానే లేదు. మరి ఎవరై వుంటారని ఆలోచిస్తూ వెళ్ళి తలుపు తీసింది.
వెన్నెల పైనే వెన్నెల కురిపించగల మధుహాసంతో రాజీవ్ గాంధీ గుమ్మం నిండుగా ఎదురుగా నిలబడి వున్నాడు. తెల్లబోయిన వెన్నెల తేరుకునే లోగా “లోపలికి దారి ఇస్తారా కొంచం..” అంటూ వెనుకే వున్న బ్లాక్ కాట్ కమెండోలకు ఏదో సైగ చేస్తూ లోపలికి వచ్చేసాడు.
అతని సౌజ్ఞ అందుకున్న కమెండోలు ఇద్దరేసి ఒక్కో నైలాను అడ్డుతెరలు కట్టి వున్న ఆరడుగుల ఫ్రేములు కట్టిన పెయింటింగ్స్ పదింటిని లోపలికి మోసుకు వచ్చారు. ఒక్కో పెయింటింగుని నిలువుగా నిలబెట్టి పట్టుకున్నారు.
వెన్నెల దిగ్భ్రమలో వుండిపోయింది.
ఎంతో గంభీర మృదుమధుర స్వరంలో మృణ్మయనాదంలా అతని గొంతు వినిపిస్తోంది.
“నాకెప్పుడూ ఒక అద్భుత సౌందర్యరాశి, అపురూప లావణ్యవతి కలలోకి వస్తూంటుంది. నేను వెంటనే లేచి కూర్చుని కలలో కనిపించిన ఆమె రూపాన్ని గుర్తు చేసుకుంటూ అర్థరాత్రి ఆమె చిత్రాన్ని చిత్రిస్తుంటాను. అలా వివిధ భంగిమల్లో నేను చిత్రించిన ఆమె చిత్రాలే ఇవి. ఈ రోజున ఆశ్చర్యంగా నా కలలోని ఆ అద్భుత సుందరిని ఇలలో చూసాను. అసలిది ఎలా సాధ్యమో నాకర్ధం కావటం లేదు. నా ఉత్సాహాన్ని ఆపుకోలేక మిమ్మల్ని వెంబడించాను. నేను గీసిన చిత్రాలను మీరు ఒకసారి చూడండి..” అంటూ రాజీవ్ గాంధీ కమెండోలను చిత్రాల పైనున్న అడ్డు తెరలు తొలగించమన్నాడు.
చిత్రాలను చూసిన వెన్నెల ఆశ్చర్యంలో నోరు తెరుచుకుని అలాగే వుండిపోయింది. అన్నీ తన చిత్రాలే. ఎంత మనోహరంగా వున్నాయి. ఆ దట్టమైన నల్లటి మబ్బుల్లాంటి శిరోజాలు, హరి విల్లంటి కనుబొమలు, కలువల్లాంటి కనులు, సంపంగి ముక్కు, చిట్టి పెదవుల ఒంపు, ఎత్తయిన వక్షోజాలు, వాటి బరువును మోయలేనట్లు కొద్దిగా వంగినట్లున్న తీగలాంటి సన్నని వయ్యారి నడుం… అసలు పది చిత్రాలు పది విభిన్నమైన భంగిమల్లో దేనికదే ఒక కళాఖండంలా వున్నాయి.
వెన్నెల నోట మాట లేక సంభ్రమాశ్చర్యాలలో వుండగా అతను “మీ అందం స్ఫూర్తిగా చిత్రించిన ఈ చిత్ర పటాలను నా బహుమానంగా మీకు సమర్పించుకుంటున్నాను” అన్నాడు.
“వద్దు. దయ చేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని వీటిని వెంటనే ఇక్కడి నుండి తీసుకు వెళ్ళిపొండి. ఇవి మీ దగ్గర వుండటమే న్యాయం.” కంగారుగా అంది భర్త వాటిని చూసి ఏమనుకుంటాడోనని హడలి పోయిన వెన్నెల.
అతని ఆజ్ఞ మేరకు ఇరవై మంది కమెండోలు పది చిత్రాల ఫ్రేములను తిరిగి మోసుకుని వెళ్ళిపోయారు.
ఆ వెనుకే రాజీవ్ గాంధీ కూడా నిరుత్సాహంగా నిష్క్రమించాడు.
వెన్నెల తలుపు గభాలున మూసేసి తలుపుకి చేరగిలబడి గట్టిగా ఊపిరి తీసుకుంది.
* * *
వెన్నెల విశాఖ సముద్ర తీరాన సాయం సంధ్యా సమయాన వ్యాహాళికి వెళ్ళింది.
దూరాన సముద్ర గర్భంలోకి అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు వెన్నెల చామంతి వన్నె మొహాన్ని ముద్ద మందారంగా మార్చాయి.
ఆమె కట్టకుండా వదిలేసిన పొడవాటి చిక్కటి చీకటి కేశాలు సముద్ర కెరటాలతో పోటీ పడుతూ అలల తరగల్లా గాల్లో తేలుతున్నాయి.
ఆ సముద్ర తీరాన వీచే గాలి హోరు నాభి లోంచి తీసే ఓంకార ధ్వనిలా ప్రతిధ్వనిస్తోంది.
ఆ హోరుతో కోరస్ కలిపిన సముద్ర కెరటాల సవ్వడి రసమయ మృదంగ గానంలా ఆ ప్రదేశాన్ని ఆవరించి వుంది.
హొయలుగా సుతారంగా ఇసుకను హత్తుకుంటున్న వెన్నెల వెండి పట్టీల పాదాలను సముద్ర కెరటాల అలలు ఉండుండి ముద్దాడుతున్నాయి.
ఎదురు గాలికి ఒంటి పొర పైటలో నుండి వెన్నెల కుచద్వయపు పొంగులన్నీ ప్రస్ఫుటంగా తుళ్ళుతూ కనిపిస్తున్నాయి.
ఏవో స్నిగ్ధ మనోహర వలపు తలపుల్లో వెన్నెల చంపలు కెంజాయ వన్నెలో తళుకులీనుతున్నాయి.
సరిగ్గా అప్పుడే దూరాన కూర్చుని వున్న వడ్డాది పాపయ్య దృష్టి వెన్నెల పైన పడింది. అతని అంతరాంతరాల్లో “ఇన్ట్యూషన్”తో వున్న సౌందర్య కాంక్షకు వెన్నెల మోహన రూపం స్ఫూర్తినిచ్చింది.
అతని కుంచె కొత్త కొత్త ఊహలతో చిందులేసింది.
అతని కాన్వాస్ సౌందర్య దాహార్తి అయి అలమటించింది.
వడ్డాది పాపయ్య క్షణం తటపటాయించాడు. అతనిలోని సౌందర్య పిపాస అతనిని నిలవ నీయలేదు. అతనిలో నిద్రాణమై వున్న కళాతృష్ణ అతనిని కదిలించి కుదిపేసింది.
అతను వెన్నెలను సమీపించాడు. వెన్నెలను చూసిన అతనికి రాజా రవి వర్మ వేసే దేవతా చిత్రాల వెనుక రహస్యం ఏమిటో తెలిసినట్టయ్యింది. అతనికి అడవి బాపిరాజుకి అంత భావుకత్వం ఎలా అబ్బిందో అవగతమయ్యింది.
వెన్నెలను ఒక్క క్షణం కదలకుండా ఉండమన్నాడు. వెన్నెల బిత్తరపోయింది. స్థాణువులా బిగుసుకుని నిలుచుండి పోయింది.
వడ్డాది పాపయ్య కుంచె కాన్వాస్ పైన చకచకా చిత్ర విన్యాసం చేయటం మొదలెట్టింది. ఒక అద్భుత కళాసృష్టికి ఆ అమృత ఘడియలో రూపకల్పన జరిగి పోయింది.
చక్రాల్లాంటి కళ్ళు, చిట్టి నోరు, కోసుదేరిన చిన్ని గడ్డం, వయ్యారి నడుము, బొడ్డు కిందుగా పారాడే చీర కుచ్చెళ్లు, పట్టీలతో పల్చని పాదాలు..
స్త్రీ అందం, తెలుగు సాంప్రదాయం కలగలిసిన వెన్నెల రూపం కాన్వాస్ పైన ఆవిష్కారమయ్యింది.
వడ్డాది పాపయ్య అప్సరస లాంటి ఏ మోడల్ ను చూసి బొమ్మలు గీయడంటారు. కేవలం ఆలోచించి మాత్రమే వేస్తాడంటారు.
అసలు ఆయన తొలి చిత్రం వెన్నెలను చూసి వేసిందేనన్న నిజం వెన్నెలకు మాత్రమే తెలుసు.
వడ్డాది పాపయ్య వేసిన తన రమణీయమైన రూపాన్ని చూసి బిత్తరపోయింది వెన్నెల. ఆ తరువాత అతను వేసిన రాధ, శకుంతల, పార్వతీదేవి, లక్ష్మి లాంటి దివ్య దేవతా రూపాలన్ని కూడా వెన్నెల రూపాన్నే ఆపాదించి చిత్రించిన రెప్లికాలు.
అది జగమెరుగని సత్యం.
* * *
ప్రమీల తన ప్రాణ స్నేహితురాలు వెన్నెల ఇంటికి వెళ్ళింది.
వెన్నెల చెప్పిన విషయాలకు విస్తుపోయింది.
వెన్నెల చెప్పిన వారం క్రితం వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు జరిగిన రాజీవ్ గాంధీ సంఘటన, గత మాసంలో విశాఖ వెళ్ళినప్పుడు బీచ్‌లో జరిగిన వడ్డాది పాపయ్య సంఘటన విని ప్రమీల నివ్వెరపోయింది.
తేరిపార వెన్నెల మొహం లోకి చూసింది. వెన్నెల మొహం అతి సహజంగా, ప్రశాంతంగా వుంది. తాను యదార్ధంగా జరిగిన సంఘటనలు చెప్పిందే తప్ప కల్పిత కథలు కావన్న నమ్మకము, నిజాయితీ ఆ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రమీలకి ఏమి మాటాడాలో అర్థం కాలేదు.
వెన్నెల కళ్ళల్లోకి చూస్తూ “వెన్నెలా, రాజీవ్ గాంధీ, వడ్డాది పాపయ్య ఇద్దరూ పోయి దగ్గర దగ్గరగా ముప్పయి ఏళ్ళవుతోంది తెలుసా. రాజీవ్ గత వారం బ్లాక్ కాట్ కమెండోలతో నీ చిత్రాలతో నీ ఇంటికి రావటమేమిటి, వడ్డాది పాపయ్య పోయిన నెలలో విశాఖ బీచ్‌లో నీ బొమ్మలు వేయటమేమిటి చిత్రం కాకపోతే. ఎవరైనా వింటే నీకు పిచ్చనుకుంటారు” అంది.
ప్రమీల మాట పూర్తి కాకుండానే వెన్నెల ఉక్రోషంగా “అంటే నేను నీకు అబద్దం చెబుతున్నానంటావా. అబద్దాలు చెప్పవలసిన అవసరం నాకేముంది. మా వారికి ఎలాగూ ఇలాంటి విషయాలు చెప్పుకోలేను. ఇంత ప్రాణ స్నేహితురాలివి నువ్వే నా మాటలు నమ్మకపోతే ఇంకెవరికి చెప్పుకోను. నన్ను ఇంకెవరు నమ్ముతారు” అంటూ ఎంతో ఉద్వేగంగా వెక్కి పెట్టి ఏడవడం మొదలెట్టింది. ప్రమీలకి ఏం చేయాలో అర్థం కాలేదు.
“అసలు జీవించి లేని మనుషులు నిన్ను కలిసారంటే ఎలా నమ్మమంటావు వెన్నెలా..” అంది ప్రమీల జాలిగా.
“నాకేం తెలుసు ఎలా వచ్చారో. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నన్ను కలవటం మటుకు నిజం.. నీకు అపనమ్మకంగా వుంటే కూరగాయల కొట్టువాడిని అడుగు, నేను అర కేజీ వంకాయలకు వంద రూపాయల నోటు ఇచ్చి పారిపోయానో లేదో వాడు చెబుతాడు” ఇంకా ఏడుస్తూనే అంది వెన్నెల.
ప్రమీలకి పసిపిల్లలా ఏడుస్తున్న వెన్నెల అమాయకమైన మొహం చూస్తే బాధ వేసింది. బాగా ఏడ్చి వాచి ఎర్రబారిన వెన్నెల కళ్ళను, అదురుతున్న ముక్కు పుటాలను చూసి ప్రమీలకి దుఃఖం కలిగింది. ఇప్పుడు వెన్నెల చెప్పేది అబద్దమన్నా, భ్రమన్నా వెన్నెల చాలా రభస చేసేట్టుంది. ఇంకా ఎమోషనల్ అయితే ప్రమాదం. వెన్నెలను అంతకు మించి అప్సెట్ చేయటం మంచిది కాదు.
“సరే. నీ మాటలు నేను నమ్ముతున్నాను. ఈ విషయాలు మనిద్దరి మధ్యే వుంచు. ఇంకెవరికీ చెప్పకు. నీ అందానికి ఈర్ష్య పడతారు. అంత గొప్ప సెలెబ్రిటీలు నీ బొమ్మలు వేశారంటే అసూయ పడతారు. సరేనా..” వెన్నెల మాటలను నమ్మినట్లుగా నమ్మబలికింది ప్రమీల.
తన స్నేహితురాలు తన మాటలు విశ్వసించినందుకు ముప్పయి ఏళ్ళ వెన్నెల పసి మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.
“హమ్మయ్య, నువ్వు నమ్మావు. నాకంతే చాలు. ఇంకెవరికీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఇప్పుడు నా మనసు తేలికయ్యింది. ఏడవటం వలనననుకుంటా తలపోటుగా వుంది ప్రమ్మీ. వుండు మంచి కాఫీ కలుపుకొస్తాను” అంటూ వెన్నెల లేచి వంటింట్లోకి వెళ్ళింది.
* * *
వెన్నెల సత్సంప్రదాయ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. పుట్టటమే నవ్వులు రువ్వే చంద్రవదనంతో పుట్టిన వెన్నెలకు, వెన్నెలే సరయిన పేరని అదే పేరు ఖాయం చేసారు ఆమె తల్లితండ్రులు.
సౌందర్యము, సౌశీల్యము రెండూ ఒకే ఒరలో ఇమడటం చాలా అరుదు. వెన్నెల సౌందర్యము, సౌశీల్యము మాత్రమే కాకుండా అదనపు ఆభరణం సౌకుమార్యం కూడా పుణికి పుచ్చుకుంది.
పుట్టినప్పటినుండి పెరిగే ప్రతి దశలోనూ అడుగడుగునా పుత్తడి బొమ్మలాంటి తన అందాలను బంధువులు స్నేహితులు మెచ్చుకుంటుంటే ఆ ప్రశంసల సంతృప్తిలో పెరిగింది వెన్నెల.
వెన్నెల నానమ్మ ఎప్పుడూ “నా చిట్టి రాకుమారి ఏ యువరాజుకి రాసిపెట్టి వుందో… ఎవరో ఆ అదృష్టవంతుడు” అని వెన్నెలను ముద్దాడినప్పుడల్లా వెన్నెల కలల్లో తేలిపోయేది.
వెన్నెల తమ్ముడు “అక్కా, నీ అందం గురించి విని ఏ రాకుమారుడైనా నీ కోసం రెక్కల గుర్రం మీద వస్తాడే” అన్నప్పుడు వెన్నెల ఊహలు రెక్కలు కట్టుకుని ఆకాశంలో విహరించేవి.
వెన్నెల స్నేహితురాలు “నువ్వు ఎం.ఎఫ్. హుస్సేన్ దృష్టిలో పడలేదు, పడి వుంటే మాధురీ దీక్షిత్‌కి బదులు నీ చిత్రాలు వేసేవాడు” అన్నప్పుడు వెన్నెల గర్వంతో మైమరిచి పోయేది.
డిగ్రీ పూర్తి అవగానే వెన్నెల ఇరవయ్యో ఏట ఆమె తల్లితండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయ్‌తో సాంప్రదాయ పద్దతిలో వివాహం జరిపించేసారు. అందం పైన వెర్రి వ్యామోహం లేని విజయ్ వెన్నెల సౌందర్యంలో గొప్పతనం గ్రహించలేదు.
వెన్నెల కవిత్వం తెలియని వాడి ముందు ఛందోబద్దమైన శ్లోకం అయ్యింది.
కనులపండవుగా వుండే వెన్నెల అందం చూసి విజయ్ స్పందించటం గాని వెన్నెలను ఆకాశానికి ఎత్తేయటం కానీ ఎప్పుడూ జరగలేదు. అందాన్ని ఆస్వాదించలేని రసహీన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో యాంత్రిక జీవితం వెన్నెలను మానసిక అవ్యవస్థకు గురి చేసింది.
వెన్నెలను ఆమె సౌందర్య రహిత వైవాహిక జీవితం పదేళ్ళుగా క్రమక్రమంగా పారానాయిడ్ స్కీజోఫ్రోనియాకి దగ్గర చేసింది. వెన్నెల తనకు తెలియకుండానే ఏదో మనోమాయకు లోనవుతోంది. భర్త నుండి తన అసాధారణ సౌందర్యం ఎటువంటి గుర్తింపు, ప్రశంసలు పొందని నైరాశ్యంలో ఆమె తెలియని డిప్రెషన్‌కి గురి అయి తానేమి ఆలోచిస్తోందో తనకే తెలియటం లేదు.
డాక్టర్ సుహాసిని ప్రమీల చెప్పిన వెన్నెల కేసు వివరాలన్నీ నోట్ చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించింది.
ఎదురుగా ఆదుర్దాగా తన వంకే చూస్తూ కూర్చుని వున్న విజయ్ ప్రమీలల వంక చూసి దీర్ఘంగా నిట్టూర్చింది.
“సాధారణంగా పేషెంట్‌ను చూడకుండా మెడిసిన్స్ ప్రిస్క్రయిబ్ చేయటం జరగదు ప్రమీలా. కాని నీ స్నేహితురాలి పట్ల నీ కన్సర్న్ నన్ను కదిలించింది. నువ్వు తన మెంటల్ కండిషన్ తెలిస్తే వెన్నెల తట్టుకోలేదు అంటున్నావు కాబట్టి నేనో మెడిసిన్ ప్రిస్క్రయిబ్ చేస్తాను. ఎలా వాడాలో చెబుతాను. మెడిసిన్ పూర్తిగా క్యూర్ చేస్తుందని చెప్పను. కాని వ్యాధి ప్రోగ్రెస్ కాకుండా నివారిస్తుంది. వ్యాధి నివారణకు మెడిసిన్ కన్నా విజయ్ సహకారం చాలా తోడ్పడుతుంది” అంటూ డాక్టర్ సుహాసిని విజయ్ వైపు చూసింది.
“చెప్పండి డాక్టర్, నా వెన్నెల కోసం ఏమి చేయమన్నా చేస్తాను. అసలు తన మానసిక పరిస్థితి ప్రమీల చెప్పేవరకూ నాకు తెలియదు. నేనెప్పుడూ ఆఫీసు పనులతో బిజీగా వుండి తనను అలక్ష్యం చేసాను. నాతో మామూలుగానే ప్రవర్తిస్తూ అంతర్లీనంగా ఇంత సంఘర్షణ అనుభవిస్తోందని వింటుంటే నాకు షాకింగ్‌గా వుంది. నన్నేం చేయమంటారో చెప్పండి డాక్టర్..” చాలా ఆర్ద్రంగా అన్నాడు విజయ్.
“ఏమీ లేదు. వెన్నెల ఏ చీర కట్టినా, ఏ రంగు వస్త్రాలు ధరించినా అడుగడుగునా ఆమె అందం అద్వితీయమని అతి సహజంగా కాంప్లిమెంట్స్ ఇస్తూండండి. పగలైనా, రాత్రి పక్కలోనుండగా నయినా, అడుగడుగునా ఆమె సౌందర్యానికి మీ తన్మయత్వం, స్పందన వ్యక్తపరచండి. ఇరవై నాలుగ్గంటలూ ఆమె వెంట వుండే భర్తగా అది మీకేమంత కష్టసాధ్యం కాదు. ఆమె సౌందర్యానికి మీ సంభ్రమాశ్చర్యాల మెచ్చుకోలు వెన్నెల మైండ్‌కి ఇక మరెవరి ప్రశంసల హాల్యుసినేషన్స్ చేయవలసిన అవసరం లేకుండా వుండాలి. ఆమె అందానికి మీ నుండి లభించే గుర్తింపు ఇచ్చే సంతృప్తితో ఆమె మైండ్ కామ్ అవుతుంది. ఆమె మైండ్‌కి డెల్యూసన్స్కి గురయ్యే గ్యాప్ ఇవ్వకండి. నేను రాస్తున్న ఏంటి సైకోటిక్ మెడికేషన్ ఇవ్వండి. లెట్ అస్ సీ హౌ షి గోస్. నెల్లాళ్ళ తరువాత మళ్ళీ కలిసి ప్రోగ్రెస్ చెప్పండి” ప్రిస్క్రిప్షన్ రాసిచ్చింది డాక్టర్ సుహాసిని.
అక్కడ విజయ్ ప్రమీలలు వెన్నెల మానసిక ఆరోగ్యం గురించి ఆందోళనతో డాక్టర్ సుహాసినితో చర్చిస్తూ క్లినిక్‌లో వుండగా ఇక్కడ వెన్నెల తన ఇంటికి ఎదురుగా వున్న ఉద్యానవనంలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్‌కి అతను చిత్రిస్తున్న తన కలర్‌ఫుల్ పిక్చర్‌కి పోజు ఇస్తూ పూతారల మధ్య జాబిలిలా కూర్చుని వుంది.
(మళ్ళీ కలుద్దాం)

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
24 Comments
Navneeth
Nice …. a canvas of dreaming girls dreamscape ….
Jhansi koppisetty
Yes brother, surrealism of mindscape…Thank you

Jhansi koppisetty
నా గొంతును ధారావాహికంగా వినిపిస్తున్న సంచిక యాజమాన్యానికి ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు

Md.Saleem
అద్భుత రచన ఇంకా అద్భుతమైన కథనం, వాట్సప్ మీ రచనకు, వాస్తవ విషయాలకు సరైన ఊహాను జోడిస్తే వచ్చిందే ఈ రచన.
సిహెచ్.సుశీల
నిజమే.
‘అందాన్ని ఆస్వాదించలేని రసహీన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ‘ ముందు వెన్నెల లాంటి ‘నవరస’ హృదయ ‘కవిత్వం తెలియనివాడి ముందు చందోబద్ధమైన శ్లోకం’ అవటం ఆశ్చర్యమేమీ లేదు. మొదటి పేరాలో హీరో పేరు ‘అచ్చు తప్పు’ కాబోలు అనుకుంటూ చదవటం మొదలెట్టా. చివరకు వచ్చేసరికి మళ్లీ “ఝాన్సీ మార్క్” ‘మనసును తాకే దిగులు మేఘం” కమ్ముకుంది.
” ఊహించి రాస్తే ఎలా ఉంటుందో ” అన్న ఈ ప్రయోగం చదివాక అనిపించింది – “ఎలా వస్తాయి ఈమెకి ఇలాంటి ఊహలు..!”
Jhansi koppisetty
సుశీలగారూ, ధన్యోస్మి




మీ ఆత్మీయమైన స్పందన నా ఊహలకు రెక్కలు తొడుగుతాయి… విశ్వ విహారం చేయించి అద్భుతాలు సృష్టిస్తాయి
Jhansi koppisetty
మబ్బు తెర మంచు పొర.
మంచు పొర కరిగితే, మబ్బు తెర తొలిగితే దర్శనమిచ్చేదే అసలైన వాస్తవం, ఈ లోపు అంతా ఊహానో, బ్రమనో, రుగ్మతో కదా? కథకు వంద శాతం సరిపోయే పేరు పేట్టారు, అభినందనలు.
వాస్తవ విషయానికి, సరి అయిన ఊహ జోడిస్తే వచ్చినదే అద్భుతమైన ఈ మీ కథ.
విషయం ఎంత గొప్పదో కథనం అంతకుమించి గొప్పగా ఉన్నది.
“కళాపూర్ణదయం” కర్త భావనా పటిమకు ఏమాత్రం తీసిపోకుండా,” మను చరిత్ర” కారుని వర్ణనాజిగిబిగికి దీటైన పదజాలాన్ని స్పురింప చేసినది మీ రచనా చాతుర్యము. “వెన్నెల” శరీర సౌష్టవ వర్ణనా సందర్భము ‘వరూధిని” నీ మనోఫలకంపై నాట్యమాడించినది సుమా!
హృదయవిదారకమైన సన్నివేశాలకు, ఊహకందని భావన పటిమతో జోడించి, కాళిదాసును మించిన ఉపమా కల్పనలతో, రవి వర్మను, వడ్డాదినీ, రాజీవులను సమ్మి శ్రి తం చేయడం మీకే సాధ్యమహో!
పాత్రల తలకెక్కిన తిక్కను, పాఠకుల హృదయానికి ఔషధంగా అందించి మనోచైతన్యాన్ని కలిగించిన తమరి ప్రతిభా పాటవాలు పింగళి సూరనను మించలేదా? మించినవి ఫో!
జయహో ఝాన్సీ గారు..
తమరి రచనలకు.
…..Saleem Mohammad
Jhansi koppisetty
Saleem Mohammad గారూ ….మీరు నా కథ చదివితే నాకు ఆనందంగా వుంటుంది….బాగా లోతుగా క్షుణ్ణంగా విశదీకరిస్తారు. రచయితకు కావలసిన సంతృప్తిని ప్రోత్సాహాన్ని అందిస్తారు….మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలండీ


Jhansi koppisetty
మంచు పొరలు లాంటి మబ్బు తెరలు, ఉన్నాయి, ఉన్నాయి, ఈ జీవితంలో!
…..Padma Padmapv
శీలా సుభద్రా దేవి
కథ రాయటంలో , వాక్యనిర్మాణం లో మీదైన ఒక బలమైన వెలువడినాయి సాధించారు.ప్రేమరాహిత్యం
తో సతమతమౌతూ డిప్రెషన్ లోకి జారుకునే సౌందర్యరాశి వెన్నెలని సజీవంగా చిత్రించారు.కథను మొదలు పెట్టిన పాఠకులకు ముందు అయోమయంగా అనిపించినా చదవటం అపనివ్వని ఝరి మీ స్వంతం.
మనసారా అభినందనలు ఝాన్సీ.
Jhansi koppisetty
శీలా సుభద్రగారూ, ధన్యవాదాలండీ. మీ కమెంటు నాకెంతో ఆనందదాయకంగా వుంది. మీలాంటి సీనియర్ రచయిత్రి ప్రశంస నా రచనా పటిమకు టానిక్కులా పని చేసి మరింత పదును పెడుతుంది.
Jhansi koppisetty
వెన్నెల కథ వెన్నలంత అందంగా ఉంది. మీ శైలి చాలా చక్కనిది.సంఘటనల సమాహారంగా hallucinations ని present చేసిన తీరు పాఠకుణ్ణి ఆకర్షించేదిగా ఉంది.అభినందనలు
…..వెంపటి కామేశ్వర రావు
Sagar
వాస్తవానికి, కల్పితానికి తేడా తెలియనంతగ పాఠకుణ్ణి కధలో లీనం చేసే ప్రతిభ మీ స్వంతం మేడం. అభినందనలు.
Jhansi koppisetty
ధన్యవాదాలు సాగర్ గారూ


Sambasivarao Thota
Jhansi Garu!
Sunnithamaina sthree purusha sambandhaalanu andangaa vivarinchdamlo meeru raanisthunnaaru..
Dhanyavaadaalandi..
Jhansi koppisetty
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ

Jhansi koppisetty
First I have to thank your friend Rajkumari garu for her suggestion. Otherwise we would have missed such a fantastic narration of fiction from your pen. It is a masterpiece-like creation of Yaddanapudi and Yandamuri put together.
ఒక్కసారి చదవడం
మొదలుపెట్టాక ఏకబిగిన చదివేలాచేసిన మీ రచనా పాటవానికి, పద విన్యాసానికి, కాల్పనిక జగత్సృష్టికి జోహార్లు.
“మృణ్మయనాదం” అన్నారు. అంటే ఘటవాయిద్యం చేసే చప్పుడనా?
…..Lakshmi narayana rao Bitra
Jhansi koppisetty
మేడం













మంచు తెర మబ్బు పొర
చాలా బాగుంది
కథలో వెన్నెల గూర్చి ఆ వర్ణనలు
చదువుతుంటే ఎదో సౌందర్య లోకంలో విహారిస్తున్నట్టుగ అనిపించింది…
చిన్నతనం నుండి తన అందం గూర్చి ప్రశంసలకు అలవాటు పడి.. పెళ్లి అయ్యాక తనని పట్టించుకోని భర్త వల్ల ఎంత మానసిక ప్రాబ్లమ్ లో పడిందో చక్కగా వివరించారు…
శుభాకాంక్షలు మీకు
……కళావతి
Jhansi koppisetty
సర్రియలిజం, మేజిక్ రియలిజం రెండూ కలిపి జుగల్ బందీ చేసిన మనోవైజ్ఞానిక కథ.
మనిషి లోపలి భయాలు, తీరని కోరిక లు,తమ ఉనికిని కాపాడుకోవడానికి పడే తపన, ఆత్మీయులు తమ పట్ల చూపే ఉదాసీనత, ఇలా హేలూసినేషన్స్ రూపం లో బయటకు వస్తాయి అంటారు మనో విశ్లేషకులు.
కథనం,భాష, శైలి బాగున్నాయి.
ఐతే ఈ భ్రాంతుల మూలం ఏమిటో
మానసిక వైద్యుల డయాగ్నోసిస్, గురించి సాధికార త తో వివరిస్తే మరింతగా హత్తుకునేది
బాగుంది..ఆ సక్తికర మైన మంచి కథ.
మీకు అభినందనలు
…..Dr. M Suguna Rao
Jhansi koppisetty
Baby sister look into my life . U too find many melodramas in & to . U write
. I don’t write .
May perhaps, I don’t have patience enough & my phone won’t support.
I too have all feelings & pains that got along and seen many thousands of your experience.
I am lazy inkling pen
….Narisetty Navneeth Kumar
Jhansi koppisetty
ఇది కూడా ఊహలా లేదు.నిజంలాగే ఉంది. పుట్టింటి రాజకుమారి అత్తింటికెళ్లాక చాలా మంది అడపిల్లల మనస్థితి ఇలాగే ఉంటుంది. ఎంతో గొప్పగా అందరికీ కనిపించిన విషయాలు కొందరి భర్తలకెందుకో చాలా casual గా కనిపిస్తాయి.
….Sathi Padma
Mannem sarada
అచ్చం ఇలాంటి ఊహ ల్లో వుండే ఒకామె నాకు తెలుసు. అయితే ఆమె నిత్యం ఎవరో తనని తరుముతున్నారని , చంపడానికి ప్రయత్నిస్తూ న్నారని తాను పారిపోయి వచ్చానని రకరకాల కథలు చెబుతూనే వుంది . కాదన్న వారిని ఆమె దూరం చేసుకుంటుంది. చాలా జాలి కధ. డాక్టర్ దగ్గరకి రాదు. చాలా బాగా వివరించావు ఝాన్సీ , అభినందనలు
Jhansi koppisetty
Thank you శారదక్కా, నేను నిజ జీవాతానుభవంలో నుండే రాసాను

Jhansi koppisetty
అద్భుతమైన శైలి తో అక్షరాలకు అందమైన సొబకులద్ది ఆసాంతం ఆసక్తికరంగా ఆద్యంతం అనురక్తి తో అనుభూతిని ఆస్వాదింపచేయడం ది గ్రేట్ ఝాన్సీ గారికే చెల్లిందనిపిస్తుంది.చాలా చాలా బాగుంది మీ కధానికం సరికొత్త విషయాలతో .హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు.















……అఫ్సర్ వలీషా