తడి ఆరని గుండె..
జానకిని కొడుకు కృష్ణ వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళాడు.
జానకి చుట్టూ పరికించి చూసింది.
అందరూ అపరిచితులే. ఆ అభద్రతలో స్వాంతన దొరికింది ఆమెకు.
ఏళ్ళ తరబడిగా దుఃఖంతో స్రవిస్తున్న గుండె గాయానికి కొంత ఊరట కలిగింది.
తను చేసిన పాపానికి ఆమె స్వచ్ఛందంగా కోరుకుంటున్న ప్రాయశ్చిత్తమది.
ఇన్ని సంవత్సరాలుగా గుండెను పిండేస్తున్న బాధ నుండి జానకి మనసు తేలిక పడింది.
ఇన్నాళ్ళకు తన పాప విమోచన వాంఛ నెరవేరింది.
జానకి తనవారంటూ ఎవరూ లేని, అశుభ్రంగా వున్న ఆ వృద్ధాశ్రమాన్ని చుట్టూ కలయ చూసి మనశ్శాంతితో తృప్తిగా చిన్నగా నవ్వుకుంది.
మనశ్శాంతితోనే ఆమె మంచం పైన అటు ఇటు అశాంతిగా కదిలింది.
అదాటుగా మెలకువ వచ్చి తల విదిలించి అమాంతం మంచం మీద లేచి కూర్చుంది.
ఇదంతా కలా…?
జానకి కొన్నేళ్ళుగా తరుచూ ఇదే కల కంటుంది.
తను జానీని వృద్ధాప్యంలో తెలియని చోట వదిలేసినట్టుగా తనను తన కొడుకు కృష్ణ వృద్ధాప్యంలో అపరిచితుల మధ్య వదిలేసినట్టు…
ఇరవై ఏళ్ళుగా నీడలా వెంటాడుతున్న ఒక దృశ్యం జానకి కళ్ళ ముందు మళ్ళీ దృశ్యమానమయ్యింది.
ఆఖరిసారిగా కటకటాల గేటులో నుండి దీనంగా తన వైపే చూస్తున్న జానీ జాలి చూపు.
ఇంత కాలంగా కళ్ళు మూసినా తెరిచినా ఏ పని చేస్తున్నా తనను వెంటాడుతున్న దయనీయమైన చూపు.
రంపంతో కోసినట్టుగా తన హృదయాన్ని కోసి రక్తాశ్రువులు చిందిస్తున్న ఆర్ద్రమైన తడి చూపు.
అపరాధ భావనతో జానకి హృదయం ముకుళించుకు పోయింది.
మనసంతా కకలావికలమై పోయింది.
తను చేసింది అలాంటి ఇలాంటి పాపం కాదు.
తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు.
ఆమె భారమైన హృదయం ఇరవై ఏళ్ళ గతానికి తెర తీసింది.
* * *
జానకి పదేళ్ళ వయసప్పుడు ఆమె తల్లి, తమ్ముడు అర్జంటు పని మీద పక్క ఊరెళుతూ అప్పటి పెంపుడు కుక్క టామీని మొదటిసారిగా తనకు అప్పగించారు.
అప్పట్లో తనకు కుక్కలంటే అస్సలు పడేది కాదు.
అప్పటివరకూ ఎప్పుడూ కనీసం టామీని చేతితో తాకి ఎరుగదు.
కుక్కల నల్లటి మూతులు, బయటకు వేలాడేసే చొంగ నాలుకలు తనకు నచ్చేవి కావు.
ఆమెప్పుడూ టామీ దగ్గరకు వెళ్ళక పోవటం గమనించిన తమ్ముడు ఊరెళుతూ ఆమెను ఒకటికి రెండుసార్లు హెచ్చరించి వెళ్ళాడు.
“అక్కా, అన్నం గిన్నె దూరం నుండి తోస్తే టామీ తినదు. గిన్నెను దాని ముందు పెట్టి ప్రేమగా తల నిమిరి తినమని చెబితేనే తింటుంది”
తమ్ముడు అంతగా చెప్పినా తను మూడు మీటర్ల దూరంలో నిలబడి కర్రతో అన్నం గిన్నెను టామీ దగ్గరకు తోసింది.
టామీ ఒక నిరసన చూపు ఆమె మొహాన పారేసి ఏమీ పట్టనట్టు ఊరుకుంది. అది కనీసం అన్నం గిన్నె వంకయినా తల తిప్పి చూడలేదు.
కడుపులో బాగా మాడితే అదే తింటుందిలెమ్మని జానకి ఊరుకుంది. ఉదయం పదింటికి పెట్టిన పాలన్నంలో మధ్యాహ్నానికి తేమ ఆరిపోయిందే తప్ప ఒంటి గంటయినా టామీ అన్నం ముట్టుకోలేదు. జానకికి ఆకలి వేసింది. టామీ తినకుండా ఆమెకూ తినాలనిపించలేదు.
జానకి ఇక తప్పదని లేచి అన్నంలో మరి కొన్ని పాలు పోసి కలిపి టామీ దగ్గరకు వెళ్ళి దాని తల, వీపు తాకీ తాకనట్టు నిమిరి, తినమని నచ్చ చెప్పాక, అప్పుడు టామీ తోక ఊపుకుంటూ తినేసింది.
జానకి టామీ భోజనమయ్యాక సబ్బుతోనూ డెట్టాల్ తోనూ చేతులు ఎన్ని సార్లు కడుక్కుందో లెక్కలేదు. అయినా ఆ చేతితో ఆ రోజు అన్నం తినలేక పోయింది.
అలాంటి జానకికి జీవితమంతా శునకంతో సావాసం తప్పనే లేదు.
ఆమెకు మూన్నాళ్ళ ముచ్చటయిన భర్తకి కుక్కలంటే ప్రాణం. నిత్యం ఇంట్లో ఏదో ఒక జాతి కుక్క వుండేది. కుక్కలకు ఆహారం వండే కుక్కర్ వేరుగా పెట్టినా, తన భర్తే స్వయంగా తోముకుని వండినా, కుక్కలను శ్రీవారే వాకింగ్‌కి తీసుకెళ్ళినా, జానకికి ఇంట్లో కుక్క చిరాకుగా ఎప్పుడూ భారంగానే అనిపించేది.
ఎప్పుడూ కుక్కలతో వుండే వాళ్ళ ఇంటిని చూసి, జానకి శునక ప్రేమికురాలని పొరబడిన ఆమె కజిన్ బ్రదర్, ఆమెకు పుట్టిన రోజున అప్పుడే పుట్టిన చిన్న స్నోబాల్ లాంటి తెల్లటి పమేరియన్ పప్, జానీను బహుమతిగా కొని ఇచ్చాడు.
బుజ్జికొండ తెల్లటి చిన్న దూది ఉండలా కనిపించేది.
తాకితే వెన్నముద్దలా మురిపించేది.
కుక్కలంటే చిరాకు పడే జానకిని దాని మృదువైన వెచ్చటి స్పర్శతో మైమరిపించేది.
జానీకి బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం. జానకి భర్త జానీని బైకు ముందుండే పెట్రోల్ ట్యాంకు పైన కూర్చో బెట్టి రౌండ్లు వేసేవారు. దాని పట్టుకుచ్చులాంటి తెల్లటి జుంపాలు గాలికి ఎగురుతుంటే జానీ ఎంతో అందంగా కనిపించేది. జానకి ఆల్బం నిండా జానీ చిత్రాలే.
దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో భర్త పోయి ఒంటరిగా మిగిలిన జానకికి జానీ క్రమంగా దగ్గరయ్యింది. అప్పటినుండీ జానకికి జానీ పైన ఇష్టం మరింత పెరిగింది.
జానీ జానకికి సెక్యూరిటీ గార్డ్‌లా వుండేది. ఆమె దగ్గరకు ఎవరు వచ్చినా జానీ సహించేది కాదు. మహా పొసేస్సివ్గా జానకిని కంటికి రెప్పలా కాచేది.
జానీ ఎప్పుడూ సిట్ అవుట్లో కూర్చుని ఏ ఒక్కరినీ ఇంట్లోకి రాకుండా సునిశిత కాపలా కాచేది. దానికి బాగా పరిచయమున్నవారెవరైనా వచ్చినా, వాళ్ళు తిరిగి వెళ్ళేప్పుడు చేతిలో ఏ వస్తువు వున్నా ఊరుకునేది కాదు.
జానకికి వాళ్ళ పక్కింటి ఉమతో మంచి స్నేహం. ఆవిడ తరుచూ వస్తుండేది. జానకి చపాతీ కర్రతో చపాతీలు బాగా వస్తాయని కర్ర కోసం వచ్చి, జానీకి భయపడి తను ఖాళీ చేతులతో వెళ్ళి తన వెనుకే జానకిని చపాతి కర్ర తెచ్చి ఇమ్మనేది ఉమ.
ప్రొద్దస్తమాను ఉమ జానకి ఇంట్లో వుండి వంట సాయం చేసినా, తిరిగి వెళ్ళి పోయేప్పుడు ఖచ్చితంగా ఖాళీగా వెళ్ళాల్సిందే.
జానకి ఆఫీసులో మధు అనే కొలీగ్ వుండేవాడు. ఎప్పుడూ ఉత్సాహంగా లైవ్లీగా వుండేవాడు. జానకంటే అతనికి చాలా అభిమానం. అతని ప్రతి మాటలో చేష్టలో ఆ ఇష్టం కనబరిచేవాడు. జానకిపై ప్రేమను మొత్తం కుటుంబంపై కనబరిచేవాడు.
పుట్టుకకు బ్రాహ్మడే అయినా జానకి వండే చికెన్ కర్రీ అంటే అతనికి మహా ఇష్టం. ప్రతి ఆదివారం చికెన్‌తో భోజనం కోసమే జానకి ఇంటికి వచ్చేవాడు.
జానకి ‘చికెన్ కోసమే మా ఇంటికి వస్తున్నారా’ అంటే తడబడి ‘కాదు మీ కోసం’ అనేవాడు కంగారుగా.
జానకి కోపంగా చూస్తే ‘జస్ట్ కిడ్డింగ్’ అంటూ సరదాగా నవ్వేసేవాడు.
అతను శునక ప్రియుడు. కుక్కలను మాలిమి చేసుకోవటంలో మహాదిట్ట. జానీని తన ప్రేమతో సునాయాసంగా లొంగదీసుకున్నాడు.
అతను వచ్చినప్పుడల్లా జానీ తోకాడిస్తూ అతని దగ్గరకు వెళ్ళటం, అతను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవటం షరా మామూలయ్యింది.
ప్రతి యేడు లాగే ఆ సంవత్సరమూ మధు అలవాటుగా హోలీ రోజున జానకిని రంగుల్లో ముంచెత్తటానికి, మొహానికి గులేర్ రాయటానికి వచ్చాడు. మధు జానకిని ఒడిసి పట్టుకుని మొహానికి రంగు పులమబోయాడు. ఊహించని విధంగా జానీ ఎగిరి వాళ్ళిద్దరి మధ్యకు దూకి అతని వైపు పళ్ళు నూరుతూ అరుస్తూ చూస్తూ దాని ఉగ్ర నరసింహావతారం చూపించింది.
మధు హడిలిపోయి జానకిని వదిలేసాడు.
“పాతిక సంవత్సరాలుగా హోలీ రోజున మీకు రంగులు పూసే అపురూపమైన అవకాశాన్ని ఇప్పుడు వచ్చిన జానీ చెడగొట్టింది. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదేనేమో” అంటూ వాపోయాడు.
జానకి కిలకిలా నవ్వి జానీని గుండెలకు హత్తుకుంది.
అప్పటినుండీ జానకికి జానీ పైన ప్రేమ రెట్టింపు అయ్యింది.
మధు “జానీగాడు నాకు మొగుడిలా తయారయ్యాడు” అంటూ హాస్యమాడేవాడు.
అలా జానకిని ఒక తండ్రిలా, అన్నలా, భర్తలా, మిత్రునిలా కాచే జానీని జానకి ఒక దురదృష్ట సందర్భంలో అమానవీయంగా అనాథను చేసి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయింది.
* * *
అది జానకికి తొలిసారి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిన సందర్భం.
అకస్మాత్తుగా ముందస్తు నోటీసు లేకుండా ఎక్కువ వ్యవధి ఇవ్వకుండా అమెరికా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రయాణానికి టికెట్లు బుక్ అయ్యాయి.
నయగారా జలపాతాలతో మమేకమవ్వాలని, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఆలింగనం చేసుకోవాలని, మేడం టుస్సాడ్స్‌లో రాయల్ వాక్స్ మోడల్స్‌తో ఫోటోలు తీసుకోవాలని ఎంతో కాలంగా జానకి కలలు కంటూ ఆ అవకాశం కోసం ఎదురు చూసింది.
ఆ సదవకాశం తెచ్చిన సంభ్రమం ఆమె వివేచనను మింగేసింది.
జానకి భర్త వుండి వుంటే ససేమిరా ఒప్పుకోని దారుణ అకృత్యం తను చేసింది.
తన ప్రయాణపు ఉత్సాహంలో జానకికి జానీ గురించిన ఆలోచనే రాలేదు.
రోజుకో షాపింగుతో తలమునకలై పోయింది.
ఆ దురదృష్టకర ఆదివారం రాత్రే ఆమె ప్రయాణం. ప్రయాణం రోజు మధ్యాహ్నం జాని తలపుకొచ్చింది.
వెంటనే జానీని కానుకగా ఇచ్చిన కజిన్‌కి కాల్ చేసింది. ఆమెకు అతను తప్పకుండా జానీ బాధ్యత తీసుకుంటాడన్న నమ్మకం వుంది.
అతను ఒక ఫ్యాక్టరీకి అధిపతి. లక్షల్లో టర్నోవర్ వుండేది.
జానీని తను తిరిగి వచ్చేవరకూ వాళ్ళ ఇంట్లో పెట్టుకోమన్న జానకి అభ్యర్ధనను అతను కాదన్నాడు. పోనీ ఫ్యాక్టరీలో వాచ్‌మ్యాన్ దగ్గర పెట్టి రోజూ కాస్త అన్నం పెట్టించమని జానకి వేడుకుంది.
“అదేమైనా ఆల్షేషన్ కుక్కా లేక డోబర్ మ్యానా ఫ్యాక్టరీలో కాపలాకి పెట్టేందుకు, పైగా పన్నెండు ఏళ్ళు నిండాయి దానికి… మహా బ్రతికితే మరో నాలుగైదు నెలలు బ్రతుకుతుందేమో.. రేపో మాపో పోయే ఆ ముసలి కుక్క కోసం అంత ఆలోచన, బాధ దేనికి… దారి గుర్తించనంత దూరం కారులో తీసుకెళ్ళి వదిలేసేయి. ఇదివరకు నేను మా కుక్కకు గజ్జి పడితే అలాగే వదిలేసాను” అన్నాడతడు.
అప్పుడు ఆ మాటలు ఎంత కఠినంగా నిర్దాక్షిణ్యంగా వినిపించాయో తన చెవులకు.
అసలు తన కజిన్ దయా దాక్షిణ్యాలు లేని మానవ రూపంలో వున్న రాక్షసుడు అనిపించింది ఆ క్షణం. మొదటిసారి జానకికి అతని అంతర్గత రూపం తెలిసినట్టయ్యింది.
మధుకి ట్రాన్స్ఫర్ కాకుండా వుండి వుంటే జానీని తప్పకుండా చూసుకునేవాడని బాధపడింది.
ఆమె స్నేహితురాలు ఉమని, మరి కొందరు బంధు మిత్రులను జాని ఆశ్రయం గురించి అడిగి చూసింది.
ఒకటి రెండు రోజులయితే ఏమో గాని ఆరు నెలలు అనే సరికి ఒక్కరూ ముందుకు రాలేదు.
సాయంత్రం ఐదు అవుతోంది. ఆ రోజు అర్థరాత్రికే తన ప్రయాణం. ఏమీ తోచ లేదు.
అప్పట్లో బ్లూ క్రాస్ సొసైటీల విషయ జ్ఞానం తనకు లేదు. సమయం గడిచే కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. కజిన్ మాటలు చెవిలో రొద పెట్టాయి.
అతడిని దానవుడు అనుకున్నదల్లా తిరిగి దారుణమైన అతని సలహాను మననం చేసుకునేంతగా తను దిగజారిపోవటం ఆమెకే ఆశ్చర్యమనిపించింది.
తన ఇంటి సమీపంలో ఒక వెటరినరీ ఆసుపత్రి వుంది. జానీ వాక్సినేషన్స్, ఇతర ట్రీట్మెంట్లు అక్కడే జరిగాయి.
ఆ ఆసుపత్రి ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకల్లా మూసేస్తారు.
ఇదివరకు అక్కడ జబ్బు పడ్డ రెండు ముసలి కుక్కలను ఇద్దరు అనామక ఓనర్లు నిర్దాక్షిణ్యంగా వదిలేసారని, ఆసుపత్రి వారే వాటిని సంరక్షిస్తున్నారని జానకి విన్నది.
వేరే దారి కనిపించక జానకి ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చేసింది.
జానీని వీధుల పాలు చేసే కన్నా అదే సమంజసమని జానకి తనకు తాను సర్ది చెప్పుకుంది.
జానీకి ఇష్టమైన ఆహారం స్వయంగా చేసి తినిపించింది. చివరి సారిగా జానీని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది.
జానీకి కారు షికారు అంటే ఇష్టం. కారు ఎక్కమనగానే జానీ అమాయకంగా ఉత్సాహంగా కారు ఎక్కేసింది.
ఓ చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో దానికిష్టమైన బిస్కట్లు దారి పొడవునా నోటికి అందిస్తూ జానకి కంటికి మింటికి ఏకధారగా ఏడ్చింది.
జానకి కారు వెటరినరీ ఆసుపత్రికి దూరంగా ఆపింది. కారు లాక్ చేసి జానీ చెయిన్ పట్టుకుని ఆసుపత్రి దగ్గరకు నడిచింది.
అక్కడ వాచ్‌మ్యాన్ ఎవరూ కనబడలేదు. గేటుకి దళసరి ఇనుప గొలుసు చుట్టి పెట్టి వుంది. తాళం వేసి లేదు. చుట్టూ పరికించి చూసింది. ఎవ్వరూ లేరు. దరి దాపుల్లో జనసంచారం లేదు. గేటుకున్న గొలుసు ఊడ తీసింది. జానీతో లోపలికి వెళ్ళింది.
గొర్రె కసాయివాడిని నమ్మినట్టు జానీ హుషారుగా ఆమెతో వెళ్ళింది.
చెట్టు కింద నీడలో వున్న బల్ల కాలుకి జానీ మెడకున్న గొలుసును కట్టేసింది. మిగిలిన బిస్కట్లు అక్కడే పెట్టేసి, జానీ తల మీద ఒక ముద్దిచ్చి, కళ్ళు తుడుచుకుంటూ గబగబా లేచి వచ్చేసింది. గేటుకి ఇనుప గొలుసు యథావిధిగా చుట్టేసి ఆఖరిసారిగా జాని వంక చూసింది.
అమాయకంగా అప్పుడు జానీ చూసిన జాలి చూపులు ఆ రోజు నుండి ఈ రోజు వరకూ జానకి గుండెను పిండేస్తూ హింసిస్తూనే వున్నాయి.
జానీ ఏమయ్యిందన్న పిల్లల ప్రశ్నకు జానకి గొంతు పెగల లేదు.
తెలిసిన ఫ్రెండ్స్ అడాప్ట్ చేసుకున్నారని అబద్ధమాడింది.
తప్పు చేసినప్పుడే కదా అబద్ధాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది.
అనునిత్యం రక్తం స్రవిస్తున్న తన గుండె గాయం ఇప్పటికీ మానలేదు.
బహూశా తన కల నిజమైన రోజునే తన గుండె తడి ఆరుతుందేమో..!
(మళ్ళీ కలుద్దాం)

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
30 Comments
రమేష్ చెన్నుపాటి
తప్పు చేసినప్పుడేగా అబద్దాన్ని ఆశ్రయించాల్సి వస్తోందీ.. జానకీ జానీ పుట్టుకలు పక్కన పెడితే..
⚘⚘
జీవీ జీవాల తారతమ్యంలేని రెండు హృదయాల కలయిక..
మీ కలంలోని ప్రతి ఇంకు చుక్కా నిజాయితీ భావాల ఊట.మీ రచనల్లో జీవితాలని వెత్తుక్కుంటుంటాం అందుకే
సీరామ్
Jhansi koppisetty
ధన్యురాలిని తమ్ముడూ


Sagar
పేరుకు శునకమయినా దానికీ ఒక మనసు ఉంటుంది, ఆ మనసు పడే వేదనను చెప్పకనే చెప్పారు. మధువిషయంలో జానీ ప్రతిఘటనతో. ఇక వేరే మార్గంలేక తను ఆవిదంగా చేసినా కూడ అది సమర్ధనీయంకాదు. అని నా అభిప్రాయం మేడమ్ . హృదయాన్ని కదలించేలా ఉంది మీరచన. మీకు అభినందనలు.
Jhansi koppisetty
అవును సాగర్ గారూ…. సమర్ధనీయం కాదనే ఇది తప్పని తపన చెందటం, ఇలా అక్షరవివాళులు సమర్పించుకోవటం…..
Jhansi koppisetty
నా గొంతును ధారావాహికంగా వినిపిస్తున్న సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు


Navneeth
Touching
Jhansi koppisetty
Thank you brother Navneet …..
డా కె.ఎల్.వి.ప్రసాద్
మనసున్న వారే…మరీ అంతగా ఆలోచిస్తారు.
శూనక ప్రియులకు ఇదే ఇబ్బంది.ఎక్కడికీ వెళ్లడానికి
వుండదు.ఎవరికీ అప్పగించలేని పరిస్తితి. ఒక రకంగా జానకి మంచి పనే చేసింది.కానీ త న సున్నితమైన మనస్సు అపరాధ భావం తో..తన నేటి పరిస్తితి తో
ముడిపెట్టుకొవడం బాధాకరమైన విషయమే! విస్వాసానికి మారుపేరు కదా,శూనక రాజం అంటే.అభినందనలు.
Jhansi koppisetty
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ డాక్టర్ ప్రసాద్ గారూ


Sambasivarao Thota
Jhansi Garu!
Kukkanu gurinchi meeru vraashindi chadivina tharuvaatha..
Naakenno jnaapakaalu..
Chaalaa Baagaa Vraashaarandi..
Abhinandanalu
Jhansi koppisetty
ధన్యవాదాలు సాంబశివరావు గారూ


Jhansi koppisetty
కథ చాలా బాగుంది, ఎలాంటి విషయాన్నైనా తీసుకుని అద్భుతమైన శిల్పంతో కథ రాయడం లో తమరు మంచి నేర్పరి అనడానికి ఈ కథ మంచి ఉదాహరణ.
మీ ప్రతి కథలోనూ మానవీయ విలువలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి,,
ఏదో ఒక సందర్భంలో స్త్రీ పురుష సంబంధాలను కూడా స్పృశించడం మానవ జీవితంలో ఒక భాగం కనుక సమర్థనీయమే.
కొన్ని చోట్ల తేలికైన తెలుగు పదాలు ఉంటే చాలా బాగుండేది ఉదాహరణకు. ముకుళించు కోవడం, కకావికలం, హృదయము, శునకము..
మొత్తానికి కథ చాలా అద్భుతం అభినందనలు.
….Saleem Mohammad
Jhansi koppisetty
తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలిత బాధ అనుభవంలోకి వచ్చి పశ్చాత్తాపం పడే అవకాశం ప్రతి జీవికి ఉండాలి

….బంగారు కల్పగురి
Jhansi koppisetty
[7/2, 3:32 pm] Writer Ch Susheela: జానకి , పెంచుకున్న జానీ పేర్లు దగ్గర “సుశీల, బంటి’ అని పెట్టుకుంటే మొత్తం కథ అంతా నాదే రాసింది ఝాన్సీ.
చదివి దిగులుగా కూర్చుండిపోయాను పొద్దటి నుంచి.
[7/2, 4:48 pm] Writer Ch Susheela: పమెరిన్, మొదట్లో కుక్కల దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడకపోవడం,
వేరే ఊరు వెళ్ళటానికి ఇబ్బంది, తప్పనిసరి పరిస్థితిలో కారులో తీసుకు వెళ్లడం,
నిర్దాక్షిణ్యంగా వదలడం,
ఇప్పుడు పశ్చాత్తాపం,
మొత్తం నాకదే!
మీకెలా తెలిసింది!!
ఆ దిగులు జీవితాంతం వదల దేమో!
మీరన్నట్టు “ఓల్డ్ ఏజ్ హోమ్” తగిన శిక్షే నేమో అన్న భయం!!
[7/2, 4:54 pm] Writer Ch Susheela: చాలా రాసుకోవాల్సిన పని ఉంది ఈరోజు. కానీ ఇది చదివాక దిగులుగా కూర్చున్నా.
ముఖ్యంగా పమెరియన్లు బాగా ప్రేమని పెంచుకుంటాయి. నిర్దాక్షిణ్యంగా వదిలేయటం పాపం కదా.
Jhansi koppisetty
జానకి జీవితంలో జరిగినట్లు ఇలా చాలామంది జీవితంలో జరగవచ్చు…జరగకపోవచ్చు..కానీ దాన్ని నిజాయితీ గా స్వఛ్చంగా ఇలా కధలో హృదయం ద్రవించేలా చెప్పడం అందరూ చెప్పలేరు.జానకి చేసింది తప్పా ఒప్పా అని మనం జడ్జ్ చేయలేము…అదేమిటో జానకి కి తెలుసు..కానీ మూగజీవాల ప్రేమ విశ్వాసం మానవులకు ఉండడం చాలాసార్లు కష్టం
……సరళ మోహన్
Jhansi koppisetty
తప్పని పరిస్థితిలో చేసినా చాలా బాధాకరం.కొన్ని సార్లు తప్పవు.
…..Satti Padma
Jhansi koppisetty
Chala Baga rasav.
Nee sunnitam aina hrudayaniki johar.
Chala bhavodvegam to rasav muga jantuvu la meeda anubandhanni…
…..Srinivas, Sydney
Jhansi koppisetty
బంధాలు అయినా బంధనాలు అయినా అవి మనుషుల మధ్య అయినా పశువుల మధ్య అయినా బిగించి బలమైన ప్రేమ ఆత్మీయ అనురాగాల తాడుతో ఇట్టే కట్టేస్తారు కదా ఝాన్సీ గారు చదువు తున్నప్పుడు ఆతృతగా హృదయాన్ని తాకించడం మీకే సాధ్యం. సున్నితమైన మనసుతో బహు సున్నితంగా హృదయానికి హత్తుకునేలా వ్రాశారు కధనాన్ని హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు సో……గ్రేట్ హాట్సాఫ్ యు
















…..Mohammad Afsar Valisha
Jhansi koppisetty
మీ కథ చాలా బాగుంది మేడం కథ చదువుతూ ఉంటే జానీ కళ్ళముందు కదిలి నట్టుగా ఉంది సూపర్ మేడం సూపర్
……Avva Bucchanna
Jhansi koppisetty
ఏ సబ్జెక్టు తీసుకున్నా అందులో నిజాయితీ ఉట్టిపడుతూ ఉంటుంది అందుకే నువ్వు రాసే ప్రతీ కథ అద్భుతంగా ఉంటుంది






…Raj Kumari
చిట్టె మాధవి
కొన్ని అనుభవాలు వెంటాడితే మరికొన్ని వేటాడుతాయి.ఏ పరిస్థితిలో చేసినా మనఃసాక్షికి
తెలుసు తప్పొప్పుల గురించి..అందుకే అవి ఒక్కోసారి మనఃశాంతిని దూరం చేస్తాయి.బాగా వ్రాశారు జాన్సీ
Jhansi koppisetty
Thank you మాధవీ డియర్
Jhansi koppisetty
Going good!
…Afsar Mohammed
Jhansi koppisetty
చాలా బాగుంది మేడమ్
…Neelima VS Rao
Chatrapathi
పొరుగింటి వారంటే చికాకు పడే వారు కూడా పెంపుడు కుక్కల ప్రేమకు బానిసలు అవుతుంటారు.. వాటి నిస్వార్థ ప్రేమ ఎవరినైనా కట్టి పడేస్తుంది.. జానకి అన్ని ప్రయత్నాలు చేసి మరీ తప్పనిసరి అయినప్పుడు మాత్రమే జాని ని అలా వదిలేసింది.. అయినా తాను కూడా బాధ పడుతూనే ఉంది.. కాబట్టి ఇలాంటి బంధాలు అనుబంధాలు అప్పుడప్పుడు వీడి పోవడాలు తప్పవు మరి.. తప్పు ఎవరిదీ కాదు
Jhansi koppisetty
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ఛత్రపతిగారూ


Jhansi koppisetty
తడి ఆరని గుండె..నా గుండెని తడిపేసింది. నాకు కుక్కలంటే ఏమి మక్కువ లేదు.అయినా జానీ గుండెలనిండా అక్రమించేసింది. ఏమిటమ్మా ఇలా పాఠకుల్ని నిర్దాక్షిణ్యంగా బాధ పెడుతున్నారు.ఓ మౌనరాగం..ఓ తడి ఆరని గుండె.. కొంత టైం కావాలి సాధారణ స్థితికి చేరుకునేందుకు.బాగుంది కథ
…..Vempati Kameswara Rao
Jhansi koppisetty
కుక్క పిల్లల కి ఆటాచ్మెంట్ ఎక్కువ. పెంచనే కూడదు.పెంచాక ప్రేమగా చూడాలి అంటారు. మీ కథ లో జానీ ని వదిలి వెళ్లడం బాధాకరమే.. బాగా రాసారు ఝాన్సీ.
….Sunita Pottoori
Jhansi koppisetty
I hate you…
… Virinchi Laxmi
Jhansi koppisetty
రాముడే రావణుడైతే లా జానకియే రాక్షసి ఐతే లా కన్నీరు తెప్పించిందమ్మా, జానీ చివరి చూపు!
రాత్రంతా చీకట్లో ఒంటరిగా బయట … ఎటూ వెళ్ళలేకుండా గొలుసుకట్టుతో అనుభవించిన నరకం,
మూగజీవికే కాదు మాటలొచ్చిన మనుషులకి సాధ్యమా?
మా ఇద్దరికీ కుక్కపిల్ల పడల్ మొదట్లో అలాగే అనిపించేది! పిల్లలెత్తుకున్నా దించమనేవాణ్ణి!
అందర్నీ నాకినట్టు నన్నూ నాకాలని ప్రయత్నించేది కానీ నేను దూరంగానే ఉండేలా చూపులతో
మేనేజ్ చేసేవాణ్ణి! వరలక్ష్మి ఎటు వెళితే అటు, స్నానం చేసి వచ్చేవరకూ మూసి ఉన్న డోర్ దగ్గర కూర్చుని
తనతోపాటు బయటకి రావడం, తన బట్టలారేసి ఎండాక తీసుకు రావడం అన్నీ గమనిస్తూ …
ఇప్పుడు సోఫాలో కాళ్ళ దగ్గరా ఆనుకుని పడుకోవడం చేస్తుంది! నేను రోజూ వాకింగ్ కి తీసుకెళ్ళినా
ఫ్రీగానే నాతో రావడం చెప్పినట్టు నడవడం అలవాటయ్యాక కూర్చున్నప్పుడు నా పక్కన ఏ మాత్రం చాన్స్ దొరికినా
పక్కన ఆనుకుని పడుకోవడానికి ప్రయత్నిస్తుంది! నా చూపుల్లో ఏదో లాపమో మరొకటో దాన్ని గద్దించక పోవడంతో
ఆనుకుని కూర్చుంటుందప్పుడప్పుడు! 3 ఏళ్ళ కుక్కపిల్లని గజ్జి వచ్చిందని స్కూటర్ పై తీసుకెళ్ళి దూరంగా ఉన్న కాలనీ రోడ్డుపై వదిలేసి వస్తుంటే నావైపు ఎంతలా పరిగెత్తిందో? నేను స్పీడు పెంచి తప్పించుకు వచ్చినా నన్ను ఆ రోజంతానే కాదు,
ఓ వారం మరీ మరీ … నెల తరువాత అప్పుడప్పుడూ ఓ ఏడాదికి మరచిపోయినా 30 ఏళ్ళలో 2-3 సార్లు గుర్తొచ్చింది!
ఇప్పుడు మీ గొంతు వినగానే … మళ్ళీ గుర్తొచ్చింది! మనసు నిజంగానే పిండేసినంత బాధ! జానకిలో మార్పు వచ్చి ఆదరించినా మళ్ళీ సహజ దానవగుణం పోలేదుగా? కొన్ని కథలింతే! ప్రాయశ్చిత్తంకోసం తరువాత ప్రయత్నిస్తాం!
Very Good and Natural true story!
…. Jogeswara Rao Pallampati