చీకటి వెన్నెల
అతను ఇప్పటికీ మారలేదు..
అతని పట్ల నా మనోభావాలూ మారలేదు.
నా పదేళ్ళ వయసప్పుడు తన ఊహలతో నన్ను ఎంత మైమరిపించాడో ఇప్పుడూ ఈ వయసులోనూ అంతే మురిపిస్తున్నాడు.
మనసుకు వయసుండదు.
ప్రేమనే భావనకు వృద్ధాప్యముండదు.
నలభై ఐదేళ్ళుగా సహచర్యం చేస్తున్నా అతని మొహం నేనెరగను.
అతని విగ్రహం నా మనోఫలకం మీద ముద్రించుకు పోయింది.
నేను ఆరో తరగతిలో వుండగా మొదటిసారి అతను నన్నుఆరడీ పెట్టి గారడీ చేసాడు.
అతను అరెకరం వెడల్పున్న విశాలమైన వీపుగల ఆరడుగుల ఆజానుబాహుడు.
వెనక చొక్కా కాలరుని అలరిస్తూ ఒత్తయిన అతని నల్లటి క్రాపు నా గుండెల్లో గిలిగింతలు పెట్టేది.
ఒకానొక యద్దనపూడి నవలలో పరిచయమైన నవలా నాయకుడతడు.
ఒక్కోసారి రెండు చేతులూ ప్యాంటు జేబులో పెట్టుకుని దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ…
ఒక్కోసారి రింగులు రింగులుగా సిగరెట్టు పొగ వదులుతూ శూన్యంలో గజిబిజి ముగ్గులల్లుతూ…
అలా వెనుకనుండి అతని రూపం నా మనసులో పాతుకుపోయింది.
కలలోనైనా ఎదురుపడి నేనతని మొహం చూడాలనుకోలేదు.
కాని కలల నిండా అతని ఆ వెనుతిరిగిన రూపమే కలగాపులగంగా కలవరపెట్టేది.
అతనిని అదే ఫ్రేములో ఆరాధిస్తూ పదహారేళ్ళ పడుచుతనాన్ని సంతరించుకున్నాను.
నేనేమంత అందమైనదాన్ని కాదు.
కాని వయసులో వున్న కోతైనా అందంగానే కనిపిస్తుంది కదా.
అలా నేనూ అందంగానే కనిపించే దానిని.
నాది నవలా నాయికల్లా పాల మీగడ, గులాబి రేకలు కలగలిపిన పసిడి వన్నె కాదు.
అలాగని కాకంత కారు నలుపూ కాదు.
చామనఛాయగా వుండేదానిని.
నవలానాయకుడిని ప్రేమించటానికి నవలానాయికలా వుండటమే ప్రమాణము కాదనే నమ్మకంతో ఆ ఆరడుగుల ఆగంతడుడిని మనసా వాచా ప్రేమించాను.
ఇప్పటికీ ఐదు పదులు దాటినా ప్రేమిస్తూనే వున్నాను.
నాకు పదహారు నిండక మునుపే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టారు మా ఇంట్లో.
పెళ్ళి చూపుల్లో చామనఛాయయినా కళయిన మొహం అనుకున్నారు పెళ్ళివాళ్ళు.
ఆడపిల్ల అమ్మ కడుపులో పడే సరికే తనకొక మొగుడు పుట్టే వుంటాడుట.
అలా నా కోసమని స్వర్గంలో ముందుగానే నిర్ణయించబడ్డ మొగుడు పెళ్ళికొడుకుగా వచ్చాడు.
ఆడపిల్ల తలెత్తి చూడకూడదన్న హితవు చిన్నతనం నుండీ నరనరానా జీర్ణించుకు పోయి నా చూపులెప్పుడూ నేలని కొలుస్తూనే వుండేవి.
అతని మొహం నేను చూడనే లేదు.
వెళ్ళిపోతుండగా మాత్రం వెనుక నుండి చూసాను.
ఆరడుగుల పొడవూ లేడు. అరెకరం వీపూ లేదు.
చాలా నిరుత్సాహంగా అనిపించింది.
ధైర్యం చేసి గొంతు పెగుల్చుకుని ‘అతను సిగరెట్లు తాగుతాడా..’ అని మా మామయ్యను అడిగాను.
‘ఛఛా.. అలాంటి దుర్గుణాలు అస్సలు లేవ’ని సర్టిఫికెట్ ఇచ్చాడు మామయ్య.
నిలువునా నీరై పోయాను.
ఆడపిల్లల పెళ్ళంటే వాళ్ళ ఇష్టాయిష్టాల ప్రసక్తి కన్నా కుటుంబ పరువు ప్రతిష్ఠలు, ఇచ్చి పుచ్చుకోవటాల ప్రస్తావనా ప్రాముఖ్యతే ఎక్కువ.
నా ప్రమేయం ఏమీ లేకుండానే నా పెళ్ళి జరిగిపోయింది.
నిలువుగా గానీ అడ్డంగా గానీ ఏ కొలతలలోనూ నా ఆరడుగుల ప్రేమికుని విగ్రహంలో నా పతి దేవుడు ఇమడలేదు.
పాతివ్రత్యం వంశపారంపర్యంగా వస్తున్న ఇంట్లో పుట్టిన ఆడపిల్లని.
అయిష్టంగా ఆరడుగుల మూర్తిని మరుపు లోకి నెట్టి కట్టుకున్న ఐదడుగుల విగ్రహంలోనే నా ప్రణయ నాయకుడిని కనుగొందామని కంకణం కట్టుకున్నాను.
కలగన్న అర ఎకరానికి బదులుగా దక్కిన ఆ పది సెంట్ల మైదానంలో ఓ ప్రేమ మొలక నాటుదామని, అది పెరిగి పెద్దయి చెట్టయ్యాక ఆ నీడలో సేద తీరదామని తడి కోసం తడిమాను.
అదంతా చమ్మ ఎరుగని బీటలు వారిన ఎడారని తెలిసి నా గుండె చెరువై పోయింది.
గట్లు తెంచుకుని విజ్రుంభించిన ఆ ప్రవాహంలో నా నీతినియమాలు కొట్టుకు పోయాయి.
సరిగ్గా అప్పుడే సీత లక్ష్మణ రేఖ దాటింది.
ఆ రోజు మామయ్య హనీమూన్‌కి ఊటీకి టిక్కెట్లు బుక్ చేసాడు.
ఏసీ కోచ్ బస్సులో నా భర్త కిటికీ పక్కన కూర్చున్నారు. ఆ పక్కనే కూర్చున్న నేను మాగన్నుగా నిద్ర పట్టి అప్రయత్నంగా నా తలను ఆయన భుజం మీద వాల్చాను.
ఆయన తన చేత్తో నా తలను తోసేస్తూ ‘సీటు బ్యాకు పైన తలాన్చుకోవచ్చు కదా’ అని చిరాకు పడ్డారు.
ప్రేమంటూ వుండాలేగాని పూరి గుడిసెలో కటిక నేల పైన కూడా భార్యాభర్తలు ఒకరికి ఒకరు దిండూ పరుపులై పోవచ్చు.. చీరా పంచెలే దుప్పట్లుగా చుట్టుకోవచ్చు.
భుజం మీద తల ఆనిస్తే భరించని అప్పుడే పెళ్ళయిన భర్తను ఆశ్చర్యంగా చూసాను. ఇలా చిరాకు పడుతూ రుసరుసలాడుతూ ఊటీకి వెళ్ళి హనీమూన్‌లో వెలగపెట్టేది ఏముంటుందసలు..
అలాంటి మొగుడితో హనీమూన్ తలుచుకుంటే నవ్వొచ్చింది.
ఏడవ లేక నవ్వే నవ్వది.
తల నా సీటు వెనకకు వాల్చుకుని కళ్ళు మూసుకున్నాను.
సరిగ్గా అదే అదనుగా నా ఊహల్లో నుండి తరిమి కొట్టేసిన ఆరడుగుల నా చెలికాడు మా వంశ మర్యాదలను మంట గలుపుతూ నా ప్రమేయమేమీ లేకుండానే తిరిగి నా ఆలోచనలలోకి వచ్చేసాడు.
నా పెళ్లయ్యాక అతని పునః ప్రవేశం అదే మొదటిసారి.
నేను నిర్భయంగా నిర్లజ్జగా అతని అర ఎకరం ఛాతీ పైన తల పెట్టుకుని లతలా అతనిని వాటేసుకుని పడుకున్నాను.
ఏ అపరాధ భావన లేకుండా మధురమైన ఊహలతో హాయిగా నిద్ర పట్టేసింది.
అది మొదలు అతను తరచూ రావటం మొదలెట్టాడు.
అతని లాలనకు, చేసే గారానికి, చూపే ప్రేమకు పూర్తిగా బానిసనై పోయాను.
అలౌకికమైన మానసికానందానికి అలవాటు పడిపోయాను.
నేనూ నా భర్తా భౌతికంగా కాపురం చేస్తున్న దంపతులం.
ఒకే కప్పు కింద నివసిస్తున్న పరస్పర ప్రేమ లేని భార్యాభర్తలం.
అతను నా మానస ప్రియుడు.
అతనితో నా మానసిక దగ్గరితనం నాకెంతో ఊరటగా వుండేది.
ఒక రోజున బయటకు వెళ్ళిన నేను అనుకోకుండా ఇంటికొచ్చేసరికి చూడకూడని దృశ్యం నా కళ్ళబడింది.
నా భర్త మా పక్కింటావిడతో పకడ్బందీగా దొరికిపోయారు.
నాకేమీ బాధనిపించలేదు.
నా ఊహా ప్రియుడితో నేను స్వాంతన పొందగా లేనిది ఆయన తనకు నచ్చిన చోట తన కోరిక చల్లార్చు కోవటంలో తప్పు లేదనిపించింది.
ఆయనను నేను తప్పు పట్టలేదు.
మేమిద్దరం మా మా పద్దతుల్లో మా మా లోకాల్లో బ్రతకటానికి అలవాటు పడ్డాము.
నేను ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను.
ప్రేమకూ పిల్లలు పుట్టటానికి అస్సలు సంబంధం వుండదు.
ప్రేమ రాహిత్యంతో బాధపడే ఆయన పిల్లలకు తండ్రి ప్రేమ కూడా పంచి ఇవ్వ లేకపోయారు.
ఆ వెలితిని పూడ్చటానికి నేనే అమ్మను నాన్నను కావలసి రావటంతో కన్నప్రేమలో తలమునకలై నా ఆరడుగుల ప్రియుడిని మరుగున పడేసాను.
రెక్కలొచ్చిన ఎదిగిన పిల్లలు గూడు వదిలి ఎగిరిపోయారు.
అంతవరకూ పిల్లల భవిష్యత్తుకి ఇటుకలు పేర్చటంలో తలమునకలైన నేను అకస్మాత్తుగా ఒంటరినై పోయాను.
ఒంటరితనంలో నేను మరుగున పడేసిన నా ప్రియుడి ఆలంబన మళ్ళీ అవసరం అయ్యింది.
అస్వస్థతగా వున్నప్పుడు ఆ ఊహల కౌగిలి నాలోకి మరీ మరీ ఊపిరి ఊది ప్రాణం నిలిపేది.
ప్రేమ ఎంత మధురం. అసలా భావనే మధురాతిమధురం.
ప్రేమ మాధుర్యాన్ని నేను ఆసాంతమూ సంతృప్తిగా అనుభూతిస్తూంటాను.
ఓ అర్ధరాత్రి ఇంటికి తిరిగి వస్తూ నా భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు.
భౌతికంగా ఆ ఇంట్లో మసిలే ఒక్క తోడు నాకు దూరమయ్యింది.
నా స్నేహితులు ఒకరిద్దరు మళ్ళీ పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చారు.
నాకు మనోబలాన్ని ఇచ్చే నా ప్రియమైన ఊహాత్మక తోడు నాకుండగా వేరే పెళ్ళి ఎందుకని ఒంటరిగా వుండిపోయాను.
నా ప్రియుని ప్రేమాలాపనలో ఉక్కిరిబిక్కిరయ్యే నేను ఆ తాదాత్మ్యాం తట్టుకోలేనప్పుడు నాకు ఒక ఔట్లెట్ అవసరమయ్యింది. అది నా కలం రూపంలో కరుణించింది.
ఇప్పుడు నా ఊహల్లో నేను గ్రోలే ప్రేమామృతాన్నంతా కలం లోకి ఒంపి కవిత్వంగా మలుస్తున్నాను.
మొగుడూ మొద్దులూ లేని ఐదు పదుల నాకు ప్రేమ పైత్యమేమిటని ఆ పిచ్చి కవిత్వమేమిటని నలుగురూ నాలుగు విధాలుగా చెప్పుకుంటున్నారు.
అవేమీ పట్టని నేను నా ప్రియుని ప్రేమలో మునిగి తేలుతూ ఆ ప్రేమలో సమైఖ్యమౌతుంటాను.
ఎటు చూసినా తనే.. నా ఎదురుగా…నా పక్కనా…నాలోనూ… నా చుట్టూరా..
ఇటు అటు ఎటు చూసినా తనే…
నేను అలౌకికానందాన్ని ఆస్వాదిస్తూ ప్రేమ తత్వాన్ని శ్వాసిస్తూ ప్రేమ కావ్యాలల్లుతున్నాను.
ఇప్పుడీ లోకం నా ప్రేమకు మూలపురుషుడెవరని భౌతిక సంబంధాలను శోధిస్తోంది.
ఎవరితో మాటాడినా వారిలో నా ప్రియుడిని వెతుకుతోంది.
నాకు అక్రమసంబంధాన్ని అంటగడుతోంది.
అనుమానపు చూపుతో నా శీలాన్ని శంకిస్తోంది.
అసలీ సమాజంలో స్త్రీ ప్రేమను అర్థం చేసుకునేదెవరు…
కనీసం నన్ను ఊహల్లో కూడా నాకు నచ్చిన విధంగా బ్రతకనీయని ఈ సమాజాన్ని నేనెందుకు లెక్క చేయాలి..
ఈ సమాజం కోసం ఈ చీకటి జీవితంలో పరుచుకున్న వెన్నెల లాంటి ఊహల ఊతం వదులుకుంటే నేను అసలు బ్రతికేదెలా…
ఈ లౌకిక జనం చేసే నిందారోపణలకు నాలో నేను గుంభనంగా నవ్వుకుంటుంటాను.
(మళ్ళీ కలుద్దాం)

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
38 Comments
Padmapadmapv
నో మోర్ వర్డ్స్.. అంతే! రాయడానికి.
, ఒక వ్యక్తి మనోభావాలు ని, కథ గా మలచి రాసిన మీకు. ప్రేమ పూర్వక అభివందనాలు
ma’am.
Jhansi koppisetty
Thanks a lot పద్మగారూ

డా కె.ఎల్.వి.ప్రసాద్
ప్రేమ,ప్రియుడు _మొగుడు,సంసారం వీటి మధ్యలో
స్త్రీ పడే వ్యథ,ఆవేదన,ఆలోచన వంటి విషయాలను
ఈ ఎపిసోడ్ లో వివరంగా చర్చించారు రచయిత్రి.
భార్యాభర్తల ఆలోచనా విధానం ఒకేలా వుండి తమ సంసారాన్ని ప్రేమ మందిరం గా ,మార్చు కున్న వాళ్ళు, ఆ ఆనందాన్ని ఆస్వాదించే వాల్లూ మన సమాజంలో బహు తక్కువ. అలా కలసి రావడం బహు అరుదుగా చూస్తాం.
అయితే..బయటకి కనిపించే ది అంతా బూటకమే!
మంది కసం విచిత్రమైన వేషాలు మనం చూస్తాం అంతే!
జీవిత సత్యాన్ని బాగా వివరించారు. అభినందనలు.
Jhansi koppisetty
మీ లోతైన ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు డాక్టరు గారూ


సిహెచ్.సుశీల
ఆరడుగుల అందమైన ప్రేమికుడిని మనసు పొరల్లోపలికి నెట్టేసి, కట్టుకున్న వాడినీడలో సేదదీరాలనుకొని ‘తడి’కోసం వెదుక్కోవడం, అరసికుడితో హనీమూన్… దారుణమైన – ఎందరో స్త్రీలు మనోగతాన్ని స్పష్టంగా చెప్పిన మీ స్వచ్ఛమైన మనసుకి అభినందనలు ఝాన్సీ గారు!
Jhansi koppisetty
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సుశీలగారూ

రవిచంద్
ప్రేమకు వయసు, భౌతిక రూపంతో సంబంధం లేదు అని తెలిపే మీ వివరణ అద్భుతంగా ఉంది :౼రవిచంద్ మైనంపాటి
Jhansi koppisetty
Thank you Ravi

రవిచంద్
ప్రేమకు వయసు, భౌతిక రూపంతో సంబంధం లేదు అని తెలుపుతూ సంప్రదాయ కుటుంబం లో జన్మించిన ఒక స్త్రీ తన మనసులోని భావాలను బయటకు తెలుపలేక ఊహల్లో జీవించే కథా విషయం అద్భుతమైనది.
:౼రవిచంద్ మైనంపాటి
Jhansi koppisetty
Very happy for your understanding రవిబాబు

Jhansi koppisetty
నా గొంతు విప్పిన గువ్వను ధారాళంగా వినిపిస్తున్న సంచిక యాజమాన్యానికి ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు


Sambasivarao Thota
Jhansi Garu!
Nizamaina Prema entho goppadandi..
Aa premaku antham anedi vundadu..
Meeru cheppinatlugaa…
Prema entho madhuram kadaa..
Ade theliyajesindi ee mee episode..
Abhinandanalu Meeku
Jhansi koppisetty
మీకు నా ధన్యవాదాలు సాంబశివరావు గారూ

Jhansi koppisetty
ఊహల ఆసరాను కూడా ఓర్వలేని ఈలోకంతో నిజంగా పనిలేదు ఝాన్సీ డియర్..
నవ్వుకోవాల్సిందే మనసారా
…..శోభా రాజు
Jhansi koppisetty
Yes శోభా డియర్…You are right


Jhansi koppisetty
“చీకటి వెన్నెల”- ఒక విరోధాభాస
“ఊహాప్రియుడి ఆరాధన”- ఒక
అవాస్తవ ప్రణయం.
సమాజం హర్షించని ప్రేమ కథ.
సాహిత్యం ఆమోదించిన
మనోజ్ఞ గాథ.
రచయిత్రి గురించి చెప్పాలంటే చర్విత చర్వణం ఔతుందేమో నని భయం. ఆమె రచనా శైలి అమోఘం.
అధివాస్తవికతకు దర్పణం.(surrealism)
…..Lakshmi narayana Rao Bitra
Jhansi koppisetty
Thanks a lot Bitra garu for your nice comment

Jhansi koppisetty
కధ చాలా బాగా వ్రాసారు,వాస్తవానికి అతి దగ్గరగా ఉంది.all the best medam
…. Nageswararao Kamana
Jhansi koppisetty
ధన్యవాదాలు నాగేశ్వరరావు గారూ….
మొహమ్మద్. అఫ్సర వలీషా
మన మనసు వెన్నెలంత తెల్లగా స్వఛ్ఛంగా ఉన్నప్పుడు బయటి ప్రపంచానికి ఎలా ఉన్నా తప్పు పడుతున్నప్పుడు మన మనసు చెప్పేదే నిజం. ఎన్నో జీవితాలను తాకుతున్నది మీరు వ్రాసే జీవన సజీవ సత్యాలు ఝాన్సీ గారు. ఎందరో ఆడవారు ఊహలను కూడా ఊయల చేసి ఊపలేని నిర్భాగ్యులున్న సమాజం మనది


















స్త్రీ మనోభావాలకు ధైర్యపు తొడుగులు పట్టే మీ రచనలు సూపర్బ్ స్ఫూర్తి దాయకం ఆదర్శ పూరితం .ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీ గువ్వ పలికే మరో ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ శెలవు ఝాన్సీ గారు
Jhansi koppisetty
Thank you so much Valisha dear for such a nice comment
Jhansi koppisetty
[21/2, 8:20 pm] Sydney Srinivas: Nijame..Chala Mandi jeevitalloni rendo konam…Baga rasaru…
Jhansi koppisetty
Thank you Srinivas…
Jhansi koppisetty
పురాణ, ఆధ్యాత్మిక, భక్తి అనే అంశం కూడా ఈరకమైన ప్రేమను ఆమోదించింది
……Venugopal Naidu
Jhansi koppisetty
మీ స్పందనకు ధన్యవాదాలండీ వేణుగోపాల్ గారూ…
Sagar
ఉన్నది ఉన్నట్లుగా ఒక మహిళ అంతరాలలో నిలిచిన ఆవేదనను , ఆత్రుతనూ రచనలో స్పష్టంగా వివరించారు. నిజమే ఊహలలో విహరించినా, వ్యభిచరించినా తప్పుపట్టే సమాజానికి దూరంగ ఒక మహిళ కలంతో చేసిన స్నేహం అధ్భుతమే మేడం. మీ కలం నుంచి జాలువ్రాలేది ముత్యాలు కాదు. అధ్భుతాలు. మీకు అభినందనలు
Jhansi koppisetty
కలం నుండి జాలువారేవి ముత్యాలు కావు…అద్భుతాలు.. wonderful comment Sagar garu… You made my day


రమేష్ చెన్నుపాటి
మనస్సుకు వయస్సూ.. ప్రేమ భావనకు వృద్దాప్యమూ లేనీ..
అనుభూతి తాధ్మయానికి, భౌతిక శరీరపు అవసరమూ రాని.. ప్రేమని..
గెలుచుకొచ్చాక, ఆ అభౌతికతలోని అసాధారణ అలౌకికతని ఎవరైనా చూపెట్టమంటే.. మనం చూపెట్టొచ్చు.
అదీ ఎవరికీ.. నేనూ నా జీవితంలో ఏదో ఓ పూట.. ఏదో ఓ సందర్భంలో.. అటువంటి అనుభూతికి లోనయ్యానని ఒప్పుకోగలిగిన వారికి మాత్రమే.
అయినా.. మనమిచ్చే సమాధానానికి
సమాధానపడలేని ప్రశ్నలు ఉద్దేశ్యమే వేరైనప్పుడు..
ఆ ప్రశ్నలకి ఎండమావుల్లోని ఎండంతా విడగొట్టి తేమ తీసిచ్చినా.. నీ దోసిట్లోది నీరే కాదంటారు.
అటువంటి వారికి ఇంకేమీ చెప్పాల్సిన అవసరమే లేదేమో..
సీరామ్
Jhansi koppisetty
ఎంత చక్కగా విడమర్చి వివరించావు తమ్ముడూ… స్త్రీ హృదయాన్ని అర్ధం చేసుకునే మీలాంటి సత్పురుషులు పదికాలాలు చల్లగా వుండాలి
Jhansi koppisetty
Jhansi garu, I read it now it is so touching.
sorry but that’s how the lines touched me and shook me up for a moment
Could very well connect with some or most of it…Nijja jeevitha prayanam.
Does the ending should be like this can’t there be any other way…
Why should woman always suffer due to the society or parents or so called husband or in law’s
Manaku antu oka life or moments in that life kavali anukodam thappa
……Neelu MK
Jhansi koppisetty
Neelu dear, that’s the optionless ending given by my generation women….Now present generation like you are very bold and can give great ending

Present generation is a step ahead in taking self decisions, choosing life they want, enjoying freedom…
Lalitha
Wow.. ఎక్సలెంట్ ఝాన్సీ గారు..



ఒక స్త్రీ హృదయాన్ని.. జీవితాన్ని అక్షరాలో ఆవిష్కరించారు.
Jhansi koppisetty
ధన్యవాదాలు లలితగారూ
Jhansi koppisetty
Lovely
. Oohalentha మధురం..
….స్వర్ణ కిలారి
Anand KK
Imagination is the greatest hearrt of the soul.. and


Imagination is the greatest soul of the art..
Excellent write-up Jhansi garu..
Jhansi koppisetty
Thank you Anand garu

P.Vijayalakshmipandit
అంత పరిణితి చెందిన మనసున్న మనుషులే
అలౌకిక మానసిక ప్రేమనర్థంచేసుకోగలరు.
ప్రేమకు వయసుతో పనిలేదు ప్రేమ మనసుకు సంబంధించిన అలౌకిక దివ్య భావన .
Beautiful narration of your feelings …Jhansi
అంత పరిణితి చెందిన మనసున్న మనుషులే
అలౌకిక మానసిక ప్రేమనర్థంచేసుకోగలరు.
ప్రేమకు వయసుతో పనిలేదు ప్రేమ మనసుకు సంబంధించిన అలౌకిక దివ్య భావన .
Beautiful narration of your feelings …Jhansi
Jhansi koppisetty
అంత పరిణితి చెందిన మనసున్న మనుషులే
అలౌకిక మానసిక ప్రేమనర్థంచేసుకోగలరు.
ప్రేమకు వయసుతో పనిలేదు ప్రేమ మనసుకు సంబంధించిన అలౌకిక దివ్య భావన .
Beautiful narration of your feelings …Jhansi
…. Palavali Vijayalakshmi Pandit