ఆ పది రోజులు…
భారీ ఎత్తున జరగబోయే సివిల్ మిలిటరీ లయేజన్ కాన్ఫరెన్స్ కోసం ఆ రోజున మా ఆఫీసులో స్టెనో డిటైల్మెంట్ జరుగుతోందని తెలిసింది. ఆ విషయం విన్నప్పటి నుండీ నాలో ఏదో అలజడి. ఎందుకంటే నా పాత కమాండెంట్ పోస్ట్ అవుట్ అయి కొత్త కమాండెంట్ ఇంకా రిపోర్ట్ చేయక, నేను ఖాళీగా వున్నాను. నన్ను పంపుతారేమోనన్న అనుమానంతో నాకు కలవరంగా వుంది.
నా అనుమానాన్ని నిజం చేస్తూ పది రోజుల్లో జరుగబోయే సివిల్ మిలిటరీ లయేజన్ కాన్ఫరెన్స్‌కి కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ నోట్ చేసుకోవటానికి అనుభవమున్న స్టెనోనంటూ నన్ను ఎంపిక చేసారు.
ఇదివరకు నేను సీనియరునైనప్పటికీ కమాండెంట్ ప్రైవేటు సెక్రటరీనైన నా వైపు కన్నెత్తి చూడటానికి భయపడేవారు. ఇప్పుడు బాస్ బదిలీ అయిపోవటం, కొత్త బాస్ ఇంకా రిపోర్ట్ చేయకపోవటంతో ఖాళీగా వున్న నన్ను పంపుదామని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీర్మానించారు. అందుకు నాకు సమర్థురాలినన్న విశేషణం తగిలించారు.
ఆ డిటైల్మెంట్ జరిగినప్పటి నుండీ నన్ను తెలియని భయం ఆవహించింది. షార్ట్‌హాండ్‌లో కనీసం ఒక్క వాక్యం రాసి రమారమి ఇరవై ఏళ్ళయ్యుంటుంది. ఇన్నేళ్ళ సర్వీసులో నేను చూసిన అనేకులలో ఏ ఒక్క కమాండెంట్ ఒక్క చిన్న డిక్టేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. అన్ని పర్సనల్ లెటర్స్‌కి, అఫిసియల్ లెటర్స్‌కి నేనే డ్రాఫ్ట్ రిప్లై తయారు చేసి పెట్టడం అలవాటయిపోయింది. కొన్ని వెంటనే అప్రూవ్ అయ్యేవి. కొన్నింటిలో కొద్దిపాటి మార్పులు చేర్పులు జరిగేవి. కొందరు స్వదస్తూరితో డ్రాఫ్ట్ రాసి ఇచ్చేవారు. అలా నాకు షార్ట్‌హాండ్ స్ట్రోక్స్‌తో పూర్తిగా అలవాటు తప్పిపోయింది.
కాన్ఫరెన్స్ హాజరు పట్టిక చూసిన నా పై ప్రాణాలు పైకే ఎగిరిపోయాయి. సివిలియన్స్ తరపున ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుగారు, జిల్లా కలెక్టర్లు, తహసిల్దార్లు, రెవెన్యూ అధికారులు, డీజీ, పోలీసు కమీషనర్లు, మునిసిపల్ కమీషనర్లు, బేగంపేట ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాఫిక్ కంట్రోలింగ్ అధికారులు, కంటోన్మెంట్ ఆఫీసర్లు, ఇతర సివిల్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన ఐఏయస్ అధికారులు హాజరవుతూండగా ఆర్మీ తరపున సబ్ ఏరియా జనరల్ ఆఫీసరు, మద్రాసు నుండి GOC ATNKK & G ఏరియా (అప్పటి ఉమ్మడి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ మరియు గోవాల కమాండింగ్ జనరల్ ఆఫీసరు) పూణే నుండి జనరల్ అధికారి మరికొందరు హై ర్యాంకు ఆఫీసర్లు హాజరవుతున్నారు.
ప్రస్పుటంగా బయటకు కనబడుతున్న నా కలవరాన్ని చూసిన మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు “ఇంత అనుభవమున్న మీరే అంతలా కంగారు పడితే ఇంక వేరే కొత్త స్టెనోల పరిస్థితి ఏమిటి..” అన్నారు.
అతనికి తెలియని విషయం ఏమిటంటే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు అంతవరకూ చేసిన ఉద్యోగ ప్రవేశ పరీక్షల కోసం షార్ట్‌హాండ్ పూర్తి స్థాయి ప్రాక్టీసులో వుంటారు. నేను పాతికేళ్ళ నుండీ ఆ అవసరం లేక, ఎప్పుడూ రాక, పూర్తిగా సబ్జెక్టు టచ్ కోల్పోయాను. ఇవన్నీ నేను అతనికి విడమర్చి చెప్పలేను. అయినా నా అప్పాయింట్మెంటే స్టెనో అయినప్పుడు నేను చెప్పే కారణాలు అర్ధరహితం.
అతను నా మీదున్న అభిమానంతో గత సంవత్సరపు సివిల్ మిలిటరీ లయేజన్ కాన్ఫరెన్స్ మినిట్స్ స్టడీ చేయమని నాకు పంపించారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య జరుగుతున్న చర్చలు, ఏకాభిప్రాయానికి రాని విషయాలు, ఇంకా పరిష్కారం పొందని సమస్యలు, గత సంవత్సరం కొత్తగా ఉత్పన్నమయిన తాజా అంశాలు వగైరాలన్నీ పొందుపరిచి వున్నాయి అందులో.
అవన్నీ చదవటం పూర్తయ్యేసరికి ముచ్చెమటలు పట్టాయి. జరగబోయే కాన్ఫరెన్స్‌లో ఈ పాత అంశాల పైన ఎంత పురోగతి సాధించారన్న పాయింట్లన్నీ, ఒక్కోసారి రెండు పార్టీల మధ్య జరిగే వాగ్యుద్ధాన్ని నేను యధాతధంగా నోట్ చేసి మినిట్స్ తయారు చేసుకుని టైపు చేసి ఇవ్వాలి. వారు మాటాడుకున్నంత స్పీడులో నేను నోట్ చేసుకోలేక ఏదైనా పాయింట్ మిస్ అయితే అక్కడ నేను పెద్ద ఫెయిల్యూర్ని, నా పాత్ర అట్టర్ ఫ్లాప్. ఒక్కసారిగా వెన్నులోంచి వణుకు పుట్టింది.
ఆఫీసు అయ్యాక ఇంటికి వచ్చానన్న మాటే గాని తెలియని అస్థిమిత, అసలు ఏమి చేయాలో అర్ధం కాని కన్ఫ్యూజన్. వంట ధ్యాస, ఇంటి ధ్యాస, పిల్లల ధ్యాస లేదు. మనసు నిలకడగా లేదు.
ఆ రాత్రి మంచం పైన పడుకున్నానే గాని నిద్ర పడితే ఒట్టు. దాదాపు పాతికేళ్ళ సర్వీసు పూర్తి చేసినా ఏనాడూ ఎదురవని పరీక్ష, ఎప్పుడూ అనుభవించని కలకలం అది.
ఆ క్షణం నుండి షార్ట్‌హాండ్ టెక్స్ట్ బుక్ అర క్షణం వదిలింది లేదు. పొడవయిన ఫ్రేజస్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకున్నాను. ఏ పని చేస్తున్నా కళ్ళ ముందు అలికేసిన ఉర్దూ లిపిలా షార్ట్‌హాండ్ స్ట్రోక్స్ ప్రత్యక్షమయ్యేవి. కళ్ళు మూసినా తెరిచినా అర్ధం తెలియని సంక్రాంతి ముగ్గులా గీతలు, చుక్కలు, ఒంపులు, మెలికలు, దీర్ఘాలు, ముళ్ళు…
ఆఫీసులో ఎవరు ఏమడిగినా జవాబు ఇయ్యటం మరిచిపోయి, వారన్న మాటలను బుర్రలో షార్ట్‌హాండ్ లోకి తర్జుమా చేసుకునేదాన్ని.
అందరూ నేను పరధ్యానంగా వుంటున్నానని “ఒంట్లో బాలేదా… ఏమయినా ప్రాబ్లమా..” అంటూ పలకరించేవారు.
వాళ్ళ అనుమానాలకు తోడు నా వాలకం కూడా కొంత మారిపోయింది. ఎప్పుడూ ఫ్రెష్‌గా లైవ్లీగా నవ్వుతూ తుళ్ళుతూ వుండే నేను అస్తవ్యస్తంగా కనిపిస్తూ నాకు వినిపించే ప్రతీ ఆంగ్ల వాక్యాన్ని చేతి వేళ్ళతో గాలిలో షార్ట్‌హాండ్ లోకి తర్జుమా చేసుకుంటూ స్నేహితుల్లో అనుమాన బీజాలు నాటాను.
కనిపించిన వారికల్లా ఎదురుగా వున్న ఇంగ్లీషు న్యూస్‌పేపర్ చేతికి ఇచ్చి ఏదో ఒక వార్త స్పీడుగా డిక్టేషన్ ఇమ్మనేదానిని. ఇంట్లో ఆఖరికి పిల్లలతో సహా ఇంగ్లీషు చదవ గలిగే ఏ ఒక్కరినీ వదల లేదు.
మా ఇంట్లో అద్దెకున్న ఒక బ్యాచిలర్ ఇంగ్లీషులో అనర్గళంగా మాటాడేవాడు. అతను డిక్టేషన్ ఇస్తే నేను ఎంత స్పీడులో షార్ట్‌హాండ్‌లో రాయగలనో తెలుసుకోవచ్చని ఆ విధంగా మంచి ప్రాక్టీసు అవుతుందని అనిపించింది. అతని ఆఫీసు అయ్యాక, సివిల్స్ ప్రైవేటు క్లాసులు అయ్యాక, డిన్నర్ పూర్తి చేసుకుని రాత్రి పది దాటాకే రూముకి వచ్చేవాడు. ఆ రాత్రప్పుడు అతని కోసం కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూసేదానిని.
మా ఇంట్లో డిస్టర్బెన్స్ కారణంగా అతను వచ్చీ రావటమే నా షార్ట్‌హాండ్ నోట్ బుక్కు, పెన్సిలుతో ఆ రాత్రి వేళ అతని రూముకి వెళ్ళేదాన్ని. అతనితో పన్నెండు దాటే వరకూ డిక్టేషన్ తీసుకునే దాన్ని. నన్ను చాటుగా గమనించే పొరుగింటి ఆడంగులు చెవులు కొరుక్కునేవారు. మొగుడు ఇంట్లో వుండగానే రాత్రుళ్ళు బ్యాచిలర్ రూముకు వెళ్తున్నానని వారి చపలత్వానికి తృప్తినిచ్చే కథలు అల్లుకునేవారు.
నాకు రాత్రింబవళ్ళు షార్ట్‌హాండ్ ధ్యాస తప్ప ఎవరేమనుకున్నా పట్టేది కాదు. ఆఖరికి భోజనం చేస్తూ కూడా కంచంలో అన్నం మధ్య వేళ్ళతో స్ట్రోక్స్ వేస్తుండేదాన్ని.
కాన్ఫరెన్స్ డే దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరుగుతూ వచ్చింది. ఏదయినా ముఖ్యమైన విషయ చర్చలో ఏ పక్క ఏ పాయింటు మిస్ అయినా నా పరిస్థితి ఏమిటని ఒకటే అలజడిగా వుండేది. ఆ ఆలోచనకే గుండె దడదడలాడుతూ నన్ను కంగారు పెట్టేది. నాది ఒట్టి విగ్రహ పుష్టి, చూపులకే తప్ప నాకు వర్క్ నాలెడ్జి లేదనుకుంటారేమోనని ఆందోళనగా కలవరంగా వుండేది.
ఆ పది రోజులు పది యుగాల్లా గడిచాయి. ఆఖరికి ఆ డీ డే రానే వచ్చింది. పది రోజులుగా నన్ను నిలకడ లేకుండా గడగడలాడించిన ఆ కాన్ఫరెన్స్ రోజు నాకు తప్ప అందరికీ మామూలుగానే తెల్లవారింది. ఆ సమయంలో నా ఈసీజీ గనుక తీసి వుంటే ఆ రిపోర్ట్ నేను ప్రాక్టీసు చేస్తున్న షార్ట్‌హాండ్ స్ట్రోక్స్ లాగే గజిబిజిగా ఏ డాక్టరుకి అర్ధం కాకుండా వుండేది.
“గణేశా, నువ్వే నన్ను ఆవహిస్తావో, ఏదయినా అనన్య సామాన్యమైన మేధాశక్తిని నా బుర్రలోకి జొప్పిస్తావో నాకు తెలియదు. నేను మొత్తం కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ ఒక్క అక్షరం పొల్లు పోకుండా నోట్ చేసుకునేట్టుగా చూడు తండ్రీ.. నీదే బాధ్యత” అంటూ విఘ్నేశుని పూజ చేసుకుని బయిలుదేరాను.
కాన్ఫరెన్స్ హల్కి వెళ్ళే దారంతా సాధారణ జనప్రవాహ నిషేధంతో టైట్ సెక్యూరిటీతో సాయుధ ఆర్మీ పేట్రల్లింగ్తో నన్ను మరింత భయపెట్టింది. నా గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినిపించింది.
AOC సెంటర్లో అంత పెద్ద కాన్ఫరెన్స్ హాలు నేను చూడటం అదే ప్రధమం. వివిధ కేటగరీ విఐపీలకు ప్రోటోకాల్ ప్రకారంగా సీటింగ్ ఏర్పాటు చేసారు. వారి వారి స్థానాలకెదురుగా వాళ్ళ నేమ్ ప్లేట్లు, వాటర్ బాటిల్స్, కాన్ఫరెన్స్ సంబంధిత ఇతర సామగ్రి పెట్టి వున్నాయి. ఓ ప్రక్కగా కొంచం ఎత్తుగా స్టెనో ప్లేటుతో నా సీటింగ్ ఏర్పాటు చేసారు. నేమ్ ప్లేట్ల పైనున్న ఒక్కొక్కరి పేరు, అధికారిక హోదా చదివే కొద్దీ నాలో భయం పెరిగి నా బీపీ పెరిగిపోసాగింది.
క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు, బ్యాటుతో బ్యాట్‌మాన్ అటెన్టివ్ పొజిషన్‌లా, రన్నింగ్ రేసు మొదలయ్యే ముందు రన్నర్ ఓ కాలు ముందుకు సాచిన అప్రమత్త భంగిమలా, కాన్ఫరెన్స్ నిర్ణీత సమయానికి ముందే నా ఒళ్ళంతా చెవులు మొలిచి వేళ్ళ మధ్య పెన్సిల్ సిద్దమైంది.
ఒక్కొక్కరుగా ఆహ్వానితులందరూ విచ్చేసారు. వణుకుతున్న వేళ్ళ మధ్య పెన్సిలుతో కళ్ళెత్తి విఐపీల వంక చూసాను. చిత్రంగా అందరి పెదవులు పైకి కిందకి కదులుతున్నట్టు, ఎడమకి కుడికి సాగుతున్నట్టు కనిపించాయి. అదేమిటి అందరూ ఒకేసారి గందరగోళంగా మాటాడేస్తున్నారు… నేను ఎవరి మాటలను నోట్ చేసుకోవాలి…
ఒక్కసారిగా కాకులగోలతో నా చెవులు చిల్లులు పడ్డట్లనిపించింది. పెన్సిల్ వదిలేసి రెండు చెవులు గట్టిగా మూసుకున్నాను.
పది రోజుల ప్రయాస వృధా అయిపోయింది.. నా పరువు గంగపాలు అయిపోయింది.
ఇప్పుడు నా అసమర్థత పర్యవసానమేమిటి…?
మూసుకున్న చెవులకు మృదువుగా, స్పష్టంగా ఏదో వినిపించటం మొదలెట్టింది. అప్పటివరకూ స్తబ్దుగా మారిన మెదడు చురుకుగా పని చేయటం మొదలెట్టింది.
యస్, కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులందరికీ సాదర ఆహ్వానం పలుకుతూ మొదలయిన ఓపెనింగ్ స్పీచ్.
వెంటనే మాటాడే వ్యక్తి ముందున్న నేమ్ ప్లేట్లో అతని పేరు చూసి పెన్సిల్ అందుకుని గబగబా రాయటం మొదలెట్టాను. అతను చాలా నిదానంగా కుదురుగా మాటాడుతున్నాడు. నా స్ట్రోక్స్ స్మూత్‌గా ఫ్లో అవుతున్నాయి. నిజానికి లాంగ్ హ్యాండ్లో కూడా రాసుకునేంత వీలుగా వుందా స్పీడు. క్రమంగా నాలో దడ తగ్గింది.
గొంతు మారినప్పుడల్లా ఎవరు మాటాడుతున్నదీ తలెత్తి చూసి కన్ఫ్యూజన్ లేకుండా నా కలం చకచకా రాసుకుపోయింది. కొన్ని ప్రశ్నలకు జవాబుగా కొందరు తల పంకించిన సందర్భాల్లో తల నిలువుగా ఊపారా, అడ్డంగా ఊపారా అన్నది ఆ పై జరిగిన సంభాషణతో ఊహించి రాసుకోసాగాను.
ఎక్కడయినా స్ట్రోక్ పడని చోట పదాన్ని లాంగ్ హ్యాండ్లో రాసుకుంటూ, మధ్య మధ్య ఇచ్చే విరామాల్లో ఆలస్యం చేయకుండా మిస్ అయిన మ్యాటర్ పూరించుకుంటూ, దాదాపుగా తొంభై ఎనిమిది శాతం కరెక్ట్‌గా మొత్తం ప్రొసీడింగ్స్ నోట్ చేసుకున్నాను. ఐదింటికల్లా కాన్ఫరెన్స్ పూర్తయ్యింది.
మరో గంటా రెండు గంటలు కూర్చుని తప్పులు ఏమయినా దిద్దుకుందామనుకుంటుండగా ఎవరో నన్ను పక్కనున్న మరో సౌండ్ ప్రూఫ్ గదిలోకి పిలిచారు.
ఎందుకు అయి వుంటుందోనని ఆందోళనతో బితుకు బితుకుగా వెళ్ళాను. అక్కడ ఒక కుర్చీ, టేబుల్, టేప్ రికార్డర్, కంప్యూటర్, ప్రింటర్ అన్నీ అమర్చి వున్నాయి.
ఒక వ్యక్తి నా చేతికి ఒక సీడీ ఇచ్చి “మేడం, మొత్తం కాన్ఫరెన్స్ రికార్డు చేసాం ఇందులో. దీనిని ప్లే చేసి, అవసరమయితే రివైండ్ చేసుకుంటూ విని, మీరు రాసుకున్నది సరి చేసుకుని కంప్యూటర్లో టైపు చేయండి. మీకు వాటర్, టీ, స్నాక్స్ ఏమి కావాలన్నా ఈ బజర్ నొక్కండి. అటెండర్ తెస్తాడు. ఇవాళ అయినంతవరకే చేయండి. తొందర ఏమీ లేదు. రేపు, ఎల్లుండి కూడా మీరు ఇక్కడికే వచ్చి మినిట్స్ ఎల్లుండి కల్లా రెడీ చేయండి.” అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని వెనుకే తలుపులు మూసుకుపోయాయి.
నేను ఆశ్చర్యపోతూ పది రోజులుగా నేను ఇంత హైరానా పడింది ఈ మాత్రానికేనా అనుకుని రిలీఫ్‌గా నిట్టూర్చి ఆ సీడీని టేప్ రికార్డరులో పెట్టి ఆన్ చేసాను.
మృదువైన స్పష్టమైన గొంతుతో మంద్రస్థాయిలో ఓపెనింగ్ స్పీచుతో తిరిగి కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యింది.
(మళ్ళీ కలుద్దాం)

ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
22 Comments
మొహమ్మద్. అఫ్సర వలీషా
చక్మంని చిక్కని మంచి మంచి ఉపమానాల తో సంధర్భోచితంగా వ్రాసి మమ్మల్ని టెన్షన్ పెట్టిస్తూ చదివించినా చివరికి ఈ ఝాన్సీ బాయినే గెలుస్తుందనే ఓ ప్రగాఢ విశ్వాసం నాలో . అసలు కాన్ఫరెన్స్ ఎలా ఉంటుంది అక్కడ ఏఏ అధికారులతో కూడి ఉంటుంది అన్న విషయాలు భలే క్లుప్తంగా చెప్పారు.మీ గణేష్ షుడే మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని రక్షించాడు. నిజంగా మీ ధైర్య సాహసానికి హాట్సాఫ్ .చక్కని రచనలతో అలరిస్తూ ఆనందింప చేస్తున్న మీ గొంతు విప్పిన గువ్వ అద్భుతం హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ఝాన్సీ గారు














Jhansi koppisetty
Thank you so Much వలీషా డియర్

Jhansi koppisetty
నా గొంతు విప్పిన గువ్వను ధారాళంగా వినిపిస్తున్న సంచిక యాజమాన్యానికి ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు


sagar
మొదటినుంచి మీరు వ్యక్తీకరిఃచిన తపన అంతా వృత్తిపై మీకున్న నిబద్దతను తెలియచేస్తుంది. చివరకు మీకు ఆ ప్రత్యామ్నాయం లేకున్నా మీరు విజయవంతంగా పూర్తిచేశారు. ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు మీరు చేసిన పనికి మెరుగులు మాత్రమే దిద్దింది అని నా అభిప్రాయం మేడమ్ . వృత్తిలో నిబద్దత ఏవిదంగా ఉండాలో వివరించిన అపురూప రచన ఇది. మీకు ధన్యవాదములు మరియు అభినందనలు
Jhansi koppisetty
ధన్యవాదాలు సాగర్ గారూ… మీ ఆలోచనాకోణం నాకు నచ్చింది…Thank you so much
Jhansi koppisetty
అమ్మా మీరు కవి కుల గురువు కాళిదాసు గారికి గురువులా? శిష్యులా? ఏమీ రచనా చాతుర్యము ఏమా అద్భుత ఉపమానములు. మీకేమో గాని పాఠకుల్లో గుండె దడ పెంచుతూ రక్తనాళాల్లో ప్రవాహ వేగం జెట్ వేగాన్ని ఎప్పుడో దాటింది, ఎంత చక్కని మానసిక విశ్లేషణ, ఇది ఊహ, కల్పనా చాతుర్యం కాదు. అక్షరరూపం దాల్చిన వాస్తవం, ఝాన్సీ గారి భయోత్పాదక మానసిక అనుభవ సంఘర్షణ ఉత్సాహం. పాఠకులకు గొప్ప జ్ఞాన ప్రసాదం.
…..Saleem Mohammad
KK Anand
టైపింగ్ షార్ట్ హండ్ నెర్చుకునె రొజులు గుర్తుకొచ్చాయి
Jhansi koppisetty
హహహ….. అప్పుడంత టెన్షన్ వుండదండీ…. ఇది భారీ ఎత్తున సాగిన కాన్ఫరెన్స్… మొత్తం నా భుజస్కందాల పైనే వుంటుందనుకుని టెన్షన్ పడ్డాను… వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుంటారని తెలియలేదు


Navneethkumar Narisetty
Wonderful well narrated
Jhansi koppisetty
Thank you brother Navneeth….
Jhansi koppisetty
అద్భుతమైన వర్ణన. మొదటినించి చివరివరకు చదివినంతసేపూ పొట్టచెక్కలయ్యేట్లు నవ్వుకున్నాను.
It proved to be “Much Ado About Nothing” by Shakespeare.
ఆ పదిరోజులు మీ “eat shorthand, drink short hand, sleep short hand” గొడవ అందరిని కలవరపెట్టి ఉంటుంది. Tenant అబ్బాయి dictation ఇరుగుపొరుగు ఆడంగులకి మంచి విందు భోజనం.
ఏది ఏమైనా మీ రచనా కౌశలం అమోఘం.
అద్వితీయం.
అనితర సాధ్యం.
…..Laxmi narayana Rao Bitra
Jhansi koppisetty
…..Manjula
Sambasivarao Thota
Jhansi Garu!
Ee episode poorthigaa chadivina tharuvaatha naakardhamaina vishyam emitante….
“Manalo yentha talent vunnaa,yenni skills vunna,,
yeppatikappudu update chesukokapothe , ibbandulu thappavu..
anthe kaadu..ee potee prapamchamlo negguku raalemu..
Manchi message vundi..ardham chesukunte…
Dhanyavaadaalandi
Jhansi koppisetty
మీ దృక్పథానికి ధన్యవాదాలండీ సాంబశివరావు గారూ…. అనుభవాల్లో నుండి సందేశం కూడా ఇయ్యగలిగితే ఆ అనుభవం సార్ధకమైనట్టే…
డా కె.ఎల్.వి.ప్రసాద్
సస్పెన్స్ త్రిల్లర్,కొసమెరుపు కథగా ముగింపు యిచ్చారు.
ప్రాక్టీసు లేకుంటే కొన్ని విషయాలు మరచిపోవడం ఖాయం.అందులో ‘ పిట్ మేన్ షార్ట్ హేన్డ్’ ఒకటి. ఇదే కాదు కథలు రాయడం మానేసిన ప్రసిద్ధ కథా రచయిత ల
సంగతి కూడా ఇలాంటి దే.
మిలటరీలో ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదే! క్రమ శిక్షణ కు మారు పేరు కదా! అందుకే, ఆ..అలజడి,టెన్షనూను,వివరించిన రచయిత్రి, వర్క్ హాలిక్,అయినప్పటికీ, సాంకేతిక పరం అయిన అంశం కనుక, ఒక పక్క సర్వీస్ అనుభవం,మరో పక్క షా ర్ట్-హాన్డ్,అనుభవం కోల్పోయిన,పరిస్థితి, తికమక చేసినా
మరో రూపంలో వడ్డున పడేసి మానసిక శాంతిని
కలిగించారు. బాగుంది. రచయిత్రి కి అభినందనలు.
Jhansi koppisetty
ఎల్.వి.ప్రసాద్. కానేటిగారూ ..మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ


వైష్ణవి శ్రీ
చాలా బాగుంది మేడం
Jhansi koppisetty
మంచి అనుభవం ఝాన్సీ, నీ రచనా శైలి అమోఘం, అభినందనలు

….మన్నెం శారద
Jhansi koppisetty
డీ డే ఈసీజీ..
కొన్ని భావోద్వేగాలని ఏ సాంకేతికతా అంచనా వేయలేదేమో.. బాధ్యతల సన్నధత.. పూర్తి స్థాయి యుద్దమంత.. బహుశా సైనిక వాతావరణమే అంతేమో..దానికితోడూ మీ నిబద్దత.. ఎంత రికార్డెడు ఆడియో మీకు దన్నుగా ఉన్నా.. అది వీడియో కూడా అయిఉన్నా.. మీరు అబ్జర్వ్ చేసిన ఆ తలల అవునూ కాదూ అనే తాకిడి ఆడియో విజువల్స్ పట్టలేక పోవచ్చు.. మొదటి ఎత్తుగడనుంచీ.. పనే ప్రత్యక్ష దైవమనట్టూ అకుంఠిత దీక్ష గా చేపట్టిన రి లెర్నింగ్ ప్రాక్టీసూ.. క్రికెటు బ్యాటుతో మీరు సిక్సర్ కొట్టిన.. చుట్టు పక్కల సగటు ఆడంగుల సామాజిక థాటూ..
విజేతల కథల ప్రతి కదలికా కనికట్టే అన్నట్టూ
…..Ramesh Chennupati
Jhansi koppisetty
Ramesh bro …I felt missing your wonderful comment which literally boosts my literary levels… and here it’s come….Thank you so much brother


Jhansi koppisetty
అద్భుత అనుభూతి!
నిజంగా … మీ టెన్షన్ క్రమమంతా మా స్కూల్లో యాన్యువల్ సెలబ్రేషన్స్ డేట్ ఫిక్సయ్యాక అందరం ప్రోగ్రాముల్ని పంచుకున్నాక నాకు లేటునైట్ నిద్ర మధ్య మధ్యలో మంచి వ్యాఖ్యలు స్పురించి పక్కనే పెట్టుకున్న నోట్ బుక్ పెన్సిల్ తీసి రాసుకుని 2-3 రోజుల్లో రాసినవాటిని పేర్చి కూర్చి ట్యూనింగ్ కట్టి పాడి చూసి మా పిల్లలకి పాడడం నేర్పి వారితో పాడించి తృప్తి పడి పేరెంట్స్ తో శభాష్ అనిపించుకున్న మధుర క్షణాలన్నీ పూసగుచ్చినట్టు గుర్తొచ్చాయమ్మా, మీ అనుభవాక్షరాల్ని చదువుతుంటే!
ఆ స్థితిలో ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు పూర్తి టెన్షన్ తో! పట్టని వారు ఎప్పుడైనా ఒకలాగే ఉంటారు!
ఇలాంటి మీ అనుభవ పాఠాలు నేటి స్టెనోలకి ఎంత పిరయోజనకరమో? పైగా ఆరోగ్యకరం!
హ్యాట్సాఫ్ ఫర్ యువర్ రైటప్!
…. Jogeswara Rao Pallampati
Jhansi koppisetty
ఉద్యోగ నిర్వహణలో ఆకస్మికంగా ఎదురయ్యే అనూహ్య ఘటనల గురించి బాగా వివరించారు..
మనం ఎక్కువ ఊహించుకున్న సందర్భాల్లో తేలిగ్గా పోవడం.. ఒక్కోసారి ఎక్కువ ఒత్తిడి ఎదురవ్వడం సహజమే..
మీ షార్ట్ హ్యాండ్ కథ స్మార్ట్ గా సాగింది..
మొత్తానికి ఎక్కడైనా ఎప్పుడైనా విజయం మీదే
…. Chatrapati Yaddanapudi