కోటి క్రోసుల దూరన కొండలపై వెలిగేవు
గోవిందుడా ఓ గోవిందుడా
కొంగు బంగారమై మా కోరికలు తీర్చేవు
గోవిందుడా మా గోవిందుడా
అచంచలమై అలసటయే లేక నిలిచేవు మా కొరకు
గోవిందుడా ఓ గోవిందుడా
చంచలమైన మా చిత్తాలు చూసి చిరునవ్వు నవ్వేవు
గోవిందుడా మా గోవిందుడా
కలిమిలో మేము కన్నెర్ర చేసెము లేమిలో కన్నీరు కార్చేము
గోవిందుడా ఓ గోవిందుడా
కలిమిలేములందు సమదృష్టి నిచ్చి మమ్ము కాపాడుమా
గోవిందుడా మా గోవిందుడా
కొండకోనల కదిలేము నీ నామజపము తోడుగా
గోవిందుడా ఓ గోవిందుడా
కొండంత అండవై కనుచూపు మేరలో కదలాడుమా
గోవిందుడా మా గోవిందుడా
అన్నమయ్యలము గాము మేమల్పజీవులము
గోవిందుడా ఓ గోవిందుడా
సంకీర్తనలు రావు సంసార భాదలే బహు బాగా కూర్చేము
గోవిందుడా మా గోవిందుడా
నీలి మణిమాణిక్యాదులు నీకివ్వలేము కానుకగా
గోవిందుడా ఓ గోవిందుడా
మెరిసేటి మా తలనీలాలే గ్రహియింపు మా మొక్కులుగా
గోవిందుడా మా గోవిందుడా
గోవిందుడా ఓ గోవిందుడా
గోవిందుడా మా గోవిందుడా
గోవిందుడా ఓ గోవిందుడా
గోవిందుడా మా గోవిందుడా

విస్సాప్రగడ వేంకట కృష్ణ సాయి స్వస్థలం ఏలూరు. సర్ సి అర్ అర్ కాలేజ్ లో పట్టభద్రులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొద్ది కాలం పనిచేసి, 1997 లో అమెరికా వలస వెళ్లి బోస్టన్ పరిసర ప్రాంతంలో స్థిరపడ్డారు. వృత్తి రీత్యా సమాచార సాంకేతిక (IT) రంగంలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. కాలేజీ రోజుల నుంచి కవితా సాహిత్యం పై మక్కువ. ఏవో చిన్న చిన్న పద కవితలు వ్రాసుకుని బంధువర్గం తోను మిత్రుల తోను పంచుకుని సంతోషపడేవారు. ప్రముఖుల రచనలు చదవడం ఇష్టం. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం మరియు న్యూ ఇంగ్లాండ్ షిరిడి సాయి పరివార్ దేవాలయంలో స్వచ్ఛంద స్వేచ్ఛా శ్రమదానం చేయడం ఇష్టపడతారు.