[డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి రచించిన ‘హృదయాన్ని మీటిన రాగాలు’ అనే కవితని అందిస్తున్నాము.]


మనసుతోటలో విరబూసిన పూలు
వెదజల్లే పరిమళాలకు అవధి లేదు
ఎంత దూరాలవరకైనా పయనిస్తాయి
ఎంతకాలమైనా తాజాగా ఉంటాయి
హృదయాన్ని తాకే అనుభూతులు
పంచిన పరిమళాలకు కొదవ లేదు
గాఢంగా అద్దుకొని గుబాళిస్తాయి
జీవితమంతా మనతోనే పయనిస్తాయి
ఎదమీటిన స్నేహ బంధాలు ఆత్మీయతలు
అందించిన పరిమళాలకు అంతేలేదు
ఎన్నటికీ వీడని సుగంధ వీవెనలౌతాయి
తీయని జ్ఞాపకాలుగా మిగిలుంటాయి
మదిని కలవరపరిచే ముదిమి తలపులు
ఆధ్యాత్మిక పరిమళాలను స్వాగతిస్తాయి
వేదాంత భావనావీచికలు ఆఘ్రాణిస్తాయి
శేషజీవితం ప్రశాంతంగా గడవనిస్తాయి
గుండెగూటికి చేరిన సేవాభావాలు
మానవతాపరిమళాలు చిందిస్తాయి
మంచిచేతలు చందనగంధాలౌతాయి
మానవజన్మకు సార్ధకత చేకూరుస్తాయి

డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి విశాఖజిల్లా అనకాపల్లిలో 3.9.1954 న లక్ష్మీకాంతం, రాధాకృష్ణ దంపతులకు జన్మించారు. ఎం.కాం.,ఎం.ఫిల్.,పి.హెచ్.డి, హిందీ సాహిత్యరత్న విద్యార్హతలు. అనకాపల్లి వర్తకసంఘ లింగమూర్తి కళాశాల వాణిజ్యవిభాగంలో 1976 లో లెక్చరర్ గా ప్రవేశించి రీడర్గా పదోన్నతి పొంది 2012 సెప్టెంబర్లో శాఖాధిపతిగా పదవీవిరమణ.
గ్రంథాలయాల పట్ల, పుస్తకాల పట్ల అభిరుచి పెరిగింది వారి అన్నగారి వలన. 1970 నుంచి తన భావాలకు అక్షరరూపం యివ్వటం ప్రారంభించారు. ఆ ఆసక్తి కవితలు,గేయాలు రాయటానికి దోహదమైంది. అందరిలాగే ఆయననూ శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం ప్రభావితం చేసిందని చెబుతారు.
రంగుల చినుకులు, నెలవంక, కవచం పలుకే బంగారమాయే – కవితాసంపుటులు వెలువరించారు. ప్రస్తుతం కన్వీనర్, అనకాపల్లి సాహితీమిత్రులు.