సుధీర్ కస్పా


స్కూల్లో, కాలేజీలో అడపాదడపా నెగ్గిన వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలూ గుండెలో నింపిన ధైర్యమేమో! సాహిత్యంలో ఓనమాలు తెలియకుండానే నేరుగా దూకేసాను.
‘కలం స్నేహం’ అనే వాట్సాప్ సమూహంలో జరిపే సాహిత్యపరమైన చర్చల ద్వారా ఒకొక్క విషయం నేర్చుకుంటూ, ప్రతిలిపి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇచ్చిన ప్రోత్సాహంతో పదిహేను కథలు, రెండు నవలలు రాసాను.
మన చుట్టూ జరిగే విషయాలనే కాస్త లోతుగా, స్పష్టంగా చూపించటం నాకిష్టం. అలా సామాజిక ఇతివృత్తంతో నేను రాసిన కథలు ప్రతిలిపిలో వేలాది మంది అభిమానులను సంపాదించిపెట్టాయి.
పత్రికల్లో అచ్చు అయితేనే రచయిత అనే ముద్ర వేయించుకోగలము అన్న పెద్దల సలహాపై నేను పంపిన ఒకటి రెండు కథలు ముద్రితం కూడా అయ్యాయి. శ్రీమతి బండారు అచ్చమాంబ స్మారక పోటీల్లో ఓ చిన్ని బహుమతి కూడా గెలిచింది, ‘మ్యారిటల్ రేప్’ అంశంపై నేను రాసిన కథ.
‘అచ్చంగా తెలుగు’ సంస్థ వారు నా కథ ‘ఒంటరి’కి, ‘క్షీర సాగరంలో కొత్త కెరటాలు’ అనే పుస్తకంలో పెద్ద పెద్ద రచయితల సరసన చోటిచ్చారు.
శెభాష్ రా!! సుధీరా!! అని నా భుజం నేనే చరుచుకుంటున్న ఈ సమయంలో ఒకొక్క పత్రికా మూత పడుతున్న విషయం మనసుని కలవర పెట్టే విషయమే.
తెలుగు భాషని భుజానికెత్తుకొనే సాహసం ఈ లేత సాహితీవేత్త చేయలేడేమో కానీ, యువతరం మళ్ళీ తెలుగు పుస్తకాన్ని అందుకునేలా నా వంతు ప్రయత్నం అయితే చేయాలనే సంకల్పం ఉంది.
తెలుగు పుస్తకాన్ని చదవటం నామోషీ అనుకునే ఈ రోజుల్లో నా ప్రయత్నం కష్టమే కానీ అసాధ్యం కాదని నా నమ్మకం.
తొలి అడుగుగా, ప్రతిలిపిలో వేలాది మంది పాఠకులు ఆదరించిన నా నవల ‘మృత్యువిహారి’కి పుస్తకరూపమిచ్చి త్వరలో ముందుకు రాబోతున్నాను.
sudheer.kaspa@gmail.com
1 Comments
RadhikaPrasad
హృదయపూర్వక అభినందనలు సుధీర్ గారూ!! సమాజం పట్ల, వ్యవస్థ పట్ల మీకున్న గౌరవమే, మీ రచనలలో నిజాయితీగా చూపిస్తారు.. చక్కని భావనా శక్తి, భాషపై పట్టు ఉంది., ఇదే మీ బలం.. ఒక రచయితకు ఇంతకన్నా కావలసిన అర్హత మరొకటి ఉండదు.. మీదైనా శైలిలో, రాశికన్నా వాసికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగండి.. అభినందనలు

