[సంచిక కోసం ప్రముఖ కవి శ్రీ మోకా రత్నరాజు గారితో డా. కె. ఎల్. వి. ప్రసాద్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.]
కోనసీమ కవికోకిల.. శ్రీ మోకా రత్నరాజు


తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగినా, వృత్తి రీత్యా ‘పోస్టుమాన్’గా తన సేవలు విశాఖపట్నంలో అందించే అవకాశం రావడం వల్ల ఆయన సాహిత్యాభిలాషను మెరుగు పరచుకునే పరిస్థితులు, అవకాశం ఆయనకు అక్కడ మెండుగా లభించాయి.
మరుగున పడిపోతున్న సంస్కృతి, సంప్రదాయ విషయాలు, వస్తువులు, కవిత్వ రూపంలో ఆయన సరళమైన భాషలో మనముందు ఉంచుతారు.
కవి రత్నరాజుగారి సాహిత్య ప్రస్థాన విశేషాలు మరిన్ని.. ఆయన ద్వారా.. తెలుసుకుందాం.
~
ప్ర) రత్నరాజు కవి గారికి సంచిక అంతర్జాల మాసపత్రిక పక్షాన స్వాగతం. మీరు పుట్టి పెరిగింది తూర్పుగోదావరి జిల్లా, కానీ మీ ఉద్యోగ పర్వం, సాహిత్య ప్రస్థానం అంతా విశాఖపట్నంగా చెబుతారు. అదెలా జరిగింది? వివరంగా చెప్పండి.


ప్ర) మీరు డిగ్రీ కాలేజీ మెట్లు ఎక్కలేక పోయానని అప్పుడప్పుడూ బాధ పడుతుంటారని మీ అతి సన్నిహితులు చెబుతుంటారు, మీ రచనా వ్యాసాంగానికి అది మీరు వెలితిగా భావిస్తున్నారా?
జ) అవును సార్, మొదటి ప్రశ్నకి సమాధానంలోనే నా కాలేజీ ప్రస్థావన వచ్చింది, 10వ తరగతి పూర్తైయిన మూడేళ్ళు కూలీ పనుల్లో నలిగి, తర్వాత కూడా సైన్స్ గ్రూపులో జాయిన్ అవ్వడం; మా పక్క గ్రామం వాడ్రేవుపల్లి నుండి డిగ్రీ చదివే ఆర్ట్స్ గ్రూప్ వాళ్లుండేవారు, నాకు సైకిల్ లేదు కాబట్టి నేను వాళ్ళ దగ్గరకెళ్ళి, వాళ్ళను ఎదర కూర్చోబెట్టుకుని వాళ్ళ సైకిల్ తొక్కుకెళ్ళేవాణ్ణి. ఒకోసారి వాళ్ళు కాలేజీకి సెలవు పెడితే నేను ఆగిపోయేవాణ్ణి. అలా మొత్తం మీద చదువుసాగలేదు. అందుకు వెళ్ళినట్టే వెళ్ళానే కాని వెళ్ళనట్టే లెక్క. అయినా నా సాహితీ సృష్టికి అదెక్కడా వెలితిగా నేను భావించట్లేదు.
ప్ర) మొదటినుంచి మీరు కవిత్వాన్ని మాత్రమే సాధన చేస్తూ వస్తున్నారు.. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? కవిత్వం వైపు మీకు మార్గదర్శనం చేసిన పెద్దలు ఎవరు?
జ) నిజానికి నేను మొదట కథలే రాసేవాణ్ణి. ఆ కథ ప్రారంభించడం నా చేతుల్లో వుండేది కానీ, తర్వాత ముగింపు కన్నా ఊహించని మలుపులు పేజీలు పేజీలుగా సాగిపోయేవి. ఓ రోజు కథ ప్రారంభించాను అలా సాగిపోతోంది. అప్పుడు రాత్రి 10 గంటలు అవుతోంది. నా బుడ్డి దీపం ఆరిపోయింది. అప్పటికి మా ఊరికింకా కరెంటు కూడా రాలేదు. మాది మట్టి గోడ, తాటాకిల్లు ఆ చీకట్లో లేచి గోడకు కొట్టిన వాసం మేకుకు తగిలించిన కిర్సనాయిల్ సీసా దగ్గరకెళ్ళాను, సీసాలో కిర్సనాయిలు ఉందో లేదోనని సీసాను కదిపి చూశాను. అందులో కిర్సనాయిలు లేదు. ఉన్నదొక్కటే బుడ్డి దీపం – చేసేది లేక వచ్చి మా అమ్మ పక్కనే పడుకున్నాను. అయితే నిద్ర రాదు, రాయడానికీ వీలు కాదు. అప్పటి వరకూ కవిత రాయడమెలాగో తెలియని వాణ్ణి. అప్పుడు నాకొచ్చిన ఆలోచనని ఆ చీకటిలోనే రాసిన కవిత ఇది.
*కారణం*
పాపాల చీకటిని
పారద్రోలాలని
దీక్షబూనిన దీపమొకటి ఆరిపోయిందంతలోనే
సుడిగాలికి భయపడి కాదు
బుడ్డిలోని చమురులేక!
ఆ దీపాన్నే నమ్ముకున్న – ముక్కు పచ్చలారని
నవ భీజమొకటి ముగిసిపోయిదంతలోనే
బ్రతికే రోజులు లేక కాదు
బ్రతికున్న రోజుల్లో తిండిలేక!
ప్ర) మీ కవిత్వాన్ని మొట్టమొదట ప్రోత్సహించిన పత్రిక ఏది? అది ఎలా సాధ్యం అయింది? అప్పుడు మీ అనుభూతి ఎలాంటిది? ఆ కవిత అచ్చు అయిన టైం కి మీ వయస్సు ఎంత?
జ) అలా అనుకోని విధంగా రాసిన ‘కారణం’ అనే కవితను విశాలాంధ్ర పత్రికకు పంపిస్తే దానికి ప్రత్యేకంగా ప్రేమ్ కట్టి ప్రచురించారు. అది సంక్రాంతి ప్రత్యేక సంచికలో. ప్రత్యేకంగా కారణం లేదు. కాని ఇలా కవిత్వం రాస్తున్న నన్ను స్వతహగా కవి అయిన శ్రీ జి. సుబ్బరావు గారు (రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ – కొత్తపేట) ఎంతగానో, ప్రోత్సహించడం, ప్రేమించడం అంతేకాక వారి కుటుంబ సభ్యుడిగా చూసుకోవడం వల్ల, ఆయన ద్వారా డా॥ అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు పరిచయం కావడంతో, ఆయన ద్వారా ఎందరెందరో పేరు మోసిన సహృదయత కలిగిన వారందరి పరిచయం నా కవితా యాత్రకు దోహదపడింది.


డ్యుటీలో మోకా రత్నరాజు
ప్ర) కవిత్వం కోసం మీరు ఎన్నుకునే ‘వస్తువు’లో మీ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఎందుచేత?
జ) కవిత వస్తువును బట్టి శైలి ఉంటుందని నమ్ముతాను. నేను ఎన్నుకునే వస్తువు నా కళ్ళ ఎదుట తారసపడే ప్రతి వస్తువు కవితమైయంగానే కనిపిస్తుంది.
ఉదా:- దుడ్డు కర్ర, పురిటి మంచం, నల్ల బల్ల, చెరువు గట్టు, డొక్కతాడు అలా ఇవి అన్ని సాదృశ్యాలే, నా కవిత వస్తువులు.
ప్ర) మీకు తెలుగు సాహిత్యంలో ఇష్టమైన కవి ఎవరు? ఎందుచేత? మీరు అసలు ఇతరుల సాహిత్యాలు చదువుతారా?
జ) కె. శివారెడ్డి, శిఖమణి, యెండ్లూరి సుధాకర్, ఆశారాజు మొదలగువారు. యాక్సిడెంట్ అయ్యి 8 నెలలు మంచం మీద ఉండి ‘అంతర్జనం’ ని ప్రసవించిన శివారెడ్డి అంటే ప్రత్యేక అభిమానం.


కవి.. శివారెడ్డి గారితో శ్రీ మోకా
ప్ర) వృత్తిపరంగా మీకు విశ్రాంతి సమయం అతి తక్కువ కదా? మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా జరిగేది?
జ) ఇది చాలా మంచి ప్రశ్న సార్! నేను వృత్తి రీత్యా పోస్ట్‌మాన్‌ను, కాల ఋతువులతో సంబంధం లేకుండా సంచరించాల్సిన బాధ్యతాయుత ఉద్యోగం. అలాంటి సమయ ఇరకాటంలో కూడా సంక సంచితో ఉత్తరాల బట్వాడా చేస్తూనే సాయంకాలానికి నేను రాసిన నాలుగు ఐదు పంక్తుల కాగితాలతో ఇంటికి వచ్చేవాడిని, రెండు రోజులలో శుద్ధ కవిత్వం తయారయ్యేది. వాటిని పత్రికలకి పోస్ట్ చేయడం, ప్రచురించడం జరిగేది. అప్పుడు చాలా సునాయాసంగా జరిగిన పని ఇప్పుడు చేయలేక పోతున్నందుకు చింతిస్తున్నాను. దానికి ప్రతికూల కారణాలు అనేకం.
ప్ర) ఉద్యోగం – కవిత్వం ఈ రెండిటిని సమనంగా ప్రేమించిన మీరు, కుటుంబానికి సమయం ఎలా కేటాయించగలిగారు? అది మీకు ఎలా సాధ్యం అయింది వివరించండి.
జ) మనస్సు ఉంటే మార్గం ఉంటుంది అనే సామెతకు దగ్గరగా నా జీవనశైలి ఉంటుంది. రేపు చేయవలసిన పనికి ఈరోజే సిద్ధపడు అనే నానుడికి కట్టుబడి ఉద్యోగించినంత కాలం చాలా జాగురతతో ఉండేవాడిని. దానికి నా కుటుంబ సభ్యులు అంతా ఎవరి స్థాయికి వారు ఎంతో అంకితామయంగా సహాకరించేవారు. అందుకే నేను ఈ రెండింటిని సమర్ధనీయంగా నిర్వహించగలిగాను.
ప్ర) నాటి కవి తిలక్ ‘పోస్ట్‌మాన్’ నేపథ్యంగా ఒక కవితా రాశారు. అది మీ దృష్టికి వచ్చిందా? వృత్తి నేపధ్యంగా మీరు ఏమైనా కవిత్వం రాశారా?
జ) దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ అనే కవితా సంపుటిలో ‘పోస్ట్‌మాన్’ మీద వ్రాసిన ‘తపాలా బంట్రోతు’ కవిత గొప్పగా గుర్తించబడింది. కొన్ని కవి సమ్మేళనాలో అయితే ‘అప్పుడు తిలక్ గారు పోస్ట్‌మాన్ గురించి కవితా రాస్తే – ఇప్పుడు పోస్ట్‌మాన్ రత్నరాజు గారు తన కవిత వినిపించబోతున్నారు’ అనే వ్యాఖ్యానం నాకు ఎంతగానో ఆనందానిచ్చేది. నా వృత్తి నేపథ్యంగా ‘సాగర పుత్రుని’, ‘ఉత్తరము’ అనే కవితలు వ్రాయడం వాటికి మంచి గుర్తింపు రావడం జరిగింది.
ఉదా:-
ఉత్తరం
దూర తీరాలే కాదు.
వీధికెదురు వీధి
సందు పక్క సందు
దగ్గర దగ్గరగా కళ్ళెదుటే మసలుతున్నా-
చేతి ఉత్తరాలతో చేరువై
ఒకింటి వారైన వాళ్ళ ప్రేమ సౌధానికి
పునాది రాయిగా నిల్చింది ‘ఉత్తరమే’ కదా!
తినగ తినగ వేము అన్నట్టు
ఉత్తరాలు వ్రాసి వ్రాసి కవులైన వాళ్ళెందరో!
చదివి,
ఉత్తేజితులైన
నాటి దేశ నాయకులెందరికో
ఉత్తరమే మహత్యం
ఉత్తరమే శరణ్యం
***
ఒక్క సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగి
లక్షల టన్నుల గోధుమ పంట గల్లంతైనట్టు
చిన్న సెల్‌ఫోన్ మోజుకు చేరువై
భావపుష్టి పదసంపద సమూహ ఉత్తరాల్ని
ఓల్డెజ్ హోమ్ తల్లిదండ్రుల్ని చేస్తుంటే
ఏ భాషా శిశువైనా – పరిపుష్టిగా ఎలా పెరుగుతుంది?
తల్లిపాల ఉత్తరాల్ని పట్టందే!
~
ప్ర) మీ ఇంట్లో మీ కవిత్వం ఎవరైనా చదువుతారా? కవిత్వపరంగా మీ వారసులు ఎవరనుకుంటున్నారు? ఎందుచేత?
జ) నా కవిత్వం మాములుగా చదవటమే కాదు, విమర్శ సమీక్షించే రీతిలో చదివే మా పెద్దబ్బాయి డా॥ వీరేంద్ర కుమార్, నేను రాసిన విన్నపాలను సి.డి చేసే విషయంలో మా చిన్నబ్బాయి ‘మధు’, నా కవిత గానానికి తగినట్టుగా వీడియో రూపొందిచడం అనేక ప్రశంసలు పొందడం జరిగింది. అందుచేత ఆ ఇద్దరు వారసులే, వీరిద్దరికి తోడుగా నా తమ్ముడు విశ్వేశ్వరరావు కూడా.


కవిత చదువుతూ రత్నరాజు
ప్ర) విశాఖపట్నం సాహితీరంగంలో మీ పాత్ర ఎలా ఉండేది? కవిత్వపరంగా ఎవరు ఎక్కువగా మిమ్ములను ప్రేమించేవారు?
జ) విశాఖపట్నంలో సాహితీ రంగంలో నాకు ఓ ప్రత్యేక స్థానం బాగానే ఉండేది. ప్రస్తుతానికి ఉంది. కవిత్వాపరంగా అక్కడవున్న సాహితీ సంస్థలు అన్నీ చాలా ప్రేమించేవి, అభిమానించేవి. ముఖ్యంగా నేను వివాదాలకు దూరంగా ఉంటాను, నేను ఎవరి దగ్గర ప్రజ్ఞ వున్నా వారిని మిక్కిలి అభిమానిస్తుంటాను. ముఖ్యంగా శ్రీ రామతీర్ధ, జగధాత్రి, చందు సుబ్బరావు, చింతగింది శ్రీనివాసరావు, మేడా మస్తాన్ రెడ్డి మొదలగువారు. ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని చూడగానే చానాళ్ల క్రితం అనగా 1982 ప్రాంతంలో జరిగిన ఒక విషయం గుర్తుకు వస్తుంది. నేను ఏదో పరీక్ష వ్రాసే నిమిత్తం వైజాగ్ వెళ్ళినప్పుడు నాకు రేడియో స్టేషన్ చూడాలని ఆ రోజు రేడియో కేంద్రానికి వెళ్ళాను, రేడియో స్టేషన్ చూడాలని అక్కడి సెక్యూరిటీని అడిగితే నా వివరాలు అన్ని అడిగి స్టేషన్ డైరెక్టర్ గారి దగ్గరకు పంపించారు. అప్పుడు ఆయన ఇంకో ఆయనను పిలిచి ‘ఈయన అమలాపురం నుండి వచ్చారట, స్టేషన్ అంతా ఒక్కసారి చూపించ’మని చెప్పితే ఆయన చూపించారు. ఆ తక్కువ సమయంలోనే ఆయనతో మాట్లాడుతూ నా ‘కవితలు పంపిస్తే ఎందుకు ప్రసారం కాలేదు’ అని ఆయనను అడిగాను. ‘ఏంటి నువ్వు కవిత్వాం రాస్తావా’ని ఆయన ఆశ్చర్యంగా అడుగుతూ ‘ఆ కవితలు నీ దగ్గర ఉన్నాయా?’ అని అన్నారు. అప్పుడు ‘దగ్గరలేవు ఇప్పుడు మీరు రాసివ్వమంటే ఇప్పుడు ఇచ్చేస్తాను’ అని నేను కంగారు కంగారుగా అనేసరికి ఆయన కంగారు పడి ‘ఇప్పుడు వద్దు బాబు, సాయత్రం 5 గంటలకు తీసుకురమ్మ’ని అంటే నేను వెంటనే అలా పాండురంగాపురం మీదుగా బీచు దిగి, 6 కవితలు వ్రాసుకుని 5 గంటలకు తిరిగి రేడియో స్టేషన్‌కు వచ్చాను. అప్పుడు ఆయన వాటిని పరిశీలించి 5 కవితలను సెలెక్ట్ చేసి అప్పటికప్పుడు నా చేత రికార్డింగ్ చేయించి, కాంట్రాక్ట్ ఫారం మీద సంతకాలు చేయించి, 45 రూపాయలు చెక్కుగా ఇవ్వడం జరిగింది. ఆ తరువాత చాన్నాళ్లకు తెలిసింది ఆ స్టేషన్ డైరెక్టర్ శ్రీ బొజ్జా క్రిష్ణశాస్త్రి గారని, ఆ స్టేషన్ అంతా నాకు చూపించి, రికార్డు చేసింది శ్రీ, కె.మధుసూదన్ గారని. అంతవరకు నేను ఎప్పుడూ విశాఖపట్నం వెళ్ళలేదు. అదే మొదటిసారి. ఈ క్రాంటాక్ట్ ఫారం ఊళ్ళో జనానికి చూపించడం చూపిచడంతోనే నలిగి నలిగి నా చేతుల్లోనే జన్మ చాలించేదెమో అనిపించింది.
1997 విశాఖపట్నం ఉద్యోగరీత్యా వెళ్ళడం, తిరిగి మళ్ళీ వాళ్ళందరిని కలవడం, వాళ్ళలో ఒక్కడిని అవ్వడం, శ్రీ బండి సత్యనారాయణ, శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు, కాకరపర్తి సత్యనారాయణ గారు, డా॥ విప్పర్తి ప్రణవమూర్తి గారు, ఉప్పల అప్పలరాజు ఇంకా అనేక అనేక సాహితీ సంస్థలతో మమేకం అవ్వడం, అందరి ప్రేమను, ప్రోత్సాహని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను.


ఒక సమావేశంలో ఉపన్యసిస్తూ శ్రీ రత్నరాజు
ప్ర) పదవీ విరమణ తరువాత మీ జన్మస్థలనికి చేరుకున్న అదృష్టవంతులు మీరు. అక్కడి సాహిత్య కార్యక్రమాల గురించి సవివరంగా చెప్పండి?
జ) ఉద్యోగ విరమణ తరువాత జన్మస్థలమైన మానేపల్లి రావడం అదృష్టవంతులని మీరు అన్నారు కానీ, అప్పటి ఊరు ఊరులా లేదు, నీరు నీరులా లేదు. ‘కూపోదకం వటచ్ఛాయ తాంబూలం తరుణీకుచం’ అన్న శ్లోకంలో ఈ నాలుగు వేసవి కాలంలో చల్లగాను, శీతాకాలంలో వెచ్చగాను ఉంటాయి అని దీని భావన. కూపోదకం అంటే నూతి నీళ్ళు. అన్ని కాలలోను ఉప్పగాను, వేడిగాను ఉంటున్నాయి. గుడిసెలు పోయి మేడలు వెలిసినా మనుష్యులలో రావలసిన సామాజిక మార్పు రాలేదని నా వేదన.


అంబేద్కర్‌కు నివాళులర్పిస్తూ కవి శ్రీ మోకా..
ప్ర) మీ ఖాతాలోకి ఇప్పటి వరకూ చేరిన మీ పుస్తకాల వివరాలు చెప్పండి.?
జ) నా పుస్తకాల వివరాలు:
- ‘నీవూ నీ స్థానం’ కవితా సంపుటి (1989)
- ‘పొద్దు పొడుపు’ కవితా సంపుటి (1990)
- ‘సాగర స్పర్శ’ కవితా సంపుటి (2002)
- ‘గుండె కొలిమి’ విన్నపాల సంపుటి (2002)
- ‘రూపాయాల చొక్కా చిన్న కథల సంపుటి (2005)
- ‘ట్రంకు పెట్టె’ కవితా సంపుటి (2012)
- ‘అమ్ముల పొది’ కవితా సంపుటి (2014)
ప్ర) మీ అవార్డులు, సత్కారాల గురించి చెప్పండి.?
జ) రాష్ట్రంలోను, రాష్ట్రేతర ప్రాంతాలలోను ప్రముఖ సాహితీ సంస్థలు నిర్వహించిన పోటీలలో గత 25 సం॥లు గా ప్రథమ, ద్వితీయ బహుమతులెన్నో వరించాయి.
- 1982 సం॥లో తపాలా శాఖ అత్యుత్తమ పురస్కారం ‘డాక్ సేవా’ అవార్డు – 1982
- ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం నుంచి విశిష్ట సేవా పురస్కారం – 2006
- ‘రంజని – కుందుర్తి’ అవార్డు – 2010
- ‘రంజని – కుందుర్తి’ అవార్డు – 2011
- మచిలీపట్నం సాహితీ మిత్రులు నిర్వహించిన కవితల పోటీలో జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి, 2012
- ‘పెన్నా పురస్కారం, నెల్లూరు – ట్రక్కు పెట్టె’ – 2012
- కె.ఆర్.కె మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైనాక్స్, నిమ్మగడ్డ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రకటించిన ‘శ్రీశ్రీ పురష్కారం’ – 2012
- శిలపరశెట్టి రాములు నాయుడు స్మారకా కవితా పురస్కారం – 2012
- ప్రపంచ తెలుగు మహాసభలు ఆహ్వానం -2012
- ‘నేటినిజం’ దినపత్రిక స్త్రీల సమస్యలు – పరిష్కారాలు అనే అంశంపై కవితల పోటీలో ఉత్తమ బహుమతి 2013
- సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో ‘చివరి చూపు’ కవితకు ‘జూలై నెల పురష్కారం 2013
- మదర్ ఛారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం వారు నిర్వహించిన అమ్మ గొప్పతనం పై నిర్వహించిన కవితల పోటీల్లో ప్రథమ బహుమతి, 2014


వివిధ సన్మానాలు అందుకుంటూ కవి రత్నరాజు
ప్ర) కవిత్వామే కాకుండా మీరు వివాహాలు కూడా చేస్తారని విన్నాను.. వాటి విషయాలు ఏమైనా వివరిస్తారా?
జ) అవును సార్! అవి అంబేద్కర్ పెళ్ళిలని అంటారు, అయితే 1987వ సం॥లో మానేపల్లిలో ఇలాంటి మేరేజ్ చేయడానికి ఒప్పందపడి కొన్ని అనివార్య కారణాల మూలంగా ఆయన రాలేకపోయారు. ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. అప్పుడంతా ఏమి చేయాలని ఆలోచిస్తున్న సమయంలో నేను అలాంటి పెళ్ళిళ్ళు చేయటం చూసి ఉండటం మూలంగా స్వతంత్రించి నేను ఆ పెళ్ళి చేయడం జరిగింది. అది చూసిన వారంతా నేను ఇంతకు ముందు చేస్తునట్టుగాను, అనుభవం ఉన్నట్టుగాను భావించి అభినందించారు. అంతేకాకుండా ఆ పెళ్ళిచేసినందుకు నాకు 20 రూపాయాలు ఇస్తే నేను మా అమ్మని 5 రూపాయలు అడిగి 25 రూపాయలు పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురుకు ఇవ్వడం జరిగింది. అలా ప్రారంభమైన వివాహా నిర్వహణ కార్యక్రమాలు ‘పూలే అంబేద్కర్ యోచన సోషల్ మ్యారేజ్ అసోషియేషన్’ గా రిజిష్టర్ చేసి ఈ 2023, ఫిబ్రవరి నాటికి 467 పెళ్ళిలు చేయడమే కాక అందులో కొన్ని కులాంతర, మతాంతర వివాహాలు చేయడం జరిగింది. ఆనాడు మా గ్రామం మానేపల్లిలో ప్రారంభించిన వివాహాలు గ్రామ, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలు దాటి బొంబాయి వంటి ప్రాంతాలలో కూడా వివాహాం జరిపించడం నాకు ఆనందంగా ఉంది. మరింత ఆనందించదగ్గ విషయం ఏమిటంటే నేను పెళ్ళిలు చేసిన కొన్ని జంటల పిల్లలకు కూడా నేను వివాహాం చేయడం.
ప్ర) చివరిగా మీ కవితలు ఇతర భాషాలోకి అనువదించబడ్డాయా?
జ) నా కవితలు హిందీ, ఇంగ్లీష్ భాషలోకి అనువదించబడ్డాయి. ఆంధ్రా యూనివర్శిటీ తెలుగు శాఖలో రత్నరాజు జీవితం సాహిత్యం అనే అంశం మీద పి.హెచ్.డి తీసుకోవడం కూడా జరిగింది.
** చాలా చక్కని సమాచారం అందించారు రత్నరాజు గారు, సంచిక పక్షాన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సర్.
**ధన్యవాదాలు ప్రసాద్ గారు.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
9 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సికిందరాబాద్.
Naccaw Sudhawcaraw Rau
Nicely conducted interview. Formal education…is not indispensable…as the poet cum short story writer proved through his literary outputs.
The comments that changes in seasons,in structures and ways of living are physical but without any changes in dyed in the wool social and cultural values… divisive and humiliating in nature.
The real challenge is the inequitous and injudicious age old social structure and the change if any must be here… but the change is seen in every walk of life except in the critical area…
Dr ji thank you for nice interview and the writer is a great inspiration for the upcoming generations …
డా.కె.ఎల్.వి.ప్రసాద
సుధాకర్ గారూ
ధన్య వాదాలూ మీకు.
Shyam Kumar Chagal
ముందుగా రచయిత రాజు గారికి నా యొక్క వందనాలు. బాల్యంలో తాను అనుభవించిన కష్టాలు బీదరికం నుంచి వచ్చిన తన జీవన గాధ చదివి నా కళ్ళలోంచి నీరు ధారావాహికంగా సాగిపోయింది.
బురద నీటి నుంచి కలువ వికసించినట్టుగా అతని కవిత, రచన ప్రయాణం ఎందరికో మార్గదర్శకం అనే చెప్పాలి.
పైన శీర్షికలో ఉదాహరించిన రెండు మూడు అతని కవితలు చదివి ఆహా భలే రాశారు అనుకున్నాను. అతని కవితలు చదవాలని కోరిక ఉద్భవించింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. పాఠకులలో ఇలాంటి కోరిక జనించిందంటే ఇంకా ఆ రచయిత విజయతీరాన్ని చేరుకున్నట్టే .
రచయిత శ్రీ రత్నరాజు గారికి నా యొక్క అభివందనాలు మరియు అభినందనలు
డా.కె.ఎల్.వి.ప్రసాద
Mitrama
Shyam.నీ స్పందనకు ధన్యవాదాలు.
డా బండి
మోక రత్న రాజుగారి సాహిత్య ప్రస్థానం చదివాను. యథార్థ వ్యధార్ధ కథనం. ఆర్తి… స్ఫూరి… కీర్తి.
డా.కె.ఎల్.వి.ప్రసాద
Thank you Dr.Bandi Gary.
Konduri Kasi visveswara rao
Moka Ratna Raju garu, meeyokka parichauam chadivanu. Deepak aripoyindi గాలికి భయపడి kaadu, nunneleka kabitha chala sahajamga వుంది. We met in Thyagaraya Gana Sabha, Hyderabad in Dr. C. Narayana Reddy gari meetinglo. అక్కడ నుండి మనం కోటి వరకు కలసి vachhamu. Dr. C. Narayana Reddy garu mee kavithanu appreciate chesaru. My best wishes for your coming great poetry.
Konduri Kasivisveswara Rao
Hyderabad
డా.కె.ఎల్.వి.ప్రసాద
Thank you sir.