నువ్వేమిటో
అసలు
నాకు అర్థం కావు,
నా విషయంలో,
నీ.. పరిస్థితీ..
అంతేనేమో..!
దగ్గరికి
వచ్చినట్టే వస్తుంటావు,
అంతలోనే
దూరమయి పోతుంటావు,
ఆశా నిరాశల మధ్య,
అంతులేని
అగాధాన్ని సృష్టిస్తావు!
నేను అనుకుంటున్నట్టే,
నువ్వూ..
నా గురించి ఇలానే,
ఆలోచిస్తుండవచ్చు,
ఆధునిక సమాచార
చానళ్లు ఎన్నివున్నా,
సమాచారం అందడంలో
సంపూర్ణత లోపించవచ్చు!
దీనిని..
ప్రేమ అంటారో
లేక..
పెరిగిన అనురాగం అంటారో
నాకైతే..
తెలీదు కానీ..
ఎందుకో..
నువ్వంటే నాకు ఇష్టం!
అది మాత్రం ‘స్పష్టం’!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
1 Comments
Rajendra Prasad
బాగుంది సర్
రాజేంద్ర ప్రసాద్