[శ్రీరామనవమి సందర్భంగా శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు రాసిన ‘జై శ్రీరామ్’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
ఏభై ఏళ్ళ క్రితం ఆకాశవాణిలో ఉషశ్రీ గారు నిర్వహించిన ‘ధర్మ సందేహాలు’ అనే కార్యక్రమం విపరీతమయిన ప్రజాదరణ పొందింది. ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోందంటే శ్రోతలు రేడియో చుట్టూ గుమిగూడేవారు. అప్పట్లో ఇప్పటి మాదిరిగా ఈనాటి ఉత్తమ ప్రశ్న అని ఓ ప్రశ్నకు బహుమతిని ప్రకటించటం వంటి పద్ధతులు ఉండేవి కావు. కానీ ఓ పర్యాయం ఓ శ్రోత అడిగిన ప్రశ్న, దానికి ఉషశ్రీ గారి సమాధానం ఎక్కువ మందిని ఆకట్టుకొన్నాయి. ఆ ప్రశ్నేమిటంటే – “వివాహ మహాత్సవ ఆహ్వాన పత్రికలలో ఎక్కువగా సీతారాముల చిత్రాలు వారికి సంబంధించిన శ్లోకాలే వేస్తారు.. కానీ నిజానికి సీతారాములు జీవితంలో కలిసిమెలసి సుఖపడింది తక్కువ కద మరి అన్ని కష్టాల పాలయిన వారి వివాహాన్నే ఎందుకు ప్రస్తావిస్తారు?” అని; దానికి ఉషశ్రీ గారి సమాధానం – “సీతారాములు ఎన్ని కష్టాలు పడినా ఎన్నో అవమానాలు, సంక్లిష్ట పరిస్థితులు ఎదురుకొన్నా ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ, అంకిత భావం, బాధ్యతలలో ఏ మాత్రం తేడా చూపలేదు. కష్టాలు, మోహాలు, తాపాలు వారిని మానసికంగా విడదియ్య లేదు. అదే స్ఫూర్తిని నూతన వధూవరులు తమ వైవాహిక బంధంలో ప్రదర్శించాలని సందేశంగా సీతరామాల పరిణయాన్నే ప్రస్తావిస్తారు” అని. రామాయణం వంటి ‘ఇతిహాసం’, రాముని కన్నా ‘ఉత్తమ నడవడిక’ మరొక చోట కానరాదని విజ్ఞుల అభిప్రాయం.. ఈ ‘ఏకైక’ అంశమే రామాయణాన్ని యుగాల గడిచినా (నాసా వారు ఏడు వేల సంవత్సరాలు అంటారు; వారి లెక్క వారిది) నిత్య నూతనంగా ఉంచుతోంది. సీతారాములు ‘ఏటేటా’ పెళ్ళి చేసుకొనేటట్లు చేస్తోంది.
***
శ్రీరాముడు వసంత బుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షతంలో అభిజిత్ ముహూర్తంలో (మద్యాహ్నం 12గం॥) జన్మించాడు. అరణ్యవాసం, శత్రు సంహారం చేసి అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడైనది కూడా చైత్ర శుద్ధ నవమి నాడే అని మరి కొందరి అభిప్రాయం. రెండూ పర్వదినాలే కాబట్టి శ్రీరామనవమి నాడు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరుపుకొంటారు. సరె! రాముడు నవమి నాడు పుట్టి మరల నవమి నాడే తిరిగొచ్చాడనుకొందాం.. ఆ రెంటి నవమిల మధ్య జరిగిన ప్రయాణమే రామాయణం.
మహాభారతం కూడా గొప్ప ఇతిహాసమే కదా!! నిజానికి వేదాలలో సూత్రప్రాయంగా చెప్పబడిన వన్నీ మహాభారతంలో వివిధ సంఘటనల రూపంలో కనబడతాయి. అందుక మహాభారతాన్ని ‘పంచమవేదం’ అన్నారు. అయితే ఇది కలియుగానికి దగ్గరగా ‘జరగడం’ వలన కలియుగపు పోకడలు, రాజకీయలు ఎక్కువగా కనిపిస్తాయి. ధర్మాల కన్నా ధర్మ సూక్ష్మాలు ఎక్కువ. భారతంలో శ్రీకృష్ణుడి అవతరం వస్తుంది. ఆయనకు లీలలు ఎక్కువ. ధర్మాధర్మ విచారణ ఎక్కువ జరుగుతుంది. రాముడు ఒక మామూలు మనిషి.. మనిషిగానే కష్టాలు పడ్డాడు.. మనిషి లాగే ఆలోచించాడు.. అంటే ఓ మంచి మనిషిలాగ, ఎక్కువగా స్వశక్తి మీదనే ఆధారపడ్డాడు. సాయం పొందాల్సి వచ్చినప్పుడు భేషజాలకు పోకుండా సాయాన్ని అర్థించాడు. ప్రత్యుపకారాన్ని అందించాడు. విజయుడయ్యాడు.. కాని మధ్యమధ్యలో మామూలు మనిషిలా రోదించాడు.. అందుకే గుండెకు దగ్గరయ్యాడు.
మంచి మనిషంటే ఎవరు? మంచి మనసున్నవాడు.. మంచి మనసుండొచ్చు.. అందగాడు కాకపోవచ్చు.. ధైర్యవంతుడు కాకపోవచ్చు. సుగుణాలు మాత్రమే ఉండొచ్చు. దుర్గుణాలు లేకపోవచ్చు.. కొన్ని గుణాలుండీ కొన్నిలేకపోతే ‘సంపూర్ణత్వం’ లేక పోవచ్చు. రాముడు మంచి బాలుడు.. ఆయన ‘శ్రీరామచంద్రుడే..’ – ఈ ఒక్క పదం ద్వారా ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో చెబుతాం..
రామనామం ఆదర్శానికి పర్యాయపదం. గుణవంతుడు, ధైర్యవంతుడు, సమర్థుడు, అందగాడు, భూతదయ కలిగినవాడు, ధృడ సంకల్పం కలిగినవాడు, ధర్మం తెలిసినవాడు, దేవతలను సైతం భయపెట్ట గలవాడు ఇత్యది 16 గుణణామాలు కలిగిన ఏకైక వ్యక్తి రాముడు.. ఇన్ని గుణములు కలిగి ఉండి కూడా సీతవియోగం కలిగినప్పుడు అతి సామాన్యుడిలా శోకించటం నారాయణుడి నరజన్మకు సంపూర్ణత్వం కలిగిందనే చెప్పాలి.. భార్య దూరమయితే విలపించరా? పరిస్థితులను అంగీకరించాలి, వచ్చింది వచ్చినట్లుగా స్వీకరించాలి అనే మాటలను ఆచరణలో చూపిన వ్యక్తి. ‘రేపు నువ్వే రాజువి’ అంటే పొంగిపోలేదు.. ‘కాదు వనవాసివి’ అంటే క్రుంగిపోలేదు.. తమ్ముడు రాజయితే అసూయ పడలేదు. మనిషి జీవితంలో ఒక్క క్షణంలో పరిస్థితులు తారుమారవొచ్చు.. ఏది జరిగినా సంసిద్ధంగా ఉండటమే ఉత్తమ పురుషుని లక్షణం.. ఎక్కడ ఒదిగి ఉండాలో తెలిసిన వ్యక్తి కాబట్టి సుగ్రీవాదుల సాయాన్ని అంగీకరించాడు.. శత్రువైన రావణుడిని గౌరవించాడు. శరణాగతి పొందితే విభీషణుడిలా వదిలేసేవాడు. మాట వినకపోతేనే బాణ ప్రయోగం చేస్తాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎవరినైనా వదిలేస్తానన్నాడు. దేనినైనా సంహరిస్తాడు. ఇన్నెందుకు, మానవ మాత్రుడికి సాధ్యపడని లక్షణాలు కలిగిన ఏకైక మానవుడు ఆ పురుషుడు, ఆ మర్యాదా పురుషోత్తముడు. ఎక్కడా కల్లాకపటం ప్రదర్శించని మహానీయుడు. అందుకే ఆ రాముని కథ జగద్వివిఖ్యాతం. కాదంటే ‘అయ్యో రామ’ అనే అంటాం, ఒప్పుకొంటే ‘రామచంద్ర’ అని సంతోషిస్తాం.
ఆయణం అంటే నడక లేదా ప్రయాణం. రామాయణం అంటే రాముని జీవనమే. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలంటే రామాయణంలో 24000 శ్లోకాలున్నాయి. ప్రతీ వెయ్యి శ్లోకాల తరువాత వచ్చే మొదటి అక్షరాల కూర్పుతో గాయత్రి మంత్రం ఏర్పడినదని చెబుతారు.
రామాయణం ఆనవాళ్ళు ప్రపంచం నలు మూలలా ఉన్నాయి. అందుకే రామనవమి వేడుకలు ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా జరుపుకొంటారు. ‘రామో విగ్రహవాన్ ధర్మ’ అంటే రాముడు ధర్మస్వరూపుడని మరీచుడు చెప్పడం విశేషం. మరి ఏ ఇతర వ్యక్తికి పాత్రకి ఈ ఘనత లేదు. ఏ వ్యక్తి పరిపాలన ‘రామరాజ్యం’గా పరిగణించబడలేదు.. ఒక్క రాముడి పాలన తప్ప. రామరాజ్యం అంటే సుభిక్ష సుసంపన్నం, రాజ్యంకాక్ష లేనే లేదు. లంకను జయించింది రాజ్యవిస్తరణకు కాదు, రామరాజ్యంలో రోగ భయం, చోర భయం ఉండవు. వైధవ్యం కలగదు. కరువు కాటకాలు, ఆకలిచావులు ఉండవు. కానీ రామరాజ్యం అంటే ఇవి కావు.. ఇవి ఫలితాలు.. రామరాజ్యం అంటే కీలకమైన సేనాధిపతి, కోశాధికారి వంటి పదవులలో వ్యక్తిగతమైన ఇష్టాలకు కక్షలకు అతీతంగా వ్యవహరించి సమర్థులను మాత్రమే వినియోగించటం. కీలక పదవులతో అవినీతిపరులని, అసమర్థులని, వాళ్ళు తన బంధువులే అయినా తొలగించటం, ఎల్లవేళలా ధర్మానుష్ఠానాన్ని పాటించటం.. ఇవి చేసినప్పుడు పైన చెప్పబడిన ఫలితాలు కలుగుతాయి.
అయితే అంతా ప్రతికూల దృక్పథమే.. రామరాజ్యం అంత గొప్పదయినప్పుడు ‘అన్నమో రామచంద్ర’ అని ఎందుకు అలమటించారు? అలాంటి వాతావరణం ఏర్పడకూడదు కదా అనే వాళ్ళు ఉన్నారు.. ఈ పదం రామరాజ్యంలో పుట్టింది కాదు.. ఎవరైనా గంట మ్రోగిస్తే శాస్త్రానుసారం వ్యవహరించి న్యాయం చేస్తానని ప్రతిన పూనిన రాముని రాజ్యంలో అన్నార్తులు లేరు.. రాముడిని ఆశ్రయిస్తే కావలసినది దొరికేది. కాని తరువాత కాలంలో అన్నార్తులు ఆహారం కోసం అలమటిస్తూ రామున్ని తలచుకొంటూ ‘అన్నమో రామచంద్ర’ అన్నారే కానీ ఆ పదం పుట్టింది రామ రాజ్యంలో కాదు.. ఇలాగే ఉన్న మరొక ప్రతికూల పదం ‘అలో లక్ష్మణా’. బంగారు లేడిని వెంటాడుతూ రాముడు వెడతాడు.. రాక్షస మాయ రామునికి ఆపద కలిగినటు భ్రమింప చేస్తే సీత లక్షణుడిని నానా మాటలు అని పంపిస్తుంది. లక్షణుడు రాముని చేరుకొంటాడు. సీతకు కాపలగా ఉండవలసిన లక్ష్మణుడు రావడం చూసిన రాముడు అక్కడ తన ఆలి ఎలా ఉందని లక్షణుడిని సంభోదిస్తూ “ఆలి, ఓ, లక్షణా” అంటాడు.. అది కాస్తా ‘అలో లక్ష్మణా’ అయ్యింది. ఎవరెన్ని వక్ర భాష్యాలు చెప్పిన అజరామరం రామనామం.
‘ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక వ్రాయ వడకుండు గావుత, పది కొంపలునులేని పల్లెనైనను రామభజన మందిరముండు వరలు గాత!’ అన్నట్లు రామనవమి వేడుకలు ఊరు వాడా మహాత్సవంగ జరుగుతాయి.. శ్రీరామనవమి పందిళ్ళుకు పెట్టింది. వడపప్పు, పానకం, విసనకర్రెలు.. కోలాహలం కాచాల్సిందే. అయిదువందల సంవత్సరాల పోరాటం ఫలించి అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడు, వేడుకలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోండి. ఇప్పటి వరకు సీతారామ కళ్యాణం అంటే భద్రాచలమే గుర్తొచ్చేది. రామతీర్థం, ఒంటిమిట్టలో కూడా ఉత్సవాలు బాగానే జరుగుతాయి..
సాక్షాత్తు పరమశివుడే నిత్యం జపించే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే విష్ణు సహస్ర నామ జప ఫలితంతో బాటూ శివ సహస్రనామ జప ఫలం కూడా లభిస్తుంది.
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’.
సమాప్తం
పొన్నాడ సత్యప్రకాశరావు కవి, కథకులు. వీరు ఇప్పటి వరకు 69 కథలు, 2 నవలలు, 100కి పైగా కవితలు వ్రాశారు. 2002లీ వీరి నవల “ఊరు పొమ్మంటోంది” స్వాతి అనిల్ అవార్డును గెలుచుకుంది. ఈ నవలని 2010లో సాహితీప్రచురణలు వారు ప్రచురించారు. 2010లో చినుకు ప్రచురణల ద్వారా వీరి కథాసంపుటి “అడవిలో వెన్నెల” విడుదలైంది. వివిధ పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నాన్న ప్రేమ
జీవన రమణీయం-160
స్నేహం.. నేనూ..
రామం భజే శ్యామలం-31
రామ్మూర్తి సంగతులు
మాఊరి పాదముద్రలు
ఉద్వేగం
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-27
నేను.. కస్తూర్ని-13
అమృతవర్షిణి
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®