[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది మొదటి భాగం.]


ప్రశ్నలు:
1.
మల్బరీ చెట్లపై నివాసం
ఆ ఆకులే దాని ఆహారం
తన ఇంటికి ఎవరెళ్లినా
పట్టు బట్టలే పెడుతుంది
2.
మా అమ్మదో కులం
మా నాన్నదో కులం
నాకేమో పిల్లలు లేరు
నేనెవరో చెప్పండి చూద్దాం!
3.
చేటంత చెవులు
చింతాకు కళ్ళు
కొండంత ఒళ్ళు
స్తంభాల్లాంటి కాళ్ళు
చెప్పండెవరో వాళ్లు?
4.
చాక్లెట్లు బిస్కెట్లు దాచుకోవడానికి
జేబు అక్కర్లేదు
పలకా బలపం పెట్టుకోవడానికి
సంచి అక్కర్లేదు
అన్నింటీకీ కంగారు పడుతుంది
ఆస్ట్రేలియా నుంచి వచ్చింది!
5.
చీకటి పడక ముందే
ఇంటికా చేరాలనే తొందరేం లేదు
రాత్రయినా, పగలయినా
చేత దీపం పట్టుకుని తిరుగుతుంది!
6.
మనుష్యుల ముక్కు మీద
కోపం ఉంటే,
దీని ముక్కు మీద
కొమ్ము ఉంటుంది
రౌడీలు కత్తిని చేతిలో పట్టుకుంటే
ఇది కత్తిని తన పేరులో పెట్టుకుంది!
7.
రక్తం తాగుతుంది
రాగాలు ఆలపిస్తుంది
రాత్రి వేళ సంచరిస్తుంది
ఒకరి నుంచి మరొకరికి
జబ్బులు అంటిస్తుంది!
8.
బెదురు చూపుల కళ్ళు
వేగంగా పరిగెత్తే కాళ్ళు
సీతను లంక పాల్జేసిన
మాయా మారీచుడి వేషం
పేరు చెప్పుకోండి పిల్లలూ!
9.
చిటారు కొమ్మనున్న
చిగురాకునైనా తినేస్తుంది
మచ్చల దేహంతో
మెడ పొడుగ్గా ఉంటుంది!
10.
నీళ్లు తాగకుండా
నెలలైనా జీవిస్తుంది
ఎడారిలోనైనా
ఎంతో వేగంగా వెళుతుంది
ఎడారి ఓడ బిరుదాన్ని పొందింది!
జవాబులు:
1. పట్టుపురుగు 2. మ్యూల్ 3. ఏనుగు 4. కంగారు 5. మిణుగురు 6. ఖడ్గ మృగం 7. దోమ 8. లేడి 9. జిరాఫీ 10. ఒంటె

డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.