[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 2వ భాగం.]


ప్రశ్నలు:
11.
రూపేమో నలుపు
అరుపేమో కర్ణకఠోరం
తినేవేమో ఎంగిలి మెతుకులు
తాగేదేమో కుండలో రాళ్ళేసి నీళ్ళు
12.
జిగట చర్మం
మిడిగుడ్లు
వర్షం వస్తే చాలు
కుప్పలు తెప్పలు
13.
పాలు పెరుగు మాయం
ఎలుకలకు సింహ స్వప్నం
మెత్తని అడుగులతో నడకలు
మ్యావ్.. మ్యావ్.. అరుపులు
ఎవరో కనుక్కోండి పిల్లలూ!
14.
కుంచె లాంటి తోకతో హొయలు
చీటికి మాటికి ఉరుకులు పరుగులు
వారధి కట్టడంలో చేసిన సాయానికి
ఒంటిపై రాముడి చేతి చారలు
15.
గ్రీన్ కలర్ శారీ
రెడ్ లిప్‌స్టిక్
నోట్లో జాంపండు
ముద్దు పలుకులు
ఆమె ఎవరు ?
16.
ఎప్పుడూ శీర్షాసనమే వేస్తుంది
చిమ్మని చీకటిని ప్రేమిస్తుంది
తెరచాపల్లాంటి రెక్కలతో ఎగురుతుంది
ఎక్కడ మానవ సంచారం లేకుంటే
అక్కడ అది నివసిస్తుంది
ఎవరో చెప్పండి చూద్దాం?
17.
రాజుల వాహనం
పరుగుతీస్తే వాయువేగం
సైన్యంలో ఒక దళం
18.
చెట్ల కొమ్మలకు
అమృతం వేలాడదీస్తుంది
దాన్నెవరూ దొంగిలించకుండా
సాయుధ సైనికుల్ని
కాపలా పెడుతుంది.
ఎవరో చెప్పండి పిల్లలూ!
19.
అది ఆకులు తింటుంది
దాన్ని మనుషులు తింటారు
అది సంవత్సరమంతా
‘మే’ నెలనే కలవరిస్తుంది
20.
ఎనిమిది కాళ్ళుంటాయి
కానీ సాలీడు కాదు
నీళ్ళలో నివాసముంటుంది
కానీ చేప కాదు
జవాబులు:
11. కాకి 12. కప్ప 13. పిల్లి 14. ఉడుత 15. చిలుక 16. గబ్బిలం 17. గుర్రం 18. తేనేటీగ 19. మేక 20. ఆక్టోపస్

డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.