నాటకాలు తెరమీదకెక్కినప్పుడు ఆ అనుభవం మరోలా ఉంటుంది. ఎన్.ఎఫ్.డి.సి. వారు మహేశ్ దత్తాని రచించిన ‘డాన్స్ లైక్ ఎ మాన్’ నాటకాన్ని అదే టైటిల్‌తో 2004లో నిర్మించారు. ఈ చిత్రానికి పామెలా రూక్స్ దర్శకత్వం వహించారు.
ఈ నాటకానికి మహేశ్ దత్తానికి సాహిత్య అకాడమీ బహుమతి రావటం విశేషం. ఎంతో కాలానికి ఒక నాటక రచయితని సాహిత్యకారునిగా గుర్తించి ఈ పుణ్యం మూటకట్టుకున్నారు ప్రభుత్వం వారు. అలాంటి పురస్కారాన్ని అందుకున్న తొలి నాటక రచయిత మహేశ్ దత్తాని గారు. పామెలా రూక్స్ ఆయన చేత చలనచిత్రానికి స్క్రిప్ట్ వ్రాయించుకోవటం కూడా విశేషంగా చెప్పుకోవాలి. రూపకం అనేది సాహిత్యంలో ఒక అభిన్నమైన అంగం. కవులు, రచయితలు ఒక దృశ్యాన్ని వారి రీతిలో దర్శించిన తరువాత కాగితం మీద కలం పెడతారు. ఏదైనా చదువుతున్నప్పుడు మనకు దృశ్యమే కనిపిస్తుంది. అంచేత కాళిదాసు ‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు. కాకపోతే మన బుద్ధిజీవులు నాటకకర్తలను ‘కావ్యాల’ నుండి దూరం చేసి అసలు సాహిత్యానికే తీరని మచ్చ తెచ్చారని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది.
‘డాన్స్ లైక్ ఎ మాన్’ ఎన్నో ఆలోచించవలసిన అంశాలను ఇతివృత్తంగా తీసుకుంటుంది. ఒక పురుషుని నాట్యంలో ఒక అనుకోని వైపరీత్యాన్ని దర్శింపజేస్తుంది. భరతనాట్యం అనేది ఎన్నో తరాలను, అంతరాలను దాటి ఒక కళారూపంగా ఈ రోజు ‘ఒకలా’ నిలబడి ఉంది. సామాజికపరంగా నృత్య కళ విషయంలో ప్రతి రచయితకు ఎన్నో ఆలోచింపజేసే అంశలు కనిపిస్తాయి. ముఖ్యంగా దేవదాసీ వ్యవహారం… ఈ అంశం ఎందరినో ఆకర్షించింది. స్త్రీతో పెట్టుకునే అక్రమ సంబంధం ఈ ప్రక్రియ ద్వారా ఒక కళాపోషణ రంగు పూసుకుని చాలా కాలం చెలామణి అయిపోయింది. మరో ప్రక్క నృత్య కళను అభ్యసిస్తూ జీవనోపాధిని సంపాదించుకుంటూ, ఇంకెందరికో ఆ కళను నేర్పుతూ సమాజానికి దూరంగా ఉండే దేవదాసీలు ఉన్నత వర్గాలు కళల పట్ల చూపించే అభిమానాన్ని, ఆదరాన్ని ఏ విధంగా ఆదరిస్తారు అనేది ఎప్పటికైనా అందరినీ కదిలించే విషయమే.
అదాలా ఉంచి స్త్రీ-పురుషుల మధ్య ఉండే సమస్యలు, పోటీలు, దృక్పథాలు ఇలాంటివి కథకు తోడై స్టేజ్ మీద తిల్లానాకు చేసిన అభినయంలా ముందరికి సాగిపోతాయి.
కేరళ నటుడు మోహన్‌లాల్‌తో వచ్చిన ‘వానప్రస్థం’ కూడా కథకళి సంప్రదాయంతో మొత్తం క్లాస్ వార్ని చూపిస్తుంది. ‘డాన్స్ లైక్ ఎ మాన్’ చిత్రం మామూలు దైనందిన జీవితంలో ఉండే విషయాలతో చాలా సింపుల్‌గా నడచిపోతుంది. కాకపోతే, గతంలోని సంఘటనలు మధ్య మధ్యలో కనిపిస్తూ ఒక చక్కని లయలో కలిసిపోతాయి.
ఈ నాటకం, చలన చిత్రం – రెండూ ఆంగ్లంలో ఉంటాయి. అమృత్లాల్ పారెఖ్ (మోహన్ అగాషె) ఆయన కుమరుడు జయరాజ్ పారెఖ్ (ఆరిఫ్ జకారియా) నృత్యం చెయ్యటం ఏ మాత్రం ఇష్టపడడు. అయినప్పటికీ తండ్రిని ఎదిరించి నృత్యం నేర్చుకుని ఆ రంగానికి చెందిన రత్న పారెఖ్ (శోభన)ను వివాహం చేసుకుంటాడు. కోడలు నృత్యం నేర్చుకునేందుకు దేవదాసీల వద్దకు వెళ్ళటం పెద్దాయనకు ఇష్టం ఉండదు. ఇంటికే గురువుని రానిస్తాడు. కానీ ఒక వ్యూహాన్ని పన్నుతాడు. కొడుకు ఈ నృత్యం వలన పురుషునిగా ప్రవర్తించటం మానేస్తున్నాడని తలచి కోడలితో ఒప్పందానికి వచ్చి కొడుకును నృత్యానికి దూరం చేస్తూ వస్తాడు. కోడలు అవకాశాన్ని పురస్కరించుకుని అతనిలోని కళను నిర్వీర్యం చేస్తూ వస్తుంది. అమృత్లాల్ ఒక గొప్ప సంఘసంస్కర్తగా పేరున్నవాడు. అంచేత శోభన తన ఇంట్లోకి రావటాన్ని స్వీకరించినా, ఆ ‘కళ’కు అంకితమవుతున్న కొడుకు వ్యవహారం అతనికి కళంకంగా మారుతున్న ప్రక్రియ. ఈ దుగ్ధ అతన్ని నమిలేస్తూ ఉంటుంది. ఇది ఈ ఇతివృత్తానికి ఆయువుపట్టు – “ఒక పురుషుని ప్రపంచంలో స్త్రీ పురోగమనానికి చిహ్నం…” అని చెబుతాడు. “… కానీ ఒక పూర్తి స్త్రీపరమైన లోకంలో ఒక పురుషుడు దీనుడు గానే మిగులుతాడు!”.
ఈ సరళిలో జయరాజ్ ఊగిసలాడుతూ మద్యానికి బానిస అవుతాడు. రత్న మటుకు తన కెరియర్ చూసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళ కుమార్తె లతను (అనుష్క శంకర్) కూడా ఆమె భవిష్యత్తులో గొప్ప నర్తకి కావాలని ఆశిస్తూ ఎంతో కృషి చేస్తూ ఉంటుంది. విశాల్ (లత స్నేహితుడు) ఇంటి అల్లుడు కావాలని ఇంట్లో ప్రవేశిస్తాడు.
ఇక్కడ ‘పురుషుని’ విషయంలో ఒక ఆసక్తికరమైన అంశం ముందుకు వస్తుంది. మొదటిది ప్రకృతితో లయబద్ధంగా కలిసి చేసే ‘ఆనందతాండవం’; రెండు, ఆ కలయికలోని పరవశంలో పురుషుడు చేసే విలయతాండవం! అసలు పురుషునికి ‘లయ’ ఎవరు?
బాగుంది. విశాల్, లతను తెలిసినంత మేరకు ప్రోత్సహించటం జయరాజ్‌ని ఆలోచింపజేస్తుంది. అమృత్లాల్ తన కొడుకు నాట్యానికి దూరమై పురుషునిలా తన కనపడటం ఆనందదాయకమైనా, జయరాజ్ తన పూర్తి ప్రపంచాన్ని పోగొట్టుకుంటాడు. చివరకు ఓ బాధాకరమైన గతం ముందరికి వస్తుంది – జయరాజ్ కొకైన్కు అలవాటు పడ్డ రోజులలో చిన్ని శిశువు (శంకర్)కు ఆయా తెలియక నిద్రపుచ్చేందుకు ఇచ్చిన కొకైన్ అతని ప్రాణాలను బలి తీసుకుంటుంది.
అది గుర్తు తెచ్చుకుని కలవరపడుతూ ఉంటాడు జయరాజ్. అక్కడ స్టేజ్ మీద లత తన నృత్య విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. లత, విశాల్, ఆ పెద్ద ఇంటిని కూలగొట్టించే పనిలో ఉంటారు. ఒక ‘పురుషుని’ ప్రపంచం నేల కూలిపోతూ ఉంటుంది!
ఇందులో నటించిన వారందరూ ఎంతో సునాయాసంగా నటించారు. నృత్య ప్రధానమైన అంశాన్ని చక్కని మృదంగ ధ్వనులతో నడిపారు. సంగీతం ఆకట్టుకుంటుంది. దుస్తులు ఇంపుగా ఉన్నాయి (హిమానీ దెహల్వీ). కెమెరా పట్టుకొన్న ఆనంద్ కుమార్ ఎక్బోటే, ధ్వని అందించిన ఫైజల్ మజీద్ అందరూ రాణించారు. ఆరిఫ్ జకారియా, శోభనతో తీసిపోకుండా నటించటం, నృత్యం చేయటం రెండూ విశేషాలే!
పామెలా రూక్స్ ‘ట్రెయిన్ టు పాకిస్తాన్’, ‘మిస్ బీటీస్ చిల్డ్రన్’ చిత్రాల ద్వారా పేరు సంపాదించారు. ఈ చిత్రంలో ఆవిడ ఒక సంక్లిష్టమైన విషయాన్ని తెరమీదకు ఎంతో సునాయాసంగా తీసుకురాగలరని నిరూపించారు!
ఫ్లాష్‌బాక్, ఇంట్రా డయజెటిక్ నెరేటివ్ వంటివి రెండు గంటల నిడివిలో ఎలా వాడుకోవచ్చో ఈ చిత్రం ద్వారా చూడగలం. కాకపోతే ఒక పాత్రను పూర్తిగా ఎంచుకుని ట్రాజెక్టరీ వెయ్యకపోవటం వలన కథాంశం పలుచనైపోయిందా అనే అలోచన కలుగుతుంది!
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™