[బాలబాలికల కోసం జంతువుల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 8వ భాగం.]


ప్రశ్నలు:
71.
కిరీటం లేకున్నా అడవికి రారాజు
ఆయుధం లేకున్నా దాని కెదురు లేదు
గర్జించిందా అన్నీ హడలి చావాల్సిందే
72.
నేను పక్షినే కాని ఎగరను
నా పేరులో నిప్పుంటుంది కానీ మండను
నేను పెట్టే గుడ్డు మాత్రం చాలా పెద్దది
నా పేరెంటో చెప్తారా నేస్తాలూ?
73.
నీలంగా ఉంటాను
నీళ్ళలో ఉంటాను
జంతు జాలమంతటికీ
పెద్ద జంతువును
నేనెవరో గుర్తించండి
74.
నీళ్ళపై నడుస్తుంది
నింగిలో ఎగురుతుంది
ఒంటికాలితో జపం
శ్వేత వర్ణంలో రూపడను
75.
దీని గూటికి
ప్రపంచంలోనే లేదు సరిజోడు
దీని ఇంటిప్లాను
ఏ ఇంజనీరూ గియ్యలేడు
76.
మనిషిని కుట్టి
తాను చస్తుంది
ఐకమత్యానికి
ప్రతీకగా నిలుస్తుంది
77.
పేరు గుర్రమే
కానీ పరిగెత్తలేదు
ఉండేది సముద్రమే
కానీ చేప కాదు
78.
చాకలి మూటలు మోసే కూలీని
రోజంతా చాకిరీ చేసే పనిమనిషిని
నా సంగీతాన్ని ఎగతాళి చేశారో
నా వెనక కాళ్ళతో తంతాను
79.
రూపంలో గుర్రాలకు దాయాది
గీతల్లో పులికి వేలువిడిచిన చుట్టం
మనుషులు రోడ్డు దాటేందుకు
ఈ గీతలే మరి ఆధారం
80.
ఆర్కిటిక్‌లో నివాసం
సీల్లు దాని ఆహారం
ఐస్‌లో ఆటలు ఇష్టం
శ్వేతవర్ణపు సాగర క్షీరదం
పేరు చెప్పండి చూద్దాం?
జవాబులు:
71. సింహం 72. నిప్పుకోడి 73. నీలి తిమింగలం 74. కొంగ 75. గిజిగాడు 76. చీమ 77. సీహార్స్ 78. గాడిద 79. జీబ్రా 80. ధృవపు ఎలుగుబంటి

డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.