[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]


[హుజూరాబాద్‌లో తమకెదురైన అనుభవాల గురించి తండ్రికి ఉత్తరం రాస్తాడు రాఘవ. సెలవలకి తాను ఇంటికి రావడం లేదని, వెయ్యిస్తంభాల గుడి, మహంకాళి దేవాలయం, భద్రాచలం, రామప్పగుడి, పర్ణశాల మొదలైన ప్రదేశాలకి వెళ్ళాలనుకుంటున్నట్టు తెలియజేస్తాడు. అనుకున్నట్టుగానే సంక్రాంతి రోజున భద్రాచలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాడు. రాములవారి వద్ద హనుమ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. రాముడికి నిజమైన భక్తుడెవరా అని ఆలోచిస్తాడు. కన్యాకుమారిలో రామాయణం గురించి బాబాయ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అక్కడ్నించి పర్ణశాలకు బయల్దేరుతాడు. ఫిభ్రవరి వస్తుంది. ఎండలు మండిపోతుంటాయి. ఒకరోజు ఉదయం ఐదుగంటలు కావస్తున్నా రాఘవ మాత్రం పడకనుండి లేవడు. చల్లా రవి వచ్చి రాఘవ చేతిని పట్టుకుని కుదిపి చూస్తే, మెల్లగా ములుగు వినబడుతుంది. వెంటనే వాడు వెళ్ళి మోహనరావుకి చెప్తాడు. ఆయన వచ్చి రాఘవని లేపడానికి ప్రయత్నించి, నుదుటి మీద చెయ్యి పెట్టి చూస్తే, జ్వరం ఉందని గ్రహించి, సరే పడుకోనీలే అనుకుని వెళ్ళిపోతాడు. వంట మాస్టరు వెంకటయ్య రాఘవ కోసం ఎదురుచూస్తుంటాడు. ఎంతకీ రాకపోయేసరికి అంకయ్య భార్యని చూసి రమ్మంటాడు. ఆమె వచ్చి రాఘవని పరిశీలించి, రాఘవకి అమ్మవారు పోసిందని చెప్తుంది. దాంతో, రాఘవని తమ గదికి తీసుకురమ్మంటుంది. ముందు తాను వెళ్ళి తమ గదిని శుభ్రం చేస్తుంది. పది నిమిషాల తర్వాత రాఘవని అక్కడికి తీసుకువెళ్తారు. అక్కడ నేల మీద పరిచిన తెల్లటి చీర మీద పడుకోబెడతారు. ఆ రోజునుంచి అంకయ్య భార్య రాఘవకి పరిచర్యలు చేస్తుంది. ఎనిమిది రోజుల తర్వాత రాఘవకు తగ్గుతుంది. మర్నాడు మొదటి తలంటు స్నానం చేయిస్తుంది. ఓ తల్లిలా ఆమె చేసిన సేవకు మనసులో నమస్కరించుకుంటాడు రాఘవ. – ఇక చదవండి.]
37. హైదరాబాద్‌లో శిక్షణ
రాఘవకు అమ్మోరు దిగిపొయ్యాక మళ్లీ తన నిలయానికి వెళ్లిపొయ్యాడు.
పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యి, మిగతా తరగతుల వారికి వార్షిక పరీక్షలు మొదలయ్యాయి.
మరుసటిరోజు జరగబోయే పరీక్షకు పిల్లలు చదువుతుంటే రాఘవ అటుఇటు తిరుగుతూ వాళ్లను పర్యవేక్షిస్తున్నాడు.
‘‘రాఘవగారూ మిమ్మల్ని ప్రధానాచార్యులు పిలుస్తున్నారు.’’ వచ్చి చెప్పాడు గుమస్తా.
ఇద్దరూ ఆఫీసుకు చేరుకున్నారు.
ఏదో ఫైల్‌ను చదువుతున్న ప్రధానాచార్యులు వీళ్ల రాకతో తల పైకెత్తారు.
‘‘రండి రాఘవగారూ, కూర్చోండి! ఇందాకే హైదరాబాదు నుండి తపాలా వచ్చింది. మే 1 నుండి హైదరాబాదులో కొత్తవాళ్లకు శిక్షణ ఉంటుందని మీకు తెలుసు కదా! దాని తాలూకు ఉత్తరమే ఇది. నేనూ, కార్యదర్శీ మాట్లాడుకుని మీ పేరును సూచించాము. మీకు శిక్షణలో పాల్గొనేందుకు అనుమతి లభించింది. మీకు అక్కడ తెలుగు, దానితో పాటుగా సంస్కృత భాషలో కూడా శిక్షణను ఇస్తారు. శిక్షణలో ప్యాసయ్యినవాళ్లను శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తూ వాళ్లకు జీతపు స్కేలును కూడా నిర్ణయిస్తారు. మీకు సంతోషమే కదూ..’’ అంటూ రాఘవ వైపు నవ్వుతూ చూశారు ప్రధానాచార్యులుగారు.
రాఘవ కూడా తనకు సంతోషమే అన్నట్టుగా నవ్వుతూ తలూపాడు.
‘‘నిజానికి కొత్తవాళ్లు ముందుగా రాతపరీక్ష రాయవలసి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైనవాళ్లకే శిక్షణనిస్తారు. కానీ మీరు రాతపరీక్ష రాయకపోయినా మీరు శిక్షణకు అర్హులయ్యారు. ఎలాగనుకుంటున్నారు?’’ అంటూ ప్రశ్నించారు.
‘‘మీరు నా పేరును సూచించారుగా, అందుకు..’’
‘‘కాదు రాఘవగారూ, మీరు ఏడాదిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారుగా. దాన్నే అర్హతగా భావించి రాత పరీక్షనుండి మిమ్మల్ని మినహాయించారు. ఏది ఏమైనా మీరు శిక్షణను దిగ్విజయంగా పూర్తిచెయ్యండి. సరేనా, ఇంకేమైనా అనుమానాలున్నాయా?’’
‘‘ఆచార్యజీ.. తెలుగులో శిక్షణ సరే, సంస్కృతం అంటున్నారు. నాకస్సలు సంస్కృతం రాదే.’’
‘‘భయపడకండి. తెలుగు బోధించేవాళ్లే సంస్కృతం కూడా చెప్పాలన్నది మన విద్యానికేతనం వారి నిర్ణయం. మీకు అక్కడ అన్నీ వివరంగా బోధిస్తారు. భయపడాల్సిన పనేమీలేదు.’’
‘‘అలాగే ఆచార్యజీ.’’ అంటూ నిశ్చింతపడ్డాడు రాఘవ.
‘‘ఇంకో విషయం. ఎల్లుండి నుండి వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి కదా, మీరు మీ సొంతూరికెళ్లి అటునుండి అటే మే1వ తారీఖుకల్లా హైదరాబాద్ చేరవచ్చు. లేదూ ముందుగా వెళ్లి కూడా చేరవచ్చు.’’
‘‘లేదు ఆచార్జీ. నేను మా ఊరికి వెళ్లటం లేదు. రైలు చార్జీలు వృథా. పైగా నేను అక్కడికెళ్లి చేసేదేమీ కూడా లేదు. అందుకే ముందుగానే హైదరాబాద్ వెళదామనుకుంటున్నాను.’’
‘‘మంచిది, ముందుగా వెళితే అక్కడి పరిస్థితులు మీకు బాగా అలవాటవుతాయి! ఇక్కడి లాగానే అక్కడ కూడా ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునేంతవరకూ తరగతులు ఉంటాయి. మీరిక్కడ ఇప్పటికే అలవాటుపడ్డారు కనుక మీకేమీ ఇబ్బందులు రాకపోవచ్చు.’’
‘‘అవును ఆచార్యజీ..’’
‘‘అయితే మీరు త్వరగా పరీక్ష పేపర్లు దిద్ది ఇచ్చేసి హైదరాబాద్ బయలుదేరండి మరి.’’ అంటూ రాఘవను ఉత్సాహపరిచారు.
అనుకున్నట్టే రాఘవ త్వరగా పేపర్లు దిద్దేసి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లాడు.
హైదరాబాద్‌లో అడుగుపెడుతుంటే అతనికేదో కొత్తగా, వింతగా అనిపించింది. హైదరాబాద్‌ను చూడటం అతనికి అదే మొదటిసారి. ఇప్పటిదాకా అతను పనిచేసిన తామరగుంటలో మనుషులు కనిపించటమే అరుదు. ఇక్కడ ఎటుచూసినా మనుషులే. జనారణ్యం. సిటీ బస్ ఎక్కి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాడు రాఘవ.
కార్యాలయంలో ప్రధానాచార్యులు రాసిచ్చిన ఉత్తరాన్ని చూపించాడు.
వాళ్లు అతనికి స్వాగతం పలికారు. అతనికి ఒక పెద్ద హాలును చూపించారు. అందులోకెళ్లి అతని సూట్‌కేస్‌ను సర్దుకోమని చెప్పారు. అప్పటికే అక్కడ ఒకళ్లిద్దరు కనిపించారు. వాళ్లంతా అక్కడే ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా ఉన్న పాఠశాలలో పనిచేస్తున్నవాళ్లుట. రాఘవకు అందరితోనూ పరిచయాలయ్యాయి.
సుమారు యాభై ఎకరాలలో విశాలంగా నిర్మించబడి ఉంది ప్రధాన కార్యాలయం. పక్కనే సరస్వతీదేవి దేవాలయం. ఒకేసారి వెయ్యిమందైనా కూర్చుని భోజనం చేసేటంత భోజనశాల. పక్కనే విశాలమైన తరగతి గదులు. అందరూ ఒకేసారి కూర్చుని ఉపన్యాసం వినేంత పెద్ద మైదానం.
అక్కడి నిర్మాణాలు చూడటానికి రెండు కనులూ చాలటం లేదు.
మరునాడు ఆ విద్యానికేతనం ప్రధాన కార్యదర్శితో ఒక చిన్న సమావేశం కూడా జరిగింది. రాఘవను ప్రశంశిస్తూ.. నిరుద్యోగ సమస్యతో బాధపడేవారికి తమ సంస్థ ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతుందని, రాఘవ మిత్రులెవరైనా నిరుద్యోగులుగా ఉంటే వచ్చి సంస్థలో చేరమని సూచించారు. అటువంటివాళ్లెవరూ లేరని గుర్తుచేసుకున్నాడు రాఘవ.
వారం రోజులపాటు.. రానున్న శిక్షణార్థుల కోసం చెయ్యవలసిన ఎన్నో ముందస్తు పనులలో సాయపడ్డాడు రాఘవ. దాంతో సమయం గడవటమే తెలియలేదు అతనికి.
ఏప్రిల్ 30న ఉదయం నుండే శిక్షణార్థులు అక్కడికి చేరుకోవటం మొదలుపెట్టారు. వాళ్లకు గదులు కేటాయించే పనుల్లో సాయపడ్డాడు రాఘవ.
ఆరోజు సాయంత్రానికి దాదాపు తొంభైశాతం మంది శిక్షణార్థులు ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
నిన్నటిదాకా బోసిపోయి కనిపించిన విద్యానికేతనం, ప్రస్తుతం ప్రాంగణమంతా సందడిగా తయారైంది.
వారం రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతమంతా ఇప్పుడు మనుషుల మాటలతో గోలగోలగా మారిపోయింది.
మే1, ఉపాధ్యాయ శిక్షణా శిబిరంలో మొదటిరోజు.
ఉదయం అల్పాహారం అయ్యాక 9 గంటలకు అందరూ మైదానంలోకి వెళ్లి వరుసగా నేలమీద కూర్చున్నారు.
ఒక వ్యక్తి హార్మోనియం వాయిస్తుండగా సరస్వతీ శ్లోకంతో ప్రార్థన మొదలైంది. రోజూ పాడే ప్రార్థన కనుక వచ్చిన వాళ్లందరూ తమ గళాన్ని కూడా దానితో జత కలిపారు. తర్వాత ప్రధాన కార్యదర్శి ఉపన్యాసం మొదలైంది.
ఏ ఉద్దేశంతో విద్యానికేతనాన్ని ప్రారంభించిందీ, నిరుద్యోగులకు అది ఎలా ఉపయోగపడుతున్నదీ, సమాజంలో సత్సంప్రదాయాలు, అలవాట్లును భావి తరాలకు అందిస్తూ వాళ్లను ఎలా భావి భారత పౌరులుగా తీర్చుదిద్దుతున్నదీ అన్నీ వివరించారు. రేపటి నుండి శిక్షణాకాలం ఎలా ఉండబోతున్నదీ, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకూ ఉన్న కాలాంశాలన్నింటినీ ఎలా సద్వినియోగం చేసుకోవలసిందీ అన్నీ వివరంగా తెలిపారు.
మధ్యాహ్నం, రాత్రి భోజనాల సమయాలు, వడ్డన డ్యూటీలు, అప్పుడెలా నడుచుకోవాలి.. ఇత్యాదివన్నీ తెలిపారు. అన్ని వందలమంది మధ్యన కూర్చుని ఉపన్యాసం వినటం రాఘవకు ఒక కొత్త అనుభూతినిచ్చింది.
ఉపన్యాసం ముగియటానికి రెండు గంటల సమయం పట్టింది. మధ్యలో కొంత విరామాన్ని ఇచ్చారు. అప్పుడు ఒక కొత్త దేశభక్తి గీతాన్ని నేర్పించటం జరిగింది. తర్వాత మరికొందరు ప్రముఖులు కూడా ప్రసంగించారు.
మరుసటిరోజు ఉదయం ఐదుగంటలకు స్పీకరులో దేశభక్తి గీతం వినిపిస్తుంటే రాఘవకు మెలకువ వచ్చింది.
గబగబ లేచి తయారై యోగా క్లాసుకు వెళ్లాడు. రెండుగంటలసేపు వ్యాయామాలు, ఆసనాలు నేర్పించారు. తర్వాత కొంత విరామమిచ్చారు. ఆ విరామంలో కాలకృత్యాలు, స్నానాలు పూర్తిచేసి అందరూ అల్పాహారానికి వెళ్లారు.
అల్పాహారం పూర్తయ్యాక తొమ్మిది గంటలకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.
తెలుగుకు సంబంధించిన తరగతులు చాలా ఆహ్లాదకరమైన పద్యాలతో మొదలయ్యి అందరినీ ఆనందానికి గురిచేసింది.
ఆ మధ్యాహ్నం మొదటి సంస్కృతం తరగతి ప్రారంభమైంది. సంస్కృతాచార్యుడు అందరినీ ఒకసారి పరీక్షగా చూసి ‘‘మీరంతా సంస్కృతానికి కొత్త అని నాకు తెలుసు. ఈ భాషను చూసి చాలామంది దీన్ని నేర్చుకోవటం చాలా కష్టమనుకుంటారు. పలకటం ఇంకా ఇంకా కష్టమనుకుంటారు. అదంతా ఒట్టి అపోహ మాత్రమే. సంస్కృతం చాలా సులభమైన భాష. సులభంగా నేర్చుకోగలిగిన భాష. నేర్చుకుంటూంటే కష్టం అనిపించనే అనిపించదు. ఇప్పుడు నేను మీకొక సవాలు విసురుతున్నాను. ఈ కాలాంశం ముగిసేసరికి మీ అందరిచేతా నేను సంస్కృతంలో మాట్లాడిస్తాను. అలా మాట్లాడించలేకపోతే నేను ఈ ఉపాధ్యాయ వృత్తినే వదులుకుంటానని తెలియజేస్తున్నాను. ఏమంటారు? సరేనా?!’’ అని అందరి వైపూ చూశాడు.
అందరిలోనూ ఆశ్చర్యం నెలకొంది. ఇవ్వాళే సంస్కృతం నేర్చుకుంటున్న మొదటిరోజు. ఇవ్వాళే తామెలా సంస్కృతంలో మాట్లాడగలం? అందరిలోనూ అదే ఆసక్తి నెలకొంది.
ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తేగానీ మాట్లాడగలిగే పరిస్థితి రాదు, అలాంటిది మొదటిరోజే మాట్లాడిస్తాను అంటున్నాడే. అదీ చూద్దాం. అనుకుంటూ అతను చెప్పే విషయాలను శ్రద్ధగా వినసాగారు.
అతను మొదట ఇలా చెప్పాడు: ‘‘మమ నామ పురుషోత్తమ ఆచార్యః’’ అని.. ‘‘ఏదీ, నేను చెప్పేవాళ్లు లేచి వాళ్ల పేర్లను ఇలా పలకండి.’’ అన్నాడు. కొందరు లేచి వాళ్ల వాళ్ల పేర్లను సంస్కృతంలో చెప్పారు.
అతను కొన్ని వస్తువుల పేర్లను వరుసగా చెబుతూ బోర్డుమీద ఇలా రాశాడు.
బంతి=కందుకం, పుస్తకం=గ్రంథం, పెన్=కలం, గడియారం=ఘటీ, దువ్వెన=కంకతం, రుమాలు= కరవస్త్రం, కళ్లద్దాలు=ఉపనేత్రం.. అలా చాలా పదాలను రాశాడు.
అలాగే కొన్ని క్రియా పదాలను రాశాడు. పఠామి=చదువుతున్నాను, ఖేలామి=ఆడుతున్నాను, పిబతి=తాగుతున్నాను, గచ్ఛామి=వెళుతున్నాను, ఇలా..
ఇప్పుడు వాటిని కలుపుతూ కొన్ని ఉదాహరణలను చెప్పాడు. అహం పుస్తకం పఠామి, సః కందుకం ఖేలతి, ఇలా
అలాగే అందరిచేతా చెప్పించాడు. అందరూ పోటీలుపడి చేతులెత్తి మరీ సంస్కృతంలో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
అందరిలోనూ సంస్కృతం అంటే ‘ఇంత సులభమా’ అనిపించింది. ఆ ఆచార్జీని అందరూ ఆరాధనగా చూశారు.
రోజులు గడిచేకొద్దీ తెలుగు చెప్పే ఆచార్యులందరూ సంస్కృతం కష్టం కాదనే అభిప్రాయానికి వచ్చారు.
ఎలాగైతేనేం రాఘవ నెలరోజుల శిక్షణను విజయవంతంగా పూర్తిచేశాడు. వాళ్లు నిర్వహించిన రాతపరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. జూన్ 7వ తేదీన ఎవరెవరు ఆచార్యులుగా ఎన్నికైన తుది ఫలితాలను ప్రకటించారు.
ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టింగు ఇచ్చారో ఆ జాబితాను కూడా బోర్డులో అంటించారు.
మంచి ఉచ్చారణతో చక్కగా సంస్కృతాన్ని పలుకుతున్న రాఘవకు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయపు అనుబంధ పాఠశాలలోనే పోస్టింగు ఇచ్చారు.
రాఘవ జాబితాను చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాడు.
38. తుది వీడ్కోలు
శిక్షణ పూర్తయ్యేంత దాకా రాఘవ ఇంటికి ఉత్తరం రాయలేదు.
ఇప్పుడు తనకు ప్రధాన కార్యాలయ అనుబంధ పాఠశాలలోనే పోస్టింగు ఇచ్చారనీ, తానిక హైదరాబాదులోనే ఉంటాననీ, అక్కడి చిరునామానూ తెలుపుతూ.. తండ్రికి ఉత్తరం రాశాడు.
పాఠశాలలు పునఃప్రారంభయ్యేదాకా ఆగి, రెండు రోజులు సెలవు పెట్టి ఈ విషయాన్ని వరంగల్ బాబాయ్‌కి, వాళ్ల బావగారికీ, తామరగుంట ప్రధానాచార్యులకు, మిగతా ఆచార్యులకు నేరుగా తెలియజెయ్యాలని బయలుదేరి వెళ్లాడు.
హరిజనవాడ బస్టాపు దగ్గర దిగి పాఠశాలకేసి నడుస్తూ ఉంటే.. జీవితం పట్ల ఎంతో నమ్మకాన్నీ, గొప్ప విశ్వాసాన్నీ, ఆత్మస్థైర్యాన్నిచ్నిన ఆ పాఠశాలను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. దాన్ని నిగ్రహించుకుంటూ పాఠశాలలోకి అడుగుపెట్టాడు.
తనకు బదిలీ అయిన విషయాన్ని విని మిగతా ఆచార్యులందరూ ఎంతగానో సంతోషించారు. ప్రధాన పాఠశాలలో పని చెయ్యటం తమందరి కల అని చెప్పారు.
అక్కడ పనిచెయ్యటం గర్వించతగ్గ విషయమని ప్రధానాచార్యులు కూడా మెచ్చుకున్నారు.
రాఘవకు హైదరాబాద్ బదిలీ అయ్యిందని తెలుసుకుని చల్లా రవి పరుగుపరుగున వచ్చి అతని చేతిని పట్టుకుని.. ‘‘ఆచార్జీ, ఇక మీరు ఇక్కడికి రారా, మాకు పాఠాలు చెప్పరా?’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అతణ్ణి చూసి మరికొందరు పిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
పిల్లల కన్నీటిని చూసి రాఘవకూడా తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపొయ్యాడు.
వాళ్లకు దూరం కాలేనని అందరినీ తన రెండు చేతులతో దగ్గరకు తీసుకుని అతనూ కన్నీటి పర్యంతమయ్యాడు. తర్వాత తనను తాను నిగ్రహించుకుంటూ వాళ్లను ఓదార్చాడు.
రాఘవ అక్కడి టీచర్లతో కలిసి ఎన్నో విషయాలను కలబోసుకున్నాడు. ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. మరునాడు రాఘవ తిరుగు ప్రయాణమయ్యాడు.
అందరూ తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండమని చెప్పి మరీ సాగనంపారు.
చల్లా రవి ఏడుస్తూ ఒక మూలన కూర్చున్నాడు. కానీ రాఘవ వెళ్లిపోతుంటే మనసొప్పుకోక గుమ్మం దగ్గరికొచ్చి పిల్లలందరితోపాటు వాడూ చేతులూపుతూ కన్నీళ్లతో వీడ్కోలు పలికాడు.
రాఘవ వెనక్కు తిరిగి అందరినీ చూస్తూ చేతులూపాడు.
ఊళ్లోకెళ్లి.. ‘బాబాయ్ బావగారికి’ కూడా విషయం తెలిపి తన కృతజ్ఞతలను తెలిపాడు.
తర్వాత వరంగల్ బస్సెక్కి బాబాయ్ ఇంటికెళ్లాడు. ఆయన ఆత్మీయ పలకరింపుకు ఆనందిస్తూ తన బదిలీ విషయం చెప్పి ఎందుకో మళ్లీ భావోద్వేగానికి గురయ్యాడు రాఘవ.
ఆయన అతడి భుజం తడుతూ..‘‘ఇలాగే పైపైకి వృద్ధిలోకి రావాలి’’.. అని మనస్పూర్తిగా ఆశీర్వదించాడు.
ఆయన దగ్గరకూడా సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు.
మాధవరెడ్డి బస్టాండుకొచ్చి అతణ్ణి బస్సెక్కించాడు.
బస్సు బయలుదేరే ముందు కొంతడబ్బు తీసి బలవంతంగా రాఘవ జేబులో కుక్కాడు మాధవరెడ్డి.
(ఇంకా ఉంది)

1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్‌కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).