[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]


[ఓ రోజు రాఘవని చూడడానికి చిన్నక్క శాంత వస్తుంది. పెళ్ళి చేసుకోమని తమ్ముడికి గట్టిగా చెబుతుంది. అక్క ఉన్నన్నీ రోజులు రాఘవకి విశ్రాంతి దొరుకుతుంది. శాంత వాళ్ళ ఊరెళ్ళిపోతుంది. ఒకరోజు రాఘవ ఒంట్లో బావుండదు. బారెడు పొద్దెక్కినా తలుపు తెరవకపోయేసరికి పక్కింటి మునిరత్నం వచ్చి తలుపు తడతాడు. రాఘవ మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీస్తాడు. రాఘవకి జ్వరంగా ఉండడం చూసిన మునిరత్నం డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు. ఆయన పరీక్షలు చేసి టైఫాయిడ్ అని తేల్చి మందులు రాసిస్తాడు. పది రోజులు బాధపడి, కోలుకుంటాడు. శాంతక్క తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పేస్తాడు. నీరజ, రాఘవల వివాహమవుతుంది. చిత్తూరులో ఉద్యోగాలు సరిగా లేవని, తిరుపతికి మకాం మారుద్దామని భావిస్తాడు రాఘవ. ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బును అక్కలకూ, తమ్ముడికీ భాగాలు పంచి తన భాగానికొచ్చిన డబ్బును బ్యాంకులో దాచుకుంటే కుటుంబానికి ఆసరగా ఉంటుందని తలుస్తాడు రాఘవ. ఇల్లును అమ్మగా వచ్చిన డబ్బులో తమకెలాంటి భాగమూ అక్కర్లేదని రాఘవ అక్కలూ, తమ్ముడు చిన్నా ఆ ఇంటిపై తమకున్న హక్కును వదులుకుంటున్నట్టుగా డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తారు. ఇంటిని అమ్మకానికి పెడతాడు. అయినా పెద్దగా బేరాలు రావు. తిరుపతిలో ఓ కాన్వెంటులో టీచర్ ఉద్యోగం దొరుకుతుంది రాఘవకి. భార్య నగలు తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బుతో తిరుపతిలో కాపురం పెడతాడు. టీచరు ఉద్యోగం బానే ఉంటుంది. రోజులు గడుస్తున్నా, చిత్తూరులో ఇల్లు అమ్ముడుపోదు. నీరజ గర్భం దాలుస్తుంది. రాఘవ ఎంతో సంతోషిస్తాడు. ఓ రోజు బాత్రూమ్లో కాలు జారి పడడం వల్ల గర్భస్రావమవుతుంది నీరజకి. చాలా దుఃఖిస్తుందామె. – ఇక చదవండి.]
47. తోడు – నీడ
నీరజకు గర్భస్రావమైన విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు కూతుర్ని చూడటానికి వచ్చారు. మంచంపై పడుకోనున్న నీరజ తల్లిని చూడగానే “అమ్మా..” అంటూ ఏడుస్తూ లేచి కూర్చుంది. ఆమె కూతుర్ని గుండెకు హత్తుకుంది.
“నా కడుపున పడ్డాడు. ఈ భూమ్మీదికి రాకనే చితికిపోయాడమ్మా. నేను పాపాత్మురాలిని.” కుమిలిపోయింది నీరజ.
“వాడికి నిన్ను తల్లిగా పొందే ప్రాప్తం లేదు. వాడే దురదృష్టవంతుడు.” అంటూ నీరజను ఓదార్చింది తల్లి.
రెండు రోజులు కూతురికి ధైర్యాన్ని కలిగిస్తూ, జరిగిన సంఘటన మరపుకొచ్చేందుకు ప్రయత్నించింది ఆ తల్లి.
మూడవరోజు ఊరికి వెళ్తూ, ‘కూతుర్ని తమ వెంట తీసుకెళ్తామని, ఓ నాలుగు రోజులు తమతో ఉంటే అన్నీ సర్దుకుంటాయని’ చెప్పాడు నీరజ తండ్రి. రాఘవ అందుకు సమ్మతించాడు.
వారం తర్వాత రాఘవ వెళ్లి భార్యను తీసుకొచ్చాడు. అప్పటికి బాగానే కోలుకుంది నీరజ. ఆ మార్పుకు ఎంతో సంతోషించాడు రాఘవ.
ఒకరోజు రాత్రి భోజనం చేస్తున్న సమయంలో.. “ఏమండీ, చూస్తుంటే మీ ఒక్కరి జీతంతోనే ఇల్లు గడవటం కష్టమనిపిస్తోంది. చేతిలో బ్యాంకు లోను డబ్బుంది కాబట్టి సరిపొయ్యింది. కానీ కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుందని.. ఆ డబ్బు ఖర్చైపోవటానికి ఇక ఎంతో కాలం పట్టదు. అదేంటో చిత్తూరులోని ఇల్లు అమ్మకం ఆలస్యమవుతూనే ఉంది. ఎప్పుడు దానికి మంచి బేరం తగులుతుందో ఏమో, ఏమీ అర్థం కావటం లేదు. మీరు స్కూలుకు వెళ్లాక ఇంటి పనులన్నీ పూర్తయ్యి బోలెడంత సమయాన్ని ఖాళీగా గడపటం బోరుగా ఉంటోంది. అందుకనీ నేనూ ఉద్యోగానికి వెళ్తే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నాను. మీ కాన్వెంటులో నర్సరీ, ఎల్‌కెజీ పిల్లలకు పాఠాలు నేర్పేందుకు టీచరు ఉద్యోగమేదైనా ఖాళీ ఉందేమో కనుక్కోండి, నేను చెయ్యటానికి తయారుగా ఉన్నాను.” సీరియస్‌గానే అంది నీరజ.
‘భార్య గర్భశోకం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. చేతి నిండా పనులుంటే దృష్టి మరలి, ఆ బాధ నుండి పూర్తిగా బయటపడొచ్చు. పైగా చదువుకున్న డిగ్రీ సార్థకమయ్యేలా ఏదో ఒక ఉద్యోగం చెయ్యటం మంచిదే. అది తమ కుటుంబానికి వేణ్ణీళ్లకు చన్నీళ్లలా ఉపయోగపడొచ్చు. ఇప్పటి పరిస్థితిలో ఇది మంచి ఆలోచనే’ అని మనసులో అనుకుని, “అలాగే నీరజా, స్కూల్లో ఖాళీ ఏదైనా ఉందేమో కనుక్కుంటాను.” అన్నాడు.
రాఘవ తమ పరిస్థితి చెప్పగానే, నీరజకు టీచరు ఉద్యోగం ఇవ్వటానికి అంగీకరించాడు స్కూలు కరస్పాండెంటు. మంచిరోజు చూసుకుని భర్తతో వెళ్లి కాన్వెంట్లో టీచరుగా జాయినయ్యింది నీరజ.
ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ ఉదయం టిఫిన్ కాగానే సైకిలుపై బయలుదేరి స్కూలుకు వెళ్తున్నారు. మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి వెళుతున్నారు. మళ్లీ సాయంత్రం స్కూలునుండి జంటగా ఇంటికి తిరిగొస్తున్నారు.
అలా కొద్దిరోజుల్లోనే మామూలు స్థితికి వచ్చింది నీరజ.
ఒకరోజు స్కూలు నుండి ఇంటికి రాగానే తమకోసం ఓ వ్యక్తి ఎదురుచూస్తూ కనిపించాడు. ఎవరా అని విచారిస్తే చిత్తూరులోని ఇంటిని కొనుగోలు చెయ్యటానికి వచ్చినట్టుగా తెలిపాడతను.
అతణ్ణి లోపలికి పిలిచి కూర్చోబెట్టి బేరం మాట్లాడారు.
చివరకు రెండు లక్షలా ఎనభై వేల రూపాయలకు ఇంటిని అమ్మటానికి రాఘవ అంగీకరించాడు.
కొనుగోలుదారుడు అడ్వాన్స్‌గా యాభైవేల రూపాయలిచ్చి అగ్రిమెంటు రాయించుకున్నాడు. మూడు నెలల్లోపు ఎప్పుడైనా మిగతా డబ్బును చెల్లించి ఇంటిని రిజిష్టరు చేసుకుంటానని తెలిపాడు. రిజిస్ట్రేషను నాటికి తనకు పూర్తిగా ఖాళీగా ఉన్న ఇంటిని అప్పగించాలనీ, ఆలోపు ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు, ఇంకా ఏవైనా ఇంటిమీద బకాయిలుంటే అన్నీ పూర్తిగా రాఘవ చెల్లించి తనకు ఆ రశీదుల్ని, ఇంటి పట్టా పత్రంతో సహా అప్పగించాలని కోరాడు.
అందుకు రాఘవ మనస్ఫూర్తిగా అంగీకరించాడు. కొనుగోలుదారుడు తృప్తిగా తిరుగు ప్రయాణమయ్యాడు.
ఆయనను సాగనంపి తిరిగొచ్చిన రాఘవ, భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ.. “హమ్మయ్య, ఆ ఇంటికి ఇంతకన్నా మంచిరేటు వస్తుందన్న నమ్మకం నాకు లేదు నీరజా. ఇక మన కష్టాలన్నీ తీరినట్టే.” అన్నాడు సంతోషిస్తూ. నీరజ కూడా ఎంతగానో సంతోషించింది.
“చూడండీ, రిజిస్ట్రేషనుకు ఇంకా మూడు నెలలు గడువుందని కేర్లెస్గా ఉండిపోకండి. ఈలోపు అక్కడున్న సామాన్లన్నీ ఖాళీ చేసెయ్యాలి. అది గుర్తుంచుకోండి. అందుకనీ మనం ఇంకాస్త పెద్ద ఇంటిని అద్దెకు తీసుకుందాం. అప్పుడు అక్కడి సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ సర్దుకోవచ్చు.” అంది.
“ఔను. అలాగే చెయ్యాలి.” అంటూ మరుసటిరోజు నుండి అద్దెకు కాస్త పెద్ద ఇల్లు కోసం వెతకటం మొదలుపెట్టారు.
నెల రోజులు తిరిగేసరికి వాళ్లకు కాస్త పెద్ద ఇల్లే కుదిరింది. అద్దె ఎక్కువే అయినప్పటికీ విశాలంగా, చిన్న చిన్న గదులతో వాళ్లకు బాగా నచ్చింది. వెంటనే ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి కుదుర్చుకునేశారు. మంచిరోజు చూసుకుని వెళ్లి అందులో చేరిపొయ్యారు.
ఓ ఆదివారం చిత్తూరుకెళ్లి ఇంట్లోని సామాన్లన్నింటినీ ఓ మినీ వ్యానులో వేసుకుని తీసుకొచ్చాడు రాఘవ.
కొత్త ఇంట్లోకి చేరిన పదిహేను రోజులకంతా కొనుగోలుదారుడి నుండి పిలుపొచ్చింది. రిజిస్ట్రేషను రోజున చిత్తూరుకు వెళ్లేందుకు ఇద్దరికీ సెలవు ఇవ్వలేదు స్కూలు హెచ్చెమ్. రాఘవకు మాత్రమే సెలవు మంజూరు చేశారు.
ఉదయాన్నే రాఘవ చిత్తూరుకు బయలుదేరుతుంటే నీరజ ఇలా అంది.. “చూడండీ అమ్మకందారుడిచ్చిన అడ్వాన్సు డబ్బు ఎనభైవేలు, బ్యాంకు ప్యాసు పుస్తకం, నగల తనఖా కార్డు, అన్నీ మీ సూటుకేసులో పెట్టాను. ముందు మీరు పదిగంటలకల్లా బ్యాంకుకు వెళ్లిపోండి. లోను అప్పు అసలు, వడ్డీతో సహా కట్టేసి, నగలు విడిపించుకోండి. నగలు సరిగ్గా ఉన్నాయే లేవో కార్డులో చూసి చెక్ చెయ్యండి. తర్వాత రిజిష్ట్రాఫీసుకు వెళ్లి పని పూర్తిచేసుకోండి. డబ్బులు జాగ్రత్తగా లెక్కపెట్టుకుని భద్రంగా ఇంటికి తీసుకురండి!” అంటూ ఎన్నో హెచ్చరికలు చేసింది.
బస్సులో కూర్చుని ఆలోచిస్తుంటే, పెళ్లిలో చాలామంది అన్న మాటలు గుర్తుకొచ్చింది రాఘవకు.
“ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్టున్నారు. ఈడూ జోడూ చక్కగా కుదిరింది. మా దిష్టే తగిలేలా ఉంది. యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్..” అని గొప్పగా పొగిడారు.
అప్పుడు రాఘవకు ఆ పొగడ్తలు ఎంతో గర్వాన్ని కలిగించాయి.
కానీ, ఇప్పుడు ఆలోచిస్తోంటే.. ‘కొత్తగా పెళ్లైన దంపతులు నలుగురి కంటికీ సరైన ఈడు జోడుగా కనిపించకపోయినా పరవాలేదు. కానీ వాళ్లిద్దరూ ఒకరికొకరు తోడూ నీడగా ఉంటే చాలు. కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో అన్నింటిలోనూ పరస్పరం వెన్నుదన్నుగా ఉండాలి, అండదండగా నిలబడాలి. అప్పుడే భార్యాభర్తల అనుబంధానికి అర్థమూ పరమార్థమూ ఉంటుంది. అదృష్టవశాత్తు తన భార్య తనకెంతో ఆలంబనగా ఉంటోంది. అది చాలు తనకు.’ మనసులోనే తృప్తిపడ్డాడు.
బస్సు చిత్తూరుకేసి పరుగులు తీస్తోంది.
48. ఫైనాన్స్ వ్యాపారం
చిత్తూరులోని ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బులో నుండి రెండు లక్షల రూపాయలు బ్యాంకులో భార్య పేరుమీద ఫిక్సెడ్ డిపాజిట్ చేశాడు రాఘవ. మిగిలిన డబ్బును ఏం చేద్దామా అని ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాడు.
ఆ రోజు స్కూలు నుండి ఇంటికి రాగానే, “నీరజా అలా బయటికెళ్లొద్దాం పదా!” అన్నాడు.
“ఎక్కడికీ?” అంది.
“ఊరికే, అలా సరదాగా తిరిగొద్దాం.” అన్నాడు.
“ఎక్కడికని అడిగితే సరదాగా అంటున్నారు. ఎక్కడికో చెప్పండి.”
“ఎక్కడికో చెప్తే కానీ రావా?”
“ఊహూ..”
“అయితే విను. బంగారం షాపుకెళ్లి నీకేవైనా నగలు కొందామనుకుంటున్నాను.”
“అనవసర ఖర్చు. ఇప్పుడేం వద్దండి!” అని రాఘవను వారించింది.
“చూడూ, ఇప్పుడు కాక ఇంకెప్పుడు కొనగలం నీరజా. పైగా నీకు ఇప్పటిదాకా నేనేమీ కొనివ్వలేదు కూడానూ. కాదనకు!” అంటూ బలవంతంగా భార్యను బంగారం షాపుకు తీసుకెళ్లి ఆమెకు ఇష్టమైన నగల్ని కొనిచ్చాడు.
భర్త ప్రేమగా చేసిన పనికి ఎంతగానో సంతోషించింది నీరజ. తర్వాత అటునుండి హోటల్‌కెళ్లి టిఫిన్ తిని తృప్తిగా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి రాగానే ఆ నగలను దేవుడి పటం ముందుంచి దీపం వెలిగించింది నీరజ.
ఒకరోజు సాయంత్రం సోషల్ టీచరు జయరాం, రాఘవ వాళ్లింటికొచ్చాడు. మిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించి భార్యతో టీ పెట్టమని చెప్పి అతనితో మాటలు మొదలుపెట్టాడు రాఘవ.
“సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుదామనే ఇంటికొచ్చాను. నా ఫ్రెండు రవీ అని ఆటోనగర్‌లో టూ వీలర్ స్పేర్‌పార్ట్స్ వ్యాపారం చేస్తున్నాడు. బిజినెస్ బాగా జరుగుతోంది. మంచి లాభాలను కూడా ఆర్జిస్తున్నాడు. తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని అతని కోరిక. అందుకని ఓ రెండు లక్షలుంటే అప్పుగా ఇవ్వమని నన్ను అడిగాడు. నా దగ్గర అంత లేదు. లక్ష ఉంటే ఇచ్చాను. ఇంకో లక్ష మీ దగ్గరుంటే సర్దుతారేమోనని అడగటానికి వచ్చాను..” అంటూ వచ్చిన విషయం చెప్పాడు జయరాం.
ఈలోపు నీరజ టీ కప్పులతో వచ్చి భర్తకు, కొలీగ్కూ చెరొకటిచ్చి తనూ ఒకటి పట్టుకుని మంచంపై కూర్చుంది.
ఈమధ్యే రాఘవ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు చేరిందని జయరాంకు తెలుసు. అందుకే వచ్చి అడిగాడు.
రాఘవ ఆలోచనలో పడ్డాడు.
“సార్, ఇంకో విషయం.. మనం అప్పుగా ఇచ్చే డబ్బుకు అతను వడ్డీ కూడా ఇస్తానన్నాడు. కాకపోతే ఎక్కువ వడ్డీ ఇచ్చుకోలేననీ, రూపాయి వడ్డీకైతే తీసుకుంటానని చెప్పాడు. తెలిసిన మనిషి, నమ్మకస్థుడు! బ్యాంకులో ప్రస్తుతం మన డిపాజిట్లకు రూపాయి కూడా వడ్డీ రావటం లేదు. ఆ విషయం మీకు తెలియనిదేమీ కాదు..” అన్నాడు జయరాం.
అప్పటికీ రాఘవ బదులేమీ ఇవ్వకపొయ్యేసరికి, “సార్, మీ డబ్బు ఎక్కడికీ పోదు. నేను గ్యారెంటీ, నన్ను నమ్మండి!” అన్నాడతను హామీ ఇస్తున్నట్టుగా.
అప్పటికీ ఏ నిర్ణయానికీ రాలేకపొయ్యాడు రాఘవ. నీరజ కూడా ఏమీ మాట్లడలేదు.
“ఓకే సార్, తొందరేం లేదు. ఇద్దరూ బాగా ఆలోచించుకుని రేపు మీ నిర్ణయం చెప్పండి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. నేను మీకు మేలు చేసేవాణ్ణే కానీ మోసం చేసేవాణ్ణి కానని నమ్మండి.”
“ఛ ఛ అదేం కాదు జయరాం గారూ. పెద్ద మొత్తం కదా! అందుకే వెంటనే జవాబివ్వలేకపోతున్నాము. ఇద్దరమూ చర్చించుకుని రేపు మీకు ఏ విషయమూ చెప్తాను, ఓకేనా?”
“అలాగే!” అంటూ కుర్చీలోంచి లేచి వాళ్ల దగ్గర నుండి శెలవుతీసుకుని వెళ్లిపొయ్యాడు జయరాం.
“ఇద్దామంటావా నీరజా?” భార్యను అడిగాడు రాఘవ.
“లక్ష రూపాయలు కదా, అదే ఆలోచిస్తున్నాను.”
“ఔను! అయితే మనం జయరాం సార్‌ను నమ్మొచ్చు. అదీగాక, బ్యాంకులో రూపాయి కూడా వడ్దీ ఇవ్వటం లేదన్నది వాస్తవం.” అన్నాడు రాఘవ.
ఇద్దరూ బాగా చర్చించుకున్న మీదట జయరాం స్నేహితుడికి లక్ష రూపాయలు వడ్డీకి ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు.
మరుసటిరోజు బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసుకొచ్చి, జయరాం సాక్షిగా, ప్రోనోటు రాయించుకుని డబ్బిచ్చారు.
జయరాం స్నేహితుడు రవి, రాఘవ దంపతులకు ఎంతగానో కృతజ్ఞతలు తెలిపాడు.
అనుకున్నట్టే మరుసటి నెల మొదటి తారీఖునే వడ్డీ డబ్బులు ఇంటికొచ్చి మరీ ఇచ్చి వెళ్లాడు రవి. దాంతో అతనిపైన బాగా నమ్మకం కుదిరింది రాఘవకు.
ఠంచనుగా ప్రతినెలా 1,2 తేదీల లోపల వడ్డీ డబ్బులు తెచ్చివ్వసాగాడు రవి.
ఎనిమిదవ నెలలో రాఘవను మరో లక్ష రూపాయలుంటే సర్థమని కోరాడు రవి. అతనిపైనున్న నమ్మకంతో జయరాంను మధ్యవర్తిగా పెట్టుకుని మరో లక్షరూపాయలు వడ్డీకి ఇచ్చాడు రాఘవ. ఇప్పుడు వడ్డీ మాత్రమే నెలనెలా రెండు వేల రూపాయలు రాఘవకు ముట్టసాగింది.
ఈ పై ఆదాయం దాదాపు ఏడాదిపాటు కొనసాగింది.
ఈ పరిస్థితుల్లో నీరజ మళ్లీ గర్భవతైంది. అయితే ఈసారి నీరజ ఏమి తిన్నా వాంతులు కాసాగింది. డాక్టరు దగ్గరకు వెళితే, కొందరికి అలాగే ఉంటుందని రెండు రకాల మాత్రలు రాసి వాటిని వాడమని చెప్పింది.
పదే పదే వాంతులు అవుతుండటంతో నీరజ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. నెలలు నిండేకొద్దీ క్రమంగా వాంతులు తగ్గాయి. ప్రసవానికి పుట్టింటికెళ్లింది నీరజ.
ఒకరోజు రవి, రాఘవను కలవటానికి వాళ్లింటికొచ్చాడు. అతణ్ణి కుర్చీలో కూర్చోమని మర్యాద చేశాడు రాఘవ.
“థాంక్యూ సార్, మీ సాయం వల్ల నా వ్యాపారం బాగా పుంజుకుంది. ఇక నేను నెలనెలా వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదనిపించింది. అందుకని మీ అసలు మీకు ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగోండి మీ డబ్బు.” అంటూ బ్యాగులో నుండి రెండు లక్షల రూపాయలను తీసి రాఘవ చేతికిచ్చాడు.
“లెక్క పెట్టుకోండి సార్!” అన్నాడు రవి.
రాఘవ లెక్క పెట్టేంతవరకూ మౌనంగా ఉండి, “కరెక్ట్‌గా ఉందా సార్, ఇక నేను వెళ్లొస్తాను. మళ్లీ అవసరమైతే మిమ్మల్నే అడుగుతాను, అప్పుడు డబ్బిస్తారు కదా?” అన్నాడు నవ్వుతూ.
“తప్పకుండా!” అంటూ రవికి వీడ్కోలు పలికాడు రాఘవ.
ఉన్నపళంగా రవి ఇలా అసలు మొత్తం తెచ్చిచ్చేస్తాడని ఊహించలేదు రాఘవ.
దాంతో వడ్డీ రాబడి తగ్గిపోయింది, నీరజ జీతమూ ఆగిపోయింది.
‘రేపు నీరజ బిడ్డను కని ఇంటికొస్తే, తనొక్కడి జీతంతోనే సంసారాన్ని గడపాలి’ అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు.
ఓ రోజు ఇంటికి దగ్గర్లోని ప్రొవిజినల్ స్టోరుకు వెళ్లాడు రాఘవ. తనకు కావలసిన వస్తువులు కొనుక్కున్నాడు. మాటల సందర్భంలో ఆ స్టోరు యజమాని, ‘ఓ పదివేలుంటే తండల్కివ్వమని అడిగాడు.’ (పదిరూపాయల వడ్డీ చొప్పున పదివేలుకు వెయ్యి రూపాయలు ముందుగానే వడ్డీ పట్టుకుని, తొమ్మిది వేలు ఓ వ్యక్తికి అప్పుగా ఇవ్వటంతో పాటు, అతని నుండి రోజూ వంద రూపాయల చొప్పున వంద రోజుల్లో పదివేల రూపాయలను వసూలు చేసుకోవటాన్నే ‘తండల్’ అంటారు.)
అదనపు ఆదాయం కోసం మరేమీ ఆలోచించకుండా మరుసటిరోజే ఆ స్టోరు నడిపే వ్యక్తికి తొమ్మిది వేల రూపాయలను తండల్కిచ్చాడు రాఘవ. త్వరలోనే ఆ స్టోరు వ్యక్తి తరపున మరో ముగ్గురికి యాభైవేల రూపాయల దాకా తండల్కిచ్చాడు. రోజూ సాయంత్రం స్కూలు నుండి రాగానే అసలు వసూలు చేసుకోవటం కోసం బజారుకు వెళుతున్నాడు రాఘవ.
కాన్పుకు పుట్టింటికి వెళ్లిన భార్య మగపిల్లాణ్ణి ప్రసవించిందని తెలిసి ఆ సాయంత్రమే పీలేరుకు వెళ్లాడు రాఘవ. కొడుకును, భార్యను చూసుకుని ఎంతగానో మురిసిపొయ్యాడు. తను వడ్డీకి తండల్కు ఇస్తున్నట్టుగా భార్యతో చెప్పాడు. ఆమె ఆ పరిస్థితిలో ‘జాగ్రత్త’ అని మాత్రమే చెప్పగలిగింది. మరుసటిరోజు తిరుపతికి తిరిగొచ్చేశాడు రాఘవ.
ఓరోజు హేమాద్రి అన్న వ్యక్తి రాఘవను వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు. తాను పలానా బ్యాంకులో క్లర్కుగా పని చేస్తున్నాననీ, తనకు ఆటోనగర్‌లో స్పేర్ పార్ట్స్ అమ్మే రవి బాగా తెలుసనీ, అర్జెంటుగా తనకు ఐదు రూపాయల వడ్డీకి లక్ష రూపాయలు కావాలనీ అడిగాడు.
రవి నిజాయితీ తనకు బాగా తెలుసు కనుక హేమాద్రిని కూడా నమ్మొచ్చు అని భావించాడు. మరుసటిరోజు రమ్మని చెప్పి పంపాడు.
మరునాడు బ్యాంకులో నుండి డబ్బు డ్రా చేసి ఉంచాడు రాఘవ. ఆ సాయంత్రం హేమాద్రి వచ్చాడు. ప్రోనోటు పూర్తిచేసి హేమాద్రి చేత సంతకం పెట్టించుకున్నాక, సాక్షి సంతకం రవిచేత పెట్టించుకు రమ్మన్నాడు.
“చూడండి సార్, మీకు నామీద నమ్మకం కలగనట్టుంది. సాక్షి సంతకం పెట్టుకురమ్మనటం ఒక రకంగా నన్ను అవమానించటంగానే భావిస్తున్నాను. ఈ హేమాద్రి మాటంటే మాటే. నా గురించి మా బ్యాంకులో విచారించి చూడండి. నేనెలాంటి వాణ్ణో తెలుస్తుంది. నా దగ్గర డబ్బిచ్చారంటే అది రిజర్వు బ్యాంకులో ఉన్నట్టే. ఎక్కడికీ పోదు. మీకు అంతగా నమ్మకం కుదరకపోతే రేపొకసారి మా బ్యాంకుకు రండి మా మేనేజరు దగ్గరే సాక్షి సంతకం పెట్టిస్తా.” అన్నాడు.
దాంతో మరేమీ మాట్లాడకుండా అతని చేతికి లక్ష రూపాయలిస్తూ.. “నెలనెలా వడ్డీ కరెక్టుగా చేరిపోవాలి!” అన్నాడు.
“అది ఎప్పుడూ తప్పదు. వచ్చే నెల నుండి మీరే చూస్తారుగా.” అంటూ రాఘవ నుండి సెలవు తీసుకుని వెళ్లిపొయ్యాడు.
కొడుక్కు నామకరణం రోజున పీలేరుకు వెళ్లాడు రాఘవ. కొడుక్కు భరత్ అని పేరు పెట్టటం జరిగింది. అది రాఘవకు కూడా బాగా నచ్చింది. వాడికి మూడో నెల పెట్టగానే కొడుకుతో సహా తిరుపతికి వచ్చింది నీరజ.
రాఘవ దగ్గర తండల్ తీసుకున్న ఓ వ్యాపారి రోజువారీ డబ్బు చెల్లించకుండా రెండు మూడు రోజులకొకసారి చెల్లిస్తూ ఉండటంతో అది వంద రోజులకు మించి వెళ్లసాగింది.
అలాగే మరో వ్యాపారి రోజూ డబ్బు చెల్లిస్తూ.. తొంభై రోజులకు గాను, తొమ్మిది వేల రూపాయలు పూర్తికాగానే మరి చెల్లించటం మానేసాడు. అంటే అతని ద్వారా రావాల్సిన వడ్డీ డబ్బులు ఆగిపొయ్యాయన్నమాట.
ఇద్దరినీ ఎన్నిసార్లు, ఎంతగా అడిగినా మొదట్లో తర్వాత ఇస్తాం అన్నవాళ్లు క్రమంగా అప్పు తీరిపోయినట్టుగా మాట్లాడసాగారు. పైగా వాళ్లు గొంతు పెంచి రాఘవను బూతులు తిట్టసాగారు.
అప్పుడనిపించింది రాఘవకు.. ‘ఈ బిజినెస్‌ను చెయ్యాలంటే అందరి ముందూ బూతులు తిట్టించుకోవటమే కాదు తానూ మాట్లాడగలగాలి, రౌడీయిజం చెలాయించాలి.. అవసరమైతే కొట్టుకునే స్థాయికి వెళ్లగలగాలి, అంతేకానీ మౌనంగా మెత్తగా ఉంటే వ్యవహారం నడవదు.’ అని.
దీనికి తోడు నెలనెలా వడ్డీ డబ్బులు ఠంచనుగా చెల్లిస్తున్న హేమాద్రి నాలుగు నెలల తర్వాత మొహం చాటేశాడు.
అతని కోసం బ్యాంకుకు వెళితే, ప్రస్తుతం తనకు డబ్బు కొంచెం టైట్‌గా ఉందని, అన్నీ సర్దుకున్నాక వడ్డీ డబ్బు మొత్తం చెల్లిస్తాననీ, తన దగ్గర డబ్బుంటే రిజర్వు బ్యాంకులో ఉన్నట్టేనని మళ్లీ చెప్పాడు.
తర్వాత తెలిసిందేమిటంటే.. అతని దగ్గర ఐదు రూపాయల వడ్డీకి డబ్బు తీసుకుని వేరొకరికి పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నాడని తెలిసి షాక్‌కు గురయ్యాడు రాఘవ.
ఎలాగో ఓలాగా అతని నుండి తన అసలు తీసుకుంటే చాలు, వడ్డీ రాకపోయినా పర్లేదు అని నిర్ణయించుకున్నాడు.
కానీ తనలాగా అతనికి డబ్బిచ్చినవాళ్లు విషయం పూర్తిగా అర్థం చేసుకుని అతని ఇంటిపై బడి టివి, ఫ్రిజ్, బీరువా అంటూ తమకు ఏది కనిపిస్తే దాన్ని తీసుకెళ్లిపొయ్యారుట. కానీ రాఘవ ఆ పని చెయ్యలేకపొయ్యాడు.
పోలీసు డిపార్టుమెంటులో తనకు బాగా తెలిసిన ఒక మిత్రుణ్ణి వెంటబెట్టుకుని హేమాద్రి ఇంటికి వెళ్లి అతనిచేత హెచ్చరిక చెయ్యించాడు రాఘవ.
ఈ సంఘటన జరిగిన నాల్గవ రోజున రాఘవకు ఒక లాయరు నోటీసు వచ్చింది.
అందులో.. తన క్లయింటు హేమాద్రి వ్యాపారం చేసి దివాలా తీసినందున, అప్పులను తీర్చలేక ఐ.పి.పెట్టాడనీ, అయినా అప్పిచ్చినవాళ్లు తన క్లయింటును వేదిస్తున్నందున అతను ఆత్మహత్య చేసుకుంటే, దానికి ఈ కిందివారు బాధ్యులు కాగలరని సూచించిన జాబితాలో తన పేరు కూడా ఉండటం చూసి షాకయ్యాడు రాఘవ.
(ఇంకా ఉంది)

1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్‌కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).