[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
జనా కాశ్మీరికా దుర్గ ఖిలేభ్యో మూషాకా ఇవ। దులచతౌ గతే వన్దీకృతశేషా మిర్యయు॥ (జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 160)
కశ్మీరును అల్లకల్లోలం చేసి, ఎనిమిది నెలల పాటు కశ్మీరాన్ని ధ్వంసం చేసిన దుల్చా కశ్మీరును వదిలివెళ్లటంతో, దుల్చకు, రించనుడికి దొరకకుండా కొండలలో, గుహలలో దాక్కుని తప్పించుకున్న ప్రజలు, కలుగుల్లోంచి ఎలకలు బయటకు వచ్చినట్లు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జోనరాజు చేసిన వర్ణన కశ్మీరు దుస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. గుండెను కరగించి వేస్తుంది. ఎందుకంటే, ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా మనం ప్రజలలో ఇలాంటి దుస్థితిని చూస్తున్నాం. సిరియాలో, ఇరాక్‌లో, అఘ్ఘనిస్తాన్లో, పలు ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి ఘోరమైన వేదనను ప్రజలు అనుభవించటం చూశాం. త్వరలో యుక్రెయిన్‌లో కూడా ఇలాంటి పరిస్థితిని చూడబోతున్నాం.
తుఫాను తాకుతుంది. ఇళ్ళూ ఊళ్ళూ కొట్టుకుపోతాయి. ప్రజలనేకులు తిరిగి వెళ్తున్న సముద్రం నీటితో సముద్రం లోకి వెళ్లి జలసమాధి అవుతారు. ప్రాణాలతో మిగిలినవారు, చెట్టులో, రాతి బండనో పట్టుకుని వ్రేలాడుతూంటారు. సముద్రం నీరు తిరిగి వెళ్ళిన తరువాత ఒకరొకరుగా తాము పట్టుకుని వ్రేలాడుతున్న చెట్టునో, చెట్టు కొమ్మనో వదిలి వస్తారు. అప్పుడు వారికి ఎదురుగా సర్వం నాశనమైన బీభత్స దృశ్యం కనిపిస్తుంది. ఆపై తన వాళ్లు గుర్తుకువస్తారు. ఆ సమయంలో ఎవరికివారు ప్రాణాలు కాపాడుకోవటంలో మునిగి సర్వం మరచి ఉంటారు. ప్రాణాలకు భయం లేదని నిర్ధారణ అయిన తరువాత తనవారు గుర్తుకువస్తారు. వారిని వెతుకుతారు. సునామీ, తుఫాను, భూకంపం వంటివి ప్రాకృతిక వైపరీత్యాలు. కానీ యుద్ధాలు మానవ మూర్ఖత్వ ఫలితాలు. వాటి వల్ల ఘోరమైన నష్టం భౌతికంగానే కాదు, మానసికంగా కూడా జరుగుతుది. దుల్చా వెళ్లిపోయిన తరువాత కశ్మీరీ ప్రజలు కలుగుల నుంచి ఎలుకలు బయటకి వచ్చినట్టు బయటకు వచ్చారు అనటంలోనే వారెంతటి ఘోరామైన నరకాన్ని అనుభవించారో ఊహించవచ్చు. ఆ తరువాత జోనరాజు చేసిన వర్ణన అచ్చు సునామీ తరువాతనో, యుద్ధంలో బాంబుల దాడికి సర్వనాశనమైన తరువాత బ్రతికిన వారు ఒకరొకరు సురక్షిత స్థలాల్ని వదిలి బయటకు వస్తున్నప్పటి పరిస్థితినో కళ్ళ ముందు నిలుపుతుంది.
నాలబ్ధ పితరాం పుత్రః పితాతం చన కంచన। భ్రాత్రుంశ్చ భాతరో దుల్చరాక్షసో పప్లవాత్యయే॥ (జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 161)
రాక్షసుడి లాంటి దుల్చా హింసకు గురయిన కశ్మీరీ ప్రజలు అతడి హింస ఆగిపోయిన తరువాత తమవారి కోసం వెతుక్కున్నారు. దుల్చా దాడి సమయంలో ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రజలు ఎవరికి వారు ప్రాణాలు కాపాడుకుంటూ పరుగులెత్తారు. ఇప్పుడు వెతుకుతుంటే కొడుక్కు తండ్రి జాడ దొరకటం లేదు. తండ్రికి కొడుకు ఆచూకీ తెలియడం లేదు. సోదరులు దొరకటం లేదు. కశ్మీరం సృష్టికి ముందరి లాంటి పరిస్థితిని ఎదుర్కుంది. మనుషులు కొందరే. ఆహారం లేదు. ఎటు చూసినా సర్వనాశనం. జోనరాజు ఒక్క శ్లోకంలో మొత్తం కశ్మీరు దుస్థితిని వర్ణించాడు. సృష్టికి పూర్వం లాంటి పరిస్థితి అనటంతోనే కశ్మీరు ఏ స్థాయిలో నాశనమయిందో తెలుస్తుంది.
సృష్టికి పూర్వం నగరాలుండవు. భవంతులుండవు. వ్యవస్థ ఉండదు. మనుషులు కొందరుంటారు. వారూ అనాగరిక స్థాయిలో ఉంటారు. ఇళ్లు, వాకిళ్లు, తిండి వంటివేమీ ఉండవు. ఎటు చూసినా గడ్డి, దుమ్ము, ధూళి. అలాంటి పరిస్థితి కశ్మీరంలో నెలకొంది.
మితలోకా ఖిలక్షేత్ర నిర్ధోజ్యా దర్భనిర్ధరా। సర్గారంభ ఇవ ప్రాయస్తదా కాశ్మీరాభూర భ్రూత్॥
‘సర్గారంభ’ అంటే ఆరంభం నాటి పరిస్థితి. ఆరంభంలో ఏమీ ఉండదు. ‘Starting from scratch’ లాంటి పరిస్థితి అన్న మాట కశ్మీరీయులది. దుల్చా పోతూ పోతూ కశ్మీరులోని యువకులను, శక్తిమంతులందరినీ మూట కట్టుకుపోయాడు. దాంతో శక్తి ఉన్న వ్యక్తి లేడు కశ్మీరులో. దుల్చా వెళ్లాడు కానీ రించనుడు అక్కడే ఉన్నాడు. లడాఖ్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయి కశ్మీరు చేరిన రించనుడు, ఇప్పుడు కశ్మీరులో శక్తిమంతుడు. కశ్మీరీయులను బానిసలుగా అమ్మి బోలెడంత ధనం అతడు సంపాదించాడు. దాంతో కశ్మీరుపై పట్టు బిగించాడు రించనుడు. అవకాశాన్ని గ్రహించి అందిపుచ్చుకునేవాడు విజేతగా నిలుస్తాడు. ఆ అందిపుచ్చుకోవటంలోని నైతికత, అనైతికతలతో పని లేదు. చీకటి పడినప్పుడే కదా వార వనితల వ్యాపారం ఆరంభమయ్యేది ‘విశ్వమంధ ధయతి ధ్వాన్తే సుఖభోజోజి పారికా’ అంటాడు జోనరాజు, కశ్మీరుపై రించనుడు పట్టు బిగించి, అధికారం కాజేయడం గురించి.
(ఇంకా ఉంది)
కశ్మీర్‌లోని విధ్వంసం తరువాత పరిస్థితులను సమకాలీన ప్రపంచ దేశాల పరిస్థితులతో మిళితం చేసి ఈ భాగంలో వివరంగా వివరించిన మురళీకృష్ణ గారికి అభినందనలు, ధన్యవాదాలు🙏🏻🙏🏻
ఆహారం దొరకక వేటాడే స్థితిలో .. ఆకలి తీర్చుకోవటానికి మనిషి ఎంత అనాగరికంగా ఉన్నాడో ..చదువు సంధ్యలు నేర్చుకుని నాగరికులం అన్ని విర్రవీగే స్థితిలో ఇప్పటికీ అదే స్థితిలో ఉండటం ఏ నాగరికతకి చిహ్నం? యుద్ధాలు ప్రేరేపిస్తున్న అహంకారం మానవ హననం చేస్తూ పునరావృతమవుతున్న చరిత్రని నిరూపిస్తున్నాయి. అంటే చరిత్ర నించి మనమేమీ నేర్చుకోవట్లేదు!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మానస సంచరరే-62: జ్ఞాపకాల దారులలో!
భరతమాత
సిడ్నీ, ఆస్ట్రేలియా లో శ్రీరామ నవమి ప్రత్యేక కార్యక్రమాలు
తెలంగాణ మలితరం కథకులు – కథన రీతులు – 11: జి. వెంకటరామారావు – నిజమైన ‘పరిష్కారం’ ఏది?
దూరపు కొండలు
మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-13
కవయిత్రి, కథా రచయిత్రి శ్రీమతి వారణాసి నాగలక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ
సంచిక – పద ప్రతిభ – 2
జ్ఞాపకాల పందిరి-172
మలుపులు తిరిగిన దారి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®