[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం గారి ‘కాలక్షేపానికి కబుర్లు’ అనే రచనని అందిస్తున్నాము.]


గోపాలరావు గారు జబల్పూరు పశువైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్నారండి. ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి, రిటైరయ్యేక మా ఊళ్లో స్థిరబడ్డారు. విశాలా ఎపార్టుమెంట్సులో ఓ టు బెడ్ రూమ్ ఎపార్టుమెంటు తనదిగా చేసుకున్నారు. దాని మెయిన్ డోరుకు, ‘Dr. Gopalarao’ అని ఇంగ్లీషులోను తెలుగులోను పెద్ద అక్షరాలతో ఒక నేమ్ ప్లేటు ఏర్పాటు చేసేరు. ఆయన మెడలో స్టెత్, అదేనండి స్టెతస్కోపు లేకుండా బయటకు రారండి. అది చూసి మొదట్లో చాలామంది, ఆయన మనవంటి వారికి వైద్యం చేసే డాక్టరుగారని అభిప్రాయపడ్డారండి. ముఖ్యంగా ఎపార్టుమెంట్సులో పని చేస్తున్న సెక్యూరిటీ స్టేఫ్, తదితర పనివాళ్లది అదే అభిప్రాయముండేది. అది దురభిప్రాయం కాదు సుమండీ. ఏదో understanding లో పొరబాటు మాత్రమే. తరువాత, తరువాత ఎపార్టుమెంట్సులో నివసిస్తున్న వాళ్లు ఆయన వెటర్నరీ.. డాక్టరు అని తెలుసుకున్నారండి. కాని ఆయన్ని ఎవరైనా మరొకరికి పొరబాటున ‘పశువుల డాక్టరుగారు’ అని పరిచయం చేసేరనుకోండి. ఆయన తన ఎత్తులో రెండు ఇంచీలు కుదించుకుపోయేవారట. అలా పరిచయం చేసిన వ్యక్తిని కొరుక్కు తినేద్దామా అన్నంత కోపాన్ని, కష్టాన్న దిగమిమింగుకొనేవారట. ఆ రాత్రంతా ఆయనకు నిద్రపట్టేది కాదుట. ఆయన పశువుల డాక్టరే గదా; మరి, పశువుల.. డాక్టరూ.. అంటే ఎందుకయ్యా అంత కోపం అంటారా. ఆయన కోపానికి ఓ కారణం ఉందండి. మనని, అంటే మనుషుల్ని ట్రీట్ చేసే డాక్టర్లని ‘మనుషుల.. డాక్టరు’ అంటున్నామా.. లేదు కదండి. సింపుల్‌గా ‘డాక్టరు’ అంటున్నాం గదండి. మరి ఆయన ‘డాక్టరు’ పదానికి ముందు ‘పశువుల’ అనే విశేషణం ఎందుకూ, అని ఆయన అబ్జెక్షనండి. ఆయన అది professional discrimination అంటారు. ఆయన అబ్జెక్షన్లో లీగల్ పోయింట్ ఏమిటో మనకు తెలీదు. కానీ ఆయన బాధపడుతున్నాడండి. మనమేమిటి చేయగలమండీ. ఏమీ చేయలేం గదా. అంత పెద్ద లీగల్ పోయింటు సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషన్ బెంచికి వెళ్లాలనుకొంటాను. అందుచేత మనం దాని జోలికి వెళ్లొద్దండి.
ఎపార్టుమెంట్సులో ఉన్నవారికి ఆయన మనస్తత్వం కొంత బోధపడినట్టుంది. ఆయన ఎదురుపడగానే, ఎపార్టుమెంట్సులో ఉన్నవాళ్లు “నమస్కారం డాక్టరుగారూ.” అని కొందరు, “నమస్తే డాక్టర్ సాబ్.” అని ఉన్న ముగ్గురు ఉత్తరభారతీయులూ పలకరించడం మొదలుపెట్టేరు. ఆ పలకరింపులండీ.. ఆయన చెవులకు శ్రీమతి సుబ్బులక్ష్మి గారి గానం వలె వినిపిస్తాయటండి. ఆ అంతులేని ఆనందంలో ఆయన తన ఎత్తు మరో రెండు ఇంచీలు పెరిగినట్టు ఫీలవుతారుట. మిన్నంటే సంతోషాన్ని పొందుతారట. చూసేరా, అలా పిలిచిన వాళ్లు ఏ శ్రమా పడలేదు కదా. ఓ నయాపైసా అయినా, అన్నట్టు అవిప్పుడు లేవు కదండీ; పోనీండి, ఓ రూపాయైనా ఖర్చుపెట్టలేదు కదా. ఆ డాక్టరు పదానికి ఆ విశేషణం లేకపోతే ఆయన ఎంత సంతోషిస్తారో చూసేరా. సంతోషం సగం బలం అనే సామెత ఉందికదండి. అలాగ ఇతరుల మనస్తత్వాలు తెలుసుకొని మాట్లాడితే వాళ్లని సంతోషపెట్టడమే కాకుండా, వాళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందంటారు. అదేమిటయ్యా, ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నావ్, నువ్వేమయినా డాక్టరువా అని అడుగుతున్నారా. నేను డాక్టర్ని కాదండి, ప్రభో. నేను చెప్పేది వినండి. ‘చిరునవ్వుతో’ సినిమా మీరు చూసే ఉంటారండి. చూసేరా. గుడ్. అందులో ‘సంతోషం సగం బలం’ అనే పాట, సిరివెన్నెల గారు రాస్తే బాలుగారు పాడేరు కదండి. మీరూ వినే ఉంటారు. విన్నారా. మరేం. ఏమిటంటున్నారూ. డబ్బులిస్తే మరో రచయిత ‘సంతోషం బలాన్నివ్వదు’ అని మరో పాట రాయగలడంటారా. ఔనండి. Quite possible. అందుచేత దాన్ని అలా ఉండనిద్దాం. నేనెక్కడో చదివేనండి. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు, తనకు తెలియకుండానే అదనపు బలం వస్తుందని, ఎవరో మనోవైజ్ఞానికుడు చెప్పేడని. అయితే ‘ఎవడయ్యా అలా చెప్పినవాడు’ అని నన్ను కోర్టు మార్షల్ చేయకండి మహాప్రభో. మీమీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అలా చెప్పినాయన దేశవిదేశాల్లో ప్రఖ్యాతి చెందిన మనోవైజ్ఞానికుడండి. నేను నిజంగా చదివేనండి. అది నిజమేనండి. హమ్మయ్య; అంగీకరించేరా. Thanks, అండి.
ఎపార్టుమెంట్సులోని ఇళ్లలో పని చేస్తున్న పనిపిల్లలకు ఏదైనా జలుబూ.. దగ్గూ.. వంటివి వస్తే, “ డాక్టరు అయ్యగారూ” అని ఆయన దగ్గరకు వెళ్లి మందులిమ్మని వేడుకోడం జరుగుతోంది. ఆయన దగ్గర ‘ Dr. Gopalarao’ అని ప్రింటయి ఉన్న ప్రిస్క్రిప్షన్ పేడ్ ఒకటి ఉందండి. దానిమీద ఆయన ఆ జబ్బుకి మందులు ప్రిస్క్రైబ్ చేసి ఇస్తూ ఉంటారు. మందుల షాప్ వాళ్లు నిరభ్యంతరంగా అది ఏక్సెప్ట్ చేస్తున్నారు. బాగుంది కదండి. ఆ చిన్న కంప్లైంట్ కోసం వాళ్లు గవర్నమెంటు ఆస్పత్రికి వెళ్లేరనుకోండి. పనులు మానుకొని గంటలకొద్దీ క్యూలో నిలబడాలి కదండి. దానితో అయిపోతుందా. వాళ్లు పనిచేస్తున్న ఇళ్లలో ఉన్న ఆడవాళ్లకి ఎంత ఇబ్బందండి అది. ఆ సమయంలో అర్జంటుగా.. నల్ల..గా మాడిపోయిన పెనం, వంటకు కావలిసి వచ్చిందనుకోండి. పాపం ఆ ఆడవాళ్లే తోముకోవాలి కదండి. వాళ్ళకెంత కష్టమండి అది. మన డాక్టరుగారి సేవలు, చిన్న చిన్న కంప్లైంట్స్కు మాత్రమే కాదండీ. కొద్దిగా పెద్ద కంప్లైంటయినా అవసరమయితే ఆయన సూది మందులిచ్చి బాగుచేస్తూంటారు. అంతే కాదండోయ్. ఎపార్టుమెంట్సులో ఉన్న వృద్ధులు, తప్పు తప్పు; సీనియర్ సిటిజన్లు, వారం పదిరోజులకొకసారి ఆయన ఇంటికి వెళ్లి బి.పి. చెక్ చేయించుకొంటూ ఉంటారు. ఆయన బి.పి. చెక్ చేసేక అవసరమయిన కొన్ని సలహాలు కూడా ఇస్తూంటారు. మరీ సీనియర్లైతే ఆయనే స్వయంగా వాళ్ల ఇంటికి వెళ్లి చెక్ చేస్తారండి. అంతా ఉచిత వైద్యసేవేను సుమండీ. ఇదంతా ఎంత సోషల్ సర్విస్సండి.
మన Dr.గోపాలరావుగారి వైద్య సేవలు ఇరుగు పొరుగు ఎపార్టుమెంట్స్ లోని వారికి క్రమంగా తెలిసిందండి. వాళ్లలో అనేకులు వైద్యసేవలకి మన డాక్టరుగారి దగ్గరకు రాడం ప్రారంభించేరండి. వాళ్లకి కేవలం బి.పి. చూడ్డమే కాకుండా వాళ్ల ఛాతీపైన, వీపుపైన స్టెతస్కోపు పెట్టి పరీక్షలు కూడా చేస్తుంటారు. ఏవో సలహాలిస్తూ ఉంటారు. వచ్చినవాళ్లకి అది చాలా సంతృప్తినిస్తోంది. వాళ్లు ఆయన టేబులు మీద మర్యాదగా యాభై రూపాయలుంచి శలవు తీసుకొంటూ ఉంటారు. వారది ఎంతో లాభదాయకంగా ఫీలవుతున్నారు. లాభదాయకం, ఎలాగా అంటారా. ఆపాటి వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే ఎంత చిన్న డాక్టరికయినా కనీసం ఓ వంద నోటు సమర్పించుకోవాలికదండి. దానితో అయిపోతుందా.. డాక్టరుగారి క్లినిక్‌కి వెళ్లడానికి రానూ.. పోనూ.. ఓ యాభై అయినా ఆటోవాడికివ్వాలికదండి. వాటన్నింటికి తోడు డాక్టరుగారి క్లినిక్‌లో క్యూలో వెయిటింగు కూడా చెయ్యాలి. ఎంత ముందుగా ఎపాయింట్మెంట్ తీసుకున్నా అది తప్పదు కదండి. మరి మీరే చెప్పండి. లాభదాయకం ఔనో కాదో. లాభదాయకమనే.. నాకు ఓటు వేసేరా.. Thanks, అండి.
డాక్టరు గోపాలరావుగారు చేస్తున్న ప్రజా సేవలు ఎంత విలువయినవో చూసేం కదండి. వాటి విలువ కట్టడానికి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో రాసినట్లు, ఖరీదుకట్టే షరాబు లేడండి. ఆ పశువుల డాక్టర్ని అంతలా వెనకేసుకొచ్చి పొగుడుతున్నావు, నీకు అతడు ఏమిటవుతాడేమిటి, అని అడుగుతున్నారా. ఆయన నాకు ఏ మేనత్త కొడుకూ కాదండి, ఏ మేనమామ కొడుకూ అంతకన్నా కాదండి. నాకూ.. ఆయనికి ఏ..చుట్టరికం లేదండి. మీకు కావలిస్తే కోర్టు కాగితం మీద రాసి సంతకం చేసి ఇస్తాను. సరేనా. అయితే, నాకో అలవాటుందండి. ఎవరయినా.. ఏదయినా.. మంచిపని, అదేనండి, నలుగురికీ పనికొచ్చేది చేస్తూ ఉంటే, అది నలుగురికీ చెప్తే నాకో తృప్తండి. అంతే కాదండి, నాకు ఆ తృప్తి సంతోషాన్నిస్తుంది. మీరు నాతో ఏకీభవించేరు గదా, సంతోషం సగం బలమని. అంచేతే నేను ఇప్పటికీ ఇంత హెల్దీగా ఉన్నానండి. మీరూ.. ట్రై చూసి చూడండి. మీ మెడికల్ బిల్స్ ఎంత తగ్గుతాయో.
ఇంకా ఏవయినా కబుర్లున్నాయా అంటున్నారా. ఓ.. బోలెడున్నాయండి. చెప్తాను. వినండి.
మా ఊళ్లో సుదర్శనం గారని ఒకాయన ఉన్నారండి. అందరూ ఆయన్ని ‘లండన్ లాయరు’ అంటారండి. ఆయన, లండనూ వెళ్లలేదు. లాయరూ కాదు. మరి ఆ బిరుదు ఎందుకొచ్చిందో, ఎవరు పెట్టేరో నాకు తెలీదండి. నాకు తెలిసిందల్లా, ఆయన బి.ఎ. పాసయ్యేరండి. మరే డిగ్రీ చేయలేదండి. ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతారు. రోజూ ఇంగ్లీష్ న్యూస్ పేపరు ఈ.. కొసనుండి ఆ.. కొసదాకా చదువుతారండి. పిత్రార్జితమయిన ఓ విశాల భవనం ఆయన నివాసం. పెద్దవీధిలో పిత్రార్జితమయిన మరో రెండస్తుల భవనం ఉందండి. దాన్ని ఓ పెద్ద బట్టల దుకాణం వాళ్లు పెద్ద మొత్తం మీద అద్దెకు తీసుకొన్నారండి. అది కాక పిత్రార్జితమయిన ఓ ఇరవై ఎకరాల భూమినుండి శిస్తు కూడా వస్తుంది. అంచేత ఆయన కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతుకుతున్నారు. ఆయన ఊళ్లోని నలుగురు పెద్దవాళ్లతో కలుస్తూ ఉంటారండి. అలా నలుగురి మధ్యా ఉన్న సమయాల్లో, ఏదయినా వివాదాస్పద విషయం చర్చలోకి వచ్చిందనుకోండి. ఆయన ధాటీగా తన వాదన వినిపిస్తారట. అటువంటి సందర్భాలలో ఓ మారు, ఒకాయన దలైలామాకి ఆశ్రయమిచ్చి మన ప్రభుత్వం అప్పట్లో పొరబాటు చేసిందన్నాడట. దాని మూలంగానే చైనా మనమీద కత్తికట్టిందన్నాడట. మన లాయరుగారు, అదేనండి లండన్ లాయరు గారు, దాన్ని ఖండిస్తూ, ‘యోహి భీతం ప్రపన్నం శాత్రవే దదాతి, నస్యంతి తస్య సర్వాణ్యేవ సుకృతాని’ అంటే, శరణు కోరినవారిని వారి శత్రువులకు అప్పచెబితే చేసిన పుణ్యకార్యాల ఫలితం దక్కదు. అంటే, అంత పాపమన్నమాట; అని పెద్దలు చెప్పేరని, మన భారతీయ సంస్కృతిని పాటించేరండి నెహ్రూగారు, ఆయన ఏ పొరబాటూ చేయలేదని, బల్ల గుద్ది చెప్పేరట. మన లండన్ లాయరు గారు లా చదవకపోయినా లా పాయింట్లతో మాట్లాడతారట. బహుశా అందుకే లాయరు గారికా బిరుదు వచ్చిందేమో. అయితే ఆ ‘లాయరు’ పదానికి ముందు ‘లండన్’ కూడా ఉంది కదా. అదెందుకొచ్చిందో నాకు కొంత ఐడియా ఉందండి. చెప్తాను, వినండి. రోడ్డు మీద ఏ కుర్రాడైనా రాంగ్ సైడున తొందరగా సైకిలు మీద పోడం ఆయన కళ్ళలో పడ్డాదనుకోండి. ‘గుంట వెధవ. ట్రేఫిక్ రూల్సుకి against గా వెళ్తున్నాడు. ఇదే లండన్ అయితే వాడికి ఇరవై పౌండ్లు జరిమానా వేసుందురు.” అని పక్కన ఎవరుంటే వాళ్లతో ఆయన అంటారు. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో ‘ఇదే లండన్’ అయితే, అని లండన్‌తో మా ఊరుని కంపేర్ చేస్తూంటారండి. అందుకే ఆయనికి ఆ లండన్ బిరుదొచ్చిందనుకొంటా. అయితే దానికి ఒక చిన్న కారణం కూడా ఉందండీ. అదేమిటీ అంటున్నారా. మా ‘లండన్ లాయరు’ గారి అల్లుడు లండన్‌లో డాక్టరుగా ఉన్నాడండి. ఆయన అత్తవారింటికి, అదేనండి, మా ఊరుకి వచ్చినప్పుడు అటువంటి విషయాలు మామగారికి చెప్తూంటాడేమో. అంతా నా గెస్ వర్క్సుమండీ. మన లండన్ లాయరుగారికి ఈవినింగ్ వాక్ అలవాటండి. ఓ నలుగురు రిటైరుడు ఉద్యోగులు ఆయనకు కంపెనీ అండి. వారికి లండన్ లాయరు గారంటే చాలా గౌరవమండి. వాళ్లతో ఆ రోజు న్యూసు, దేశంలోని రాజకీయాలు చర్చిస్తూ వాటి మీద ఆయన అభిప్రాయాలు చెబుతూ ఉంటారట. వాళ్లు శ్రద్ధగా వింటూ ఉంటారట. అప్పుడప్పుడు లండన్ బోగట్టాలు చెబుతూంటారట. ఓ రోజు ఆ వాకింగ్ సమయంలో, “రెండు రోజుల క్రిందటండీ, లండన్‌లో ఓ పోలీస్ కమిషనరుగారి కారు రాంగ్ సైడున పార్కు అయిందిట. అది గమనించిన ట్రేఫిక్ డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కాన్స్టబులు, కమిషనరుగారికి ఫైను వేసేట్ట. ఆ కమిషనరుగారు, కిమ్ అనకుండా.. ఫైను కట్టి వెళ్లేరట. అదేనండి లండన్‌లో డిసిప్లిను. అక్కడ రూల్స్ అంటే రూల్సే. ఎంత పెద్దవాడైనా, రూల్సు పాటించవలసిందే. ఆదే మన దేశంలో అయితే, పెద్దవాళ్లు రూల్సు పాటించకపోయినా, పట్టించుకొనే వాడుండడు. మనదేశంలో పోలీసు కాన్స్టబులుకి అంత ధైర్యం ఉంటుందా చెప్పండి. పై అధికారికి ఫైను వేస్తే ఉద్యోగం ఊడుతుంది వాడికి.” అని లండన్ ప్రత్యేకత చెప్పేరట. ఆయన చెప్పింది, నిజమే కదండి.
మా ‘లండన్ లాయరు’ గారు కూడా సోషల్ సర్వీస్ చేస్తుంటారండీ. ఆయన ఉంటున్న వీధిలో అంత క్వాలిఫైడ్ కాని వాళ్లకి, ఏదైనా నోటీసు వంటివి ఇంగ్లీష్‌లో వచ్చేయనుకోండి. వాళ్లకది బోధపడలేదనుకోండి. అది పట్టుకొని వాళ్లు ఆయన దగ్గరకు వెళ్లడం జరుగుతుంది. ఆయన అది చదివి, దాని సారాంశం వాళ్లకి బోధపరుస్తారు. దానికి ఏదయినా జవాబు ఇవ్వవలసి ఉంటే ఆయనే ఒక కాగితం మీద జవాబు రాసి ఇస్తారండి. అలాగ ఆయన అందరికీ అందుబాటులో ఉండి చేయగలిగిన సాయం ఉచితంగా చేస్తూంటారు. ఆయనకి అది సంతోషాన్ని ఇస్తుందేమో. మళ్ళీ ‘సంతోషం’ మాట ఎందుకంటారా. అవునులెండి. మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం. సో, దాన్ని స్కిప్ చేసేస్తానులెండి.
ఇంకా కబుర్లు వినాలని ఉందా మీకు. అయితే వినండి.
మా ఊరి హై స్కూల్లో ఇద్దరు సైన్సు టీచర్లు ఉన్నారండి. పెద్దక్లాసులకి సైన్సు, అప్పారావు మేస్టారు చెప్తారండి. చిన్న క్లాసులకి సైన్సు, శంకరం మాస్టారు టీచ్ చేస్తారండి. అయితే సమస్య వాళ్లు పాఠాలు చెప్పడంలో రాలేదండి. అయితే మరి ఎందులో వచ్చిందంటున్నారా. ప్రాబ్లెమ్ అంతా ఒక విశేషణం తెచ్చిపెట్టిందండి. ఇదేమిటయ్యా, సైన్సుకి, తెలుగు వ్యాకరణానికి ముడి పెడితున్నావంటున్నారా. వినండి సార్. మీకే తెలుస్తుంది. అప్పారావు మాస్టార్ని అందరూ ‘సైన్సు మాస్టారు’ అంటారు. కాని, శంకరం మాస్టార్ని.. ‘చిన్న సైన్సు మాస్టారు’ అంటారు. ఆ ‘చిన్న’ విశేషణం ఆయనకు కిట్టదండి. చిన్నతనంగా ఫీలవుతారు. ఆయన చెప్పే కారణం ఏమిటంటే, సైన్సులో ‘చిన్న సైన్సు’ ‘పెద్ద సైన్సు’ అని ఉండవు. నేను చెప్తున్నదీ.. సైన్సే. యూనివర్శిటీలో ప్రొఫెసర్లు చెపుతున్న సైన్సు పాఠాలూ సైన్సే.. అంటారు. అంతేకాదండి. ఆయనది మరో పవర్ఫుల్ ఆర్గ్యుమెంటు ఉంది. ఆదేమిటంటారా. గట్టి పునాది వేస్తేనే, ఆకాశాన్నంటుకొనే భవనాలు కట్టగలుగుతారు. పునాది గట్టిది కాకపోతే కట్టగానే అది మట్టిలో కలిసిపోతుంది. అలాగే అంతరిక్షానికి ఆవతల ఏముందో తెలుసుకోవాలంటే, సైన్సులో చిన్న క్లాసులలోనే గట్టి పునాది పడాలంటారు. అందుచేత పునాదిని చిన్నది చేసి మాట్లాడకూడదంటారు. సైన్సులో చిన్నా పెద్దా లేదంటరాయన. ఆయన వాదనలో కొంత మసాలా ఉన్నట్టుంది కదండీ. కానీ మనం ఏమీ చెయ్యలేం. ఇవన్నీ విన్నాక మనకు బోధపడింది ఏమిటంటే, విశేషణాల్ని ఆచి తూచి వాడాలని.
మా ఊళ్లో ఒక గవర్నమెంటు హై స్కూలు ఉందండి. సుబ్బారాయడుగారు దాని హెడ్ మాస్టరు అండి. ఆయన తమ్ముడు ప్రకాశరావు అదే స్కూల్లో హిస్టరీ మాస్టారు. ఆ అన్నదమ్ములిద్దరిదీ రెండు తరాలనుండి మా ఊరేనండి. అయిదు సంవత్సరాల క్రితం ఇద్దరూ బదిలీ అయి మా ఊరు వచ్చేరండి. పెద్దాయన ప్రమోషను మీద వచ్చేరండి. ఎవరో కాస్తా కూస్తో దగ్గర బంధువు అయిన మినిస్టర్‌ని పట్టుకుని, ఆ బదిలీలు వాళ్లు మేనేజ్ చేసుకున్నారని మా ఊరి ప్రజాభిప్రాయం. సుబ్బారాయుడు గారికి ముందర, విశ్వనాథంగారని, మా ఊరాయనే హెచ్.ఎమ్. గా ఉండేవారండి. అప్పట్లో ఆయన మేనమామ క్లాసుమేటు, రూలింగు పార్టీలో ఎమ్.పి. గా ఉండేవారండి. మా ఊరికి విశ్వనాథంగారు బదిలీ మీద రాడానికి అదేనండి సీక్రెటు. తరువాత, ఆ ఎమ్.పి. గారు ఎలక్షన్లో నిలబడితే, నువ్వు అలసిపోయేవు; కూర్చో అని ప్రజలు హితవు పలికారట. దానితో మన విశ్వనాథంగారి కుర్చీ కదలడం ప్రారంభించిందండి. మన సుబ్బరాయుడుగారి బంధువు, కొత్త ప్రభుత్వంలో మంత్రి అయ్యేరండి. అందుచేత కష్టబడకుండా ఆయన ఈ అన్నదమ్ముల్ని స్వంత ఊరికి బదిలీ చేయించేరు. ‘కష్టబడకుండా’ అని ఎందుకు వాడేనంటారా. మనకు తెలిసిన విషయమే కదండి. ఎవరయినా అటువంటి ఉపకారం పొందినప్పుడు చేసినవారి ‘కష్టం ఉంచుకోరు’ కదండి. మీకు జ్ఞాపకం ఉందా. దాన్నే ఏదో సినిమాలో అల్లు రామలింగయ్యగారు ‘బరువు’ పెట్టాలని అంటూ ఉండేవారు. అయితే ఎంత బరువు పెట్టాలీ..అంటే, కోరిన దాన్ని బట్టి ఉంటుందట. బదిలీ, ఏ విజయవాడకో విశాఖపట్నానికో అనుకోండి, ఎక్కువ బరువు పడుతుందట. డొంకినివలస వంటి ఊళ్లయితే తక్కువ బరువుతో అయిపోతుందట. మరి, ఉద్యోగం వేయించాలన్నా, ప్రమోషను కావాలన్నా, బరువు ఎక్కువగానే పడుతుందట. దాన్ని అలా ఉండనిద్దాం.
సరే, మన హిస్టరీ మాస్టారి సంగతి చూద్దాం. ప్రకాశరావు మాస్టారికి ఓ అలవాటు ఉందండి. అదేమిటీ.. అంటారా. రోజూ పది గంటలకు భోజనం చేసేక సుమారు ఓ గంట భుక్తాయాసం తీర్చుకుని స్కూలుకి తాపీగా, నడకన ఓ అరగంటలో చేరుకొంటారు. అప్పటికి రెండో పీరియడు ముగియడానికి ఓ పావుగంట ఉంటుంది. టైమ్ టేబులు తయారు చేస్తున్నప్పుడు సుబ్బారావు మాస్టారు అది దృష్టిలో ఉంచుకొని, ప్రకాశరావు మాస్టారి క్లాసులు ప్లాన్ చేస్తారుట. ఆయనకి ఉదయం మొదటి రెండు పీరియడ్లు, సాయంత్రం ఆఖరి పీరియడు కేటాయించరు. అది ఆ మాస్టారి రొటీనండి. సాయంత్రం కూడా ఆ ఎడ్జస్టుమెంటు ఎందుకంటారా. సాయంత్రం స్కూలు వదిలిపెట్టగానే, కుర్రకుంకలు పొలోమని మూకుమ్మడిగా ఇళ్లకు పరుగులు తీస్తారని, ఆ రద్దీలో తాను నడవలేనని ఆయన చింత. అవును. నిజమేనండి. ఆయన అమాంతంగా నేలమీద పడి, కాలో చెయ్యో విరక్కొట్టుకొన్నాడనుకోండి, మా ఊళ్లో ఆర్థొపెడిక్ సర్జను, అదేనండి, ఎముకల డాక్టరు లేడండి. అంచేత టేక్సీయో ఏదో చేయించుకుని హిస్టరీ మాస్టారు అష్టకష్టాలు పడి, మాకు దగ్గరలో ఉన్న విశాఖపట్నం పెద్దాసుపత్రికి వెళ్లాలి. అక్కడ రోగులకు ఎంత మెరుగయిన సేవలు అందిస్తారో, నాకన్నా మీకే బాగా తెలుసండి.
ఇహ మన హెడ్ మాస్టరుగారి సంగతి చూద్దాం. ఆయన రోజూ పది గంటలకల్లా తన టేబులు మీద ఎటండెన్సు రిజిస్టరు పెట్టుకుని కూర్చుంటారు. ప్రతీ టీచరు, స్టేఫ్, రాగానే, ఆ రిజిస్టరులో ఆయన సమక్షాన్న సంతకం చేసి వెళ్లాలి. కొద్దిపాటి ఆలస్యంగా వచ్చిన వాళ్లు, ఆయన పెట్టే చీవాట్లు భోంచేసి వెళ్లాలి. అరగంట కన్నా ఆలస్యంగా వస్తే ఆ రిజిస్టరు కనిపించదు. వాళ్లు తిరుగుటపాలో తిరిగి ఇంటికెళ్లాల్సిందే. ఆ స్కూల్లో తిరుమలరావని, ఒక టెంపరరీ లెక్కల టీచరు జాయినయ్యేరండి. ఆయనికి ఈ ఎటండెన్సు వ్యవహారం నచ్చలేదు. ఓ రోజు ఆయన ఇరవై అయిదు నిమిషాలు ఆలస్యంగా బడికి చేరుకున్నాడు. మన హెడ్ మాస్టరుగారు ఆయన్ని చూడగానే, “రావుగారూ మీ వాచీలో టైము ఎంతయింది.” అని వ్యగ్యంగా అడిగేరు.
“సార్, నా వాచీ చెడిపోయింది. మీ తమ్ముడుగారు దారిలో ఉన్నారు. ఆయన దగ్గర మంచి వాచీ ఉంది. ఆయన మరో పావుగంటలో రాగానే ఆయన్ని అడగండి. ఆయన కరక్టు టైము చెప్తారు.” అని వినయంగా చెప్పి, తిరుమలరావు మాస్టారు రిజిస్టరులో సంతకం చేసి, టీచర్స్ కామన్ రూముకు దారి తీసేరండి. మన హెచ్. ఎమ్. గారు చేసేది లేక పొంగి వస్తున్న కోపాన్ని దిగమింగుకొన్నారు.
మరో పావుగంటలో హిస్టరీ మాస్టారు వచ్చేరండి. ఆయనకు రిజిస్టరు కనపడలేదు. “అన్నా, రిజిస్టరు ఏదీ.” అని వాకబు చేసేరు. “నువ్వు రోజూ ఇలా ఆలస్యంగా వచ్చి, నా పరువు తీస్తున్నావ్.” అని తమ్ముడికి హెచ్. ఎమ్. గారు చురకలంటించేరండి. ఆయన అన్నగారి దగ్గర వినయంగా ఉండడానికి, మన రామాయణంలో లక్ష్మణుడు కాడండీ. “నేను ఆలస్యంగా రాడానికి, నీ పరువుకు ఏమిటి సంబంధం.” అని, అన్న, కం హెచ్.ఎమ్. గారిని తమ్ముడు, కమ్, హిస్టరీ మాస్టారు ఎక్స్ప్లనేషన్ అడిగేడండి. అన్నగారు, అదే, మన హెచ్. ఎమ్.గారు, తిరుమలరావు మాస్టారు నర్మగర్భంగా తనని ఎలా అవమానపరిచేరో చెప్పి, “ఇవాళికి నిన్ను సంతకం పెట్టనిస్తున్నాను. రేపటినుండి ఇది కుదరదు. ఆలస్యంగా వస్తే, ఇంటికి వెళిపోవలసిందే.” అని నిర్మొహమాటంగా చెప్పేరండి.
మన హిస్టరీ మాస్టారు హెచ్. ఎమ్.గారి ఆర్డర్‌ని, కండిషనల్ గా ఏక్స్పెక్ట్ చేసేరండి. అదేమిటయ్యా, ఇందులో కండిషన్ పెట్టడమేమిటంటారా. పూర్తిగా వినండి. మీకే తెలుస్తుంది. అన్న, కం, హెచ్.ఎమ్. గారికి తమ్ముడు, కమ్ హిస్టరీ మాస్టారు ఇలా చెప్పేరండి. “అన్నా, నువ్వు, రోజూ పన్నెండు గంటలికి ఇంటికి వెళిపోతున్నావ్. భోజనం చేసి తాపీగా మూడు గంటలకు వస్తున్నావ్. అంతేకాదు. మధ్యాహ్నం ఓ గంట ముందరే స్కూలు నుండి వెళిపోయి నీ పొలానికి వెళుతున్నావ్. రేపటినుండి నువ్వు అది ఆపితే, నేను కూడా రేపటినుండి రోజూ టైముకి వస్తాను.” అని ఖచ్చితంగా చెప్పి, రిజిస్టరులో సంతకం చేసి వెళ్లేరు. కండిషను బాగుంది కదండి. అయితే అన్నదమ్ములు ఏమయినా మారేరా అంటున్నారా. ఆబ్బే. కథ ఎప్పటి లాగే నడుస్తోందండి.
ఏదయినా విన్న తరువాత అందులో నేర్చుకోవలసింది ఏదయినా ఉంటే, అది తెలుసుకోవాలి గదండి. ఇది వరలో తెలుసుకున్నాం; విశేషణాల్ని ఆచి తూచి వాడాలని. అలాగే, ఇందులో ఏమిటి తెలుస్తోందంటే, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరూ, అని.
ఏమిటంటున్నారండి? హెడ్ మాస్టరుగారి ఆఫీసు నాలుగు గోడల మధ్య జరిగిన, అన్నదమ్ముల ఆత్మీయ సంభాషణ నీకెలా తెలిసిందీ.. అనా.. మీ డౌటు. గోడలికి చెవులుంటాయి అంటారు గదండి. ఏమిటి జరిగిందంటే, అన్నదమ్ముల ఆ అనురాగ సంభాషణ జరుగుతున్నప్పుడు, ఆ గదిలో దూరంగా ఆఫీసు ప్యూను ఉన్నాడండి. అతగాడి చెవిలో పడ్డ ఆ సంభాషణ, వైరస్ లాగ వ్యాపించిందండి. అదే నా సోర్సండి. దీని వల్ల, మనకు ఏమిటి తెలిసిందంటే, దరిదాపుల్లో ఎవరున్నారో చూసుకోకుండా పరస్పర దూషణలు చేసుకోకూడదు, అని.
ఆ నియమం పాటించకపోతే ఇద్దరి భాగోతం రోడ్డున పడుతుందండి.
చాలా చాలా కబుర్లు చెప్పుకొన్నాం కదండి. ఇంకా చాలా కబుర్లున్నాయండి చెప్పుకోడానికి. అందుకే మావాళ్లు నన్ను కబుర్లరాయడు అంటారు. అయ్యా, నా శ్రీమతి భోజనానికి రమ్మని మెసేజ్ పెట్టిందండి. అర్జంటుగా వెళ్లాలండి. లేకపోతే అప్పడాలు నా దాకా రావ్. మరేమీ అనుకోకండి. మరోమారు తీరిగ్గా కబుర్లు చెప్పుకొందాం. మరి శలవా.

శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత ఎనిమిది సంవత్సరాల నుండి రచనలు చేస్తున్నారు. ఈ నాటికి 33 కథలు, 3 నవలలు, 4 కవితలు, ఒక హాస్య నాటిక ప్రచురణమయ్యేయి.