శ్రీ బత్తనపల్లి మునిరత్నం రెడ్డి గారి పుస్తకం కౌండిన్య క్షేత్రాలు ఆధారంగా ఆదిమ మానవుల నివాసాలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ చూడవచ్చు. వారి పుస్తకంలోని వివరాలు వాడుకోవటానికి అనుమతి ఇచ్చిన మునిరత్నం రెడ్డిగారికి కృతజ్ఞతలు. పలమనేరునుండి నెల్లిపట్ల రహదారిలో ప్రయాణించిన 18 కి.మీ. వద్ద విరుపాక్షిపురం – బాపల నత్తం రహదారిలో ఈ ఆదిమ నివాసాలు వున్నాయి. దక్షిణం వైపున రోడ్డును ఆనుకుని అడవి కొండ గుట్టలందు వ్యాపిస్తూ నక్కపల్లి చెరువు ముంభాగము వరకు సమారు 5 చ. కి.మీ. ల విస్తీర్ణంలో ఈ రాతి నివాసాలున్నాయి. పంటలు, వంటలు, బట్టలు వగైరా ఏమీ తెలియని అనేక వేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవులు నివసించిన ప్రాంతమిది. క్రూర మృగాలనుంచి రక్షణ కొరకు మాత్రమే ఈ నిర్మాణాలు చేశారు. ఇవే ఇప్పుడు మన నివాసాలకు, దేవాలయాలకు మూలం. ఆ కాలం వారు ప్రాణ రక్షణ కోసం ఇలాంటి బండలు స్వతస్సిద్ధంగా లభించే ఈ ప్రాంతాన్ని తమ నివాసానికి ఎన్నుకున్నారు. ఏ బండలు వున్న ప్రాంతంలోగానీ అలాంటి బండలు కావాల్సినన్ని లభించవు. కాని ఇక్కడ 13 వేల నివాసాలకు సరిపడే బండలు లభించాయి. ఆ కాలంలో వున్నవారంతా ఒకే చోట జీవించటం వారి ఐక్యతకు చిహ్నం. మొత్తం జిల్లా విస్తీర్ణంలో ఇదొక్కటే పెద్ద జనావాసంగా వున్నట్లు తెలుస్తోంది. క్రూర మృగాల భయంతో వారు ఒకే ప్రాంతంలో గుంపులు గుంపులుగా జీవించారు. ఈ ప్రాంతంలో వారి నివాసాలకు తగినన్ని బండరాళ్ళు, ఆహార సముపార్జనకు తగిన అడవి, తాగు నీటికి ఏడాది పొడవునా ప్రవహించే వంక, వారు నివసించేందుకు దోహదపడినాయి. ఆనాడే సుమారు 25 లక్షల మంది నివసించిన ఆటవిక నగరమది. ఇక్కడినుండియే పరిసర ప్రాంతములకు ఆదిమ మానవుల సంస్కృతి విస్తృతి జరిగినట్లు తెలుస్తోంది. ఆదిమ మానవుల కేంద్ర స్ధానంగా వేలాది సంవత్సరాలు విలసిల్లిన ప్రాంతం ఇది. ఇవి ఆలయాలకు, ఆధునిక నివాసాలకు ప్రతిబింబంగా వున్నాయి. నేటి మన గృహ నిర్మాణ వ్యవస్ధకు పునాది వారే వేశారు. దేశమంతటా పాండవ గుడులని, అరణ్యవాస కాలంలో మావూరి అడవుల్లో పాండవులు నివశించారని ఆయా ప్రాంతాలవారి జనవాడుక. ఇది నిజం కాదు. మన దేశంలోనే కొన్ని లక్షల నిర్మాణాలున్నాయి. సమీప దేశాలైన పాకిస్తాన్, ఇండోనేషియా, చైనా, సిలోన్, అప్ఘనిస్థాన్, ఈజిప్టు దేశాల్లోనూ లక్షలాది నివాసాలున్నాయి. ఇవన్నీ పాండవుల నివాసాలనటం సబబుగాదు.
వీరు గుంపులు గుంపులుగా నివసించేవారు. ఒక గుంపులో వారు వేరొక గుంపులోని వారికి దొరికితే ఆ రోజు వారికి విందే. వారు చనిపోయినవారిని ఆహారంగా భుజించేవారు. వీరిలోనూ కీచులాటల కారణంగా కుక్కలు కరుచుకున్నట్ల కరచుకొని కలసి బతకలేని కొందరు గుంపు విడిచిపోయి నెల్లిపట్ల చుట్టూ అడవుల్లో నివసించారు. అలా ఒక గుంపు ఈ భైరవేశ్వర గొండ ప్రాంతంలో సుమారు 30 కాపురాలు ఏర్పరచుకున్నాయి. వాటిలో కొన్ని నివాసాలను ఇప్పుడు చూడగలిగాము. ఇప్పటిదాకా రాసినది శ్రీ మునిరత్నం రెడ్డిగారి పుస్తకం నుంచి. వీటిని మేము చూడలేదు.
మేము చూసినది ఇక్కడ భైరవేశ్వరస్వామి ఆలయం కొండ మీద వున్న నివాసాలు. ఇవి ఎలా వున్నాయో ఫోటోలు చూడండి. నాలుగు బండలు నాటి, వాటిమీద పైన ఒక బండను వేశారు. నిలవబెట్టిన బండల్లో ఒకదానికి రాక పోకలకోసం ఒక్కడుగు వ్యాసార్ధముగల రంధ్రము చేశారు. ఆ రంధ్రము గుండా లోపలకి వెళ్ళి మరొక బండను మూసుకుంటే ఏ క్రూర మృగమునుండి ప్రమాదం వుండదు. పగలు వేటాడి మాంసము తినటం, రాత్రి అందులో దూరి నిద్రించటం వారికి నిత్యకృత్యములు. ఆ నివాసాల్లోనే ఇరుక్కుని నిద్రించేవారు.
నెల్లిపట్ల ప్రాంతంలోని ఆదిమ మానవ నివాసాలు మేము చూడలేదని చెప్పాను కదా.. ఈ వ్యాసము శ్రీ మునిరత్నం రెడ్డిగారి పుస్తకం నుంచి తీసుకున్నాను. మేము చూసిన పాండవ గుహల ఫోటోలు ఇక్కడ ఇస్తున్నాను. మీరూ చూడండి.
ఇలాంటివి ఎక్కడా చూడలేదనుకుంటూ కొండ దిగితే అక్కడ ఇంకో అద్భుతం. దాని గురించి వచ్చే వారం.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™