[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కాలం కొత్తగా..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


కాలానికి అంతా కొత్తే
పాత లేనే లేదు
రావడమే తప్ప
ఆగడం అంత కంటే లేదు
వచ్చే కాలం అని
ముచ్చట పడేలోగా
జారి పోయే కాలమవుతుంది
అనంతమైన కాల గమనమది
అందులో మునకేయడమే మన విధి
కాలం చేసే మాయాజాలం
అర్థం చేసుకోవడం కష్టం
మనిషి ఇందులో బిందువు కూడా కాడు
నిన్నా నేడు రేపూ అనుకుంటూ
ముందుకు సాగడమే చేయగలడు

పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.