అక్షరాలకు పూలకు పెద్ద తేడాలేదు
అక్షరాలెన్నో.. పూలన్ని
వాక్యాలెన్నో.. మాలలన్ని
నా పిచ్చిగాని వర్ణమాల అంటే అదేగదా!
ఎన్నెన్ని భావాలు
మరెన్ని సౌరభాలు
మనసు మనసును స్పృశిస్తాయి!
ఊహ తెలిసినప్పటి నుంచి
భావాలతోనేగా మనిషి సావాసం!
భూతకాలాన్ని మైమరపించడానికి
స్మృతిపథంలో నెలకొన్న మధుర భావపరంపరలు కొన్నైతే,
వర్తమానపు జ్ఞాపకాలుగా రూపొందడానికి
హృదయ పొరల్లో నిక్షిప్తపవుతున్నవి మరికొన్ని!
భాష ఏదైతేనేం
భావ సుగంధం లేని మనిషి జీవితం
కాగితంపువ్వుతో సమానం!

లక్ష్మీ సుజాత గారు పుట్టింది ఆంధ్రా, పెరిగింది తెలంగాణ.. భద్రాచలం, ఖమ్మం జిల్లా. ఇంటర్ చదివే రోజుల నుండి పలు పత్రికల్లో క్విజ్లు, ఆర్టికల్స్, కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. వివిధ బాలల పత్రికలలో వీరి బాలల కథలు ప్రచురితమయ్యాయి. తెలుగు వెలుగులో రాసిన కథకు అభిమానుల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందారు. అష్టాక్షరి, ధ్యానమాలిక అను మాసపత్రికలకు ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తున్నారు. వివిధ అంతర్జాల పత్రికలలో వీరి కవితలు ప్రచురితమవుతున్నాయి. టేకు ఆకులపై రంగవల్లికలు వేసినందుకు గాను వండర్ బుక్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.