వరదాచారి ఇంటికి కూత వేటు దూరంలో గోదారి ప్రవహిస్తూ ఉంటుంది. సాయంకాలాలు ఆ నది మీదుగా వచ్చే చల్లగాలి వరదాచారి ఇంటి వసారాలో, వారి పడకగదుల కిటికీల నుంచి వీస్తూ చాలా ప్రశాంతతనిస్తుంది.
ఆ రోజు ఆ రాత్రి మొదలయ్యే సమయానికి సూర్యప్రభకు ఆ గాలి ఏ మాత్రం సౌకర్యాన్ని ఇవ్వలేదు. అసలు ఆమె అలాంటివి పట్టించుకునే స్థితిలో లేదు.
ఆదెమ్మ మరో అరగంటకల్లా వచ్చేసింది, ఆమె వచ్చేసరికి సూర్యప్రభకు నొప్పులు మొదలయ్యాయి.
సూర్యప్రభ కొద్దిగా అటూ ఇటూ కదులుతూ వాటి నుంచి దృష్టి మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
అవి మరింత పెరుగుతున్నాయి తప్ప ఆగటం లేదు. అప్పగారు చెల్లెలి దగ్గర ఉండి, కాళ్ళు పడుతోంది.
ఆ సమయంలో ముసురు చీకటి ముదురుతోంది. చతుర్దశి వెళ్ళి పౌర్ణమి ఘడియ ప్రవేశించింది.
ఆకాశములో సాయంత్రం నుంచి ఉన్న మబ్బు నెమ్మదిగా తొలగింది. చిన్న పిల్లగాలి గోదారి మీదనుంచి వీస్తోంది. పౌర్ణమి చంద్రుడు మబ్బుల మాటు నుంచి తొంగి చూస్తున్నాడు.
ఆదెమ్మ ఏర్పాట్లు చూసుకుంటోంది. నిండు చంద్రుడు ఆకాశంలో మెరిసాడు. వరదాచారి బయట వసారాలో తన పంచాగము, పుస్తకము దగ్గర ఉంచుకొని టైంను సరిగ్గా రాసుకోవాలని చూసుకుంటున్నాడు. ఆయనకు ఇంతలో చిన్న పిల్ల ఏడుపు వినిపించింది.
“హమ్మయ్య!” అన్నాడు. “అమ్మాయేనా?” అన్నాడు గది వైపు చూస్తూ.
సూర్యప్రభకు చంద్రుడంటి కుమారుడు కలిగాడు. ఆదెమ్మ వచ్చి చెప్పింది, పుత్రోదయం గురించి.
వరదాచారి ముఖంలో ఒక క్షణం ఒక నిరుత్సాహం వీచికలా వీచి మాయమైయింది.
ఆయన వెంటనే జాతకం వెయ్యటం మొదలెట్టాడు. ఆ పౌర్ణమి ఘడియలు మహత్తరమైనవని గమనించాడు ఆయన. ఎప్పుడో కలగని గ్రహకూటమిలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పడు కలిగిన ఆ సంతానం జాతకం ఆయనను అబ్బురపరిచింది.
‘వీడు ఏం సాధించబోతున్నాడో?’ అనుకున్నాడాయన ఆ లెక్కల వంక చూస్తూ.
ఆయన లెక్క ప్రకారం పుట్టినవాడు మహా జాతకుడు.
***.
పిల్లవాడు పుట్టాడని కొంత నిరుత్సాహపడ్డారు వరదాచారి దంపతులు ముందు. ఆడపిల్ల కోసం ఆశపడిన వారి కోరిక తీరలేదు. పుట్టిన వాడు బాల చంద్రునిలా వెలిగిపోతున్నాడు. అతనిని చూసి ఆ నిరాశను మరిచారు. పదకొండవ రోజు బారసాల చేసి పిల్లాడికి ‘వెంకటాచారి’ అని నామకరణం చేశారు.
పిల్లవాడు పుట్టి పదిహేను రోజులు అప్పటికి. ఆ రోజు ఆకాశమంతా మేఘావృతమైంది. ఇక ఇప్పుడో, మరుక్షణమో వాన పడొచ్చని అనిపిస్తోంది చూడబోతే. సూర్యప్రభ పిల్లవాడికి పాలు పట్టి అప్పుడే నిద్ర పుచ్చింది. మధ్యాహ్నం అయి ఉంటుంది.
‘అబ్బబ్బా! ఈ మబ్బేమిటో. వాన పడేలా ఉంది’ అని అనుకుంటూ గది నుంచి బయటకు వచ్చిందామె.
గోదావరి మీదుగా గాలి వీచటం మొదలెట్టింది. ఉన్నట్లుండి మబ్బు చెదిరిపోయింది. సూర్యుడు ఫెళ్ళున బయటకు వచ్చాడు. ఫెళ్ళని ఎర్రటి ఎండ మంచం ప్రక్కనే ఉన్న కిటికిలోంచి చిన్నారి బాలుడి మీద పడుతోంది. ఆ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆ వేడికి పసివాడి ముఖం ఎర్రగా కందుతోంది.
సూర్యప్రభ ఎండను చూసి గబగబా గదిలోకి నడిచి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయింది. అక్కడ కిటికిలోంచి వచ్చే ఎండ పిల్లవానిపై పడకుండా ఐదు తలల సర్పం పడగ విప్పి ఉంది. శిశువు తల ఆ నీడలో ఉంది. సూర్యప్రభకు కళ్ళుతిరిగాయి. ఆమె తెలివి తప్పి పడిపోయింది. ఆమె పడిన చప్పుడుకు పాము చటుక్కున మాయమయ్యింది. ఎలా వచ్చిందో, ఎలా వెళ్ళిందో కూడా తెలియదు. వరదాచారి, అప్పగారు పరుగు పరుగున వచ్చారు. సపర్యలు చేసినాక తేరుకుంది సూర్యప్రభ. లేచి చప్పున వెళ్ళి కొడుకును చూసుకుంది. తరువాత భర్తతో, అప్పగారికి జరిగింది చెప్పింది.
“పంచశిరస్సుల పాము పిల్లవాడికి పడగపట్టింది” అందామె కళ్ళు పెద్దవి చేసుకొని. భయం ఇంకా ఆమె కళ్ళలో. అప్పగారు నమ్మలేదు. వరదాచారి వెళ్ళి చూస్తే పిల్లవాడు నిద్రపోతున్నాడు. ఏ అలికిడీ లేదు.
“ఇక్కడ ఏ అడుగుల గుర్తులూ లేవు. నీవు పొరబడ్డావా? పాము ప్రాకితే పక్క నలగాలిగా ప్రభా?”
“నేను పొరబడటమేమిటి? నా కళ్ళతో నే చూశాను. ఐదు తలలతో ఉన్న పాము… పడగ విప్పి పిల్లాడిని కాచుకుంటుండగా… ఎండ పడకుండా…”
“ఏంటి? ఎండ పడకుండానా? నీకు కాన్పు వల్ల పైత్యము చేసిందమ్మాయి. మందులేమైనా మార్చాలేమో చూడండి మరిది గారు…” అన్నది అప్పగారు.
వరదచారికీ అర్థం కాలేదు సూర్యప్రభ చెప్పేది. కానీ ఏమీ అనలేదు.
“నాకే పైత్యమూ రాలేదు. నేను చూశాను. చాలా పెద్ద పాము. చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి…”
“నీకు పైత్య ప్రభావమే. అందుకే తెలివితప్పి పడ్డావు…” అంది అప్పగారు మొండిగా. చిరాకు కలిగింది సూర్యప్రభకు.
భర్త వైపు తిరిగి “నిజమండీ. నే చూశాను నా కళ్ళతో…” అంది కళ్ళ వెంట కన్నీరు కారుతుంటే.
వరదాచారి ఓదార్చాడు. అప్పగారు కూడా తగ్గి, అంది ఓదార్పుగా, “సరేలేవే. చూశావులే. ఇప్పుడేమీ కాలేదుగా. కంగారు పడకు. నెమ్మదిగా ఉండు…” అంటూ మరిదిగారితో
“మనమేమైనా శాంతి చెయ్యాలా చూడండి మరిదిగారు. పిల్లవాడికి రక్ష కట్టిద్దాము…” అన్నది అప్పగారు.
వరదాచారి తల ఊపి వెళ్ళిపోయాడు అక్కడ్నుంచి. సూర్యప్రభ కొడుకును దగ్గరకు తీసుకొని గుండెలకద్దుకుంది. వరదాచారికీ ఏమీ పాలుపోలేదు. ఆయన తన వద్ద ఉన్న తాళపత్ర గ్రంథాలు తిరగేశాడు. ఎక్కడ చూసినా, ఎలా లెక్క కట్టినా పిల్లాడి జాతకము ప్రకారము ఆయుష్షు ఉంది. మహర్జాతకము.
‘కారణజన్ముడు వీడు’ అనుకున్నాడాయన.
ఆ మరునాడు కొన్ని దానాలు, శాంతులు అవీ చేశారు దంపతులు. పిల్లవాడికి మెడలో హనుమంతుల వారి లాకెట్టు వేసారు. రామరక్షాస్తోత్రం చేసేది సూర్యప్రభ.
***.
వెంకటాచారి చాలా అద్భుతమైన మేధను ప్రదర్శించేవాడు.
ఆ ఇంట నిత్యమూ పఠించే ద్రవిడ వేదం మొత్తం మూడేళ్ళ వెంకటాచారికి కంఠతా వచ్చు. ఉదయం తండ్రి పిల్లలకు నేర్పేవి వాళ్ళతో కూర్చొని అప్పచెప్పేవాడు. ఆ పిల్లలకు బాల వెంకటాచారి మీద అవ్యాజమైన ప్రేమ ఉండేది. వాళ్ళు ఉదయం వచ్చారంటే, చదువుకోని సమయాలలో వెంకటాచారిని నేల మీద నడవనిచ్చేవారే కాదు. బూరె బుగ్గలతో, గులాబీవర్ణంతో, నుదుటమీద చిన్న తిరునామముతో వెంకటాచారి బాలకృష్ణుడిలా ఆకట్టుకునేవాడు అందరినీ.
ఊరిలో అందరికీ తరగని ముద్దుగా ఉండేది ఈ బాలుడంటే. రంగనాథుని కోవెలలో సాయంత్రాలు వచ్చే భక్తులకు వెంకటాచారి ప్రత్యేక ఆకర్షణ. వారు వరదాచారి ప్రవచానాలంటే ఎంత భక్తో, ఈ బాలుడంటే అంత ముద్దు. తల్లి వెనకే తిరుగుతూ కీర్తనలు పాడేవాడా బాలుడు. పెద్దమ్మ వద్ద తిరుప్పావై అప్పచెప్పేవాడు.
వాళ్ళు ముగ్గురికే కాదు ఆ ఊరి వారందరికీ వెంకటాచలమంటే వల్లమాలిన అభిమానంతో మాటాలాడిస్తూ ఉండేవారు.
(సశేషం)
1 Comments
Kalyani chitrapu
Every time we are waiting to read the story and enjoy