ఆ ఫాల్గుణ మాసం కొంత మందకొడిగా సాగింది.
చలి శివరాత్రికి శివశివా అని వెళ్ళిపోతుందని పెద్దలంటారు. హైద్రాబాదులో కొద్దిగా చలి ఎక్కువే, మిగిలిన జిల్లాలలో పోలిస్తే. ఉదయమే పొగమంచు కప్పిన రహదారులు, పేపరువాళ్ళు, పాలవాళ్ళు, కూరగాయల బండ్లతో వింతైన అందాలు చిమ్ముతూ ఉంటుంది.
ఆరోజు ఉదయం సుదర్శనాచార్యులు ఆఫీసులో ఫైలు సర్దుకుంటున్నాడు. ఆ రోజు కావలసిన ఫైల్సు జూనియర్ ముందు రోజు సాయంత్రమే తీసి ఉంచుతాడు. ఆయన ఆ రాత్రి అవి చూసి తను తీసుకోవలసినవి తాను తీసుకొని, వాయిదాలవి జూనియరుకిస్తాడు.
ఆ రోజు ఉదయం ఆయన ఆర్గ్యూ చెయ్యవలసినది నోట్సు చూసుకుంటున్నాడు.
చాలా అనుభవజ్ఞుడైన ఆయనకు అట్టే సమయం పట్టదు కాని, ఆరోజు కొంత పరధ్యానంగా ఉన్నాడాయన.
పండగై ఇంటికొచ్చినది మొదలు ఎందుకో ఆండాళ్ళు దిగులు పడుతోందని ఆయనకు అనిపించింది. ఆయనతో సర్వం పంచుకునే ఆండాళ్ళు, ఏ విషయం మథనపడుతోందో ఆయనకు అర్థం కాలేదు.
ఆ విషయం ఆలోచిస్తూ అన్యమస్కంగా ఫైల్లో తల దూర్చి ఉన్నాడు.
ఆ సమయంలో గుమ్మం దగ్గర చప్పుడయింది.
తల ఎత్తి చూశాడు. ఎదురుగా తిరుమలశెట్టి, ఒక పాత క్లైంటు.
‘ఎన్నాళ్ళో ఈయన కేసు. ఈ రోజు ఇతనిదే లేదే’ అని మనసులో అనుకుంటూ “ఏంటి శెట్టిగారు, ఇట్టు వచ్చారు?” అన్నాడు సుదర్శనాచారి.
“నమస్కారం సారూ…” అంటూ లోపలికొచ్చాడు శెట్టి.
“నమస్కారం! బావున్నారా? ఈ రోజు మీ కేసు లేదే…” అన్నాడు సుదర్శనాచారి.
“అవును సారు. ఇటు వైపు మా తోడల్లుడు వాళ్ళు ఉంటారు. వారి ఇంటి వైపు వచ్చాను. మిమ్ములను చూసి పోదామని వచ్చాను…” అన్నాడు శెట్టి కుర్చీలో కూర్చుంటూ.
“అవునా. ఏంటి సంగతులు? టీ త్రాగుతారా?” అంటూ నాగన్నను కేకేసాడు.
నాగన్న వచ్చాక “టీ తెచ్చిపెట్టు శెట్టిగారొచ్చారు…” అన్నాడు.
నాగన్న బయట బడ్డికొట్టు నుంచి టీ ప్లాస్కులో పోయించుకొచ్చి కప్పులో పోసి శెట్టికిచ్చాడు.
లాయరు ఆఫీసు కొచ్చేవారికి బయట నుంటి టీ తెప్పించటము మాములే.
నాగన్న వెళ్ళిపోయాక “చెప్పండి ఏంటీ కబుర్లు? మీ ఊరి సంగతులు…” అన్నాడు సుదర్శనాచారి.
“మా ఊరు ప్రక్కన తిమ్మాపూరు ఉంది సారు…” అన్నాడు శెట్టి.
అవునా అన్నట్లు తల ఊపాడు చారి.
శెట్టి కొద్దిగా ముందుకు వంగి రహస్యం చెబుతున్నట్లుగా “మన బాబు ఎప్పడు చూసినా అక్కడే తోటకాడ కనిపిస్తాడు…” అంటూ ఆగి చారి ముఖం లోకి చూశాడు. చారి శ్రద్ధగా వింటున్నట్లే కనిపింటాడు.
“ఏ బాబు?” అన్నాడాయన.
“మన బాబే. అప్పడప్పుడు ఆఫీసులో కనపడుతున్నాడుగా…”
“రాఘవా?”
“అవును. ఎప్పుడూ అక్కడే ఉంటడు. ఆ రెడ్డోళ్ళ తోటలో. ఎప్పుడు చూసినా త్రాగుతూనే ఉంటరు ఆ పోరలంతా. మన బాబు కూడా వాళ్ళతో కలిసే ఉంటాడు. ఆ తోట చూసే పనివాడు మా పనోడు ఇద్దరూ అన్నదమ్ములు. నేను బాబును చూసి అడిగితే చెప్పాడు అక్కడే ఉండా బాబు అని…” ఆగాడు శెట్టి. సుదర్శనాచారి ఎలా తీసుకుంటాడో తెలియక. సుదర్శనాచారి ఏమీ మాట్లాడక ముఖం బ్లాంక్‌గా పెట్టి వినటం చూసి కొనసాగించాడు.
“చాలా రోజుల్నుంచి ఇది నడుస్తోంది సారు. మీకు తెలియదని చెప్పటానికొచ్చా. ఈ వయస్సులో పిల్లలను మనం కాపాడుకోలేకబోతే తరువాత కష్టపడాలి. మీకు తెలవదా కానీ. ఇదీ మీ మేలు కోరేవాడిని కాబట్టి చెప్పటానికొచ్చా…” అన్నాడు నెమ్మది స్వరంతో.
తరువాత కుర్చీకి వెనక్కు జరిగి టీ త్రాగాడు నెమ్మదిగా.
సుదర్శనాచారి చాలా షాక్‌కు గురైనాడు. కాని ఆ షాక్ బయటకు కనపడితే ఆయన సుదర్శనాచారి అవడు. వెంటనే సర్దుకొని “వాడి సంగతి చూద్దాంలేండి. మీరు వెళ్ళిరండి. నేను కోర్టుకు వెళ్ళాలి. ఈ రోజు కేసులు చాలానే ఉన్నాయి…” అన్నాడు.
శెట్టి మరి కొంత సేపు పిల్లలు పెంపకం మీద మాట్లాడాలనుకొని, చారి అలా తుంచెయ్యగానే, లేచి “సరే సారు. నే వెళ్ళొస్తా. మీరు బాబును ఏమనకండి…” అంటూ వెళ్ళిపోయాడు.
జూనియర్ రామచంద్రుడు అక్కడే ఫైళ్ళు సర్దుతున్నాడు.
సుదర్శనాచారి కాసేపు కళ్ళు మూసుకు కూర్చున్నాడు. ఆయనను డిస్ట్రబ్ చెయ్యటం ఇష్టం లేక రామచంద్రుడు నెమ్మదిగా బయటకు నడిచాడు.
అరగంటకు సర్దుకున్నాడు సుదర్శనాచారి.
కష్టాలు సమస్యలు వస్తాయి. జీవితం అంటేనే అదృష్టదేవత చేతులలో ఆట. మనం ఏ విషయమైనా ఎలా తీసుకుంటామన్నది మన చేతులలో ఉంది. దాని గొడవ చేసి రచ్చ రచ్చ చెయ్యవచ్చు. నెమ్మదిగా సర్దుకోవచ్చు.
‘ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంత త్వరగా తిరిగి మనం మనలా ఉండగలమో దానిని బట్టి మనమెంత సమర్థులమో తెలియగలదు’ అంటాడు చారి.
ఆయన జీవితంలో దెబ్బలు తిన్నవాడు. పిన్ని పెంపకంలో వారాలు చేస్తూ చదువుకోని నేటికీ స్థాయికి వచ్చినవాడు. కష్టాల సంగతి ఆయన కన్నా ఎవరు బాగా చెప్పగలరు? కాకపోతే డబ్బు జబ్బు ఎక్కువ చేసిన యువత ఎంత పాడవ్వాలో అంత పాడవుతున్నారని మనసులో కొంత కష్టపెట్టుకున్నాడు.
ఏం చెయ్యాలో ఒక పథకానికొచ్చేసాడు. ఆయన మనసు నిదానించింది.
లేచి రామచంద్రుని పిలిచాడు.
బయట బాల్కనీలో నిలబడిన రామచంద్రుడు వచ్చాడు.
“నీవు రెండు రోజులలో మన వాడు ఆ రెడ్డి తోటలో పడుంటున్నాడా? ఏం చేసున్నాడో వివరాలన్నీ కనుక్కొని రా. ఈ విషయం ఎవరికీ తెలియనీయ్యకు…” అన్నాడు.
తరువాత తన మిత్రులలో ఒకరైన ఒక ప్రొఫెసరుకు ఫోను చేశాడు. మాట్లాడవలసినవి మాట్లాడాడు.
తరువాత లేచి కోర్టుకు తయారయినాడు మామూలుగా.
ఇవేమి తెలియని ఆండాళ్ళు ఆయనకు ఉదయం ఉపాహారం పెట్టి కోర్టుకు పంపింది.
***
రెండు రోజులలో రామచంద్రుడు ఆయనకు పూర్తి రిపోర్టు ఇచ్చాడు.
దానిని బట్టి రాఘవ వారంలో దాదాపు నాలుగు రోజులు కుమారస్వామి తోటలో ఉంటాడు. వెళ్ళిన ప్రతిసారీ పదివేల వరకూ డబ్బు పెట్టి వారంతా పేకాడుతారు. తాగుడూ తిండి ఖర్చు పంచుకుంటారు. రాఘవ కాస్త ఎక్కువే ఖర్చు పెడతాడు. వాళ్ళు మధ్యలో గంజాయి కూడా పీలుస్తారు. ఆడపిల్లల జోలికిపోరు. కారణాలు పనివాళ్ళకు తెలియదు ఇత్యాదివి తెలిసాయి. వాటిని చూసి తల ఊపాడు సుదర్శనాచారి.
“సరే. ఈ విషయం నీవు మర్చిపో. నే చూసుకుంటానింక!” అన్నాడు.
పైన ముగ్గురు కొడుకులు ఏ ఇబ్బంది ఇవ్వలేదు. కడగొట్టు వాడు ఇలా చుక్కలు చూపుతున్నాడు. ‘వీడికి కష్టం తెలియకుండా పెంచటమే మనం చేసిన పొరపాటు’ అనుకున్నాడాయన కొద్దిగా చిరాకుతో కూడిన నిరసనతో.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మా ఊరి సంక్రాంతి
బహుళ పంచమి జ్యోత్స్న
‘శ్రీమద్రమారమణ’ – సరికొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన
అక్కడ పాట లేదు
వేంపల్లి నాగ శైలజ మూడు మినీ కథలు
బొమ్మల రారాజు ‘కొండపల్లి’
‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’-2
పూల వనం..
ఆ కళ్ళు
జిజ్ఞాసువు – పద్య కవిత
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®