1503లో కాలికట్ నౌకాబలానికి, పోర్చుగీసు నౌకాబలానికి సముద్రయుద్ధం జరిగింది. పోర్చుగీసువారు విజయం సాధించారు. 1610-16 మధ్య మరో పోర్చుగీస్ సాహసికుడు ‘ఆల్ఫాన్జో అల్బుకర్కా’ గోవాను జయించాడు. అలా వారు తమ వ్యాపార అభివృధ్ధికి సింహళాన్ని, సింగపూర్ సమీపంలోని ‘మలక్కా’ను ఆక్రమించారు. అలా వారి ద్వారా పాశ్చాత్య వైద్యపద్దతి భారత దేశంలో ప్రవేసించింది.
అనంతరం 1595 లో డచ్ నౌకాబలం భారతతీరంలో అడుగు పెట్టింది.
డచ్ ఈస్టిండియా కంపెని ఏర్పడటానికి కారకుడు ‘విన్ లాటిన్’. ఇతను గోవా అర్బి బిషప్ ప్రైవేట్ కార్యదర్శి. 1641లో డచ్చివారు మలక్కాను జయించారు. 1654లో కొలంబో వారి స్వాధీనం అయింది. అనంతరం ఇండోనేషియాలో వారు ప్రవేసించారు.
1608లో ఇంగ్లీష్ వారి ఈస్టిండియా కంపెని ఏర్పడింది. అనంతరం ప్రెంచ్ వారి కంపెనీ ఏర్పడింది. తొలుత ఇండోనేషియాపై ఆంగ్లేయులు కన్ను వేసారు. అక్కడ డచ్చి వారితో జరిగిన యుధ్ధంలో ఓడిపోయి భారతదేశం వైపు మళ్లారు.
భారతదేశంలో 1620లో, తంజావురు జిల్లాలోని ట్రాంక్విబార్లో డచ్చివారు ఒక టంకశాల తెరిచారు. పిమ్మట కలకత్తా సమీపంలోని సిరాంపూర్ చేరారు కానీ 1845లో రెండు స్ధానాలను ఇంగ్లీషు వారికి అమ్మి వేశారు. క్రీ.శ.1600లో ఇంగ్లీషువారు భారతదేశంలో అడుగు పెట్టడానికి తీవ్ర ప్రయత్నం చేసారు. కాని పోర్చుగీసు, డచ్ కంపెనీలనుండి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. 1612- 1615లలో జరిగిన నౌకాయుధ్ధంలో ఇంగ్లీషు వారు యుధ్ధం సాగించారు. 1616లో బొంబాయి దీవిని పోర్చుగీసు రాజు తనకుమార్తె బ్రగంజాను బ్రిటీష్ రాజు రెండవ ఛార్లెస్‌తో వివాహం జరిపించి అరణంగా ఇచ్చాడు. దీన్ని రెండవ చార్లెస్ ఈస్టిండియా కంపెనీకి కౌలుకు యిచ్చాడు.
1637లో మద్రాసును కంపెనివారు సంపాదించారు. చంద్రగిరిని పాలిస్తున్న విజయనగర వంశీకుడైన రాజు ఆధీనంలో చెన్నపట్నం ఉండేది. కూంనదీ తీరంలో ఇసుక తిన్నెపై ఒక కంపెనీ భవనాన్ని కట్టుకోవడానికి ‘ప్రాన్సిస్ డే’ అనే ఆంగ్లేయుడు కౌలు అనుమతి సంపాదించాడు.
మచిలిపట్నం(బందరు) అంతకుముందే 1625లో ఇంగ్లీష్ వారి స్ధావరం అయింది. తెలుగునాట తొలి మసీదు బందరులో కట్టబడింది.
1633లో ఒరిస్సాతీరంలోని ‘బాలసోర్’లో ‘హరిహరపూర్’లో ఆంగ్లేయులు అడుగు పెట్టారు. 1651లో కలకత్తాలో కౌలు సంపాదించారు. బెంగాల్‌ను పాలిస్తున్న నవాబుకు,’గేబ్రియల్ బాటన్’ అనే ఆంగ్లేయ వైద్యుడు చేసిన సేవలకు మరో రెండు స్ధావరాలు ఆంగ్లేయులకు 1700 సంవత్సరంలో కోటలు కట్టుకునే అవకాశం లభించింది. ఈ మూడు స్ధావరాలు ఆదారంగా కలకత్తా మహానగరం ఏర్పడింది. అప్పుడే 1774లో తొలి సుప్రీంకోర్టు ఏర్పడింది. ఆంగ్ల కళాశాలలు ఏర్పడ్డాయి. 1800 సంవత్సరంలో కలకత్తా కార్పోరేషన్‌గా ఏర్పడింది. అది 1912 వరకు ఆంగ్లేయుల రాజథాని, 1912లో ఢిల్లీ రాజధాని అయింది. 1857 నుండి బ్రిటీష్ పాలకుల నిరంకుశధోరణిపై భారతీయుల తీరుగుబాటు ప్రారంభం అయింది.
ఇంతపెద్ద దేశాన్ని కేవలం కంపెనీ అధికారులే పాలించలేవని బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించింది. కంపెనీలు రద్దు చేసి, ఇంగ్లాడ్ రాణి విక్టోరియా భారతదేశానికి చక్రవర్తిని అయింది.1858 ఆగస్టు రెండవతేది బ్రిటీష్ పార్లమెంట్ ఈ ప్రకటనను ఆమోదించింది. 1858 నవంబర్ 1 న వైస్రాయి కానింగ్ ఈ ప్రకటనను అలహాబాద్‌లో ప్రకటించారు.
స్వదేశ సంస్ధానాలను స్వాధీనం చేసుకునే పధ్ధతికి స్వస్ధి చెప్పారు. వీరిని పెంచి పోషించడం వలన తమకు విశ్వాసంగా ఉంటారని గుర్తించారు.
అశోకుని బ్రహ్మలిపి శాసనాలు చదవడం నేర్చుకున్నాడు ‘జేమ్సు ప్రిన్సిప్’ అనే బ్రిటీష్ చరిత్రకారుడు. డాక్టర్ హాల్జు భారత ప్రభుత్వ పురాతత్వ పరిశోధకుడుగా నియమితుడై ప్రాచీన చరిత్రను త్రవ్వి వెలికి తీయడంలో ఎంతో సేవ చేసారు. దక్షిణ-భారతీయ చరిత్రకు, భాషలకు మెకంజి, బ్రౌన్, కాటన్ దొర తదితరుల సేవలు మరువలేనివి.
బొంబాయి, కలకత్తా, మద్రాసు నగరాలలో విశ్వవిద్యాలయాలు ప్రారంభం అయ్యాయి.
***
బాలలు వందేమాతరం కథ లోనికి మరలా వెళదాం! అని కథ చెప్పసాగాడు…
తూటాలు పేలిన శబ్ధ వింటూ కొండ పైన రహస్యస్ధావరంలోని వారంతా వేగంగా కొండదిగి రాసాగారు.
తన పిల్లలను తలుచుకుని సుగుణమ్మ పెద్దగా ఏడవసాగింది. శివయ్యకు కన్నీరు ఆగడం లేదు, అందరూ చంద్రయ్య యింటి దగ్గరకు వచ్చారు. ఇంటికి సంబంధించిన శకలాలు, తుంపులైన మనుషుల శరీర భాగాలు చెల్లా చెదురుగా ఆ ప్రాంతమంతా కనిపించాయి.
అది చూస్తూనే సుగుణమ్మ పెద్దపెట్టున నేలపై పడి దొర్లి ఏడవసాగింది. ‘అమ్మి దేశం అంతటా లక్షలాది తల్లులు ఇదే వేదన అనుభవిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన బిడ్డలను చూసి గర్వపడదాం!’ అని సుగుణమ్మను ఓదార్చి, దుఃఖాన్ని ఆపుకున్న శివయ్య చేయవలసిన పనులగురించి తనతో ఉన్నవారికి వివరించాడు.
వారంతా కలసి ఊరికి కొద్ది దూరంలో పెద్ద గోతిని తీసి ఆ ప్రాంతం లోని మానవ శరీరభాగాలు అందులో వేసి పూడ్చారు.
ఆడవారు సుగుణమ్మను కొండపైకి తీసుకు వెళ్లారు.
ఆ ప్రాంతమంతా పేలకుండా పడిఉన్న తూటాలను సేకరించగా నలభైకి పైగా లభించాయి. చంద్రన్న వాటిని భద్రపరిచారు.
‘ఇంత మారణంహోమం జరిగిన తరువాత తెల్లవాళ్లు మనపై పెద్ద ఎత్తున దాడి చేస్తారు మనం గట్టి ప్రతిఘటన ఇవ్వాలి, వారికి మనదాడి గుణపాఠం కావాలి’ అన్నాడు శివయ్య.
‘శివయ్య ఒక్క పట్టా కత్తి, నలభై తూటాలతో మనం వారిని ఎదిరించడం సాధ్యమా’ అన్నాడు చంద్రన్న.
‘అన్నా, సాధ్యమే ఆశయం, కృషి, పట్టుదల, లక్ష్యసాధన ఉంటే అసాధ్యమనేది ఉండదు, మీరు సహకరిస్తే మన పోరాటం చరిత్రలో శాశ్వత స్ధానం పొందుతుంది, స్వాతంత్ర్యం మనకు సిధ్ధిస్తుంది. మీరు పోరాటానికి సిధ్ధమా?’ అన్నాడు శివయ్య.
‘సిధ్ధమే’ అన్నారు అక్కడ ఉన్నవాళ్లంతా.
చేయవలసిన పనులు అక్కడ ఉన్నవారందరికి వివరించాడు శివయ్య.
‘అలాగే’ అని గొడ్డళ్ళతో అడవిలోని ఎండు చెట్లను కట్టెలుగా మార్చడానికి కొందరు యువకులు వెళ్లగా, మరికొందరు వయసు మళ్లినవారు ఊరి వెలుపల ఉన్న కందికట్టెను సేకరించడానికి, మరికొందరు గడ్డివాముల్లోని ఎండుగడ్డి సేకరించడానికి వెళ్లారు.
శివయ్య, చంద్రయ్యలు మాత్రమే అక్కడ మిగిలారు. ‘శివయ్య కందికట్టె, ఎండు పుల్లలు, ఎండుగడ్డితో తెల్లోళ్లను ఎదుర్కోవడం సాధ్యామా’ అన్నాడు చంద్రన్న.
‘అన్నా నీ చేతుల మీదుగా ఈసారి దాడి ప్రారంభిస్తావు, విజయానికి కారణం నువ్వే అవుతావు. తూటాలు జాగ్రత్త పరిచే బాధ్యత నీదే, పద’ అని కొండపైకి దారి తీసాడు శివయ్య.
కొండపైన పూజారిని కలసిన శివయ్య ‘పూజారయ్య మనం తినడానికి సరిపడా వంట నూనెలు, స్వామి దీపారాధనకు తమకు కావలసినంత తీసుకుని, ప్రజలు అన్నదానానికి ఇచ్చిన నూనె, నేయి, కిరసనాయిలు, కర్పురం వంటి వాటిని రేపు అడవిలోని ముత్యాలమ్మ వాగు దగ్గరకు మనవాళ్ల ద్వారా చేర్పించండి, ఆ బ్రిటీష్ వారికి తెలుగు నేల పోరాటం మరపురాని గుణపాఠం అవ్వాలి. భారతీయుల పోరాట పటిమ ఏమిటో తెలియజేస్తాను’ అన్నాడు.
(సశేషం)
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™