[శ్రీమతి దాసరి శివకుమారి గారి ‘కర్మయోగి’ పుస్తకానికి కొల్లూరి సోమ శంకర్ రాసిన ముందుమాటని అందిస్తున్నాము.]
కథైనా, కవితైనా నవలయినా పాఠకులను ఆసక్తిగా చదివించాలి. కథ, నవలల పరిధి ఎక్కువ. నవల పరిధి ఇంకా విస్తృతం. పాఠకులను చివరిదాకా చదివించాలి అంటే ఇతివృత్తాన్ని అనుసరించి, కథనమూ – చురుకుగా సాగాలి. రచన వెంట పాఠకులు ప్రయాణించాలి. పాత్రలతో మమేకం కావాలి. అలాంటి నవలలు పాఠకాదరణను తప్పక పొందుతాయి.
అటువంటిదే శ్రీమతి దాసరి శివకుమారి రచించిన ‘కర్మయోగి’ నవల. సంచిక వెబ్ పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన ఈ నవల పాఠకులను ఆకట్టుకుంది.
ప్రారంభంలో ఒక ముడి వేసి, నవల చివరలో ఆ ముడి విప్పడం – మంచి టెక్నిక్. దీనివల్ల చదువరులలో ఆరంభంలో మొదలైన ఒక ఉత్సుకత చివరి వరకు నిలిచి ఉంటుంది. అయితే కథనం మధ్య మధ్యలో ఆ ముడి తాలూకూ గుట్టుని పాఠకులు మర్చిపోకుండా ఉండేందుకు కొన్ని సన్నివేశాల ద్వారా గుర్తు చేస్తూ సస్పెన్స్‌ని కొనసాగించడం రచయిత్రి నేర్పు.
జీవితం మంచి చెడుల కలయిక. అలాగే ఈ నవలలోనూ మంచి చెడూ కలగలుస్తూ ఉంటాయి. మంచివాళ్ళూ ఉంటారు. మంచిగా ఉంటూ చెడుగా మారిన వ్యక్తులుంటారు. పైకి చెడుగా అనిపించినప్పటికీ అంతరంగం మంచిగా ఉన్న వ్యక్తులుంటారు. సందర్భాన్ని బట్టి వారు దుష్టులేమో అనిపించినా, వారి అసలు స్వభావం వెల్లడయి ఆ పాత్రల పట్ల సదభిప్రాయం కలుగుతుంది.
వ్యవసాయం, వ్యాపారం, రాజకీయం – ఈ మూడు రంగాలలోని మంచి చెడులను కథాపరంగా స్పృశిస్తూ – వాటిలో నిమగ్నమైన వ్యక్తుల మనస్తత్వాలను వెల్లడి చేస్తూ – ఎవరికీ చెడు చేయకుండా మనం నిజాయితీగా ఉంటూనే ఆ రంగాల్లో ఎలా ఎదగవచ్చో ఆయా పాత్రల ద్వారా వెల్లడి చేస్తారు రచయిత్రి.
ఇది ఇద్దరు కొడుకుల కథ. ఇద్దరు అన్నదమ్ముల కథ. ఇద్దరు తోటికోడళ్ళ కథ. రెండు తరాల కథ. కుటుంబమంతా ఇంటి పెద్ద మాటపై నిలిచే అపురూపమైన కథ.
ఆప్యాయంగా ఉండే తొలితరం అన్నదమ్ములు విధివంచితులై విడిపోతారు. తొలి తరం జంటలో ఒక జంట అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తుంది. తిరిగి వారెలా కలుస్తారు? చిన్నాభిన్నమైన వారి జీవితాలను మళ్ళీ వాళ్ళు కుదుటబరుచుకున్న వైనం స్ఫూర్తిదాయకం.
రెండో తరంలో ఇద్దరు కోడళ్ళల్లో ఒకరికి వినయం భూషణం కాగా, మరొకరికి అహంకారం ఆభరణం. వినయం కలిగిన కోడలు తన బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబంలో ఒదిగి ఉంటే, అహంకారంతో రగిలిపోయిన మరో కోడలు కుటుంబం నుంచి విడివడి – చెప్పుడు మాటలు విని – కాపురాన్ని పాడు చేసుకుని తన తప్పు గ్రహించి తిరిగి ఉమ్మడి కుటుంబంలోకి ప్రవేశించడం – కథలో – కృత్రిమంగా కాకుండా సహజంగా ఉంటుంది.
రెండో తరం అన్నదమ్ములలో అన్న ఎంచుకున్న రంగంలో కష్టపడి రాణిస్తూ, భార్య ప్రోత్సాహంతో జీవితంలో నిరంతరం రాణిస్తూ – యువతకు ఒక ప్రేరణగా నిలిస్తే; తమ్ముడు తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటాడు. నైతికంగా పతనమవుతాడు. అయినా వివేకం కోల్పోక కుటుంబానికి ఊరటనిస్తూ – తాను మారాలన్న బలమైన సంకల్పాన్ని వ్యక్తం చేస్తాడు. జీవితంలో ఎలా నడుచుకోకూడదో చెప్పడానికి ఈ పాత్ర మరో ఉదాహరణ.
తమ పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పులేదు. కానీ అందుకు ఓ ఉమ్మడి కుటుంబాన్ని విడదీసి, తమ బిడ్డను వేరు కాపురం పెట్టించి వాళ్ళకి మేలు కలిగిస్తున్నామని భ్రమపడిన తల్లితండ్రులకు – తాము ఉమ్మడి కుటుంబం రక్షణ నుంచి తమ బిడ్డను వంచించామన్న వాస్తవం తెలుస్తుంది.
మనుషుల బలహీనతలను తమ అవసరాల కోసం వాడుకుని, దాన్ని సమర్థించుకునే వ్యక్తులు ఈ నవలలో తారసపడతారు. అయితే అసలు బలహీనులు ఎదుటివారు కాదు, తామేనన్న నిజాన్ని వారు గ్రహించరు.
వ్యక్తి, కుటుంబం నుంచి మొదలైన కథ – సాంఘికంగాను, సామాజికంగానూ మారుతుంది. మానసికంగా గాయపడిన వ్యక్తులను చేరదీసిన ఆయా సంస్థలు సమాజానికి ఎంతో మేలు చేస్తుండడంతో వాటి ద్వారా వీరూ సమాజానికి చేరువవుతారు. ఇది వ్యక్తుల సమిష్టి కథ అవుతుంది.
ఆ పాత్రలకు ఎదురైన ఘటనలను – అవి సానుకూలమైన, ప్రతికూలమైనవి అయినా – వాటిని ఎదుర్కుంటాయి. సంఘటనల నుంచి పారిపోవు. ఆయా ఘటనలు అభూత కల్పనలుగా కాకుండా నేటి సమాజంలో ఎంతోమందికి ఎదురయ్యే వాటిని పాత్రలకు వర్తింపజేయడం ద్వారా రచయిత్రి పాఠకులను కథనంలో లీనం చేస్తారు.
కథాగమనంలో ఒక్కోసారి పాఠకులు విస్తుపోతారు, కుదుటపడతారు, ఉత్కంఠకి లోనవుతారు. సానుకూలమైన ముగింపుతో వారి కుతూహలానికి తెరపడుతుంది. కలత చెందిన మనసులకు ఊరట లభిస్తుంది. చివరిదాకా ఆసక్తిగా చదివించే నవల ‘కర్మయోగి’.
దాసరి శివకుమారి గారికి అభినందనలు.
***
కర్మయోగి (నవల) రచన: శ్రీమతి దాసరి శివకుమారి పేజీలు: 180 వెల: అమూల్యం ప్రచురణ: గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ, గుంటూరు. ప్రతులకు: శ్రీమతి దాసరి శివకుమారి 301, సాకృత స్పెక్ట్రమ్, రణవీర్ మార్గ్, సరళానగర్, జె.ఎం.జె. కాలేజ్ దగ్గర తెనాలి 522202 ఫోన్: 9866067664
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కౌశిక్ – కుందేలు
దివినుంచి భువికి దిగిన దేవతలు 6
ప్రశ్న
మార్పు
కాజాల్లాంటి బాజాలు-90: జంప్ జిలానా…
నల్లటి మంచు – దృశ్యం1
కల్పిత బేతాళ కథలు – ప్రకటన
కర్మయోగి-3
తల్లివి నీవే తండ్రివి నీవే!-27
కయ్యూరు హైకూలు-3
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®