ఫిబ్రవరి 26, 2015 ఉదయం 7 గంటలకి అనంతపూర్ నుంచి బయల్దేరి పంపనూరు బస్‌లో వచ్చాము. అక్కడ వున్న విశిష్ట సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం గురించి మేము పెన్నహోబిలం వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి సుధారాణి చెప్పారు. పంపనూరులో కూడా ఆవిడే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరట. ఆలయాల విషయంలో మా ఆసక్తి గమనించి ఈ పురాతన ఆలయం గురించి చెబుతున్నానన్నారు. ఆవిడకి ఇంత విశిష్ట స్వామిని చూపించినందుకు పత్రికా ముఖంగా మరోమారు ధన్యవాదాలు.
స్ధల పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకుంటూ వుండేవాళ్ళు. అందుకనే ఈ ప్రాంతాన్ని తపోవనం అనేవారు. ఆ సమయంలో ఇక్కడ ఏడు కోనేర్లు వుండేవంటారు. ప్రస్తుతం మాత్రం ఒకటే కనబడుతుంది.
500 ఏళ్ళక్రితం, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సమయంలో వ్యాసరాయలు వారిచే ఈ దేవాలయం నిర్మించబడినది. తర్వాత కాలంలో సరైన ఆదరణ లేక శిథిలమయింది. పైగా దుండగులు ఆలయంలో నిధులున్నాయని తవ్వి పోశారు. క్రీ.శ. 1980 – 90 మధ్య ఆ గ్రామస్తులు ఆలయంలో పూజాదికాలు నిర్వహించటానికి ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న కీ.శే. వి. మధుసూదన శాస్త్రిగారిని తీసుకొచ్చారు.
పూజ నిర్వహించటానికి వచ్చిన శాస్త్రిగారు మూల విరాట్‌ని చూసి ఆశ్చర్యపోయారు. అందులోని విశిష్టతని గుర్తించి అక్కడకు వచ్చినవారికి స్వామి తేజోరూపాన్ని, అలాంటి స్వామిని పూజిస్తే కలిగే ప్రభావాన్ని తెలిపారు. ఆ రోజు రాత్రి కలలో సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంతో సాక్షాత్కరించి, పంపనూరు దేవస్ధానంలో తనకు నిత్యపూజలుచేసి, నైవేద్యాలు సమర్పించి అన్నదానము చేస్తే భక్తులను అనుగ్రహిస్తానని చెప్పారు.
తెల్లవారిన తర్వాత రాత్రి వచ్చిన కల దైవ సంకల్పంగా భావించి, పంపనూరు వచ్చి అక్కడివారికి ఆ కల గురించి చెప్పారు. తర్వాత అక్కడి పెద్దలను, గ్రామస్తులను కలుపుకుని విరాళాలు సేకరిస్తూ, వాటితో ప్రతి ఆదివారం (శాస్త్రిగారికి సెలవురోజు) పూజకు, అన్నదానానికి కావలసిన సరుకులు తీసుకువచ్చి, స్వామికి శ్రధ్ధగా పూజలు, అభిషేకాలు నిర్వహించి, అన్నదానం జరిపేవారు. భజనలు చేసేవారు. వారి పూజలకి సంతృప్తి చెందిన స్వామి కొలిచే భక్తులకు కొంగు బంగారమై తన మహిమలను చూపించసాగాడు. క్రమ క్రమంగా స్వామి మహత్యం నలు మూలలా తెలిసి దూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు రాసాగారు.
ముఖ్యగా వివాహం కానివారు, సంతానం లేనివారు, జాతకంలో సర్పదోషం వగైరాలు వున్నవారు, గ్రహ గతి సరిగ్గా లేనివారు ఇక్కడికి వచ్చి 9 లేక 11 మంగళవారాలుకానీ, ఆదివారాలుకానీ స్వామిని పూజించి, 108 ప్రదక్షిణలు చేస్తే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
భక్తుల రాక అధికం కావటంతో దేవాలయమూ అభివృధ్ధి చెందుతూ వస్తోంది. 2004 సంవత్సరంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తల్లిదండ్రులైన శివ పార్వతులను స్వామి పక్కనే రెండు ఉపాలయాలలో ప్రతిష్ఠించారు. అప్పటినుంచీ, పక్క రాష్ట్రాలనుంచి కూడా భక్తుల రాక అధికమైంది. ముఖ్యంగా గ్రహ దోష నివారణకు శాస్త్రోక్తమయిన పూజలు చేయించుకోవటానికి చాలామంది వస్తున్నారు.
ఇంతకీ అన్ని ఆలయాలలోను ఇలాంటివి జరుగుతూనే వుంటాయి… దీనిలో విశేషమేమిటంటారా ఈ ఆలయం మరీ పెద్దదేమీ కాదు. అద్భుతమైన శిల్పకళ లేదు. కానీ ఇందులో వున్న అద్భుతమంతా మూలవిరాట్ లోనే. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహంలో శివ కుటుంబం మొత్తం దర్శనమిస్తుంది. అలా ఎక్కడైనా చూశారా మరి!?
స్వామి విగ్రహంలోని విశిష్టతని గురించి అక్కడ ప్రధాన అర్చకులు శ్రీ నారావఝ్ఝల సీతారామమోహన్ శర్మగారు వివరించినదాని ప్రకారము, స్వామి విగ్రహము సర్ప రూపంలో వుంటుంది. పీఠంనుండి సింహతలం వరకు స్వామి ఐదు రూపాలలో దర్శనమిస్తాడు. పీఠంలో శ్రీ చక్రము వున్నది. ఇది అమ్మవారి శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. శ్రీ చక్ర స్వరూపంలో వున్న అమ్మవారు రాహుగ్రహము యొక్క అధిష్టాన దేవత. సర్పం చివరభాగము శ్రీచక్రానికి 3½ సార్లు చుట్టుకోవటం మానవ శరీరంలోని వెన్నెముక చివరిభాగం మూలాధారంలో కుండలిని శక్తి రూపంతో సర్పాకారంతో మూడున్నర చుట్లు కలిగి వుండటాన్ని సూచిస్తోంది అన్నారు.
సర్ప రూపంలో క్రింద భాగము వక్రతుండ ఆకారంలో సుబ్రహ్మణ్యస్వామికి అన్నగారైన శ్రీ మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది. ఈ గణపతి స్వరూపం కేతుగ్రహ అధిష్టాన దేవత, మూలాధార చక్ర అధిదేవత. మూల విరాట్ లోని మధ్యభాగం శివలింగం ఆకారంతో దర్శనమిస్తుంది. ఈశ్వర స్వరూపం కాల స్వరూపుడు. కాల సర్ప అధిష్టాన దేవత. ఆయన ఆయుష్, ఆరోగ్య ప్రదాత.
ఇంక పైన, ఏడు పడగలు విప్పిన నాగేంద్రుని రూపాన్ని దర్శించవచ్చు. విగ్రహం చివరి భాగంలో వున్న సింహధ్వజము నరసింహ స్వరూపంగా విష్ణు తత్వాన్ని సూచిస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య రాజముద్రగా భావింపబడుతోంది. స్వామికి ఇరువైపుల నెమలి పింఛాలతో కూడివున్న చక్రాలు స్వామివారి వాహనం మయూరాన్ని సూచిస్తుంది. అంతేకాదు కాలగమనంలో పంచ భూతాలు, సంవత్సర, ఆయన, ఋతు, మాస, పక్ష, తిధి, వార, నక్షత్రాలను సూచిస్తాయి.
ఇవ్వన్నీ చూస్తే మూల విరాట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం పైన చెప్పిన విధంగా వివిధ శక్తి రూపాలతో వెలసి వుండటం, ఒకే విగ్రహంలో శివుడు, పార్వతి, గణపతి, నాగేంద్రుడు, ఇలా శివుని పరివారమంతా ఒకే చోట దర్శనము ఇచ్చే విధంగా వుండటంతో ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఏర్పడింది.
ఈ క్షేత్రంలో వున్న సర్ప రూప సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించడం ద్వారా నాగ దోషాలు, సర్ప దోషాలు, రాహు కేతు, కాల సర్ప దోషాలు, గ్రహ దోషాలు, కుజ దోష పరిహారము జరిగి, విద్య, ఉద్యోగము, వ్యాపార, వివాహ, సంతానము కలిగి సుఖ సంతోషాలతో వుంటారని భక్తుల నమ్మకం, అనుభవం.
అద్భుత మూల విరాట్ నెలకొనియున్న ఈ క్షేత్రం అభివృధ్ధికి ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి బి. సుధారాణి, ప్రధాన అర్చకులు శ్రీ యన్. సీతారామమోహన్ గారు అభినందనీయ కృషి చేస్తున్నారు.
అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలంలో వున్న ఈ గ్రామానికి అనంతపురంనుంచి బస్సులు వున్నాయి. అనంతపురం నుంచి వెళ్ళి రావచ్చు.
చిన్న ఊరు కనుక భోజన, వసతి సదుపాయాలు అంతగా వుండవు. శాంతులు జరిపించుకునేవారి కోసం ఆలయంలోనే వసతి సౌకర్యం వుండవచ్చు. ప్రధాన పూజారిగారి ఫోన్ నెంబరు ఇస్తున్నాను. ఆసక్తి వున్నవారు సంప్రదించవచ్చు.
శ్రీ నారావఝ్ఝుల సీతారామమోహన్ 9701799468
ఉదయం 10-25 గంటలకి బయల్దేరి తాడిపత్రి బస్‌లో తాడిపత్రి వెళ్ళేసరికి 12-15 అయింది. తాడిపత్రిలో వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర దిగి, అక్కడనుంచి ఆటోలో ఆలూరు కోన బయల్దేరాము. ఆ వివరాలు వచ్చే వారం.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™