శాంతే సిద్ధాశ్రమే సింహైర్ మృగా ఇవవ పీడితాః।
తురుష్కాః పుశ్కల భయైర్ బ్రాహ్మణాః పూర్వావత్ తథా॥
(జోనరాజ రాజతరంగిణి, 7 70)
ఆ సమయంలో బ్రాహ్మణులు తురుష్కుల అణచివేతకు గురికాలేదు.వారు సిద్ధుడి ఆశ్రమంలో ఉన్నట్టు ప్రశాంతంగా ఉన్నారు. సింహం తమపై దాడి చేస్తుందన్న భయం లేకుండా హాయిగా ఉన్నారు.
రాజతరంగిణి రచనలో జోనరాజు అసిధారావ్రతం చేయాల్సి వచ్చింది. భారతదేశంలో ఇతర ప్రాంతాలలో సంభవిస్తున్న పరిణామాల గురించి జోనరాజుకు తెలుసు. ఏ రకంగా పృథ్వీరాజు పరాజయం వల్ల, అప్పటి వరకూ తురుష్కుల వరదకు ఉన్న అడ్డుకట్ట తొలగినట్టయిందని, తురుష్కులు వరదలా భారతావనిని ముంచెత్తుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్న విషయమూ తెలుసు. అయితే, భారతదేశంలో ఇతర ప్రాంతాలలో దావానలంలా విస్తరిస్తున్న అగ్ని సెగను కశ్మీరు కూడా అనుభవించింది. కానీ కశ్మీరులో ఇస్లాం ఒక ‘దోపిడీ శక్తి’లా ప్రవేశించకపోవడంతో భారతీయ పాలన వ్యవస్థ ఇస్లామీయుల పాలన వ్యవస్థగా పరిణమించటం, దేశంలోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా జరిగింది. ఇదంతా జోనరాజు వర్ణించాడు తన రాజతరంగిణిలో. కశ్మీరుపై మంగోలుల దాడి పాలనా వ్యవస్థలో శూన్యాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలను రక్షించాల్సిన పాలకులు ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయారు. ప్రజలు మంగోలుల తాకిడికి అల్లల్లాడిపోయారు. ఈ సమయంలో అంతవరకూ రాజ్య వ్యవహారాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘షాహమీర్’ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. కశ్మీరుకు తొలి ముస్లిమ్ సుల్తాన్ అయ్యాడు. అంటే, దేశంలో ఇతర ప్రాంతాలలోలాగా ఇస్లామీయులు రాజ్యాలను గెలుచుకుని పాత వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేసి తమదైన కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు కశ్మీరులో జరగలేదు. మంగోలుల దాడులతో అల్లకల్లోల్లమైన కశ్మీరు అధికారాన్ని స్వీకరించాడు షాహమీర్.
షాహమీర్ కశ్మీరుకు – సహదేవుడు కశ్మీరుపై రాజ్యం చేస్తున్న కాలంలో వచ్చాడు. ఆ కాలంలో భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కశ్మీరుకు వలసలు అధికంగా సాగేవి. భారతదేశంలో ఒక ప్రాంతాన్ని ఇస్లామీయులు ఆక్రమించినప్పుడల్లా అక్కడి ప్రజలు చెల్లాచెదురయ్యేవారు. ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షితం అనిపించిన ప్రాంతాలకు పారిపోయేవారు. కొండల్లోకి, గుట్టల్లోకి, అడవుల్లోకి పారిపోయేవారు. ఆ కాలంలో అడవుల్లో నివసించేవారి సంఖ్య, కొండజాతుల వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని అంచనా. అలా పారిపోయేవారికి కశ్మీరు ఎడారిలో ఒయాసిస్సు లాంటిది. ఇంకా హిందూ రాజులు రాజ్యం చేస్తున్న ప్రాంతం అది. ఉత్తరాదిన ఇస్లామీయుల రాజ్యం స్థిరపడుతుండడంతో, పెద్ద సంఖ్యలో ప్రజలు కశ్మీరు వచ్చి చేరుతుండేవారు. బఖ్తియార్ ఖిల్జీ నలందను నాశనం చేసిన తరువాత శాక్యశ్రీ భద్ర ప్రాణాలు అరచేతపట్టుకుని కొన్ని బౌద్ధ గ్రంథాలను తీసుకుని కశ్మీరు పారిపోయాడు. అయితే కశ్మీరులోనూ పెరుగుతున్న ఇస్లామీయుల ప్రాబల్యం గమనించి టిబెటన్ల ఆహ్వానాన్ని పురస్కరించుకుని టిబెట్ పారిపోయాడు. దాంతో బౌద్ధం భారతదేశం నుంచి అంతరించినట్టయ్యింది. చరిత్ర రచన చేసేవారు, వ్యాఖ్యానించేవారు హిందూ ధర్మం దౌష్ట్యం వల్ల బౌద్ధం భారతదేశంలో అంతరించిందని నొక్కి చెప్తారు. బౌద్ధులు ప్రాణాలు అరచేత పట్టుకుని దేశం వదిలి పారిపోవడంలో ఇస్లాం దాడులు ప్రధాన పాత్ర పోషించాయని చారిత్రక సంఘటనలు చెప్తుంటే, ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. నిజానికి నలందపై దాడి తరువాత కూడా బౌద్ధం భారతదేశంలో కొన ఊపిరితో కొనసాగింది. క్రీ.శ. 1234లో టిబెట్ నుంచి ‘ధర్మస్వామి’ అనే ఆయన భారతదేశం వచ్చాడు బౌద్ధం అధ్యయనం చేసేందుకు. ఆయన తురుష్క దాడుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటికి నలంద నాశనం అయింది. చిన్న చిన్న ఆరామాలున్నాయి. వాటిల్లోనే అధ్యయనం సాగేది. పధ్నాలుగవ శతాబ్దంలో బెంగాలు రాజు ‘చాగలరాజు’ ఈ విద్యాలయాలకు దానాలు ఇచ్చాడు. వాటిని పోషించాడు. తరువాత కూడా చైనా నుంచి పలువురు బౌద్ధులు విద్యాభ్యాసం కోసం ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఋజువులున్నాయి. దాదాపుగా 17వ శతాబ్దం చివరి వరకు నలంద పరిసర ప్రాంతాలలో చైత్యాలు, విహారాలలో బౌద్ధం సజీవంగా ఉన్నది. అంటే భారతీయ ధర్మం ఒకవైపు నుంచి ఇస్లామీయుల దాడికి గురి అవుతూ కూడా, మనుగడ కోసం పోరాడుతూ కూడా, బౌద్ధాన్ని వీలయినంత వరకూ పరిరక్షించిందన్న మాట.
రాజతరంగిణిలో కల్హణుడు ఒక సంఘటనను విపులంగా వర్ణించాడు. ఆరంభంలో అద్భుతంగా రాజ్యం చేసిన హర్షుడు తురుష్కుల ప్రభావంలో పడి హిందూ ఆలయాలు, బౌద్ధుల ఆరామాలను ధ్వంసం చేయటం ఆరంభిస్తాడు. వారు బానిస యువతులను చూపి దేవతలంటే నమ్మి వారికి పూజలు చేస్తాడు. అందుకే కల్హణుడు వ్యంగ్యంగా అతడిని ‘తురుష్క హర్షుడ’ని, ‘దేవోత్పాతన నాయకా’ అని పొగుడుతాడు. పవిత్ర మందిరాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తూ హర్షుడు ‘పరిహాసపురం’లో ముక్తాపీడ లలితాదిత్యుడు ప్రతిష్ఠించిన బౌద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేయాలని వెళ్తాడు. ముక్తాపీడ లలితాదిత్యుడు కశ్మీరంలో భారతీయ ధర్మాన్ని అత్యంత గౌరవించి పాటించిన రాజు. కానీ బౌద్ధ విగ్రహాన్ని, అదీ మామూలు విగ్రహం కాదు, అత్యంత అద్భుతమైన బౌద్ధ విగ్రహం, ప్రతిష్ఠించాడు లలితాదిత్యుడు. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు హర్షుడు వెళ్తే అక్కడ వున్న కనకుడు అనే గాయకుడు తన గానంతో రాజును మెప్పించి విగ్రహం ధ్వంసం కాకుండా కాపాడుతాడు. కనకుడు బౌద్ధుడు కాదు. ఆకాశాన్ని తాకేట్టున్న అ బౌద్ధ విగ్రహాన్ని ‘సికందర్ బుత్షికన్’ తరువాత ధ్వంసం చేస్తాడు. ఇక్కడ గమనించాల్సిందేంటే, బౌద్ధాన్ని, బౌద్ధ విగ్రహాన్ని ఆదరించి, గౌరవించి, కాపాడిన వారంతా భారతీయ ధర్మానుయాయులే. ఆయితే చరిత్రకు వక్రభాష్యం ఇచ్చి, భారతీయ ధర్మం దుష్టమయినది, బౌద్ధులను తరిమివేసింది, తమవారినే అసమానతల ఉక్కుపాదాలక్రింద అణచివేసింది అని బ్రిటీష్ చరిత్ర రచయితలు నిరూపించటం ఎందుకంటే “in order to justify introduction of their supposedly more humane and rational form of colonial rule” అంటాడు Johan Elverskog తన ‘Buddhism and Islam on the Silk Road’ పుస్తకంలో. ఈయన బ్రిటీషువారు ఇస్లామీయులను క్రూరులుగా, అనాగరికులుగా చూపాలని ప్రయత్నించారని వ్యాఖ్యానిస్తూ పై తీర్మానం చేశాడు. కానీ భారతీయ ధర్మాన్ని కూడా అనాగరికంగా, క్రూరంగా చూపాలన్న ప్రయత్నం కూడా ఈనాడు అనేక అపోహాలు, దురూహలు ప్రచారంలోకి రావటానికి కారణమయ్యింది.
ఓ వైపు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు చేరుతూంటే, మరో వైపు నుంచి తురుష్కులు, అరబ్బులు, అఫ్ఘన్లు నిధులు, ఐశ్వర్యాల ఆశతో కశ్మీరు వచ్చి చేరారు. వీరు సైన్యాన్ని సమకూర్చుకుని, పెద్ద ఎత్తున దాడులు చేసి, దోచుకుని ధనవంతులయ్యారు. వీరులుగా చలామణీ అయ్యారు. వీలుంటే సుల్తానులూ అయ్యారు. అలా కశ్మీరుకు వచ్చినవాడు షాహమీర్.
షాహమీర్ ‘స్వాట్’నుంచి వలస వచ్చిన ‘తుర్కీ’ అని, అక్కడి రాజవంశానికి చెందినవాడని పర్షియన్ చరిత్ర రచయితలు రాశారు. కొందరు ఆధునికులు అతను ‘తుర్కీ’ కాదని, ‘ఖాసీ’ అని తీర్మానిస్తారు. ఏది ఏమయినా సహదేవుడి పాలనా కాలంలో క్రీ.శ. 1313వ సంవత్సరంలో కశ్మీరు వచ్చాడు షాహమీర్. సహదేవుడి ఆస్థానంలో పని చేశాడు. ఉన్నతస్థాయి సైన్యాధికారి అయ్యారు. రాజకీయాలు చేశాడు. చివరకు ‘కోటరాణి’ కోసం ఆశపడ్డాడు. ఆమె మరణం తరువాత రాజ్యాధికారం చేపట్టాడు. అంటే, కశ్మీరులో అధికారులు, అధికార యంత్రాంగం, పాలనా వ్యవస్థలన్నిటికీ షాహమీర్ సుపరిచితుడే. దాంతో ఎవరో పరాయివాడు వచ్చి స్థానిక రాజును ఓడించి రాజ్యాధికారం చేపట్టి, పాత వ్యవస్థను తుడిచిపెట్టి, కొత్త వ్యవస్థను స్థాపిస్తే చెలరేగే అల్లకల్లోలం, ద్వేషభావనలు కశ్మీరులో కలగలేదు. ఎలాగయితే, స్థానిక రాజుల నడుమ రాజ్యాధికారం కోసం జరిగే పోరులో ఒకరు గెలిచి రాజ్యాధికారానికి వస్తారో, అలాగే ‘షాహమీర్’ కశ్మీరంపై రాజ్యాధికారాన్ని చేపట్టాడు. దాంతో పెను మార్పులు లేకుండానే కశ్మీరులో హిందూ రాజ్య పాలన అంతరించి, సుల్తానుల పాలన ఆరంభమయింది. అయితే, ఇకపై కశ్మీరుకూ, గతంలోని కశ్మీరుకు సంబంధం ఉండదనీ, ఇకపై కశ్మీరు నూతన యుగంలోకి, పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి అడుగు పెడుతోందని జోనరాజుకి తెలుసు. అందుకని మంగోలుల దాడి తరువాత కశ్మీరు పాత యుగ నాశనం తరువాత నూతన సృష్టి ఆరంభంలో ఉన్నట్టుందని వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. ఎందుకంటే ఇకపై సుల్తానుల పాలనా కాలం ఆరంభవుతుంది కాబట్టి.
ఆరంభంలో సుల్తానులు తమ మతమౌఢ్యాన్ని ప్రదర్శించలేదు. భారతీయ ధర్మానుయాయులు పొంచి ఉన్న ముప్పును గ్రహించలేదు. లధాఖ్ నుంచి కశ్మీరు చేరిన బౌద్ధవీరుడు ఇస్లామీయులను ఓడించి రాజ్యాధికారం చేపట్టి, కశ్మీరులో బౌద్ధులు అధిక సంఖ్యలో లేరు కాబట్టి తనకు ప్రజల మద్దతు లభించటం కష్టం అని భారతీయ ధర్మం స్వీకరించేందుకు సిద్ధపడ్డాడు. కానీ అతనిని తమ ధర్మంలోకి అనుమతించేందుకు శైవులు ఇష్టపడలేదు. ఆనాటి శైవ బ్రాహ్మణులు అతడిని క్షత్రియుడిగా గుర్తించేందుకు సుముఖత చూపకపోవటంతో అతడు ఇస్లాంను ఆశ్రయించాడు. ఇస్లాంలోకి సూఫీ దెర్విష్ ‘బుల్బుల్ షాహ్’ అతడిని ఆహ్వానించాడు. దాంతో బౌద్ధ ‘రించన్’, షద్రుద్దీన్ షా, రించన్ మాలిక్‌గా రూపాంతరం చెందాడు. అతనితో పాటు దాదాపుగా 10,000మంది ఇస్లాం స్వీకరించారు. ఇతడు తన రాణి కోటరాణిని, సంతానాన్ని తన నమ్మిన బంటు షాహ్మీర్ దగ్గర ‘రక్షణ’ కోసం ఉంచాడు. ఈ రించన్ మరణం తరువాత షాహమీర్, రించన్ కొడుకుని చంపి, కోటరాణిని తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. కానీ కోటరాణి ఆరు నెలలపాటు కొడుకు పేర రాజ్యం చేసింది. చివరికి షాహమీర్కి లొంగక తప్పలేదు. అతడికి తన ప్రేగులను కానుకగా పంపి తనువు చాలించింది. ఆమె కశ్మీరులో చివరి భారతీయ రాణి. ఆ తరువాత నుంచి షాహమీర్ పాలన ప్రారంభమయింది. భారతీయులుగనక ఇస్లామీయులు ఆధికారంలోకి వస్తే కలిగే ప్రమాదాన్ని గుర్తించివుంటే, రించన్ కోరగానే అతడిని క్షత్రియుడిగా ఆమోదించివుంటే???? భారతదేశచరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం కనిపిస్తాయి. ఈరోజు వెనక్కి తిరిగిచూసి అప్పటివారిని విమర్శించటం దూషించటం సులభం. కానీ, ఆనాటి పరిస్థితులలో అప్పటి మనస్తత్వాలను పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఆలోచనలు మరోరకంగా వుంటాయి. గమనిస్తే, ఈనాడూ మనచుట్టూ సమాజంలో అలాంటి మనస్తత్వాలే కనిపిస్తాయి.
ఇదంతా జోనరాజు రాజతరంగిణిలో వర్ణించాడు. ఈ వర్ణనలో అతడు మ్లేచ్ఛులు, యవనులు, తురుష్కులు అన్న పదాలను అత్యంత జాగరూకతతో వేర్వేరు అర్థాలనిచ్చేట్టు వాడేడు. కశ్మీరు సుల్తానుల పాలనలోకి వచ్చిన తరువాత నెమ్మదిగా రూపాంతరం చెందడం ఆరంభించింది. ఇతర ధర్మానుయాయులపై అకృత్యాలు ఆరంభమయ్యాయి. ‘సికందర్ బుత్షికన్’ రాజు అయ్యాకా అకృత్యాలు తీవ్రమయ్యాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కశ్మీరు చేరిన ఇస్లామీయులు, కశ్మీరులో ఇస్లామేతరులు అనుభవిస్తున్న ‘రక్షణ’ను, సౌఖ్యాన్ని స్వీకరించలేకపోయారు. ‘జిమ్మీ’లు (ఇస్లామేతరులు) ఇస్లామీయులతో సమానంగా ఉండటం భరించలేకపోయారు. దాంతో కశ్మీరులో ఇస్లామేతరులపై అత్యాచారాలు ఉచ్చస్థాయికి చేరుకున్నాయి. అయినా సరే, పాలిస్తున్న రాజు జరిపే అకృత్యాలకూ, యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని ఆక్రమించిన రాజు జరిపే అకృత్యాలకూ నడుమ తేడా ఉంటుంది. అందుకని జోనరాజు సుల్తాన్ జైనులాబిదీన్‌ను ‘యవను’లని, భారతదేశం ఇతర ప్రాంతాలలో అనాగరికంగా వ్యవహరిస్తున్న ఇస్లామీయులను ‘మ్లేచ్ఛు’లని తీర్మానించాడు. ‘సికందర్ బుత్షికన్’ తరువాత రాజ్యానికి వచ్చిన జైనులాబిదీన్ తండ్రికి భిన్నంగా వ్యవహరించాడు. కశ్మీరు వదిలి పారిపోయిన బ్రాహ్మణులను, ఇతరులను కశ్మీరుకు ఆహ్వానించి వారికి గౌరవాన్ని, రక్షణను కల్పించాడు. అందుకని జోనరాజు, జైనులాబిదీన్ పాలనా కాలాన్ని ఒక ‘సిద్ధాశ్రమం’తో పోల్చాడు. సింహాల బారిన పడకుండా, ఒక ఆశ్రమంలో ఉన్నంత ప్రశాంతంగా ఆయన పాలనాకాలంలో ఉన్నారని చెప్తూ, ‘తురుష్క’ పదాన్ని చమత్కారంగా వాడేడు.
జోనరాజు ‘తురుష్క’ అన్న పదాన్ని ‘నీచ’ అర్థంలో వాడతాడు. అనాగరికులు, క్రూరులు, మ్లేచ్ఛులు అన్న అర్థంలో వాడతాడు. గమనిస్తే ‘సికందర్ బుత్షికన్’ పాలనా కాలంలో భారతీయులు మృగాలు, సింహాల బారిన పడ్డవాళ్ళయ్యారు. కానీ సుల్తాన్ జైనులాబిదీన్ కాలంలో ‘సిద్ధాశ్రమం’లో ఉన్నట్టు సురక్షితంగా ఉన్నారు. కానీ జైనులాబిదీన్ కన్నా ముందు రాజ్యం చేసింది జైనులాబిదీన్ తండ్రి. జైనులాబిదీన్ యవనుడయి, అతడి తండ్రి తురుష్కుడయ్యే వీలు లేదు. ఎందుకంటే యవనులు పర్షియన్లు. తురుష్కులు తుర్కులు. కాబట్టి జైనులాబిదీన్ తండ్రి కూడా యవనుడే. యవనులు నాగరికులు. మరి అంతకు ముందు తురుష్కుల రాజ్యం ఎలా అయింది? ఎలా అయిందంటే ‘సూహభట్టు’ వల్ల. ‘సికందర్ బుత్షికన్’ మంచివాడు. చెడ్డ పనులు చేసింది ‘సూహభట్టు’. ‘సూహభట్టు’ దుష్కృత్యాల వల్ల సికందర్‌కు చెడ్డపేరు వచ్చింది. ఈ ‘సూహభట్టు’ వల్ల ప్రజలు తురుష్కుల రాజ్యంలో మల్లే కష్టాలు పడ్డారు. జోనరాజు ‘సూహభట్టు’గా సంబోధించే అతను కశ్మీరీ బ్రాహ్మణుడు. కానీ ఇస్లాం స్వీకరించాడు. ‘మాలిక్ సైఫుద్దీన్’ అయ్యడు. కొత్త మతం పుచ్చుకుంటే గుర్తు లెక్కువ అన్నట్టు, తను వదిలిన ధర్మానుయాయులపై విరుచుకుపడ్డాడు. అసలు ఇస్లామీయుల కన్నా తాను క్రౌర్యంలో పది ఆకులు ఎక్కువ చదివానని నిరూపించాలని తపనపడ్డాడు. అతడి వల్ల రాజ్యం ‘తురుష్క’ రాజ్యం అయింది. ఇక్కడ జోనరాజు ‘తురుష్క’ అన్న శబ్దం ‘అనాగరికుడు’ అన్న అర్థంలో వాడేడు తప్ప, ‘జాతి’, ‘మతం’ అర్థంలో కాదు. అందుకే జైనులాబిదీన్కు ఆగ్రహం రాలేదు, తన తండ్రి పాలనను తురుష్క పాలన అన్నా. గమనిస్తే, జోనరాజు తన రాజతరంగిణిలో ‘సూహభట్టు’ను ‘సూహభట్టు’ అనే అన్నాడు తప్ప అతడిని ఇస్లాం నామంతో సంబోధించలేదు. పర్షియను అతడిని మాలిక్ సైఫుద్దీన్ అన్నారు తప్ప సూహభట్టు అనలేదు. జోనరాజు రాజతరంగిణి రచనాసంవిధానాన్ని అర్ధంచేసుకోవాలంటే ఈ అంశాన్ని విశ్లేషించాల్సివుంటుంది. .
(ఇంకా ఉంది)

5 Comments
Ramani
Aa subject ienaa raayagala praaveenyam undhi miku..chaduvutunte abburam ga undhi
పుట్టి. నాగలక్ష్మి
బౌద్ధం మన దేశాన్ని వదిలి ఎలా వెళ్లిపోయిందో.. వివరంగా తెలియజేశారు…


వీరభద్రుడు
చాలా బగుంది సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
జోనరాజు విరచిత
రాజ తరంగ ణి…ఆధారంగా,శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు శ్రమించి రాస్తున్న ఈ చారిత్రక రాజకీయ అంశాలుచడువు తుంటె నిజంగా ఒళ్లు గగొర్పొడుస్టున్న ది. కాశ్మీర్ ప్రజలు మొదటినుంచీ ఏ దో ఒక సమస్యతో
ఇబ్బందులు పడుతున్నవారె.ఇప్పటికీ అక్కడ నూటికి నూరు శాతం ప్రశాంతత లేనాట్లె.
ఒక క్లిష్టమైన అంశాన్ని ఎన్నుకుని పా టక లోకానికి అందించడానికి సాహసం చేస్తున్న మురళీకృష్ణ గారు అభినందనీయులు.రచయితకు శుభాకాంక్షలు.
Trinadha Raju Rudraraju
Your work gave us a glimpse .. how the begining of erosion to glorious culture and traditions of this land by waves of immigration and built-in mindset eminated from fenaticism. As a society we still not learned the lessons!