చీకటిని చేజిక్కించుకున్న విజయగర్వంతో కిరణాలను చిరునవ్వులుగా వెదజల్లేస్తున్నాడు దినకరుడు.
నిన్నటి సుధీర్ఘమైన రాతిరి, నిదురలో ఒదగనివ్వని అంతూ పంతూ లేని ఆలోచనల ఫలితం… మెలకువకు తావులేక తల్లో తిష్ఠ వేసుక్కూచున్న సంశయాల కల్లోలానికి కిటికీలోంచి వచ్చే వెలుతురు కూడా తోడై తలబధ్ధలై పోతుందేమో నన్నంతగా శిరోభారం… స్ధిమితం లేని శరీరం పక్కమీంచి లేవకుండా అటూ ఇటూ కదులుతున్న సమయంలో గీతిక నుండి ఫోన్. లిఫ్ట్ చేసి హలో అనే లోపే “ఎక్కడున్నావ్?” అనడిగింది.
“ఇంట్లోనే. ఈనాటి ఉదయపు నడక సెలవు తీసుకున్నట్లుంది. ఏం?” అన్నా. కాసేపట్లో నేనొస్తున్నానంటూ ఫోన్ పెట్టేసింది. ఒక్కరోజు సెలవుకే ఇంటికివచ్చి క్లాసు పీకాలా? ఈ మాట వినుంటే ఫోనులోంచే గొంతు పట్టుకొనుండేది. అయినా ఏదో పట్టుకునేందుకే కదా వస్తూంది. ఇక లేవక తప్పదు. ఇలాగే వుంటే తనకి అనుమానం వచ్చేస్తుంది. ఇప్పుడిక్కడికి వచ్చేదే నిన్నటి సంగతి తేల్చుకోడానికి… నీలిమా! నిదుర లేపవోయీ నీలోని మాయా నీలిమను. పక్కమీంచి లేచి నిలబడి తల విదిలించి ఓసారి ఒళ్ళువిరుచుకొని నిటారుగా నిలబడ్డా. స్నానం చేస్తే ఈ మూడ్ నుండి బయటపడొచ్చు. నాకు వెంటనే తలారా స్నానం చేయాలనుంది. అంతకన్నా ముందు స్ట్రాంగ్ కాఫీ తాగాలి. స్టౌవ్ వెలిగించి, పాలగిన్నె దానిమీదుంచి అవి కాగే లోపు బ్రష్ చేసుకొని, టవల్‌తో మొహం తుడుచుకుంటుంటే చెప్పా పెట్టకుండా బాల్కనీలోంచి చల్లటిగాలి రివ్వున వచ్చేసి శరీరాన్ని వణికిస్తూంది. ఇంతసేపూ చుర్రుమనిపించిన ఎండ – ఇపుడేమో వానకు తడిచి చలిగా వుందంటూ మబ్బుల దుప్పట్లో ముడుచుకొని పడుకుంటానంటూంది… ఈలోగా గీతిక వచ్చేస్తే బాగుణ్ణు.
కాఫీ కప్పుతో బాల్కనీలోని పూలమొక్కల దగ్గరకెళ్ళి నిల్చున్నా. మట్టికుండీలలో నెమ్మదిగా పెరుగుతున్న మొక్కలు… ఆకులపై అక్కడక్కడా ముత్యాల్లాంటి వానచుక్కలు అందంగా మెరుస్తున్నాయి. పచ్చటి పెద్ద పెద్ద ఆకులమధ్య కనబడకుండా దాక్కొని “నన్ను గమనిస్తున్నావా” అంటూ గాలి తగిలినప్పుడు కొంచెం కొంచెంగా కనిపిస్తున్న పసుప్పచ్చగులాబి మొగ్గ కాసేపు నా కళ్ళతో దోబూచులాడి.. ఆ పక్కనే గ్రిల్స్ పైకి పసిపిల్లాడిలా పాకుతున్న మనీప్లాంటును చూసి గుడ్ మార్నింగ్ చెబుతూంది. దూరంగా వినిపిస్తున్న డప్పుల చప్పుడు వేగంగా దగ్గరవుతుంది. ఇప్పుడు టపాసుల చప్పుడుతో పాటూ దట్టంగా కమ్ముకున్న పొగ కూడా కనబడుతూంది. ముగిసిపోయిన జీవితానికి చిట్ట చివరి యాత్ర అట్టహాసంతో వెళుతున్నట్లుంది.
కొంచెం దూరంగా కనిపిస్తున్న చెరువు. దాని కన్నా ముందే కనబడుతున్న శ్మశానం. శాశ్వతంగా అక్కడ వుండిపోయేట్లైతే…. ఈ తలనొప్పులు, కాఫీల బెడదే వుండదు. నడకలూ, యోగాలు అక్కర్లే. ఎంచక్కా ఎప్పుడూ పడకునే ఉండచ్చు. ఈ ఆలోచన రాగానే కంపిస్తున్న నా శరీరాన్ని చూసి కుండీలలోని మొక్కల ఆకులను ఊయలూపుతున్న చల్లని గాలి విస్తుబోయింది. గుండెగదిలోని ఒంటరి మనసు ఉలిక్కిపడింది. అంటే నాకు మరణమంటే ఇంత భయముందా? ఇన్నాళ్ళూ బాధను స్వీకరించి భరిస్తూ వస్తున్నదిందుకా! అందుకేనా… ఏనాడూ చావుని పరిష్కారంగా ఎంచుకోలేదు! మరి నిన్నటినుండి ఎందుకీ చావుమాటలు నన్నింతలా చుట్టుముట్టి చంపుతుంది!? మొదటిసారి నా జీవితానికి సంభందించిన విషయంలో నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండడానికి ఇన్ని ఆలోచనలా! విసుగ్గా అక్కడ్నుండి హాల్లోకొచ్చి మెయిన్ డోర్ లాక్ తీసి, గుమ్మం బయటపడున్న న్యూస్ పేపర్ని తీసి టీపాయ్‌పై పడేసి సొఫాలో కూర్చున్నా. చెమటతో చల్లబడ్డ చేతిలోని తెల్లని పింగాణి కప్పు – అందులో చల్లారిపోయిన కాఫీ – మీగడ ముసుగులో దాక్కోనుంది… ఇక ఆ కాఫీ తాగాలనిపించలా… కాసేపట్లో గీతొస్తుందిగా. అప్పుడు తాగచ్చులే. కప్పుని పక్కనే వున్న టీపాయ్ పైన వుంచి సొఫాలో వెనక్కివాలి కళ్ళు మూసుకున్నా. మనసు తలుపులుతెరచుకొని రెండ్రోజుల ముందు జరిగినదంతా మూసిన రెప్పల ముందు కొచ్చి కదలాడుతుంది. రా! యథేచ్ఛగా వచ్చేసేయ్! ఇక నిన్ను బంధించడానికి తలుపులు, కిటికీలు అవసరం లేదు.
“నీలూ! ఇదంతా నాకు తెలీదు. అసలు రాఘవ వస్తున్నాడని తెలిస్తే నిన్ను రమ్మనే దాన్నేకాదు అయినా అతడు మన బ్యాచ్ కూడా కాదు. అసలెవరు పిలిచారతడ్ని?” చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటున్నామంటూ పసిపిల్లలా ఎగురుకుంటూ వచ్చిందల్లా అక్కడకు రాగానే అందరితోపాటూ రాఘవను చూసి ఓ పక్క ఒళ్ళు మండిపోయి కోపంతో ఎగిరిపడుతూనే మరో పక్క నాకు సంజాయిషీ చెప్పి బాధపడుతుంది గీతిక. మేమున్న చోటినుండి కొన్ని అడుగుల దూరంలో విశాలంగా పరచుకొనివున్న పొగడచెట్టు నీడలో కుర్చీలపై ఆశీనులైవున్న వారంతా ఎలిమెంటరీ బడినుండి హైస్కూలు దాకా మాతో కలిసి చదువుకున్న వారూ, వారి కుటుంబీకులున్నూ. అందరినీ చూసిన ఆనందంతో వేగంగా పడిన గీతిక అడుగులు వాళ్ళమధ్య రాఘవ కనిపించడంతో ఆగిపోయి నా చేయి పట్టి ఓ పక్కకు లాక్కొచ్చి… ఇపుడేం చేయాలన్నట్లు తీక్షణంగా అటువేపు చూస్తుంది. “నాకు నీ గురించి తెలుసు. రాఘవ గురించి కూడా తెలుసు. జరిగిందానికి నువ్వు సంజాయిషీ యివ్వడమేంటి! మనం ఇలా దూరంగా వచ్చి అక్కడున్నవాళ్ళకు లేనిపోని అనుమానాలు కలిగించడమెందుకు? పద!” గీతిక భుజం తడుతూ ముందుకు అడుగేసా. ఇన్నేళ్ళ తరువాత కూడా అతడలాగే వుంటాడని ముందుగానే ఏదో ఊహించుకొని ఒక అభిప్రాయానికి రావడం నాకు నచ్చదు. రాఘవలాంటి వారిలో మార్పుని ఆశించడమనేది తెలివితక్కువ పని అని, దాని పర్యవసానం ఎలా వుంటుందోనని గీతిక ఆలోచిస్తూంది.
“అయితే యిపుడేం చేద్దాం ఇక్కడే వుందామా!” అంది. తన కళ్ళలో నీకేం ఫరవాలేదా అన్నభావం కదలాడుతుంది.. “పరిస్ధితి మరీ ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు చూసుకోవచ్చు… ఏం జరుగుతుందో జరగనీ” స్థిరచిత్తంతో అన్నా.
పన్నెండేళ్ళ తరువాత దాదాపు స్కూల్ ఫ్రండ్స్ అందరం మేం చదువుకున్న మా బడిలో కలిసాం.. అప్పటి స్నేహం ఇప్పటికీ నిలుపుకోనున్న కొద్దిమందిమి తప్ప, మిగిలినవారంతా వారే స్ధాయిలో వున్నారో చూసి మిగిలినవారెలా సెటిలయ్యారన్న కుతూహలంతో రావడం తప్పించి స్నేహం అన్న భావన కూడా కనిపించడం లేదక్కడ. చదువుచెప్పిన గురువుల ఆశీర్వాదం తీసుకొని, ఉన్న ఆ కాసేపు నవ్వుతూ నాలుగుమాటలు చెప్పుకుంటే సరిపోతుంది కదా!
మౌనంగా నేనూ, తప్పదన్నట్లు గీతిక అటువైపు అడుగులేసాం.
బాల్యం బంధనాల నుంచి స్వేచ్ఛ కావాలంటూ యవ్వనం తొంగిచూస్తున్న కాలంలో కెళ్ళిపోయి, అంతా కొత్తగా వింతగా తోస్తూ… విస్మయపరుస్తున్న సమయంలో చదువుతో పాటూ ఇంకా ఎన్నో విషయాలు తమ చుట్టూ చేరి ఉక్కిరిబిక్కిరి చెసిన సంగతులన్నీ ముచ్చటిస్తున్నారు కొంతమంది. అలాంటివాళ్ళకు రాఘవ తోడయ్యాడు. అందరినీ కలుపుకుంటూ కబుర్లతో ముంచెత్తుతున్నాడు. ఆరడుగుల అందమైన రూపంతో – అందరిలోకి ప్రత్యేకంగా కనబడడం – తన చేతలతో ఆకట్టుకోవడం, అతనికి తెలిసినంతగా అక్కడున్న మరెవరికీ తెలీదు కదా!
శేషగిరి పొట్ట చేత్తో పట్టుకొని నవ్వేస్తున్నాడు. అది చూసి మిగిలినవారంతా విరగబడి నవ్వుతున్నారు. మమ్మల్ని చూసి “నీలిమా! రాఘవ ఏమంటున్నాడో తెలుసా! త్వరలో జరగబోయే తన పెళ్ళిలో నా చేత డాన్స్ చేయిస్తాడంట. ఈలోగా ఈ పొట్టని తన జోకులతో నవ్వించి కరిగించేస్తాడట” నవ్వుతూనే చెప్పాడు. “ఏమైనా రాఘవ అనుకున్నది సాధించేవరకు ఊరుకోడు కదా!” స్కూల్‌మేట్ లలిత నా ఫీలింగ్స్ కనిపెట్టాలని కొంచెం దగ్గరగా జరిగి నన్నే పరిశీలనగా చూస్తూ అంది. “ఇక్కడున్న వారందరికీ అప్పుడూ ఇప్పుడూ హీరో నువ్వేనా… రాఘవా… ఇప్పుడూ వాళ్ల చేత అదే పాట పాడిస్తున్నావే!” మనసు మూగగా ప్రశ్నిస్తూంది.
“నీ ఉద్దేశం మార్చుకోవాలి నీలిమా” అంటూ… నా జీవితంలో విలనూ, హీరో, నీవేనంటావా రాఘవా… ఇంతకీ ఇప్పుడు నువ్వు విలనా? హీరోనా?” త్వరగా తెలిసిపోతే బాగుణ్ణు. గీతిక వంక చూసా.
గీతిక అక్కడ్నుంచి మేము వెళ్ళవలసిన దారి ఏ వైపుందోనని… ఓపక్కన పలకరింపుల ఫలహారం స్వీకరిస్తూనే లో లోపల కోపంతో బుసలుకొడుతూ చుట్టుపక్కల వెతుక్కుంటూంది.
చాలారోజుల తర్వాత మళ్ళీ నటించవలసి వస్తూంది. ఒకవైపు వడలి, విడివడుతున్న పెదవులపై వెడలిపోతానంటున్న నవ్వును పన్నీరులా చిలకరించుకుంటూ… మరోవైపు గుర్తుకొస్తున్నచేదు ఙ్ఞాపకాలతో పాలిపోతున్న మొహంలో రోషాన్ని నెత్తురులా పొంగించుకుంటూ .
రాఘవ నుండి… అప్పుడూ ఇప్పుడూ ఏ మార్పూలేని అవే చూఫులు కసిగా, కళ్ళనిండుగా కాంక్షతో రగిలిపోతూ చురకత్తుల్లా నావద్దకు దూసుకొస్తూ లోతుగా గాయం చేసేస్తుంది. హూ! సిగ్గు నిస్సిగ్గుతో తలవంచుకుంటుంది. గీతికవైపు చూసాను. అది తలవంచుకొని తన అరచేతుల్లో నా మొహాన్ని ఊహించుకుంటూంది కాబోలు! తలెత్తి నావంక చూసిన దాని కళ్ళలో అగ్ని కీలలు. మంచులా బిగుసుకుపోయిన నేను ఆ చూపుల తాకిడికి కరిగి నీరయి తిరిగి ఇప్పటి నీలిమ నవుతున్నా.
భోజనాల సమయంలో లలిత, శారద నేనొక్కదాన్నే వున్న సమయంలో చెరో పక్కన చేరి నా అదృష్టాన్ని తెగపొగిడేస్తున్నారు. తొందరపడి నేను రాఘవకు దూరమైనా, అతడి ప్రేమను స్వీకరించే అవకాశం మరోసారి నా కోసం ఆ భగవంతుడు ఇస్తున్నాడట. ఇన్నాళ్ళ అతడి నిరీక్షణలోనే తెలుసుకోవచ్చట తన ప్రేమ ఎంత గొప్పదో.
ఇప్పుడు నా నుంఢి మౌనం సమాధానమైతేనే వారినోరు మూతబడుతుంది.
రాఘవ తాత, తండ్రికి సాయంగా అటు రాజకీయాల్లో వుంటూ, ప్రజలకు ఏదో రకమైన సేవ చేసుకోవడంతో పాటూ, వ్యాపారవేత్తగా ఊర్లో, చుట్టుపక్కల వైన్ షాపులన్నీ సొంతం చేస్కోని, ప్రజలు కష్టపడి కూడబెట్టిన సొమ్ము వారిచేతనే వీళ్ళజేబుల్లోకి వొంపేసుకుంటున్నారు. చుట్టూ చేరి భజనచేసే బృందానికి పార్టీలు, కానుకల రూపంలో ఎల్లవేళలా ఏదోటి పడేస్తుంటారు.
“అప్పుడంటే ఏం తెలీదు వాడు చెప్పినట్లు చేసారు. చిన్నవాళ్ళనుకుందాం. ఇప్పుడు కూడా ఏంటి వాడికి వీళ్ళ సపోర్ట్!” గీతిక చిన్నగా మాట్లాడినా దాని గొంతునుండి స్వరం కాస్తగట్టిగానే వినబడుతూంది.
అప్పుడు ఓడిపోయిన సర్పంచ్ మనవడు మరిప్పుడు…. ఎంపి మనవడు, ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు, కాబోయే ఎమ్మెల్యేనూ….. మరి ఈ మాత్రపు ఫాలోయింగ్ వుండదా….
“ఎందుకే! వదిలేయ్, ఇది గొడవపడే సమయంకాదు” గీతికకు నెమ్మదిగా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా.
“నీరూ, నిప్పు అలాగే కలిసున్నారా?” చల్లని స్వరం వినబడడంతో తలెత్తి చూసాం… అలా మమ్మల్ని పిలిచేది లక్ష్మణమూర్తి మాష్టారే. ఇదిగో ఇలాంటి ఙ్ఞాపకాలు పట్టుకెళ్ళడానికే ఓపికగా ఇక్కడుంది.
మొదటినుంచి గీతికది దుడుకు స్వభావం. కోపం ఎప్పుడూ దాని చుట్టుపక్కలే తిరుగుతుంటుంది. ఇక నేనేమో నెమ్మదిగా వుంటాను. నాకు నచ్చినపుడు జలపాతంలా ఎగిరిపడుతుంటాను. చుట్టూ వున్న మనుషులు, పరిసరాలకనుగుణంగా ఒదిగి పోతుంటా. మేమిద్దరం ఎప్పుడూ స్నేహంగా కలిసేవుంటాం. మాటలతో దాని కోపం తగ్గించే నన్నుచూసి మాష్టారు “నీరూ… నిప్పుకెప్పుడూ దగ్గరేవుండు” అనేవారు. ఆ మాటలు వరాలజల్లుగా మా స్నేహానికి రక్షగా వుండిపోయాయి.
భోజనాలయ్యాక అందరూ ఓ చోట చేరి ఆ రోజుల్లో వారికెంతగానో గుర్తుండిపోయిన సంగతులు అందరితో పంచుకుంటున్నారు.
ప్రతి ఇద్దరిలో ఒకరు రాఘవ గురించి, తన ప్రేమ గురించి చెప్తున్నారు. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రేమంటే రాఘవ – రాఘవ అంటే ప్రేమట. నిజమే కదా! టెంత్ చదువుతుండగా ఓ రోజు తమ్ముడి కోసం మా క్లాసు కొచ్చిన రాఘవ మొదటిసారి నన్ను చూసి తొలిచూపులోనే ప్రేమ పుట్టిందంటూ నా వెంటపడ్డాడు. అందం, ఆస్తి, రాజకీయంగా పలుకుబడి వున్న కుటుంబం… కాలక్షేపం చదువు – విలాసాల జీవితం. నాతోటి విధ్యార్ధులకివన్నీ కొత్తగా, వింతగా కనబడుతూ రాఘవ వెంట తిరగడమంటే అదొక గొప్ప విషయంగా భావిస్తూ అంతటివాడి ప్రేమను కాదనకంటూ… నాకు హితబోధ చేస్తూ…
అమ్మ, నాన్నల చాటు పిల్లగా ఆ వయసులో చదువుతప్ప మరో లోకమంటూ చూడనిదాన్ని. నానుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో వేధింపులు మొదలయ్యాయి. తన ప్రేమని నిర్లక్ష్యం చేయడం భరించలేక నాపై కోపం ధ్వేషంగా మారింది. ఎలాగైనా తన ప్రేమను గెల్చుకోవాలనే ఆరాటానికి ధ్వేషం తోడయ్యింది… దీనికి దూరంగా వెళ్ళాలని ఇంటరయ్యాక నాన్నతో తాతయ్య వాళ్ళూర్లో చదువుకుంటానన్నా. నాన్న సరేనన్నారు.
కొద్దిరోజులయ్యాక రాఘవ ఆ ఊరి కొచ్చాడు. ఆఊరు అటు పల్లె కాదు, అలాని పట్నం కాదు.అక్కడ కాలేజ్లొ అందరికీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని, అది నాన్నకిష్టంలేక ఇక్కడ వుంచారని ప్రచారం చేసాడు. తాతయ్యకు తెలిసిపోయి నన్ను కాలేజ్ మాన్పించి దూరపుబంధువు కిచ్చి పెళ్ళిచేసారు. ఆ తర్వాత రాఘవ నాకెప్పుడూ కనిపించలేదు. నా భర్త వినయ్ మంచోడే. డబ్బున్నపిల్ల, అందాలరాశి భార్యగా వస్తుందని ఊహించనే లేదంటూనే… ఏదో కారణం లేకపోతే అంతస్తులో సరితూగని నాకు… నిన్నిచ్చి ఎందుకు పెళ్ళి చేసారంటూ రోజుకో కారణం వెతికేవాడు. పగలంతా అందరి ముందు అనుమానం లేకుండా మంచిగా వుంటూ నాలుగ్గోడలమధ్య మాత్రం రాత్రంతా అనుమానం తీర్చుకునే మార్గాలు వెతుక్కునేవాడు. నాకేం కావాలో తెలుసుకునే లోపే అన్నీ ఇలా ముందుగానే నాజీవితంలోకొచ్చేసి నన్నిబ్బంది పెట్టేస్తుంటే నేనేం చేయను?
ఇదేం ఆనందం కాదుగా అందరితో పంచుకోడానికి! రోజురోజుకూ పెరిగిపోతున్న బాధను అణచివేసే ప్రయత్నాలు మొదలెట్టా. మనసును ఒక ఉక్కు కవచంతో బంధించి, మొహాన నవ్వుల మేలిముసుగు ధరించి వుండేదాన్ని. అమ్మ, నాన్నదగ్గర కళ్ళకు గంతలు కూడా కట్టుకోవలసి వచ్చేది. కళ్ళలో ఏ భావం కనబడకుండా వుండాలని.
అందమైనదాన్ని, అంతకుమించి తెలివైనదాన్ని కదా! బాగానే మానేజ్ చేసేదాన్ని. నా ప్రమేయం లేకుండా నా ఇష్టమేంటో తెలిసి కూడా నా లైఫ్‌లోకి ప్రవేశించి నన్నో పావుగా వుంచి గేమ్ ఆడాడు రాఘవ. మొదట్లో బాధను తట్టుకోలేక తలవంచి తాళి కట్టించిన తాతయ్యతో చెప్పుకున్నా. చేసిన పొరపాటు సరిదిద్దలేనంటూ మరణాన్ని తోడు తెచ్చుకొని పైకి పారిపోయాడు. తాతయ్యను పోగొట్టుకున్నట్టు ఇంకెవ్వరినీ దూరం చేసుకోలేను. ఈ జీవితం నాది కాదు. అలాగని నా శత్రువుదీ కాకూడదు. నాదికాని జీవితంలో నేనుకాని మాయా నీలిమ మైమరచిపోతూ నా జీవితంలోని పాత్ర జీవించేసింది. నా చుట్టూ ఉన్ననా ప్రపంచమొక నిశ్చల సరస్సు. అందులో నేనొక ఘనీభవించిన మంచుని.
నా వైపు నుండి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో బోరుకొట్టి సముద్రాల కవతలికి వెళ్ళిపోయాడు వినయ్. “నీకు విడాకులివ్వను… నిన్నక్కడికి తీసుకెళ్ళను. ఇలాగే చావు” అంటూ దీవించి వెళ్ళాడు. శాపాన్ని వరంలా భావించి బ్రతకడం బాగా అలవాటయిపోయిన దాన్ని కదా! అసలిప్పుడే నా జీవితం నా చేతుల్లో కొచ్చినట్లనిపించింది. మళ్ళీ మునపటి నీలిమను చూసారు నా వాళ్ళు. ఆగిపోయిన చదువు పూర్తిచేసా. ఇప్పుడు నేను ఏ అడ్డనేది లేకుండా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నదిని. ఈ నా స్వేచ్ఛా ప్రవాహంలో నేను కోల్పోయిన ఆనందాన్ని కొన్ని వందలమంది పిల్లలలో చూసుకుంటున్నా. నా ఉపాధ్యాయ వృత్తి పక్కన పెడితే నేనూ ఆ పిల్లలలో ఒక పిల్లగా ఆడుతూ పాడుతూ గడిపేస్తున్నా .నా పరిస్ధితికి జాలిచూపాలన్నవాళ్ళకు నా జీవితం అర్థం కాదేమో గాని, నేనేంటో తెలిసిన నా వాళ్ళకు ఇప్పటి నేనంటే చాలాయిష్టం. ముగిసి పోయిందనుకున్న గతం నుండి వర్తమానంలోకి – మళ్ళీ రాఘవ వచ్చాడా !?
గుమ్మం దగ్గర అలికిడికి ఆలోచనల్లోంచి కళ్ళు తెరిచా.
అప్పుడే వచ్చిన గీతిక గాభరాగా వుంది. దాని కళ్ళ నిండా భయం. ఏంటా వాలకం?! కళ్ళెగరేస్తూ అడుగుతున్న నన్ను చూసి కొంచెంతేరుకుంది. కూర్చో అని సోఫా చూపించి వంటగదిలో కెళ్ళా. కాఫీ కలపడానికి.
నేనిచ్చిన కప్పు అందుకొని వేడిగా వున్న కాఫీని చప్పరిస్తూ మొదట నేను చెప్పబోయేది వినాలన్న ఆసక్తితో ముందుకు వంగి నావైఫుచూసింది.
లాప్టాప్లో నాకొచ్చిన ఓ మెసేజ్ చూపా. అది పదిరోజుల ముందు వినయ్ పంపాడు. నేనందుకోలేని చందమామని నా చేతుల్లో పెడితే ఏం చేసుకోవాలో తెలీక అదృష్టాన్ని దురదృష్టంలా ఎంచుకుంటూ నిన్ను దూరం చేసుకున్నా. నీ జీవితం ఎప్పటికీ నీ చేతుల్లోనే వుంటుంది. అపార్థం చేసుకోకు… రాఘవ ఇండియా వస్తున్నాడు. నీకోసమే. నాకు తెలిసిన ఈ విషయం ముందుగా నీకు చెప్పాలనిపించిందంతే.
“అంటే అక్కడ రాఘవ వుంటాడని నీకు ముందే తెలుసా?” ఆశ్చర్యంగా చూసింది. “తెలుసు” కూల్‌గా అన్నా.
“మారానని, సారీ చెప్తాడని ఎక్స్పెక్ట్ చేసావా!”
“లేదు. నాకే సారీ చెప్పాలనిపించింది” ఆ మాటకు దాని మొహం ఎలా వుంటుందో తెలుసు కాబట్టి ఎదురుగా నున్న గోడవంక చూసుకుంటూ మాట్లాడుతున్నా.
“ఎందుకని?” ఆ స్వరంలోని తీవ్రతలో తన కోపం వినబడుతూంది.
అప్పుడు మా మధ్య జరిగినదంతా ఇప్పుడు తలచుకుంటే నాకేం కోపం లేదు. అప్పుడు తను నాకన్నా ఓ అయిదేళ్ళు పెద్దవాడయివుంటాడు. వయసు వేడిలో దూకుడుండడం సహజమేననిపించింది. నేను కాదన్నాననే కదా అలా చేసింది. ఒప్పుకోనుంటే నా జీవితం వేరేలా వుండేదేమో!
గీతిక సోఫాలోంచి విసురుగా లేచి వంటగదిలో కెళ్ళింది కప్పు షింక్‌లో చప్పుడయ్యేట్టు పడేసింది. హాల్లో కొచ్చిన తనతో, “కప్పు పగిలిపోయిందా! ఎంతోఇష్టపడి కొనుక్కున్నా”బాధగా అన్నాను.
“ఇప్పుడు తమరు కొత్తగా పగిలిపోయిన వాటికి అతుకులేస్తున్నారు కదా! ఫర్లేదులే” హేళనగా అంది.
కథ విందువా…. నా కథ విందువా…. మాకిద్దరికీ ఇష్టమైన ఆ పాట ని నెమ్మదిగా హమ్ చేస్తున్నా.
“వినక చస్తామా! చెప్పి చావు! ” విసుగ్గా అంది. ఏంటో ఈ రోజు గీతిక నోటి నుండీ చావు మాటలే.
“ఆ రోజు మన క్లాస్మేట్స్ అందరం కలుసుకున్న రోజు… రాత్రి నాన్న ఫోన్ చేసారు. ముందురోజు అక్కడికి రాఘవ వచ్చి నన్ను పెళ్ళి చేసుకోవాలనుందని చెప్పాడట. ‘మాకెలాంటి అభ్యంతరంలేదు అంతా నీ ఇష్టమే. అని చెప్పాం. నీతో మాట్లాడాలంటున్నాడు… ఆలోచించుకొని నిర్ణయం తీసుకో’మన్నారు.
మర్నాడు రాఘవ నుండి ఫోన్. మాట్లాడాలి. ఎక్కడ కలుద్దాం అనంటూనే ఒంటరిగానే రావాలన్నాడు. ఇంటికే రమ్మన్నా.
వచ్చాడు. గెలుపు నాదేనన్న ధీమాతో చిరునవ్వులు ఒలకబోసుకుంటూ ఏం మాట్లాడకుండా నన్నే చూస్తూ విలాసంగా కూర్చున్నాడు.
తన గురించి అంతా మనమందరం కలిసినప్పుడు చెప్పేసాడుకదా.”
“ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించింది. ప్రేమను గెలిపించుకోబోతున్నాను” అని. ఇందాక నీకు చెప్పినట్లుగానే జరిగిపోయిన దానికి సారీ చెప్పా. సగర్వంగా స్వీకరించాడు.
నా నిర్ణయం వినే ముందూ ఆ తర్వాత కూడా నీ చిరునవ్వు నీ చెంతనే వుంటుందన్నా. దాన్ని మనిద్దరం కలిసి పంచుకునే ముందుగా ఓ విషయం చెప్పాలన్నాను. త్వరగా చెప్పేసేయ్! నా పెదవులపై నున్న చిరునవ్వును నువ్వందుకునేదుంకు ఆలస్యం నీకేమాత్రం సాయం చేయదంటూ తర్జని చూపి ముద్దుగా బెదిరించాడు.
వినయ్ కూడా సరిగ్గా ఇలాగే నాలుగ్గోడల మధ్య నాతో ఏకాంతంలో ఇలాగే… ఆలస్యాన్ని భరించలేకపోయేవాడు.
నా పక్కనచేరి, ఎప్పుడూ ఓ మాటనేవాడు.”నీ అందమైన శరీరం నా సొంతమేగా! దీన్ని నా యిష్టమొచ్చినట్లు వాడుకోవచ్చు. ఈ సమయంలో నాకోసం నువ్వు తప్పనిసరిగా చేయాల్సిన పని ఒకటుంది. కళ్ళు మూసుకొని నీ ప్రియుడ్ని తలచుకో! నేనో ఖరీదైన వేశ్యతో సుఖాన్నందుకున్నట్లుగా ఫీలవుతాను” అంటూ నా అంగీకారంతో ప్రమేయం లేకుండా తనేం చేయాలనుకున్నాడో అదే చేసేవాడు. ఆ మధురక్షణాలు మరువరాదంటూ ప్రేమతో తను బహుకరించిన గాయాల బహుమానాలెన్నో. కొన్నేళ్ళకు అది కూడా బోరుకొట్టి నాకు దూరంగా వెళ్ళిపోయాడు. నాకు ప్రేమంటే ఏంటో తెలీని రోజుల్లో నువు నాదగ్గర కొచ్చావు. భయంతో నేను వేసిన వెనకడుగు ఫలితం, వినయ్ నాకు భర్తగా వచ్చాడు. అప్పుడు నాకు ప్రేమంటే భయం వుంటే వినయ్, పెళ్ళంటే నరకం అని చెప్పాడు. దేనికీ సరైన నిర్వచనం నేనింకా తెలుసుకోలేదు. ఇప్పటివరకూ తెలుకోవాలనుకోనూ లేదు.
గొంగళి పురుగు దశలోనే ఎక్కువ రోజులు వుండిపోయానుకదా! ఇప్పుడు ఈ సీతాకోకచిలుక రెక్కలకు బలమెక్కువ. స్వేచ్ఛగా తిరుగుతున్నఈ శరీరమొక ఘనీభవించిన మంచు. మా దాంపత్యానికి గుర్తుగా వినయ్ తాలూకు చిహ్నాలు చెరిగిపోని మచ్చలై నా ఒంటినంటిపెట్టుకునే వున్నాయి. నువ్వొక నిప్పుపర్వతమై నిలువెల్లా లావాతో పొంగి ప్రవహిస్తేనే మొద్దుబారిపోయిన ఈ మేనులో చలనం కలిగి సుఖానుభూతి మొదలయ్యేది.
ఇప్పటినుంచే నీనుండి వచ్చే శుభవార్త కోసం నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తుంటా. రెక్కలు చాచిన పక్షిని కదా! ఇలా నేనూ ఎగరకుండా ఎక్కువసేపు వేచివుండలేను.
నేను చెప్పాలనుకుంది పూర్తయిందని నా మౌనం చెప్పింది. ఏం మాట్లాడకుండా తెల్లబోయి చూస్తున్న గీతికతో “అంతగా అవసరమైతే తాతయ్య దగ్గరకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాలే” అన్నాను. పేలవమైన చిరునవ్వు నా పెదవుల నంటిపెట్టుకోనుంది. అది నా చేతుల్లో వాలి ఏడుస్తూంది. ఇన్నాళ్ళూ నా కన్నీళ్ళతో తన భుజాలు తడిచిపోయేవి. మౌనంగా ఓదార్చేదే తప్ప మళ్ళీ ఆ ఙ్ఙాపకాలను కెలికేదికాదు. నన్ను ఓదార్చి, ఓదార్చి అది అలిసి, డస్సిపోయుంది. తనివితీరా ఏడవనీ… ఇప్పుడు నా నెచ్చెలిని ఓదార్చడం ఒక్కటే నా ముందు మిగలబోయే ఆఖరి ఙ్ఞాపకం.
చదవకుండా టీపాయ్‌పై గిరాటేసిన ఆరోజిటి న్యూస్‌పేపర్ కిటికీలోంచొచ్చిన గాలి విసురుగా తాకడంతో కిందబడి పేజీలు విడిబడింది. ‘తెల్లవారు ఝామున కారు ప్రమాదం, ఎం.పి.మనవడి మృతి’ మొదటి పేజిలో పెద్దక్షరాలతో వార్త ప్రస్ఫుటంగా కనబడుతూంది.
వాసవి పైడి సొంత ఊరు శ్రీకాళహస్తిలో జన్మించారు. పెరిగింది, డిగ్రీ వరకు చదువుకున్నది నెల్లూరులో. ప్రస్తుతం నివాసం తిరుపతి. పుస్తకం తనకెంతో ప్రియమైనదనీ, ఎవరికైనా ఇష్టంగా ఇవ్వాలన్నా, చనువుగా తీసుకోవాలన్నా తన వరకు అవి పుస్తకాలేనంటారు. ఏకాంతంలో ఆత్మీయంగా, ఒంటరితనంలో తోడుగా వుండేది పుస్తకమేనంటారు. బాల్యం నుంచి సాగుతున్న ఈ క్రమంలో కొన్నాళ్ళనుండి పుస్తకాలను చదువుతున్నప్పుడు మధ్యలో కమ్ముకొన్న ఆలోచనలనూ, భావాలను అక్షరాలలో చూసుకోవాలనిపించి రచయిత్రిగా మారారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పూచే పూల లోన-19
ఆత్మగౌరవ ప్రతీకలు గురజాడ ‘పూర్ణమ్మ, కన్యక’లు
ఇస్కూలు కతలు – పుస్తక పరిచయం
సంచిక – పదప్రహేళిక జూలై 2023
సాయి భక్తాగ్రేసరుడు హరి సీతారాం దీక్షిత్
నూకలు!!
జ్ఞాపకాల పందిరి-189
కలవల కబుర్లు-19
బ్రతుకు కావ్యం
అభినవ శ్రీనాథుడు, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారి కవిత్వస్మృతి పరిమళాలు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®