[డా. కాళ్ళకూరి శైలజ రచించిన ‘ఖామోషీ’ అనే కథను పాఠకులకు అందిస్తున్నాము.]


బక్కపలచగా, కాస్త పాలిపోయినట్టున్న పెదవులతో, చుట్టూ చూడకుండా, ఎటో క్షితిజ రేఖకి సమాంతరంగా చూస్తున్నట్టున్న కళ్ళతో ఎవరైనా కనిపిస్తే నాకు ఠక్కున అసీఫా గుర్తుకొస్తుంది. కానీ తనను ప్రత్యేకంగా పట్టిచ్చేది మటుకూ ఎక్కబోయే రైలు తప్పిపోతుందేమో అన్నట్టు చక చకా నడిచే పాదాలే. ఎపుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. మంద్రంగా, బతిమాలుతూ ఉండే కంఠస్వరం. అంతలోనే తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేందుకు అసీఫా వెనుదీయదు.
ఎంత బలం తనది! పద్మావతి కాలేజీలో అప్పట్లో తన క్లాస్మేట్ సుజాతను వీల్ ఛైర్లో కాలేజీ కాంపౌండ్ అంతా కలయ తిప్పేది. లైబ్రరీకి, హాస్టల్ రూమ్‌కి, మెస్‌కి తనే తోసుకు వెళ్ళేది.
పచ్చని పసిమి వర్ణపు తన ముఖం బురఖాలో పదిలంగా ఉండేది. అసీఫా ఓపిక 1982-84 మధ్య ఉన్న మా కాలేజీ స్టాఫ్, స్టూడెంట్స్ అందరి జ్ఞాపకాల్లో ఇప్పటికీ స్పష్టంగా మిగిలి ఉంది.
మేం మళ్ళీ కర్నూల్లో కలిసాం. మా అత్తవారిది ఆ ఊరు. నేను ఉద్యోగం కోసం వెళ్ళినపుడు అసీఫా ఆ కాలేజీలో పనిచేస్తూ కనబడింది.
ఇప్పటికీ తను ప్రతి రోజూ కాలేజీ అయ్యాక లైబ్రరీలో కాస్త సమయం గడుపుతుంది. అటెండర్ రిజ్వాన్ అన్ని తాళాలు వేసుకొచ్చే లోపు ఆ 45 నిమిషాల్లో తన రిఫరెన్స్ వర్క్ అంతా చేసుకునేది. బండి లేదు. రిక్షా, తర్వాత ఆటో.
ఏటా కొత్త విద్యార్థులు వచ్చినపుడు ఆమె మొహం కళకళ లాడిపోతుండేది. ఒకోరోజు ఆమె నవ్వు గది మొత్తం నింపేసే వెలుగుతో ఉండేది. ఆరోజు మా అందరికీ ‘చౌదవీ కా చాందినీ’. స్టాఫ్ రూమ్‌లో తప్పకుండా చాక్లెట్లు పంచేది. ‘ఈసారి ఏంటమ్మా? యూనివర్సిటీ ఫస్టా? మీ ఓల్డ్ స్టూడెంట్‌కి పీహెచ్డీ వచ్చేసిందా ? ఎవరైనా సివిల్స్ కొట్టారా? నీ రీసర్చ్ పేపరు యాక్సెప్ట్ అయిందా?’, లాటి మా ప్రశ్నలన్నిటికీ నవ్వుతూ, తలూపుతూ వివరాలు చెప్పేది. ప్రతి స్టాఫ్ మెంబరు దగ్గరా పదేసి నిమిషాలు తన స్టూడెంట్‌ని పరిచయం చేస్తూ, మాట్లాడిస్తూ గడిపేది. ఆసిఫా క్లాసులో పాఠం చెప్తుంటే వినాలి. అప్పటి దాకా గాలి వేస్తే ఎగిరిపోతుందేమో అన్నట్టు ఉండేది, ఆమె గొంతు విప్పితే, ఇంట్రడక్షన్ నుంచి రీసెంట్ అడ్వాన్సెస్ దాకా దంచి కొట్టేది. కాలేజీ ఇన్స్పెక్షన్ జరిగితే అసీఫా క్లాసు తప్పనిసరిగా ఉండేది. కొత్త బోధనా పద్ధతుల్ని ప్రతి ఏటా అలవోకగా అమలు చేసేది. స్టూడెంట్స్‌కి ఆన్సర్ పేపర్ ఇచ్చినపుడు అధమ పక్షం రెండు క్లాసుల సమయం పట్టేది. ప్రతి విద్యార్థికీ ఏం వ్రాసారో, ఏం వ్రాయాలో వివరంగా చెప్పేది. మూడేళ్ల డిగ్రీ చదువుని చాలా ముఖ్యమైన చదువులా సమగ్రంగా చెప్పడం తన స్టైల్.
“ఈసారి బోనస్ ఏం చేసావు?” అంటే జువాలజీ ల్యాబ్‌కో, వాటర్ టాంకర్కో, రెస్ట్ రూమ్ బాగు చేసేందుకో పెట్టేది.
కొన్ని ప్రశ్నలకు అసీఫా ఇచ్చే జవాబులు బోర్డు మీద రాయాలి అనిపిస్తుంది. అసలు అందుకే కదా ఈ కథ!
కాలేజీ కరస్పాండెంట్ దురుసుగా మాట్లాడతారని కొందరు ఆయనకి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్న రోజు. అసీఫా, “నేను పెట్టను”, అంది. ఎందుకని అడిగితే, “ఆ కుర్చీకి నేనిచ్చే గౌరవం అది. క్లాసులో నలభై మంది నలభై రకాలుగా ప్రవర్తిస్తేనే నాకు తల తిరుగుతోంది. ఆయన లెక్చరర్స్, పని వాళ్ళు, పై వాళ్ళు, అల్లరి పిల్లలు ఇందరిని కంట్రోల్ చేస్తూ.. కాలేజీ కమిటీకి ప్రోగ్రెస్ చూపించాలి. పైగా దాతలని ప్రసన్నం చేసుకుని మనకు డొనేషన్లు తేవాలి. ఆయన తల ఎంత తిరుగుతుందో ఏమో!”, అంది.
మరోసారి,.. హాస్టల్ అమ్మాయికి అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వస్తే తను గ్యారెంటీ సంతకం పెట్టింది. తర్వాత ఆ అమ్మాయి తండ్రి, మేనమామ వచ్చి మేము వచ్చేదాకా ఎందుకు ఆగలేదంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ వార్త పేపర్లకు ఎక్కింది కూడాను. అసీఫా ఏమీ జంకలేదు. డాక్టర్ల టీం అందరినీ సమావేశపరచమని ఆసుపత్రి సూపరింటిండెంట్‌కు అర్జీ పెట్టుకుని, వాళ్ళ చేత స్టూడెంట్ తండ్రికి సమాధానం చెప్పించింది. ఏతావాతా స్టూడెంట్ బంధువులు ఆమెకు సారీ చెప్పారు. “పర్వాలేదండీ. మరోసారి ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా, ఇలాగే చేయాలని నాకు అర్థమైంది”, అంది అసీఫా చాలా కూల్‌గా.
అలాంటి అసీఫాకి పెళ్లి కాలేదు. పెళ్ళవాలా అని అడగకండి.1964 లో పుట్టిన అమ్మాయి కదా! ఆ తరంలో పెళ్లి ఒక సామాజిక సంఘటన. అమ్మాయిల ఇష్టంతో పెద్దగా పనేం లేని రోజులు. చదువుకోడానికి, యూనివర్సిటీలో చదువుకోడానికీ, హాస్టల్లో ఉండేందుకూ అసీఫా చేసిన నిరాహార దీక్షలు, కుటుంబ సభ్యులతో పడ్డ మాటలు తనకెలాంటి పేరు తెచ్చాయో తెలీదు గానీ, అంతా బాగానే ఉన్నట్టుండి ఆఖర్లో పెళ్లి మాటలు తప్పిపోయేవి. ఆ టైంలో పళ్ళు, స్వీట్లు తీసుకెళ్లే దాన్ని కాబట్టి నాకు వివరాలు తెలుసు. చదువుకున్న కుర్రాళ్ళు కూడానూ.. ముందు ఇష్టపడేవారు. ఆ తరువాత ఏదో ఇబ్బంది.
35 ఏళ్లు వచ్చాక, “ఇక నేనెవర్నీ చూడను”, అని అసీఫా చెప్పేసింది. “పర్వాలేదు దోస్త్! ఇప్పుడు మా కుటుంబంలో ఆడపిల్లలంతా డాక్టర్లు, డెంటల్ సర్జన్లు, ఇంజనీర్లు అవడమే కాదు తమకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం కూడా చేస్తున్నారు. అప్పట్లో నా షరతు అదొక్కటే. ఇప్పుడంటావా అంతా బేషరత్!”, అన్నది అసీఫా.
అదే నవ్వు హాయిగా. మొహం నిండా వెన్నెల ఆరబోసినట్టు.
మేమిద్దరం మరో మూడేళ్లలో రిటైర్ అవుతున్నాం. మా అమ్మాయికి వాళ్ల పిల్లల్ని పెంచడంలో సహాయం చేయాలి, తీర్థయాత్రలు చేయాలి, అంటూ నేను ఏవేవో ప్లాన్లు వేస్తున్నాను.
“మరి నువ్వో అసిఫా?”, అడిగాను.
“మా సొంతూరుకి వెళ్ళిపోతాను. అమ్మానాన్న ఇదివరకు ఉన్న ఇంటిని రీడింగ్ రూమ్‌గా చేస్తాను. ఉదయం 6 నుంచి రాత్రి 8 దాకా ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ఈ రోజుల్లో ఓ మాదిరి ఊర్లో కూడా దొరకనిది ఒక్కటే.. నిశ్శబ్దం! చదువుకునే పిల్లలకి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళకి నేను బహుమతిగా ఇచ్చేది అదే!” హుషారుగా చెప్పింది.
“ఎలాను జువాలజీ డౌట్స్ అయితే నేనే తీర్చగలను కదా! ఇంతకీ దోస్త్, నా రీడింగ్ రూమ్ పేరేంటో తెలుసా? ఖామోషీ”.
1 Comments
Vani Prakriya
Good read!