ఇవాళ మా యింటికి ఓ చుట్టమొచ్చారు. అదేమైనా పెద్ద చెప్పుకోదగ్గ విషయమా అనకండి.. అసలు కథ యిక్కడే వుంది. ఈయన కాస్త పూర్వకాలం మనిషి. అంటే ఇంటికి బంధువులొస్తే ఆ వచ్చిన చుట్టం ఎక్కడ మొహమాటపడిపొతాడోనని వారికి యే లోటూ లేకుండా చూసి, సకల మర్యాదలూ జరిపించే మనిషి. అందులో తప్పేంలేదు కానీ భోజనం దగ్గర మటుకు ఆయన విశ్వరూపం చూడవలసిందే. వచ్చినవాళ్ళు వద్దు వద్దంటున్నా సరే మొహమాటపడుతున్నారంటూ వాళ్ళ విస్తళ్లనిండా అన్నీ వడ్డింపించేసేవారు. పాపం వాళ్ళు ఆయన అతిమర్యాదలకి తట్టుకోలేక పోయేవారు.
ఆయన అలా మర్యాదలు చెయ్యడమేకాదు ఆయన యెవరింటికి వెళ్ళినా కూడా ఒక అతిథిగా తనకి కూడా ఆ గృహస్తు అలాగే మర్యాదలు చెయ్యాలనుకునేవారు. ఆయన సంగతి కాస్త ఆలస్యంగానైనా తెలిసింది కనక నేను “వద్దు వద్దమ్మా, ఇంక చాలు..” అన్నా కూడా ఆ చేతుల పక్కనుంచి వడ్డించేస్తాను. ఆయన యేమీ వదలకుండా తినేస్తారు. కానీ ఆ విషయం పాపం మొన్ననే కొత్తగా పెళ్ళై వచ్చిన మా బంధువులమ్మాయి రమ్యకి యెలా తెలుస్తుందీ.
అసలే కొత్తగా పెళ్ళైంది. భర్త తరఫు బంధువు వచ్చారు. చేతనైనంతలో బాగా చేసిపెట్టాలనే అనుకుంటారు కదా.. ఆ అమ్మాయి రమ్య కూడా అన్నీ బాగానే చేసిందిట. కానీ వడ్డన మటుకే అస్సలు బాగులేదుట. ఈ మాట మా యింటికొచ్చిన పెద్దాయన చెప్పారు.
ఆయన మాటల్లోనే చెప్పాలంటే..”అదికాదే అమ్మాయ్, అయ్యో పెద్దముండావాడు, యెండన పడొచ్చాడూ.. అంటూ రాగానే కాసిన్ని నిమ్మకాయనీళ్ళు యివ్వొద్దుటే.. అదేదో చల్లగా వుంటుందిట.. పుచ్చకాయ రసం యిస్తానంటుందేవిటే.. అయినా మనలో మన మాట.. యెంతసేపూ యివ్వనా యివ్వనా అంటుంది తప్పితే యివ్వదేవిటే.. వెధవ పుచ్చకాయ పుట్టి బుధ్ధెరిగి యెప్పుడూ తినలేనట్టు యిమ్మని మనం వేరే చెప్పాలా.. అయినా యింటికొచ్చిన పెద్దమనిషికి కాస్త ఫేనేసి, వంటయ్యేలోపల ఓ రెండు యాపిలీసుముక్కలుకానీ, కాస్త కరకజ్జం కానీ ఓ ప్లేట్లో పెట్టి తేరూ! అది కూడా తెలీదే ఆ పిల్లకి. సరే పోనీ.. యేదో చిన్నపిల్లనుకుందావంటే ఉజ్జోగం చేస్తూ యిరవైవేలు తెచ్చుకుంటోందిట.. మరి యేవీ తెలీని పిల్లకి వాళ్ళా ఉజ్జోగ మెలా యిచ్చేరో.. అదంతా వదిలై.. పోనీ భోజనం పెట్టిందా.. మారడగదేమే ముంగిలాగా.. అన్నీ వడ్డించేసి అలా పక్కకెళ్ళిపోయింది.. బాబాయిగారూ, ఇంకాస్త కూర వెయ్యనా, పప్పు కలుపుకోండీ, పచ్చట్లో ఉప్పు సరిపోయిందాండీ.. అంటూ యేవైనా మాట్లాడొచ్చుగా..ఎబ్బే.. అన్నీ చిన్నచిన్న గిన్నెల్లో వేసి, కంచం చుట్టూ పెట్టేసి, యేవైనా కావాలంటే అడగండి బాబాయిగారూ అంటుందా.. నేనేం తిండికి గతిలేక వచ్చేననుకుందా.. అయినా పిల్లని యిలా పెంచిన వాళ్ల అమ్మనీ, అబ్బనీ అనాలి..” అంటూ దండకం మొదలుపెట్టేరు.
పాపం పెద్దాయన. ఆకాలంలో మనిషి. వాళ్ళు అలాగే ఆశిస్తారు కదా! ఆయన చెప్పినవాటికి నేనేమీ మాట్లాడలేకపోయేను. ఇంతలో ఫోన్ మోగింది.. ఎవరా అని చూస్తే యిప్పటిదాకా బాబయ్యగారు చెప్పిన కుర్రపిల్లే.. రమ్య.
ఫోన్లో నా మాట వినపడగానే, “పిన్నిగారూ, ఇవాళ మావారి బాబాయిగారుట వచ్చేరండీ. పెద్దాయన.. ఆయనకి యేం పడుతుందో యేం పడదో నాకు తెలీదు. ఏమైనా పెడితే మళ్ళీ రేప్పొద్దున్న ఆయనకి వంటికి యేమైనా వస్తే కష్టం కదండీ. అందుకే యేం తింటారని ఆయన్ని అడిగి, ఆయన తినేవే చేసేననుకుంటున్నానండీ. కానీ పాపం ఆయన ఏం తిన్నారో యేమో.. నాకేమిటో దిగులుగా వుందండీ” అంది. ఈ కాలపు పిల్ల. మర్యాదలకన్న ఆరోగ్యం గురించి ఆలోచించే మనిషి. ఇద్దరి ఆలోచనలూ కరెక్టే.. ఎవరిని యేమనగలం. అందుకే యిద్దరితోనూ కూడా “అవున్నిజమే..” అని మటుకు అనేసాను. అంతకన్న నేను మటుకు యేం చెయ్యనూ?
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.
వడ్డించేటప్పుడు వేయనా , ఇంకా కావాలా అని అడగటం నాకూ నచ్చదు. ఇంటికి వెళ్ళగానే కాఫీ ఇయ్యనా అంటారు ఇయ్యి అంటామా ? ఇద్దరి వాదనలూ కరెక్ట్ నే ఐనా వడ్డించే నేర్పు అందరికీ ఉండదు.అందులో ఈ కాలం లో ఇంటికి వచ్చే అథిదులూ లేరు .దానితో పిల్లలకూ తెలీటం లేదు .ఆ పెద్దాయనంత అతిగా కాకపోయినా కనీసం మాములుగా వడ్డించే పద్దతి ఈ బఫే సిస్టం ల తో పూర్తిగా పోయింది.
కదండీ మాలాగారూ..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™