Oldboy సినిమా ఇంతకు మునుపు చెప్పినట్లు జాపనీస్ మాంగా ఆధారంగా రూపొందింది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి పదేళ్ళపాటూ కిడ్నాప్ చేయించి హఠాత్తుగా విడుదల చేస్తాడు. తరువాత తనెవరు, ఎందుకు కిడ్నాప్ చేశాడో కనుక్కోమని ఛాలెంజ్ విసురుతాడు. ఈ పది సంవత్సరాలు మన కథానాయకుడికి తోడుగా ఒక టీవీ, తాగేందుకు మందు బాటిల్స్, ఒకే తరహాలో ఉండే ఆహారం అందించబడుతుంది. పాతికేళ్ళ (గుర్తుపెట్టుకోండి. తరువాత మాట్లాడుతుందాం) Shinichi Gotō పదేళ్ళ పాటూ జైలులో ఒంటరిగా బాహ్య ప్రపంచపు వివరాలేవీ తెలియకుండా ఉంటాడు. అతనికి టీవీలో కనపడేది డాక్టర్డ్ సమాచారం. అంటే మన దూకుడులో ప్రకాశ్ రాజ్‌ను సంతోషంగా ఉంచేందుకు మహేశ్ టీమ్ చూపే న్యూస్‌లా… ఇక్కడ మన షినిచి గొటోను మానసికంగా సంపూర్ణంగా దెబ్బకొట్టేందుకు చూపించబడే కార్యక్రమాలు.
పదేళ్ళ తరువాత ఎలా హఠాత్తుగా కిడ్నాప్ చేశారో అలాగే వదిలేస్తారు. ఒక పెట్టెలో పెట్టి నిర్జన ప్రదేశంలో. అక్కడి నుంచీ అతను నీళ్ళ బైట పడిన చేపపిల్లలా విలవిలలాడుతాడు, చిన్న సైజు రిప్ వాన్ వింకిల్‌లా సమాజంలో ఇమడటానికి చాలా కష్టాలు పడతాడు. కానీ, జైలు కాని జైలులో పదేళ్ళు పాటూ ఒంటరితనంలో తనని తాను శారీరకంగా బాగా మల్చుకుంటాడు. ఒకవేళ తను బైటపడగలిగితే తనను బంధించిన వారి మీద ప్రతీకారం తీర్చుకునేందుకు. ఆ శారీరక పటుత్వం వల్ల, బైటపడిన కొన్ని రోజులకు మానసికంగా ఎడ్జస్ట్ అయి ఒక కన్స్ట్రక్షన్ ప్రాజక్ట్‌లో పని సంపాదిస్తాడు. పని దొరికింది. నాలుగు వేళ్ళు లోపలకు వెళుతున్నాయి. ఇప్పుడు క్రమంగా తనను బంధించిన వారి వివరాలు తెలుసుకునే పని out of curiosity మొదలు పెడతాడు (గుర్తు పెట్టుకోండి).
ఈ క్రమంలోనే తన పాత స్నేహితుడు తటస్థపడతాడు గొటోకు. అతని సహాయంతో తాను కిడ్నాప్ కాబడటానికి ముందు క్షణాలలో ఒక రూఫ్ టాప్ మీద వదిలి వచ్చిన ఫియాన్సీని కలుస్తాడు. చాలాకాలం అతని కోసం ఎదురుజూసిన ఆ పిల్ల క్రమంగా move on అయి పెళ్ళి చేసుకుని సెటిల్ అవుతుంది. ఇంతలో గొటోకు ఒక సెల్ ఫోన్, కొంత క్యాష్ పంపి తన గురించి కొన్ని క్లూలు ఇచ్చి తానెవరో కనుక్కోమని చాలెంజ్ విసురుతాడు ఒక అపరిచితుడు. దాంతో అప్పటిదాకా క్యూరియాసిటీతోనే ఉన్న గొటోకు కాస్త తిక్క రేగుతుంది. పదేళ్ళ తన నవయౌవ్వనాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఎలాగైనా పట్టుకుని వాడికి తన ప్రతాపం చూపాలని అనుకుంటాడు. తొందరలోనే మన కథానాయకుడికి ఎరీ అనే అమ్మాయితో స్నేహం ఏర్పడుతుంది.
గొటోకు ఉన్న పెద్ద క్లూ తనకు ఇచ్చిన ఆహారం. ఒకే రకమైన పదార్థం. ఒకేరకమైన రుచి. అది ఒక రెస్టరెంట్లో నుంచే తెచ్చి ఉంటారన్న పాయింట్ మీద తన పరిశోధన మొదలుపెడతాడు. పగలు కడుపాకలి కోసం పని, రాత్రిళ్ళు తనను పదేళ్ళు నిర్బంధించి మృగంలా మార్చిన వ్యక్తి మీద పగ తీర్చుకోవాలనే సెరెబ్రల్ హంగర్ కోసం పరిశోధన. ఇదంతా కథనంలో నాంది లాంటిది. ఇక్కడి నుంచి అతని ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొడుతూ, కొత్త చాలెంజులు విసురుతూ, క్లూలు రువ్వుతూ గొటో మానసిక లోకాన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్న ప్రతినాయకుడు టకాకీ కకినుమ గురించి ఎలా కనుక్కున్నాడు, అతని ప్రతీకార వాంఛ ఫలితం ఏంటన్నది ఈ జాపనీస్ మాంగా కథ.
Frankly speaking, except for its innovatively designed story palette, slick narration and unexpected twists, this is a fairly normal action thriller that is common among Japanese Manga.
ఈ కథ ఇంతగా ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ కావటానికి కారణం మటుకూ Park Chan-work తీసిన కొరియన్ సినిమా Oldboy. ఒక సాధారణ మంచి కథ ఎలా చరిత్రలోనే ఎన్నదగిన గొప్ప సినిమా అయింది? ఇక్కడే పార్క్ దర్శకత్వ ప్రతిభతో పాటూ మేధస్సు ప్రకాశిస్తుంది.
మరీ వీడి వేషాలు ఎక్కువైపోతున్నాయి అనుకున్నా సరే! ఈ ఉదాహరణ ఇవ్వక తప్పటం లేదు.
“క్రయివంటే పెత్తేకంగా యాడ్నో ఉండదు. నీ యనకమాలుంటది. ముందుగాలుంటది. ఆ పక్నుంటది. ఈ పక్నుంటది. యాడ్జూసినా ఆడ్నే ఉంటది. ఏయో సిన్న సిన్న పన్లు సేసేప్పుడెవడికో మండినాదనుకో… ఆడు దాన్ని గుర్తెట్టుకుంటాడు. సేసే దమ్ము లేకో, ఇంకెందుకో బైటడలేదనుకో. ఏ పాబ్లమూ లేదు. లేదనుకో ఎప్పుడో టయివొచ్చినప్పుడు బదులిచ్చేస్తాడు. అది పెద్దగానుండొచ్చు. సిన్నగా నుండొచ్చు. అదే క్రయివంటే.”
నేను రాస్తూ వివిధ కారణాల వల్ల for time being పక్కన పెట్టిన Book of Blood నవలికలో ఒక డైలాగ్. ఈ Oldboy మాంగా అయినా, Oldboy సినిమా అయినా సరిగ్గా ఈ విషయం మీద ఆధారపడి తీసినవే. ఒక చీమ మనల్ని కుడితే ఠక్మని చంపేస్తాం. దానికి శివుడిని కలిపి ఒక కథ కల్పిస్తాం. వినోదాత్మకంగా బాగనే ఉంటుంది. ఇంట్లో జొరబడిన పాముల్ని కూడా మర్యాదగా పట్టుకుని దూరంగా వదలాలని చెప్పే ఆధునిక మానవులు చీమల విషయంలో కూడా కుట్టిన చోట చిన్నగా వాటిని పట్టుకుని నేలమీద వదిలేస్తే పోలా? కుట్టే సరికే సగం చచ్చిపోతాయి. మన గట్టి గ్రిప్‌ను తట్టుకుని బతికుంటాయా? ఇక్కడో విషయం గమనించాలి. మనకన్నా శక్తివంతులను మనమేమీ చేయం. మహా అయితే వాడి పాపాన వాడే పోతాడని వదిలేస్తాం. చేతకాక. అదే మనకన్నా బలహీనులైతే కచ్చితంగా ఆడుకోవాలని చూస్తాం. బెండు తీసేదాకా వదలం.
సరిగ్గా ఇలాంటి యండమూరి సుబ్బారావు (విజయానికి ఐదు మెట్లు లో ఉదాహరణగా చెప్తాడు. బాస్ మీద, ఇతరుల మీద ఉన్న కోపాన్ని, చేతకానితనాన్ని, అసహనాన్ని ఇంట్లో భార్యాభర్తల పిల్లల మీద కోపం రూపంలో చూపించే సుబ్బారావు) లాంటి సామాన్యుడే మన ఓ డే-సు (ఇదేమి పేరురా ఓబులేశు లాగా అనుకున్నా సినిమా మొదటిసారి చూసినప్పుడు). గమనించే ఉంటారు… ఇప్పుడు మనం Oldboy మాంగా నుంచీ కొరియన్ సినిమాలోకి వచ్చేస్తున్నాం.
యండమూరి మెట్ల సుబ్బారావు లాంటి ఓ డే-సు (Oh Dae-su) ఒక చిన్న స్థాయి బిజినెస్‌మన్. కాస్తో కూస్తో సక్సెస్ కూడా సాధిస్తాడు. భార్యతో పడదు కాబోలు… రోజూ చిత్తుగా తాగుతుంటాడు. ఒక శుభదినాన (మనకు కథ మొదలౌతుంది కనుక) ఇలా చిత్తుగా తాగి రోడ్ మీద తాగి గోల చేస్తుంటే పోలీసులు తీసుకెళతారు. సరిగ్గా అక్కడ మన మెట్ల సుబ్బారావు లాగనే మొదట తన బల ప్రదర్శన చేద్దామనుకుంటాడు. నేనంటే ఎవరనుకున్నారు? జింబాబ్వే 200 బిలియన్ డాలర్ నోటు తయారు చేసింది నేనే, అంటార్కిటికా ఆరో అధ్యక్షుడి మూడో భార్య వేలువిడిచిన మేనల్లుడి మరదలు భర్త నేనే, తాగటం వల్ల మత్తుగా ఉంది కానీ, లేకపోతే మీ తాట తీసే వాడిని… ఇలా తీన్మార్ వేస్తాడు మొదట. పోలీసులు భరించలేక రెండు పీకేసరికి మెట్ల సుబ్బారావులా లైన్ లోకి వచ్చేస్తాడు. ఇక సానుభూతి పొందటానికి బతిమాలటం మొదలుపెడతాడు.


ఆ రోజు నిజంగా ఓ డే-సు కు శుభదినమే. అతని కూతురు పుట్టినరోజు. మెట్ల సుబ్బారావులా భార్యంటే లోకువైనా, అందరు సామాన్య తండ్రులలాగనే కూతురంటే ప్రేమ. తన కోసం ఒక రెక్కలున్న ఏంజల్ కాస్ట్యూమ్ కొంటాడు. దాన్ని చూపిస్తూ పిల్ల గురించి చెప్తాడు. మనకు ఒక పక్క చిరాకు, మరోపక్క సానుభూతి మిక్సయిన ఫీలింగ్. ఇంతలో అతని స్నేహితుడు వచ్చి విడిపించుకుని వెళతాడు. వర్షం పడుతుంటుంది (సినిమా మొదటిసారి చూసేవాళ్ళకి ఓ డే-సు కథానాయకుడు అని చెప్పటానికి కాబోలు. హీరోలకు కష్టమొస్తే వాన పడాలి కదా). ఒక టెలిఫోన్ బూత్ వద్ద ఆగి ఇంటికొస్తున్నానని, తనకు బహుమతి తెస్తున్నానని సంతోషంగా చెప్తాడు. ఇంతలో భార్య రిసీవర్ అందుకోవటంతో పరిస్థితిని డిఫ్యూజ్ చేయటానికి పక్కింటి అన్నయ్య గారిలాంటి తన స్నేహితుడికి ఫోను అందించి బూత్ బైట నిలబడతాడు. క్షణంలో అంతా చీకటి. లేచి చూసేసరికి ఒక మాదిరి హోటల్ రూమ్ లో బందీగా ఉంటాడు. అది 1988.
ఈ డిటెయిలింగ్ అంతా అసలు ఓ డే-సు ఎవరు అనే కాదు. అసలు మానవ మనస్తత్వ లోతుల్ని చూపిస్తూ సాగుతుంది. సాగినంత కాలం తనను మించినవాడు లేడని అనుకుంటాడు. పోలీసుల ముందు తీన్మార్ వేసిన మన కథనాయకుడిలా. గట్టి ఎదురుదెబ్బ తగిలితే డీలా పడతాడు – పోలీసులు తమదైనశైలిలో సత్కారం చేశాక ఓ డే-సు లాగా.
మాంగాలో కథానాయకుడు గొటో కిడ్నాప్ కాబడ్డప్పుడు వయసు పాతిక. మాంఛి పీక్ లో ఉంటాడు. పెళ్ళి కాలేదు. గాళ్‌ఫ్రెండ్ ఉంటుంది. తనతో టెరేస్ మీద ఎన్జాయ్ చేసున్నప్పుడు తీసుకు వెళతారు.
ఇక సినిమాలో ఓ డే-సు మధ్యవయసు. సినిమాలో వయసు గురించి చెప్పరు (గుర్తు పెట్టుకోండి). కొరియన్ కల్చర్ చదివాక, మిత్రులతో మాటల మధ్య వారి దైనందిన లౌకిక జీవన విధానాలు తెలుసుకున్నాక అప్పటి లెక్కల ప్రకారం వారి వివాహాలు సాధారణంగా మగవారికి 30 ఉన్నప్పుడు జరిగేవని తెలిసింది. మనలాగనే చదువు, కెరియర్, సెటిల్మెంట్కు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చే కొరియాలో ముప్పై లోపు వివాహం గురించి ఆలోచించరు మగవాళ్లు. కూతురు వయసు అతను కిడ్నాప్ అయే సమయానికి నాలుగేళ్ళు. అంటే తక్కువలో తక్కువ కిడ్నాప్ అయినప్పుడు అతని వయసు 35.
పదిహేనేళ్ళ తరువాత వదిలి పెడతారు. అంటే యాభై దాటేస్తాడు. అదే మాంగాలో గొటోను పదేళ్ళకే వదులుతారు. అంటే 35 సంవత్సరాలు వస్తాయి. సమాజంలో తిరిగి ఇమడటం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ ఓ డే-సుకు అలా కాదు. అసలే మామూలు అతి సాధారణ వ్యక్తి. Typical middle class man. పదిహేనేళ్ళు జీవితం పోగా బైట పడేసరికే యాభై దాటతాయి. మాంగాతో పోలుస్తే దర్శకుడు పార్క్ చాన్-వుక్ కథానాయకుడికి different texture ఇవ్వటమే కాదు. ఒక ప్రత్యేక పర్పస్‌తో ఇస్తున్నాడు. మనం సాధారణంగా చూసే 2 dimensional character లాగా కాకుండా 3 dimensions తో ఒక సంపూర్ణమైన పాత్రగా మన ముందు ఆవిష్కరిస్తున్నాడు. నేను చెప్పకుండా వదిలేసిన ప్రోలోగ్ (సినిమాలో) తో కలిపి ఇంత వరకు తీసుకునే screen time కేవలం 10 నిముషాలు.
ప్రతి షాట్లో వాతావరణాన్నే కాదు, కథానాయకుడి మనఃస్థితిని, మానవ మనస్తత్వ లోతుల్ని ఆవిష్కరిస్తాడు దర్శకుడు పార్క్. మ్యూజిక్‌ను మూడ్ ఎలివేట్ చేయటానికి కాకుండా మనల్ని సినిమాలో క్రియేట్ చేసిన atmosphere లో బందీగా చేయటానికి ఉపయోగిస్తాడు. ఆ విజువల్స్ చూస్తూ, ఆడియో చేత ప్రభావితమౌతున్న మన మనస్సును, లైటింగ్ ద్వారా తన అధీనంలోకి తీసుకుంటాడు. తనకు అందుబాటులో ఉన్న ప్రతి వనరును కథ చెప్పటానికే కాదు, ప్రేక్షకుడిని మంత్రముగ్ధులను చేసి తను ఆడించినట్లు ఆడేలా చేసేందుకు వాడతాడు. అందుకే ఒకసారి సినిమా చూడటం మొదలు పెట్టాక ఆపటం సాధ్యం కాదు. అంతలా ప్రభావితం చేస్తాడు. One another entertaining action thriller Japanese manga Oldboy ఎక్కడ! పార్క్ చాన్-వుక్ తీసిన all time classic సినిమా Oldboy ఎక్కడ! ఈమధ్యే వచ్చిన కొండపొలం సినిమా పరిస్థితి మనకు తెలిసిందేగా.
ఇప్పుడొకసారి అసలు Oldboy సినిమా ఎలా మొదలౌతుందో చూద్దాం!
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ?
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య
2 Comments
Sridhar
గీతాచార్య, నేను ఇంతకు ముందు మీ ‘కొరియానం-1’ మీద కామెంట్ చేశాను దానికి ఇంకా సమాధానం రాలేదు. మీ ఎత్తుకున్న సబ్జెక్ట్ బావుంది కానీ మీ రచనా శైలి స్థిరంగా లేదు. పూర్తిగా చదవటానికి ఇబ్బందిగా ఉంది. మధ్యలో ఏమాత్రం సంబంధం లేని విషయాల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? మీరు serious గా ఒక విషయం మీద వ్రాస్తున్నపుడు sudden గా ఏ మాత్రం పరిచయం లేని వేరే topic తేవడం వలన మీ అసలు విషయం మీద ఆసక్తి పోతోంది. ఏదో కప్ప గెంతులలాగా ఉంది వ్యవహారం. నా సలహాలు, అభ్యంతరాలు మీరు పరిగణలోకి తీసుకుంటారు అని భావిస్తున్నా. కొరియన్ సినిమాల, ప్రపంచ సినిమాల అభిమానిగా మీ నుంచి మంచి ఆర్టికల్స్ రావాలని ఆశిస్తున్నాను.
గీతాచార్య
ముందుగా క్షమించాలి. నేను మీ వ్యాఖ్యలను ఆలస్యంగా చూశాను. మీ సలహాలు, అభ్యంతరాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాను. కొన్నిచోట్ల సబ్జక్ట్ కు సంబంధం లేని విషయాలు అనిపించినవి రాబోయే ఎపిసోడ్ కు రిఫరెన్సుల లాగా పనికొచ్చేవి. వాటికి రిజల్యూషన్ రాబోయే ఎపిసోడ్లలో వస్తుంది (ఉదా. ఆదాము, అవ్వ, Apple). కొన్నిచోట్ల నా రాతలో రఫ్ ఎడ్జ్ లు ఉన్నచోట సరిచేసుకుంటాను.