[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన శనగల అంజనీదేవి గారి ‘క్షణకాలం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


కృష్ణాజిల్లా, రావికంపాడు గ్రామం.
అది ఒక అందమైన పల్లెటూరు. ఆ వూరి సర్పంచ్ నరసింహభూపతి. అతని భార్య పార్వతి, ఒక్కగానొక్క కొడుకు ప్రణయ్ చిన్నతనంలోనే చనిపోయింది. ప్రణయ్‌ను తల్లి లేని పిల్లాడని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.
నరసింహం దగ్గర పాలేరుగా పని చేసే మల్లయ్య కూతురు స్వాతి, స్కూల్ లేని రోజులలో తండ్రికి తోడుగా నరసింహభూపతి ఇంటికి పనికి వచ్చేది.
చిన్నప్పట్నుంచి ప్రణయ్, స్వాతి, ఆడుకుంటూ పెరిగారు.
ఆ ఊరిలో కాలేజ్ లేకపోవటంతో పక్క ఊరి కాలేజ్‌కి ఇద్దరు కలసి వెళ్ళే వచ్చేవారు,
ఆ క్రమంలో ప్రణయ్, స్వాతి ఒకరంటే ఒకరు ప్రేమలో పడ్డారు. ఇద్దరు కలిసి ఆటలు, పాటలు. ఎన్నో ఊసులు బాసలు చేసుకున్నారు, జీవన ప్రణాళికలు, ప్రమాణాలు కూడా చేసుకున్నారు.
ఒక క్షణం కూడా ఒకరిని విడిచి మరోకరు ఉండలేనంతగా దగ్గరైపోయారు.
మన దేశంలో పేరుకుపోయిన కుల, మత ఆర్థిక వ్యవస్థలు వారిని కలవనివ్వవని ఆ చిన్న గుండెలకు తెలియదు,
ఆ నోట, ఈ నోటా నరసింహంకు వీళ్ళ ఇద్దరి ప్రేమ విషయం తెలిసి మల్లయ్యని పిలిపించాడు.
“అయ్యా, పిలిచారంట?” అన్నాడు మల్లయ్య వాలు కుర్చీలో కాలుమీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుని ఉన్న నరసింహం ముందు చేతులు కట్టుకుని నిలబడి.
“ఏరా మల్లయ్యా, నువ్వెంత, నీ బతుకెంత? నా దగ్గర కూలి పని చేసుకునేటోడివి, నిన్ను కూలి మనిషిగా కాక ఇంటి మనిషిగా చూసుకుంటే, ఏకంగా నా ఇంటికే ముప్పు పెట్టినావు కదా” అని బూతుల పంచాంగం విప్పేసరికి,
“అయ్యా! నీ కాలు మొక్కుతా, నాకు ఈ గొడవ తెలియదు” అన్నాడు మల్లయ్య.
“ఇక్కడే ఉంటే నువ్వు, నీ కూతురు గల్లంతు అవుతారు, నీ కూతురిని తీసుకుని ఈ ఊరు విడిచి వెళ్ళిపో,” అని బెదిరించాడు నరసింహం.
“అట్టనే అయ్య! నా కూతురుకి నేను సెప్పుకుంటాను.” అన్నాడు మల్లయ్య భయపడి.
“యాదగిరి ఆ పెట్టె పట్టుకురా” అని చెప్పి పెట్టెలో నుంచి కొన్ని నోట్ల కట్టలు తీసి అతని మొహం మీదకి విసిరాడు.
“ఈ డబ్బు తీసుకొని వేరే వూరికి పోయి పని చేసుకో, ఇక నువ్వు నీ కూతురు నా కంటికి కనపడకూడదు.” అన్నాడు నరసింహభూపతి.
“అట్టానే అయ్య” అంటు డబ్బు తీసుకుని ‘బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు, పెద్దోళ్ళతో పెట్టుకొని నెగ్గగలమా?’ అనుకుంటూ అక్కడ నుండి హాడావిడిగా వెళ్ళిపోయడు మల్లయ్య.
‘హమ్మయ్య’ అనే ఊపిరి పిలుచుకున్నాడు నరసింహభూపతి.
***
మల్లయ్యకి ముగ్గురు కూతుర్లు. పెద్ద కూతురు స్వాతి.
“పాపిష్టిదానా, ఎంత పని చేసావే?” అని స్వాతిని తిట్టి కొట్టి, “నేను చెప్పినది వినకపోతే ఇంటిల్లపాది తగలబడి చచ్చిపోతాము” అని భార్య మీద కూతుళ్ళ మీద కిరోసిన్ పోసాడు మల్లయ్య.
“నాన్నా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అమ్మనీ చెల్లెల్ని వదిలేయ్.” అని మల్లయ్య కాళ్లు పట్టుకొని వేడుకుంది స్వాతి.
నరసింహo ఇచ్చిన డబ్బులతో స్వాతిని మేనల్లుడు వీరబాబు కిచ్చి పెళ్లి చేశాడు మల్లయ్య.
***
స్వాతి కోసం ఎదురు చూస్తున్న ప్రణయ్‌కు, వాళ్ళు వూరు వదిలి వెళ్ళిపోయారు అని తెలిసింది, ఇదంతా తండ్రి చేసిన నిర్వాకం అని అర్థమైంది.
“మా ఇద్దరిని ఎందుకు విడదీసావు, స్వాతి తోనే నా జీవితం, స్వాతి లేకుండా నేను బ్రతకలేను, ఎందుకు ఈ పని చేసావు నాన్నా” అని తండ్రిని నిలదీశాడు ప్రణయ్,
“ఆ పిల్లకు నీకు సరిపడదు, కయ్యానికి అయినా వియ్యానికి అయినా సమవుజ్జీ కావాలి, ఈ పెళ్లి వలన వర్ణ సంకంరం నాకు ఇష్టం లేదు, నీకు మంచి పిల్లను చూసి పెళ్లి చేస్తాను.” అని కఠినంగా చెప్పి వెళ్ళిపోయాడు నరసింహం.
స్వాతి జ్ఞాపకాలు గుండెను పిండేస్తుంటే, తండ్రి మీద కోపంతో మద్యం దుకాణంకి వెళ్లి తాగుతూనే వున్నాడు.
చదువు వదిలేసి, పగలు రాత్రీ అని తేడా లేకుండా మద్యం మత్తులోనే మునిగిపోయాడు ప్రణయ్.
మద్యమద్యలో స్వాతి కోసం వెతుకుతూ ఊర్ల వెంబడి తిరుగుతూ, తాగుతూ పిచ్చివాడిలా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పడి దెబ్బలు తగిలించుకునే వాడు.
‘ఎంతో ప్రేమగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు చదువు మాని, మద్యానికి బానిసై ఎందుకు కొరగాకుండ పోయి ఊరిలో అప్రదిష్టపాలు చేశాడు.’ అని కుంగిపోయాడు నరసింహభూపతి.
పొలానికి వెళ్లి ఏదో ఆలోచిస్తూ వస్తున్న నరసింహభూపతి, రోడ్డు పక్కన బురదలో తాగి పడివున కొడుకుని చూసి కంగారులో స్కూటీ బ్యాలెన్స్ తప్పి సడెన్‌గా రోడ్డు మీద పడిపోయాడు. ఎదురుగా వస్తున్న లారీ అతని రెండు కాళ్ళ మీదుగా వెళ్ళిపోయింది.
ఆపరేషన్ చేసి రెండు కాళ్ళు తీసివేయటంతో నరసింహభూపతి మంచానికి అంకితమైపోయాడు.
మల్లయ్య చెల్లెలు లక్ష్మమ్మ, ఆమె భర్త శీనయ్య నర్సింహంని చూసుకోవటానికి ఒప్పించి పనిలో పెట్టారు బంధువులు.
“లక్ష్మమ్మా, నీ అన్న కూతురు కోడలిగా రావటానికి నాకు కులం గోత్రం, జాతి అడ్డం వచ్చాయి. నా అవసరానికి మీరే దిక్కయ్యారు. నేను మీకు చేసిన అన్యాయానికి నాకు చాలా సిగ్గుగా వుంది” అన్నాడు నరసింహం బాధగా.
“అంతే కాదు, హాస్పిటల్లో నీకు బ్లడ్ అవసరమైతే ఇచ్చింది కూడా శీనయ్యే” అన్నాడు తూలుతూ అక్కడికి వచ్చి ప్రణయ్.
“ఇప్పుడు ఏం చేస్తావు నాన్నా, నీ రక్తంలో తక్కువ జాతి వాళ్ళ బ్లడ్ కలిసింది ఏం చేస్తావ్?” అన్నాడు, మంచం మీద వున్న నరసింహ భూపతి మీద మీదకు కోపంగా వెళుతూ.
“అరేయ్! నాన్న చచ్చిన పామును ఇంకా చంపకురా.” అన్నాడు కళ్ళనీళ్లతో రెండు చేతులు ఎత్తి దణ్ణం పెడుతూ.
సింహంలా వుండే ఆయనను దీనస్థితిలో చూసి చలించిపోయాడు ప్రణయ్.
సర్పంచ్ పదవికి వేరే వారిని ఎన్నుకున్నారు.
పంటపొలాలు బీడువారిపోయి పంట దిగుబడి లేక, ఆస్తులు కరిగి పోయాయి.
తండ్రి కోసం తాగటం మానేసి, పొలం అమ్మి, పంటలకు అవసరమైన పురుగుల మందుల కొట్టు పెట్టాడు.
కొడుకు మళ్ళీ దారిలోకి రావటంతో సంబరపడిపోయారు నరసింహభూపతి.
***
ఒకరోజు వ్యాపారం పనిమీద హైదరాబాద్ వెళ్ళాడు.
అక్కడ పని చూసుకుని తిరిగి వస్తూ బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రణయ్. సన్నగా వర్షం మొదలైంది.
వర్షానికి గొడుగు అడ్డం పెట్టుకొని వచ్చి పక్కనే నుంచుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ముగ్గురు కుర్రాళ్లు ఆమె వెనకే వచ్చారు.
“నీకు అర్థమవుతుందా రాధికా? తడిసిన బట్టల్లో మస్తు హాట్‌గా వున్నావ్” అన్నాడు ఒకడు.
“రాధికా.. రాధికా..” అని ఏడిపించటం మొదలు పెట్టారు మిగిలిన ఇద్దరు.
ఆ అమ్మాయి తట్టుకోలేక దూరంగా వెళ్లి నుంచుంది. ఆ అమ్మాయి వెనుకే వెళ్ళబోయారు ముగ్గురు. షర్ట్ పట్టుకుని లాగి మొహం మీద గట్టిగా ఒక్కటి ఇచ్చాడు ప్రణయ్. వాడి ముక్కు పచ్చడి అయి రక్తం బొటబొటా కారింది.
అడ్డం వచ్చిన మిగిలిన దాన్ని కూడా పిడిగుద్దులు గుద్దుతో తలెత్తి చూసాడు.
తన వైపు ఆనందాశ్చర్యాలతో చూస్తున్న స్వాతిని చూసి షాక్‌తో నిలబడిపోయాడు.
అదే సందని ముగ్గురు తప్పించుకుని పారిపోయారు.
“స్వాతీ నువ్వేంటి ఇక్కడ?” అన్నాడు ఆశ్చర్యంగా.
“నేను ఇక్కడే ఒక చిన్న స్కూల్లో టీచర్‌గా చేస్తున్నాను” చెప్పింది.
“నీకోసం పిచ్చివాడిలా ఎక్కడెక్కడ వెతికానో తెలుసా?” అన్నాడు ఆమె చేయి పట్టుకుని ఆనందంగా.
“ప్రణయ్ చెయ్యి వదులు. అందరూ చూస్తున్నారు.” అని చెయ్యి విడిపించుకుంది.
“పద వెళ్దాం.” అన్నాడు అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ ఆమె చెయ్యి పట్టుకుని.
“రా అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం” అని బస్ స్టాప్‌లో ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరు.
“స్వాతి, ఎందుకిలా చేసావు? చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు?” అని అడిగాడు.
“ప్రణయ్, మా నాన్న చనిపోతాను అని బెదిరించి, బలవంతంగా మా బావతో పెళ్లి చేశాడు. నిన్ను మనసులో వుంచుకుని మా బావతో సంసారం చేయలేక, మా బావను వదిలి, ఇక్కడకు వచ్చి హాస్టల్లో ఉంటూ టీచర్‌గా చేస్తున్నాను.” అంది స్వాతి.
“ఇప్పటికైనా మించిపోయింది లేదు, మనం పెళ్ళిచేసుకుoదాం, నాన్నని నేను ఒప్పిస్తాను పద వెళ్దాం.” అని స్వాతిను ఇంటికి తీసుకుని వచ్చాడు.
స్వాతిను చూసి, ఆమె చేతులు పట్టుకొని “నా మూర్ఖత్వంతో మిమ్మల్ని దూరం చేసాను నన్ను క్షమించు తల్లీ.” అన్నాడు నరసింహ భూపతి కళ్ళనీళ్ళతో.
దర్జాగా ఎవరికి తలవంచకుండా వుండే నరసింహం మంచంలో రెండు కాళ్లు పోయి ఎముకలగూడులా పడి వుండటం చూసి కళ్ళనీళ్ళతో “అయ్యో, బాబుగారు, అలా అనకండి.” ఆంది బాధగా,
“బాబుగారు కాదు తల్లీ, మావయ్యా అని పిలువు. ఇప్పటికే జాతి, మతం అని మిమ్ములను విడతీసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది.” అన్నాడు నరసింహభూపతి.
మరుసటి రోజే పురోహితులను పిలిపించి ప్రణయ్, స్వాతిల పెళ్లికి ముహూర్తం పెట్టించాడు నరసింహo.
***
కావాల్సిన సామాగ్రి తేవడానికి సిటీకు వెళ్లాడు ప్రణయ్.
స్వాతి కోసం ఎర్ర పట్టుచీర కొని, ఆ చీరలో స్వాతిని ఊహించుకుని మురిసిపోయాడు.
‘స్వాతి కూడా వచ్చుంటే బాగుండేది. లక్ష్మమ్మ శీనయ్య ఏలూరు వెళ్లడం వలన స్వాతికి రావటం కుదరలేదు.’ అనుకున్నాడు ప్రణయ్.
చీరకు మ్యాచింగ్ గాజులు, పెళ్లికి అవసరమైన వస్తువులు, పువ్వులు పళ్ళు, పూల దండలు తీసుకుని, స్వాతితో తన పెళ్లి, జీవితాన్ని ఊహించుకుంటు ఆనందంగా ఇంటికి బయలుదేరాడు ప్రణయ్.
***
స్వాతి తండ్రి మల్లయ్య, బావ వీరబాబు కొందరు మనుషులతో నరసింహం ఇంటికి వచ్చి “ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తారు, పద వెళ్దాం” అని స్వాతిని మాట్లాడనీయకుండా నోరు మూసి లాక్కుని వెళ్ళిపోయారు.
మత్తు టాబ్లెట్ వేసుకుని నిద్రపోతున్న నరసింహ భూపతి వీళ్లను గమనించలేదు.
ఆనందంతో బైక్‌ను స్పీడ్‌గా నడుపుతూ ఇంటికి వస్తున్న ప్రణయ్, స్వాతిని బలవంతంగా తీసుకుని వెళుతున్న మల్లయ్య, వీరబాబు మనుషులు వీధి మలుపు తిరగటం గమనించలేదు.
స్వాతి స్వాతి అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చాడు, ఎక్కడ స్వాతి జాడ కనిపించకపోయేసరికి ఇంట, బయట వెతికి నరసింహాం దగ్గరకు వచ్చి ఆయనను లేపాడు.
“నాన్న స్వాతి ఎక్కడ?” అని అడిగాడు.
“లోపల ఉంటుంది చూడు” అన్నాడు చెప్పాడు.
మళ్లీ ఒకసారి ఇల్లంతా వెతికి, ఇది నరసింహం పనే అని గట్టిగా నిర్ణయించుకుని..
“స్వాతి ఎక్కడా? మళ్ళీ నువ్వే స్వాతిని ఏదో అని వుంటావ్. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి ఒప్పుకున్నట్లు నటించి, నన్ను పట్నం పంపించి నువ్వు స్వాతిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసావు.” ఆన్నాడు కోపంగా.
“అయ్యో ప్రణయ్ నేను ఎందుకలా చేస్తాను? ముందు స్వాతి ఎక్కడికి వెళ్ళిందో వెతుకు” అని అన్నాడు నరసింహభూపతి కంగారుగా పైకి లేవబోయి మంచం మీద నుంచి లేవలేక తన నిసహాయతకు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
“మొసలి కన్నీరు కార్చకు, నీకు కులం పిచ్చి, మతం పిచ్చి. కులమాతాలు ఉంటే చాలు నీకు కొడుకు ఆనందం అవసరం లేదు. నువ్వూ నీ కులం, మతం, పరువు ప్రతిష్ఠ అనుకుంటూ బ్రతుకు. నా స్వాతి లేని జీవితం నాకొద్దు.” అని కోపంగా బయటకు వెళ్లి తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు ప్రణయ్.
“నాన్నా, ప్రణయ్ ఆగు” అని అరుస్తూ ఏడుస్తూ మంచం మీద నుంచి కింద పడి కొట్టుకోవటం మొదలు పెట్టాడు నరసింహం.
***
“నాన్న ప్రణయ్ లేని జీవితం నాకు వద్దు. ప్రణయ్ లేనిది నేను బ్రతకలేను, నన్ను వదలండి.” అని చెప్పి, తనని లాక్కుని వెళుతున్న తండ్రి చేతిని విదిలించి కొట్టి, వెనుదిరిగి పరిగెత్తుకుని వచ్చింది స్వాతి,
“అయ్యో మావయ్య ఏమైంది?” అని కంగారుగా కిందపడి ఉన్న నరసింహంను లేపి మంచం మీద పడుకోపెట్టారు. స్వాతి, మల్లయ్య, వీరబాబు కలిసి
“మల్లయ్య, నన్ను క్షమించు, జాతి అహంకారంతో, ధన గర్వంతో నేను నిన్ను ఆ రోజున అవమానించాను, నాకు తగిన శాస్తి జరిగింది, వీరిద్దరికీ పెళ్లి చేసి నా తప్పును సరిదిద్దుకోవాలి.” అన్నాడు భూపతి మల్లయ్య చేతులు పట్టుకుని.
“అవును మావా. స్వాతికి కూడా ప్రణయ్ అంటేనే ఇష్టం, నేను ఇష్టం లేదు, మా మధ్య ఎటువంటి సంబంధం లేదు, వాళ్లిద్దరికీ పెళ్లి చేయటం మంచిది” అని చెప్పాడు వీరబాబు.
“మీరు అందరూ ‘అవును’ అన్న తరువాత, నేను ఇంకా ‘కాదు’ అని ఎలా చెప్తాను, మీ ఇష్టం” అన్నాడు మల్లయ్య.
***
ప్రణయ్ ఎంతకీ రాకపోవడంతో ప్రణయ్ గురించి అడిగింది స్వాతి, నరసింహoను.
“ఇంతకు ముందే ఇంటికి వచ్చి, నీ విషయం తెలిసి నా మీద కోప్పడి, మళ్ళీ హడావిడిగా బయటికి వెళ్లాడు, నీ కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏమో?” అని చెప్పాడు నరసింహ.
“అయ్యో!” అని ప్రణయ్ మొబైల్ కి ఫోన్ చేసింది స్వాతి. ప్రణయ్ ఫోన్ రింగ్ అక్కడే వినిపించింది,
“ఫోన్ ఇక్కడే వదిలేశాడు మావయ్య” అంది కంగారుగా.
“వస్తాడు లేమ్మా, కంగారు ఎందుకు? వాడికి కోపం వస్తే అలా ఊరంతా తిరిగి తిరిగి ఎప్పటికో ఇంటికి వస్తాడు.” అన్నాడు నరసింహ భూపతి.
స్వాతి మనసు ఎందుకో కీడు సంకించింది. “మావయ్య నాకు ఎందుకో కంగారుగా వుంది.” అంది ఏడుస్తూ.
“మేము వెతికి తీసుకొని వస్తాం.” అని వెళ్లారు మల్లయ్య, వీరబాబు.
***
ఈ విషయం తెలియని ప్రణయ్, ‘స్వాతి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నా స్వాతి ఇంకా నా దగ్గరికి రాదు, నేను బ్రతికి ఉండి దండగ నేను చనిపోవాలి. నా తండ్రి మళ్ళీ నన్ను మోసం చేశాడు. కులం మత జాతి బేధాలు మమ్మల్ని కలపనివ్వవు.’ అనుకుంటూ కృష్ణ బ్యారేజి దగ్గరకు వెళ్లి పైనుంచి నదిలోకి చూశాడు.
తనకేమి సంబంధం లేదన్నట్లు కృష్ణమ్మ బిలబిల పారుతూనే వుంది.
కళ్ళు మూసుకుని, “స్వాతి ఐ లవ్ యు” అని గట్టిగా అరుస్తూ నదిలోకి దూకేసాడు.
కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తున్న ప్రణయ్‌ను..
“నీకేం కాలేదు నువ్వు బాగానే ఉన్నావు. సమయానికి మా బావ నీ వెనకే నదిలోకి దూకి నిన్న రక్షించి ఒడ్డుకు తీసుకుని వచ్చాడు” అని ఆ రోజు జరిగిందంతా చెప్పింది స్వాతి.
***
పాల గ్లాస్ తీసుకుని లోపలికి వచ్చిన స్వాతి గ్లాస్ టేబుల్ మీద పెట్టి, చాప దిండు కింద వేసుకుని పడుకుంది.
“ఏయ్ స్వాతి, ఏమైంది నీకు ఈ రోజు మన ఫస్ట్ నైట్, నాకు చాలా ఆనందంగా ఉంది కులం, జాతి అని ఎన్నో అడ్డంకులు అన్నిటినీ దాటుకుని మన ప్రేమ గెలిచింది. విజయానికి సంకేతమైన దసరా, దీపావళి, సంక్రాంతి అన్ని పండగలు మనవే.” అని ఆనందంగా చెప్పకపోతూ ఉన్నాడు ప్రణయ్.
స్వాతి ఏమీ మాట్లాడకపోవడం చూసి “నీకు సంతోషంగా లేదా?” అన్నాడు ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని.
“లేదు పైగా చాలా కోపంగా వుంది.” అంది ప్రణయ్ చేతిని తోసివేస్తూ.
“అవునా! ఎందుకంత కోపం నామీద..” అన్నాడు ఆశ్చర్యంగా.
“ఏమి చేశావో నీకు తెలియదా? అంది కోపంగా.
“నేనేమీ చేశాను అబ్బా! నా బంగారం కదు దేని గురించో నువ్వే చెప్పు ప్లీజ్.” అన్నాడు ఆమె గడ్డం పట్టుకుని.
“క్షణికావేశంలో తమరు తీసుకున్న తప్పుడు నిర్ణయం గురించి.”
“నేనా?” అన్నాడు ఆశ్చర్యంగా.
“అవును నువ్వే, ఇప్పుడు ఆనందం, సంతోషం. దసరా దీపావళి చెడు మీద మంచి గెలిచిన సందర్భం విజయానికి నాంది అని కబుర్లు చెపుతున్నావు. రెండు రోజులు వెనక్కు వెళ్ళు, క్షణికావేశంలో నువ్వు నదిలో దూకినప్పుడు, నీకు ఎవరు సహాయం చేయలేదు, రక్షించలేదు. ఉహించుకో. అప్పుడు ఈ ఇల్లు ఎలా వుండేది. ఈ ఆనందాలు అప్పుడేమయ్యేవి. అవసానదశలో ఆదరిస్తావని ఆశ పెట్టుకున్న నీ తండ్రి, నిన్నే నమ్ముకున్న నేను నా పరిస్థితి ఎంటి? ఇప్పుడు పెళ్లి మండపం బజాబజంత్రీలతో సందడిగా వున్న ఇల్లు. అప్పుడేలా వుండేదో ఊహించుకో” అంది.
ఊహించుకోవటానికే భయం వేసింది ప్రణయ్‌కు..
“శ్మశాన నిశబ్దంతో ఉండేది. దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయి ఉండేవాళ్ళం. క్షణికావేశంలో నువ్వు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల వారిని అగాధంలో పడేసేది.” అంది కోపంగా స్వాతి.
“సారీ స్వాతి” అన్నాడు తల వంచుకుని.
“అర్థమయిందా క్షణికావేశంలో నువ్వు ఎంత తప్పు చేసావు. నువ్వే కాదు చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. క్షణికావేశంలో తన వాళ్ల గురించి కాకుండా ఆ క్షణంలో తనకు కావాల్సినదాని కోసo ప్రాణాలకు తెగిస్తున్నారు” అంది స్వాతి ఆవేదనగా.
***
కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది, ఎంతో భవిష్యత్తు ఉన్న యువత పని ఒత్తిడి, పరిమితి లేని కోర్కెలు.. చిన్న విషయానికే ఆవేశం, మనస్తాపానికి గురవ్వడం వలన అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
సమస్యలను తల్లిదండ్రులు, మిత్రులు ఆత్మీయులతో పంచుకోవాలి.
‘బతికియున్న శుభములు బడయవచ్చు.’
2 Comments
Sandhya Yellapragada
అవును. బ్రతికివుంటే సమస్యలు తీర్చుకోవచ్చు
Anjani devi
మీ ఆత్మీయ సమీక్షకు ధన్యవాదాలు అండి,
పిల్లలే కాదు కొందరు పెద్దలు కూడా తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని అర్ధాంతరంగా చాలిస్తున్నారు. ఇది బాధాకర విషయం.