[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]
ప్రథమాశ్వాసము – మూడవ భాగము
తే.గీ.॥
అన్ని కోల్పోయినను గాని అవనిలోన
మంచి మర్యాద లందున మించె జగతి
మాట యిచ్చిన ప్రాణముల్ మడయువరకు
దాని యందునె నిలబడు ధర్మమణులు. (31)
ఉ.॥
అందున పోలయాఖ్యుడను ఆయన సద్గుణమూర్తియై; సదా
నందపు తేజమై వెలుగు నాగమదేవికు పుణ్యమౌ ఫలం
బందున గల్గె నందనుడు బాలకుడై యిల బాగు మెచ్చగన్
పొందెను తల్లిదంద్రులను పూనిక తోడుత సంతసించగన్. (32)
కం.॥
మగబిడ్డ బుట్టినాడని
వగపేమియు లేక తండ్రి వనరని నెంచెన్
ఖగవాహను దయయిది యని
పగలెల్లను సంతసమున ప్రార్థన చేసెన్. (33)
తే.గీ.॥
ఇన్నినాళ్ళకు దైవంబు యిచ్చినట్టి
వరముగా నెంచి తమకును వాంఛితములు
దీర్చువాడని వారలు దిక్కులిందు
గనుచు నుండెను ప్రియమున గట్టిగాను. (34)
తే.గీ.॥
శుక్లపక్షంపు వెన్నెల సున్నితంపు
చందురుని వోలె బెరుగుచు సాగుచుండె
బోసినోటిన నవ్విన భూమి జనులు
మురిసిపడు చుండె యావూరి ముదిలంత. (35)
ఉ.॥
సాగరమందు వేటకును సాగిన ప్రోలయ వేగిరంబునన్
సాగుచు వచ్చు చుండెదన సర్వము దానని నమ్మి యంతటన్
వేగిర మందునే తిరిగి వెక్కస రీతిని వాని గాంచగన్
ఆగమమయ్యె నంతటను యా పసి బాలుని గాంచవేగమే. (36)
ఉ.॥
యాపదియేండ్ల బాలకుడు అంతట బోవను బళ్ళు లేక; పో
వంపనిపాట లేకయును వాహిని దీరము యిస్క భూములన్
యోపిక తోడ దిర్గుచును ఓపక దెప్ప తుప్పలందునన్
కాపును లేక వాడపుడు కారులు ప్రేలుచు దిర్గుచుండగన్. (37)
ఉ.॥
అప్పుడు వాని దండ్రి మరియాతని తెప్పల భాగ మేర్పరన్
చప్పుడు లేక సంద్రమున చాకిరి చేయగ బెట్టినాడు; వా
డెప్పుడు తెప్ప దీరమున కెళ్ళునొ బాలల చేరినాడగన్
యిప్పుడు దీని భారమును ఎట్టులనైనను మోప శక్యమే. (38)
తే.గీ.॥
చక్కని బాలరాజును మరి సంద్రమందు
మనసు లేకుండ పనులను మానకుండ
జేయు చున్నను మనసంత చెంత లేక
బలు విధంబుల బాధలు పడియెనాడు. (39)
తే.గీ.॥
అటుల బాలుడు బెరిగెను పటుతరముగ
సూనుడంతట యువకుడై శోభనముగ
ఎదిగె సంద్రాన చేపలు పొదువుకొనుచు
బెండ్లి యీడుకు వచ్చెను బేర్మి మీర. (40)
ఆశ్వాసాంత గద్యము:
ఇతి శ్రీ మద్వల్లంద్ర రాజవంశ రాకా సుధాకర విరాజిత కీర్తి కాంతాసముపార్జితులౌ, పట్టపు మత్స్యకార్వర్గ, ఆవలాన్వయ సంభూతులౌ, శ్రీ సీతలాంబా ఉపాసిత శ్రీ మస్తానయ్య కుమార రత్నంబగు, సహజ కవీంద్రులై వెలయు, శ్రీ వెంకట రమణ కవీంద్రుని విరచితంబగు కుసుమ వేదనా కావ్యము ప్రథమాశ్వాసము సర్వమూ సమాప్తము.
(సశేషం)

కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు.
సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు.
కం॥
గురువెవ్వరు నా కవితకు
గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్
గురువులు లేకనె నేనిట
ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.