[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన డా. మంగిపూడి వాణీ సుబ్రహ్మణ్యం గారి ‘లంకె బిందెలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. తెల్లవారలేదు. చుట్టూ చీకటిగా ఉంది. డిజిటల్ గడియారం మూడున్నర చూపిస్తోంది. కల మధ్యలో తెలివి వచ్చింది. దిండు వెనక్కి సర్దుకొని కూర్చున్నాను. మరోసారి కల గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాను. ఎవరో తవ్వుతున్నట్లు లీలగా గుర్తు ఉంది. మరేమీ గుర్తుకు రావడం లేదు.
అలా కూర్చునే నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మాటి మాటికీ అదే కల తలపుకు వస్తోంది. ఎక్కడో గునపాలతో నేల తవ్వుతున్నట్లు.. ఖణేల్.. ఖణేల్.. శబ్దం..
మెల్లగా సుషుప్తిలోకి జారుకున్నాను.
ప్రొద్దుటే కాఫీ తాగుతూ వీధి వసారాలోని ఉయ్యాలలో కూర్చున్నాను.
“రవళీ! శంకరం ఫోన్ చేసేడు. శనివారమే వాళ్ళమ్మాయి పెళ్ళనే విషయం గుర్తుచేసేడు. తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పేడు. రామాపురం వెళదామా? పెళ్లికి వెళ్ళినట్లు ఉంటుంది, మన ఊరు చూసినట్లు ఉంటుంది. ఎన్నాళ్ళయిందో. నాన్న పోయాక ఆ ఊరితో సంబంధం పూర్తిగా తెగిపోయింది..” శ్రీవారు మార్నింగ్ వాక్ నుంచి వస్తూనే అన్నారు.
శంకరం మావారికి దూరపు బంధువు. తను కూడా మావారిలానే రామాపురంలో పుట్టి పెరిగేడు. మా మావగారు రామాపురం హైస్కూలులో హెడ్ మాస్టరుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసేరు. పెళ్ళికి వెళ్ళడమా మానడమా అన్నది మేం అప్పటికింకా తేల్చుకోలేదు.
“అలాగే వెళదాం. రెండు గంటల ప్రయాణమే కదా! సరదాగా లాంగ్ డ్రైవ్ మాదిరిగా ఉంటుంది. ఒకసారి మీ తాతలనాటి ఇల్లు కూడా చూసొద్దాం..” అన్నాను.
నాకొక ఆలోచన వచ్చింది. మా మావగారు మంచితనానికి మారుపేరు. ఇప్పటికీ రామాపురంలో అంతా ఆయనని తలచుకుంటూ ఉంటారని మావారంటూ ఉంటారు. ఆయన పేరుతో పూర్వీకుల స్థలంలో ఒక వృద్ధాశ్రమం కడితే, నలుగురికీ ఉపయోగపడుతుంది. నా ఆలోచన మావారికి చెప్పేను. ఆయనకు కూడా నచ్చింది.
మా మావగారు ఇల్లు అమ్మేసిన తర్వాత ఇల్లు కొన్న ఆసామీ అలానే వదిలేశాడు. కూతురు పెళ్లి పిలుపులకు శంకరం దంపతులు వచ్చినపుడు, ఆ ఇల్లు, స్థలం అమ్మకానికి వచ్చినట్లు చెప్పేరు.
మావారు రిటైరయ్యాక విజయనగరానికి దగ్గరలోనున్న ఒక లే-అవుట్లో ఇల్లు కట్టుకుని నివాసముంటున్నాం. రిటైరయ్యాక వచ్చినదానిలో కొంత ఫిక్సెడ్ డిపాజిట్లలోను, మిగతాది మ్యూచువల్ ఫండ్లలోనూ ఉంచగా వచ్చిన వడ్డీలతో ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది.
మా అబ్బాయి, అమ్మాయి పెద్ద చదువులు చదివి, పెళ్ళిళ్ళయ్యాక విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పర్మనెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేస్తామనీ, తమతోబాటే ఉండమనీ కొడుకూ, కోడలూ ఎంత పోరినా మావారు వినిపించుకోలేదు. శరీరం దృఢంగా ఉన్నంతవరకు, మా పనిపాటలు చేసుకోగలిగినంత వరకు మన దేశంలోనే కాలం వెళ్ళబుచ్చాలని ఆయన ఆలోచన.
విశాఖపట్నం నగర శివార్లలో మావారు ఉద్యోగం చేసే సమయంలో ప్రావిడెంటు ఫండు లోను తీసుకుని మూడువందల చదరపు గజాల జాగా కొన్నాం. దాని రేటు కూడ ఇప్పుడు బాగానే ఉంది. అవసరం అయితే అది అమ్మి రామాపురంలో మా మావగారి ఇల్లు కొందామని ఆలోచన.
ఆ రాత్రి మా పిల్లలకి వీడియో కాన్ఫరెన్సులో నాకు వచ్చిన కల గురించీ, లంకె బిందెల గురించీ, ఆ స్థలం కొనాలనే మా కోరిక గురించీ తెలియజేసేను.
“ఏంటమ్మా, నువ్వు మరీను. ట్వెంటీ ఫస్ట్ సెంచరీలో కూడా ఇలాంటివన్నీ నమ్ముతావు. లంకె బిందెలు దొరుకుతాయని మటుకు నమ్మకాలు పెట్టుకోకు” మా అబ్బాయి, అమ్మాయి ముక్తకంఠంతో అన్నారు.
***
శంకరం అమ్మాయి వివాహలగ్నం రాత్రి ఎనిమిది గంటలకు. లగ్నం అయిపోయిన వెంటనే భోజనాలు చేసి మళ్లా రాత్రికి గూటికి చేరుకుందామని ప్లాను.
ఉదయాన్నే టిఫెన్లు కానిచ్చి, కారులో బయలుదేరాము. కార్తీక మాసపు చల్లదనం హాయినిచ్చింది. ప్రయాణం అలసటలేకుండా సాగింది.
మేము వివాహవేదిక చేరుకునేసరికి పదిన్నర దాటింది. వివాహం ఒక ఫైవ్ స్టార్ రిసార్టులో అవుతోంది. పల్లెటూర్లో రిసార్టులేమిటని ఆశ్చర్యపోనక్కరలేదు. పట్టణాలలో విసుగెత్తిపోయిన వారికి ఇటువంటి రిసార్టులు భూమిమీద స్వర్గాల్లా అనిపిస్తాయి. ధనవంతుల అభిరుచులను, బలహీనతలను క్యాష్ చేసుకోడానికి సాధనాలుగా ఈ రిసార్టులు వెలుస్తున్నాయనిపించింది నాకు. వైద్యవృత్తిలో పుష్కలంగా సంపాదించిన శంకరం ఇటువంటి ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో కూతురి పెళ్లిచేయడం విశేషంకాదు.
రామాపురం పల్లె కంటే పెద్ద, పట్టణం కంటె చిన్నగా ఉంటుంది. రిసార్టు ఊరికి చివరిలో, పచ్చని చేలమధ్య ముచ్చటగా ఉంది.
మేము కారు దిగేసరికి శంకరం స్వయంగా వచ్చి మమ్మల్ని పలకరించి, మాకోసం కేటాయించిన కాటేజీకి తీసుకుని వెళ్ళి వసతులన్నీ చూపించేడు.
“వేణూ, మీరంతా కొంచెం రిఫ్రెష్ అయి, కళ్యాణ మండపానికి వచ్చెయ్యండి. కత్తెరా, స్నాతకం ఇప్పుడే మొదలయ్యాయి. మధ్యాహ్న భోజనానికి ముందే పెళ్లికుమారుడి కాశీప్రయాణ కార్యక్రమం అవుతుంది. ఏదైనా అవసరం అయితే నాకు ఫోను చేయి.”
“అలాగే, శంకరం. మధ్యాహ్నం భోజనాలయ్యాక మా తాతగారి ఇల్లు చూసి వస్తాం. అమ్మకానికి పెట్టేరన్నావు కదా!” అన్నారు మావారు.
“అవునులే. ఆ ఇంట్లో లంకెల బిందెలున్నాయని అందరూ చెప్పుకుంటారు. కానీ, ఒక్క బిందెయినా ఎవరికీ దొరికినట్టు దాఖలాలు లేవు. ఆ యిల్లు కొనుక్కున్న సత్యమూర్తి మధ్యాహ్నం భోజనానికి వస్తారు. పరిచయం చేస్తానులే.”
శంకరం వెళ్లిపోయాక ఫ్రెషప్ అయి, కళ్యాణమండపానికి వెళ్ళేసరికి కాశీప్రయాణం అవుతోంది. తంతు పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటుతోంది. శంకరం దూరంగా పెళ్లికొడుకు తండ్రితో మాట్లాడుతున్నాడు. మమ్మల్ని చూసి రమ్మన్నట్లుగా చేయి ఊపేడు. మేమంతా అతని దగ్గరకు వెళ్ళేం.
“బావగారూ, ఇతను మా చిన్నతాతగారి మనుమడు వేణు, భార్య రవళి. వాళ్ళిద్దరూ పెళ్ళికి రావడం మా అదృష్టం..”
మమ్మల్ని కాబోయే వియ్యంకుడికి పరిచయం చేసేడు శంకరం.
ప్రతినమస్కారాలయ్యాక, “నేను, వేణు ఈ ఊళ్లోనే కలిసి చదువుకున్నాం. తను మేథ్స్‌లో జెమ్..” మావారి గురించి శంకరం గొప్పగా చెబుతుంటే కొంచెం గర్వంగా ఫీలయ్యాను.
భోజనంచేసే సమయంలో మా దగ్గరకు శంకరం ఒక ఆసామీని తీసుకొచ్చాడు.
“వేణూ, నీకు చెప్పేనుగా! ఈయనే సత్యమూర్తిగారు. మీ పాత ఇంటికి ప్రస్తుతానికి వీరే యజమాని. ఇల్లు, జాగా అమ్మే ఉద్దేశంలో ఉన్నారు. భోజనాలయ్యాక మాట్లాడుకోండి.”
నేను, మావారు భోజనం అయ్యాక వివాహం జరిగిన ఎ.సి. హాలులోకి వచ్చి కూర్చున్నాం.
సత్యమూర్తి గారు భోజనమయ్యేక మా దగ్గరకి వచ్చారు. మామావగారి ఇల్లు కొనడానికి మా ఆసక్తి తెలిపేం. ఒకసారి సైటుకి వెళ్దామన్నారు మావారు.
అప్పటికి మధ్యాహ్నం మూడవుతోంది. సత్యమూర్తి గారితో కాలినడకనే మా మావగారి ఇంటి స్థలం చేరుకున్నాం.
స్థలానికి నాలుగువైపుల ప్రహరీ గోడ – ఒకవైపు గోడకి గేటు అమర్చారు. సుమారు ఐదువందల గజాల జాగాలో విశాలంగా కట్టిన శిథిలమౌతూన్న పెంకుటిల్లు మా ముందు సాక్షాత్కరించింది..
మావారు ఉత్సాహంగా ముందుకి నడిచేరు. ఇంటిముందు ఖాళీ జాగా, ఇంటికి వెళ్ళేదారి అంతా తుప్పలతోనూ, పనికిరాని మొక్కలతోనూ నిండివుంది. నెమ్మదిగా తోవ చేసుకుంటూ ఇంటిదగ్గరికి వెళ్ళేం. వీధి ద్వారానికి తలుపులు లేవు.
మా ఆయనతోబాటే నేనూ లోనికి వెళ్ళాను.
“చూడు రవళీ! మా చిన్నప్పుడు నేను, తమ్ముడు ఈ వసారాలోనే ఆడుకునేవాళ్ళం.. ఇదుగో.. ఇది పిల్లల గది.. ఇది.. అమ్మా నాన్నగార్ల గది.. ఇది..” మావారి కళ్ళల్లో మెరుపు దాగలేదు.
మావారు ఇల్లంతా కలయ తిరుగుతున్నారు. తను పుట్టి పెరిగిన చోటు. మమకారం వీడలేకపొతున్నారు.
“వేణుగారూ, మీరు నమ్మరుగాని, ఈ పాత ఇంట్లో లంకెల బిందెలున్నాయని ఊళ్ళో చాలామందికి గట్టి నమ్మకం..” మా వెనుకనే వస్తున్న సత్యమూర్తి గారన్నారు.
“మరి, మీరు ఆ లంకెల బిందెలు తవ్వి తీసుకోలేదేం?” మావారు వెనక్కి తిరిగి నవ్వుతూ నావైపు చూసేరు.
“నేనెలాగూ ఆ ఇంటిని అమ్మేద్దామనే ఉద్దేశంతోనే కొన్నాను. ఆ సంపదేదో కొనుక్కొనేవాళ్ళకి చెందాలని ఆ ప్రయత్నం చేయలేదు.. మంచి ధర వస్తే అమ్మేద్దామనే ఊద్దేశ్యంతోనే ఇల్లు కొన్నది..”
“అయినా ఈ రోజుల్లో లంకె బిందెలు అవీ ఎవరు నమ్ముతారులెండి” అన్నారు మావారు.
“ఏభై ఏళ్ళ క్రితం మా నాన్నగారు ఈ ఇల్లు కొన్నారు. ఈ ప్రాపర్టీ విశేషమేమంటే – ఏవీ లిటిగేషన్లు లేవు. అమ్మిన పెద్దాయన ఒక్కరే కావడంతో ఏ తగాదాలు లేక ఆస్తి అంతా వారసత్వంగా ఆయనకే దక్కింది. ఎంతోమందికి సహాయం చేసేవారని ఆయనికి ఇప్పటికీ ఊర్లో చాలా మంచి పేరుంది. పాపం! ఆయన పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చడానికి ఈ ఇల్లు అమ్మవలసి వచ్చిందట..” సత్యమూర్తి చెబుతున్నది మా మావగారి గురించేనని స్పష్టంగా తెలుస్తోంది. మనసు చివుక్కుమంది.
తరువాత అతను తాను ఆ ఇల్లు కొన్నాక స్థలం నాలుగు వైపులా ప్రహరీగోడ కట్టించి, ఎంత పెట్టుబడి పెట్టిందీ, వివరంగా చెప్పేడు. ఇంటి విషయం బేరమాడకముందే ఈ విషయాలు చెప్పడంలో అతడి వ్యాపారదృష్టి అవగతమవుతోంది. ఆఖరికి తాను ఎంత ధరకి ఆ ఇల్లు అమ్ముతాడో చెప్పేడు.
ఆయన చెప్పిన ధర ప్రస్తుత మార్కెట్ ధరకి రెండింతలు ఉంది. మావారు నిరుత్సాహ పడ్డారు. ఎంతో బేరమాడితే పది శాతం ధర తగ్గిస్తానన్నాడు. అదికూడా మా అంచనాలకంటే, చాలా ఎక్కువే.
ఏ సంగతీ ఆలోచించుకొని తెలియజేస్తామని, వారం రోజులు గడువు అడిగాము. ఆయన సరేనని తన బిజినెస్ కార్డు ఇచ్చేడు.
సాయంకాలం ‘తోట సంబరం’లో శంకరాన్ని కలిసినపుడు జరిగిన విషయం చెప్పేం. అతను కూడా మార్కెట్ ధర కంటే ఎక్కువ ఇవ్వడం అనవసరం అన్నట్లు మాట్లాడేడు.
ఆ రోజు పెళ్లి జరిగినంతసేపూ మా ఆయన నిరుత్సాహంగానే ఉన్నారు.
పెళ్లి ముహూర్తం వరకు ఉండి, వధూవరులను ఆశీర్వదించి, భోజనాలయ్యాక బయలుదేరాము. కారు నడుపుతున్నంతసేపూ మావారు అన్యమనస్కంగానే ఉన్నారు. బరువెక్కిన మనసులతో మేము ఇంటికి చేరుకునేసరికి అర్థరాత్రి దాటింది.
***
రామాపురం నుండి తిరిగివచ్చిన మరునాడే ట్రిప్పు విషయాలు వివరంగా పిల్లలకి చెప్పేను. పాత ఇంట్లో తిరుగుతూ మావారు పొందిన ఆనందాన్ని పిల్లలకి వివరించాను. పిల్లలతో మాట్లాడిన విషయం మావారికి తెలియదు. నిరాశావలయం నుండి బయటకి రావడానికి మావారికి మూడు నాలుగు రోజులు పట్టింది. తాతలనాటి సంపద మాకు ప్రాప్తం లేదని అనుకున్నాము.
రోజులు గడుస్తున్నాయి. కార్తీకమాసం వెళ్ళగానే మార్గశిరమాసం చలిని తెచ్చింది. చలిదేశాల వలస పక్షులు కొల్లేరు సరస్సు చేరుకుంటున్నాయి. డిసెంబరు నెలలో పిల్లలు క్రిస్మసు సెలవలకి వస్తారు.
ఇంకొక పది రోజులలో ఆస్ట్రేలియా నుండి అబ్బాయి, కోడలు, మనవడు వస్తారు. రెండు రోజుల తరువాత అమ్మాయి, అల్లుడు, మనవరాలు వస్తారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసే హడావిడిలో దంపతులమిద్దరం రామాపురం ఉదంతం మర్చిపోయాం. పిల్లలు, వాళ్ళ కుటుంబాలు వస్తే సరిపోడానికి వీలుగా మొదటి అంతస్తులో అన్ని వసతులతోనూ గదులు కట్టించేం. మనవలు ఆడుకోడానికి డాబామీద స్విమ్మింగుపూలు చిన్నది ఏర్పాటు చేసేం. వాళ్ళుండే మూడు వారాలూ మాకు క్షణం తీరిక ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత క్షణమొక యుగంలా ఉంటుంది.
ఆరోజు శనివారం. పిల్లలు రావడానికి ఇంకా నాలుగురోజులే సమయం ఉంది. ఆ రాత్రి మా అబ్బాయి వీడియో కాల్ చేసేడు. మావారు నా పక్కనే సోఫాలో కూర్చున్నారు.
“అమ్మా! నీకు, నాన్నగారికి ఒక సర్ప్రైజ్!”
“ఏవిట్రా అది?” అమాయకంగా అడిగారు మావారు.
“రామాపురంనుండి మీరిద్దరూ తిరిగివచ్చాక నువ్వు వివరాలన్నీ చెప్పేవు కదమ్మా. తరువాత నేను, మీ కోడలు ఈ విషయం ఆలోచించేం. తర్వాత చెల్లితో కూడా మాట్లాడేము. ఆఖరికి, ఆ ప్రాపర్టీ ఎలాగైనా కొనాలని నిశ్చయించేం..” అంటూ ఏ విధంగా సత్యమూర్తి గారిని సరియైన ధరకి ఒప్పించిందీ వివరంగా చెబుతుంటే అవాక్కయ్యాం మేం.
“ఇల్లు మీ పేర రిజిస్ట్రేషనుకి ఏర్పాట్లన్నీ అయిపోయేయి. మేమంతా అక్కడికి వచ్చాక, మంచిరోజు చూసుకుని రిజిస్ట్రేషను, తర్వాత వృద్ధాశ్రమానికి శంకుస్థాపన.. మేమక్కడ ఉండగానే చేసేసుకుందాం..” తర్వాత వాడు చెబుతున్నది వినిపించడంలేదు.
మావారి ముఖంలోని మార్పులు – నిర్లిప్తత నుండి ఆనందాతిశయం – గమనిస్తున్న నేను, లంకె బిందెలకన్న మిన్న అయిన పెన్నిధి పిల్లల రూపంలో ప్రసాదించినందుకు భగవంతునికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.