‘ఆక్రోశ్’ (హిందీ/ఆర్ట్)
లహణ్య కథ ముగింపు అప్పటి 1980ల నాటి స్త్రీపాత్ర చిత్రణలకి అద్దం పడుతుంది. ఇది మళ్ళీ లహణ్య పాత్ర చిత్రణ పట్ల ప్రశ్నలు రేకెత్తించేలా వుంటుంది. ఖచ్చితంగా లహణ్య ఈ ముగింపుని మనసులో పెట్టుకుని అలా కేసులో నోరు విప్పకుండా ప్రవర్తించి వుండడు. ముందేం జరుగుతుందో అతను వూహించే అవకాశం లేదు. తన తండ్రి మరణిస్తాడనీ, ఆ చితికి తను నిప్పంటిస్తున్నప్పుడు, అక్కడున్న పోలీసులు తన చెల్లెల్ని కామదాహంతో చూస్తారనీ, అప్పుడా చెల్లెల్ని నరికి చంపెయ్యాలనీ, దివ్య దృష్టితో ముందే చూసి, ముందస్తు పథకం వేసుకుని, కేసులో నోరువిప్పని మొండితనంతో వుండి వుండడు. కథకి ఈ ముగింపు నివ్వాలని నోటికి తాళం వేసుకుని వుండడు. ముగింపు అతడికి తెలీదు. తెలిసిందల్లా జెడ్పీ చైర్మన్, అతడి దోస్తులు తన భార్య మీద అత్యాచారం జరిపి చంపారనే. దీంతో ఈ పోలీసు – కోర్టు విచారణ అంతా కాదు, అసలు వాళ్ళని పట్టుకుని చంపెయ్యాలనే కసితోనే, కేసులో తనకేమైనా ఫర్వాలేదని సహకరించడంలేదని స్పష్టమవుతూ వుంటుంది కథనంతో.




మరాఠీ ‘సైరాట్’ లో పిల్లవాడి రక్తపు పాద ముద్రలతో ముగింపు దృశ్యం (క్లోజింగ్ ఇమేజి) ఎలా డిస్టర్బింగ్‌గా వుంటుందో, అంత డిస్టర్బింగ్ గానూ లహణ్యతోనూ వుంటుంది – అయితే అర్థరహిత ముగింపులా, వేరే అర్థాలొచ్చే చిత్రణగా వుంటుంది.
కోర్టు విచారణ కొనసాగుతూండగానే, లహణ్య తండ్రి మరణిస్తాడు. అంతక్రియలకి పోలీసులు లహణ్యని తీసుకుని పోతారు. అక్కడ పేర్చిన చితి చుట్టూ బిడ్డ నెత్తుకుని ఏడుస్తూ లహణ్య చెల్లెలు, కొందరు గూడెం వాసులు, లాయర్ భాస్కర్ వుంటారు. చితికి నిప్పంటిస్తూ లహణ్య పోలీసుల వైపు చూస్తే, వాళ్ళు గుటకలేస్తూ చెల్లెల్ని చూస్తూ వుంటారు. దాంతో రగిలిపోయిన లహణ్య చెల్లెలి మీద దాడి చేసి చంపేస్తాడు.


మొదటి కేసులో వున్న హత్యారోపణలకి రెండో కేసులో చెల్లెలి హంతకుడుగా ప్రత్యక్షంగా దొరికి పోయాక, మొదటి కేసు అతడి మీద అన్యాయంగా రుజువయ్యేందుకు ఇక అడ్డేమీ లేకుండా పోయింది. లాయర్ భాస్కర్ ఈ రెండో కేసు కూడా పోరాడేందుకు సిద్ధపడతాడు. గురువు దొసానే నిస్సహాయత వ్యక్తం చేస్తాడు. భాస్కర్‌కి యాక్సిడెంట్ జరిగే అవకాశాన్ని హెచ్చరిస్తాడు. అడవిలో కన్పించిన ‘అన్న’ యాక్సిడెంట్ లోనే పోయాడు. ‘అయితే నేను కూడా యాక్సిడెంట్లో పోతే నా కేసు కూడా రుజువు చెయ్యరా మీరూ? ఒక ఆదివాసిగా అన్నీ సహిస్తూ వుంటారా?’ అంటాడు భాస్కర్. ‘సహించక తుపాకీ తీసుకోవాలా? పిచ్చిగా మాట్లాడకు! ఆడవాళ్ళతో ఇలా జరుగుతూ వస్తోంది…’ అంటాడు దొసానే. సరేనని కోపం అణుచుకుంటూ వెళ్ళిపోతాడు భాస్కర్.


గోవింద్ నిహలానీయే ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన వాస్తవిక కథా చిత్రానికి సంగీతం అజిత్ వర్మ.
సికందర్ ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్. సినీరంగానికి చెందిన అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉన్న విశ్లేషకుడు. ఎన్నో పత్రికలలో భారతీయ, అంతర్జాతీయ సినిమాలను విశ్లేషిస్తుంటారు. వీరు నిర్వహించే “సినిమా స్క్రిప్ట్ అండ్ రివ్యూ” అనే బ్లాగు ప్రసిద్ధి చెందినది.