పొద్దున్నే మంచిపనిలో ఉన్నప్పుడూ, సీరియస్‌గా ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడూ నా మొబైల్ మోగితే నేను తియ్యను. ఈ మొబైల్‌తో ఉన్న సుఖం ఇదే. ఎవరు చేసేరో తెలుస్తుంది కనక మనం తీరుబడిగా ఉన్నప్పుడు మనమే చేసి సంగతేవిటో కనుక్కోవచ్చు. కానీ అదేవిటో మా ఇంట్లో పనిమనిషీ, మా అమ్మని దగ్గరుండి చూసుకునే పంకజం, మాకు రోజూ కూరలూ, కావల్సిన సరుకులూ పట్టుకొచ్చే శంకరం అస్తమానం ఆ మొబైల్‌ని చెవికి అతికించుకునే ఉంటారు.
మా పనిమనిషి వనజ పదిళ్ళలో చేస్తుంది. వనజ వచ్చి పని మొదలు పెడుతుందో లేదో, ఆమె మొబైల్ మోగుతుంది. అంతే, వెంటనే చేతిలో చీపుర్ని మరో చేతిలోకి మార్చుకుని, మొబైల్‌ని చెవికీ, చెంపకీ మధ్య అతికించేసుకుంటుంది. ఇంకక్కణ్ణించి మొదలు ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్ని ఫోనులు వస్తాయో తనకి. అలా మాట్లాడుతూనే గిన్నెలు కడిగేస్తుంది, ఇళ్ళు తుడిచేస్తుంది, బట్టలు కూడా పిండేస్తుంది. కానీ ఫోను మటుకు వదలదు. ఆ గిన్నెలకి జిడ్డు పోయిందో లేదో దాని కక్కర్లేదు. గది మూలలదాకా చీపురు వేసిందో లేదో దానికి పట్టదు. బట్టలు గట్టిగా పిండిందో లేదో దానికి అనవసరం. ఎందుకంటే దాని దృష్టంతా ఫోన్లో మాట్లాడే మాటల మీదే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పేనో మాట్లాడుతూ పని చెయ్యొద్దని. వింటేగా. దృష్టి పెట్టి చెయ్యని పనులు ఎలా ఉంటాయో ఈ వనజ చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ఒక్క గిన్నెకీ జిడ్డు పోదు. ఇంట్లో దుమ్ము ఏ మూల కామూల అలాగే ఉంటుంది.
అసలు అంత పనిచేస్తూ మాట్లాడవల్సిన మాటలేముంటాయా అనుకుని, ఓ రోజు వనజ మాట్లాడుతుంటే తప్పని తెలిసీ కూడా శ్రధ్ధగా విన్నాను. ఇవిగో ఇవే …
ఫోన్ మోగుతుంది. వెంటనే మొబైల్ ఆమె చెంపకీ చెవికీ మధ్య చేరిపోతుంది. అస్సలు ఆలస్యం చెయ్యకుండా మొదలెడుతుంది మాటలు..
“ఆ.. సెప్పవే.. ఆ ఏపసెట్టింటో పనా.. యాడయిందీ.. ఇప్పుడు పోవాలే. ఈ తెల్లమేడమ్మ ఆపీసుకి పోద్ది గదా.. ముందు ఆడికి పోయినా. ఆళ్ళింటో కాపీసుక్కైనా ఇయ్యరు గదా! అందుకే ఆడ్నించి తెల్లకారామె ఇంటికి పోయినా.. ఇయాళ ఆమె ఇంట్ల లేదు. యాడికి పోయిందో ఏమొ గాని నాకు కాపి గాని, టీ గాని ఇచ్చెటోళ్ళు లేకపోయిరి. అట్నించి ఆ సత్యవతమ్మ ఇంటికి పోయినానా.. ఆయమ్మ ఈయేల వాషింగ్ మిసీను పెట్టి బండెడు బట్టలు ఆరేయించింది మిద్దెపైన. నాకేమొ యాష్టొస్తంది. నోరిప్పి కాపీ ఇమ్మని అడగలేనాయె..” ఇలా సాగిన ఆ వాక్ప్రవాహాన్ని వింటుంటే వెంటనే కాఫీ చేసి వనజకి ఇవ్వకపోతే మాట దక్కదనిపించి వంటింట్లోకి పరిగెట్టేను.
తీరుబడిగా కూర్చుని నేనిచ్చిన కాఫీని వనజ ఆస్వాదిస్తూ తాగుతుంటే మళ్ళీ ఆమె మొబైల్ మోగింది. వెంటనే మళ్ళీ అది చెవికీ, చెంపకీ మధ్య చేరిపోయింది.
“ఏటే నాగరత్నం.. నిన్నగూడా సేసినావు గదా.. నువ్వరుసుకోమన్నది అరుసుకున్నాను. ఇప్పుడైతే ఇస్కూల్లో సీట్లు లేవంట. బాబ్బాబూ, మాకు బాగ్గావల్సినాల్లండీ.. ఏడనో ఓకాడ కూకుంటదీ అని బతిమాలితే ఇస్కూలు మొదలైన జూన్ నెల కాణ్ణించీ పీజులు కడితే ఏదైనా సూస్తామన్నాడా బాబు. అయినా నాగరత్నవా.. అప్పుడే సెప్పినాగదా నీకు, నీ అత్త మాటిని ఆ గవర్నమెంటు బళ్ళో ఎయ్యకే పిల్లనీ, ఎందుకూ పనికిరాదూ అని.. విన్నావుగాదు. ఏం సేస్తాం.. మరి జూన్నెలనించీ పీజు కట్టేమాటయితే సెప్పు ..” అంటూ ఫోన్ పెట్టేసింది. వార్నాయనో.. ఈ వనజ ఇలాంటి మధ్యవర్తిత్వం కూడా చేస్తుందా అనుకుంటూంటే మళ్ళీ ఫోనూ, మళ్ళీ అది చెంపకీ, చెవికీ మధ్య అతుక్కుపోవడం జరగగానే ఇవీ మాటలు..
“ఆ.. సెప్పు పిన్నీ, ఏటీ.. అప్పుడేనా.. అంత బక్కగుంటుంది.. సర్లే.. ఏం సేస్తాం.. మరి తానంరోజు సుట్టాలందర్నీ పిలవాలిగదా! అవునవును.. మొన్న మా పిల్లకి సేసానుగదా.. పుటోలు ఎంత బాగ వచ్చినయ్యో.. అంతా కలిపి పాతికేలైంది..” చెపుతున్న వనజ మాటేమో కానీ వింటున్న నాకు గుండె గుభేలుమంది. పాతికవేలా.. నేనసలు అలాంటి పేరంటం చేస్తానా! అన్ని డబ్బులు ఖర్చు పెడతానా.. తల్చుకుంటుంటేనే గాభరా వేసింది. ఇంక ఫోన్ లో వనజ ఏం మాట్లాడుతోందో వినడం నా ఆరోగ్యానికి మంచిది కాదనుకుంటూ అక్కణ్ణించి లేచి వెళ్ళిపోయేను.
జీ ఎస్ లక్ష్మి హాస్య ప్రియురాలు. నవ్విస్తూనే చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శిస్తారు, నవ్వుతూనే కొరడాతో కొట్టినట్టు. వీరి కథలు పలు బహుమతులను పొందాయి. వీరు కథల సంకలనాలను ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™