[ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రచురించిన ‘మార్పు’ వ్యాస సంకలనాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ సిలివేరు లింగమూర్తి.]
చతుర్విధ కళలలో సాహిత్యానికి పెద్ద పీట వేశారు భారతీయులు. ‘మార్పు’ వ్యాస సంకలనంలో అతిరథ మహారథులనదగిన కవులు/రచయితలు 62 మంది వివిధ అంశాలు గురించి వివిధ కోణాలలో రాసిన వ్యాసాలున్నాయి. ఏ కాలంలోనైనా ‘మార్పు’ అనేది అనివార్యం. సమాజం లోని వివిధ రంగాలలోని ‘మార్పు’ ప్రభావం సాహిత్యంపై ఎలా చూపించిందో తెలియజేసే మంచి ప్రయత్నం ఈ పుస్తకం.
6వ ప్రపంచ రచయితల మహాసభల సంకలనమైన ఈ ‘మార్పు’ సంచలనం సృష్టించిన రచనగా చెప్పవచ్చు. మొదటి వ్యాసంలో కవి దిగ్గజం ‘మండలి బుద్ద ప్రసాద్’ గారు సాంకేతిక మార్పుల వల్ల సాహిత్యంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయో, బింబ-ప్రతిబింబ భావం చక్కగా చూపించారు. మన పునాదులన్నీ ప్రాచీన సాహిత్యంలోనే వున్నాయని, సాంకేతికంగా ఎదిగే కొద్ది మనిషిలో మార్పు రావాలనీ, అది సాహిత్యం ద్వారానే సాధ్యమనీ, తెలియజేశారు. టెక్నాలజీకి అనుకూలంగా ‘మార్పు’ సాహిత్యరంగంలో రాకపోతే అరాచక శక్తులు బయలుదేరతాయన్నారు. ఎంత టెక్నాలజీ పెరిగినా పుస్తకం విలువ మారదన్నారు.
ప్రాచీన సాహిత్య అధ్యయనం నేడు అవసరం లేదని, అది నాయికల ఒంపుసొంపుల చుట్టూ, అల్లబడినదని చెప్పే వారికి సమాధానంగా అద్దంకి శ్రీనివాసరావు గారి వ్యాసం చదవితే ప్రాచీన సాహిత్యం ఎంత గొప్పదో, దాని విలువేమిటో అర్థం అవుతుంది. ఇక లగడిపాటి సంగయ్య గారి వ్యాసంలో, ఎవరికీ తెలియని ఏకలవ్యునికి కృష్ణునికి గల బంధుత్వం తెలుస్తుంది.
తల్లి గర్భంలో వున్నప్పుడే మాతృభాష మధురిమలు ఎలా రుచి చూపించాలి, తల్లితండ్రుల పాత్ర ఏమిటో చాలా చక్కగా వివరించారు సగిలి సుధారాణిగారు. ఇంజనీరింగ్, వైద్యం వృత్తి చదువుకున్న విద్యార్థులే అవధాన విద్యలో రాణిస్తున్నట్లుగా, అవధాన విద్యలోని లోతుపాతులను, అవధాన విద్య ఎలా ఏర్పడింది, అది తెలుగు భాషకే సొంతమైనదనీ, ‘అవధాన విద్య’ గురించి డా॥ పాలపర్తి శ్యామలా ప్రసాద్ గారు వివరించారు.
హిందీ పట్ల తెలుగు రచయితలకు గల సంబంధాల గురించి వ్రాసిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి వ్యాసం మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేటట్లుగా వుంది. అలాగే వెన్నా వల్లభరావు గారి వ్యాసం హిందీ సాహిత్యానికి తెలుగు వారు చేసివ సేవ గురించి వివరిస్తుంది.
వ్యవహారిక భాషాపదాలు ఎలా వచ్చాయో.. వివరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలో మార్పులు -సాహిత్యం మార్పులు రావాలని వివినమూర్తి గారి వ్యాసంలో చక్కగా వివరించారు. నిఘంటు నిర్మాణంలోని శ్రమను, తెలుగు పరిశోధనారంగంలోని అవకతవకలను తెలిపిన శ్రీ పెద్ది సాంబశివరావుగారి, శ్రీ వెలుదండ నిత్యానందరావు గారి వ్యాసాలు ఆలోచింపచేసేవిగా వున్నాయి. న్యాయస్థానాలలో, చట్టసభలలో, ప్రభుత్వ ప్రకటనలలో మార్పు రావాలనీ, ఆంగ్లంలో రావటం వల్ల వచ్చే ఇబ్బందులను నందివెలుగు ముక్తేశ్వరరావు గారు తమ వ్యాసంలో చక్కగా వివరించారు.
తెలుగు ఉచ్చారణలో లోపాలు అనేవి నేడు కొన్ని అక్షరాలను ఎగరగొట్టడం, వాడుక లేకపోవటం, తెలుగు పాఠాలు చెప్పేటప్పుడు ఆంగ్లపదాలు కలిపి చెప్పడం వంటి విషయాలు డా॥ జె. వి. సత్యవాణి గారు తన వ్యాసంలో బాగా వ్రాశారు. తెలుగు భాషలో అన్య భాషా పదాలు ఎలా వచ్చి చేరాయో చక్కగా తెలియజేసిన వ్యాసం డా॥ జి.వి. పూర్ణచందుగారు వ్రాసినది. యువతలో సాహిత్య అభిలాష గురించి, వారిలో సాహిత్యంపై అభిమానం పెంచే అంశాలు ఎలా వుండాలో అందంగా అందజేశారు డా॥ వంగర త్రివేణి గారు.
ఆకాశమార్గాన ప్రమాయాణిస్తున్న తెలుగు కవిత్వం, భూమార్గం పట్టిందనీ, అది ప్రవాహ సదృశ్యమంటూ అభ్యుదయ సాహిత్య వ్యాసంలో శ్రీ పెనుగొండవారు వ్రాసిన వ్యాసం బాగుంది. పద్యం తెలుగు భాష వున్నంత వరకే కాదు, గ్రహలు గతి తప్పినా సరే దానికి (పద్యానికి) మృతి లేదనీ, పద్యం యొక్క గొప్పతనాన్ని, వివరించిన డా. జి. విష్ణు ప్రసాద్ గారి వ్యాసం చక్కగా ఉంది. డా॥ రాధేయగారు – రేపటి తరాల కోసం మార్పు చెందవలసిన అవసరం వుందని, రకరకాల వాదాల కవిత్వ కోణాల్ని చక్కగా సృజించారు. జానపదగేయ లక్షణాలు, సంగీత స్వరూపం, శైలి, బాణీలను డా. కూర్మాచల శంకర స్వామి చక్కగా వివరించారు.
తెలుగు ప్రముఖ అంతర్జాతీయ స్థాయిలో ఎలా గుర్తింపు పొందినది, కావల్సిన మార్పుల గురించి డా. పెరుగు రామకృష్ణ గారు మంచిగా తెలియజేశారు. విమర్శ పోకడల గురించి డా॥ టేకుమళ్ళ గారి వ్యాసం మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది. చారిత్రక కాల్పనిక రచనలలో మార్పులు రావాలని కస్తూరి మురళీకృష్ణ గారి వ్యాసం చెబుతుంది. సైన్స్ ఫిక్షన్లో రావల్సిన మార్పుల గురించి డా. చిత్తర్వు మధు గారు బాగా వ్రాశారు. శ్రీకంఠస్ఫూర్తి గారి ‘కథ, కథనం’ వ్యాసం బాగుంది. హాస్య బ్రహ్మ శంకరనారాయణ గారి – ‘హ్యాపీ చిరాయువు’ చక్కని హాస్యాన్నందించింది. ఒక విభిన్నమైన తరహలో వ్రాసిన, తప్పక చదవవలసిన వ్యాసం శ్రీ సుధామ వ్రాసిన ‘మాములైన అలవాట్లు’.
గత చరిత్రలో విద్యార్థులు – గురువులు మధ్య సంబంధాలు ఎలా వుండేవి, ఇప్పుడు విద్యార్థులు టీచర్లు సంబందాలు ఎలా వున్నవి, ఎలా వుండాలన్నీ విషయం చక్కగా వివరించారు దుర్గా ప్రసాద్ గారు. ‘నేడు పుస్తక పఠనంలో రావల్సి మార్పులు’ వ్యాసం కూడా బాగుంది. నీరు లేకపోతే మనిషి మనుగడ కష్టమని తెలియజేసే సరికొండ రాజు గారి వ్యాసం చక్కగా ఉంది. అలాగే నీటిని గురించిన వ్యాసాలు పి.ఎం.ఎస్. ప్రసాద్; సిహెచ్. వెంకట రమణల వ్యాసాలు కూడా బాగున్నవి.
‘సంస్కృతిలో జానపద సాహిత్యం విలువ’ వ్యాసం బాగుంది. సాధారణ చరిత్ర, సాహిత్యచరిత్ర కలిపి నడవాలన్న వకుళాభరణం రామకృష్ణ గారి వ్యాసం మళ్ళీ చదవాలనిపించింది. చరిత్ర రచన, పరిశోధనలో రావల్సిన మార్పులు గురించి వ్రాసిన సవివర వ్యాసం ప్రారంభంలో తేలికగా అన్పించినా, మొత్తం మీద చాలా బాగుంది.
ఇక ‘సాంప్రదాయ నృత్యం నాడు నేడు’ వ్యాసంలో నేటి కంప్యూటర్ యుగంలో ఎలా వ్యాపారంగా మారిందీ, నాట్యం యొక్క తీరుతెన్నులు, గత వైభవం గురించి బ్రహ్మండంగా వ్రాశారు. వేలూరి సుభద్రా పార్థసారథి గారి వ్యాసంలో కూడా నాట్యాన్ని గురించి బాగా వ్రాశారు. తెలుగు నాటకాలలో పద్యం ఎవరు ప్రవేశపెట్టారు, తొలి తెలుగు విషాద రచయిత ఎవరు మొదలగు అంశాలు శ్రీ అత్తలూరి విజయలక్ష్మిగారు; మానవ మస్తిష్క వికాసానికి నాట్య కళ ఎంతో అవసరమని చెప్పే వ్యాసం కొడూరి సుమన గారు వ్రాశారు. పరిణామ క్రమంలో వచ్చే మార్పు కన్నా, మనిషి ఆలోచన, అభిరుచులలో వచ్చే మార్పులు చాలా వేగంగా వుంటున్నాయని తెలిపే డా॥ భూసురవల్లి వెంకటేశ్వర్లు గారు వ్రాసిన వ్యాసం – పాఠకుని ఆలోచింపచేసే విధంగా వుంది.
ఇంకా తెలుగు నాటక రంగంపై డా. దీర్ఘాసి విజయభాస్కర్, డా. పి.వి.ఎన్. కృష్ణ, వాడ్రేవు సుందరరావు గారి వ్యాసాలు బాగున్నవి. ‘ప్రజాకళారూపాలు – కొత్త ఆలోచనలు’ వ్యాసం కొత్తపల్లి రవిబాబుగారు పాఠకుడిని ఆలోచించే విధంగా వ్రాశారు. వీటన్నటికి భిన్నంగా ‘నాణెములు-స్టాంపుల సేకరణ’ వ్యాసం, యజ్ఞయాగాలు సైన్స్‌లో భాగమనిపించే వ్యాసం బాగా వ్రాశారు.
ఈ వ్యాస సంకలనం లోని చివరి రెండు వ్యాసాలు తెలుగు భాష ప్రాచీన హోదా గురించి, 50 ఏళ్ళ ప్రపంచ తెలుగు మహాసభల గురించి చదివి తెలుసుకొనదగినవిగా వున్నవి. ఇంకా మిగిలిన అన్ని వ్యాసాలు చదివి దాచుకోదగిన పుస్తకం ‘మార్పు’ వ్యాస సంకలనం.
***


సంపాదకులు:
డా. మండలి బుద్ధప్రసాద్, ప్రొ. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, శ్రీ గుత్తికొండ సుబ్బారావు, డా. జి.వి. పూర్ణచందు
ప్రచురణ: ప్రపంచ తెలుగు రచయితల సంఘం
పేజీలు: 472
వెల: 500/-
ప్రతులకు:
శ్రీ గజ్జల సత్యనారాయణ
విజేత బుక్స్,
విజయవాడ-3.
ఫోన్: 9848687652