కథలు చెప్పడం సులువే… కథలు రాయడం కూడ తేలికే… కాని మనసుకు హత్తుకొనే కథలు, మనిషిని కదిలించే కథలు రాయడం మాత్రం కష్థమే. లబ్ధప్రతిష్ఠులైన కథకుల మధ్య ఒక కథకుడిగా నిలబడాలంటే కత్తి మీద సామే. అందులోనూ విజయనగరం లాంటి వూర్లో ఒక కథా రచయతగా గుర్తింపు పొందాలంటే ఎంతో సామాజిక స్పృహ, మానవీయ దృక్పథం, సాంఘిక కట్టుబాట్లుపై అవగాహన వుంటే గాని కుదరదు. ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకొని కథారచనలో ఒక విలక్షణతను చూపించిన రచయిత బెహరా వెంకట సుబ్బారావు.
సుమారు 200కు పైగా కథలు రాసి వాసికెక్కిన వ్యక్తి. మధ్య తరగతి జీవన వైవిధ్యమే ఆయన కథలకు ముడిసరుకు. సంబంధ బాంధవ్యాలే ఆయన కథల్లో కనిపించే పాత్రలు. సులభమైన శైలి, ఉత్తరాంధ్ర నుడికారం సుబ్బారావు గారి కథలను ఇట్టే ఆకట్టుకుంటాయి. మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే జీవన సంఘర్షణ ఆయన అక్షరాలతో చిత్రించి చూపించారు. ఆయన రాసిన కథల్లో సుమారు వందకు పైగా వివిధ దిన, వార, మాస పత్రికల్లో ముద్రణకు నోచుకున్నాయి. వీటిలో వందకు పైగా కథలు వివిధ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి. 1950లో రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించిన సుబ్బారావు గారు చివరి వరకు కొనసాగించారు. 1970-80 ల మధ్య ప్రతీ వారం ఏదో ఒక వార పత్రికలో ఈయన కథ తప్పక కనిపించేది. డబ్బై, ఎనభై దశకాల్లో బెహరా వెంకట సుబ్బారావు పేరు ప్రతీ పాఠకుని నోట్లో నలిగేది. ఆంధ్ర సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిల్లో ఈయన కథలు ఎక్కువగా కనిపించేవి.
“ఒకవైపు మానవత్వం మందగిస్తుంటే, వేరొకవైపునుంచి నీతి నిజాయితీలు నిందిస్తుంటే, ఎంతటి దుర్మార్గుడైనా మాటకు కట్టుబడక మానడు, నైతిక విలువలకి పట్టుబడక మానడు”, “మనిషి కి విలువ లేదండీ, అతని మాటకే విలువ వుంటుంది” అంటూ ‘విలువలు’ అన్న కథలో సుబ్బారావు గారు మనిషి విలువలపైన, మాట కున్న ప్రాముఖ్యత పైన తనకున్న నమ్మకాన్ని వెలిబుచ్చుతారు. ఈ కథ 1984లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురితమయింది. శ్రీమతి మాదిరెడ్డి సులోచన ప్రథమ వర్ధంతి సంధర్భంగా నిర్వహించిన కథల పోటీలలలో ద్వితీయ బహుమతి పొందిన కథ ఇది.
ఉద్యోగ రీత్యా పోస్ట్ మాస్టర్‌గా పనిచేసిన సుబ్బారావు గారు విజయభావన ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆ ప్రసంగంలో పోస్ట్ మాస్టర్‌గా తనకెదురైన సంఘటనలే తన కధా వస్తువులని చెబుతారు. పూసపాటిరేగలో పోస్ట్ మాస్టర్‌గా వున్నప్పుడు పోస్టాపీసుకు ఒక ముసలమ్మ రోజూ వచ్చి అయ్యా నాకేమైన వచ్చాయేటి అని అడిగేదట. ఏమి రాలేదని చెబితే ముఖం చిన్నగ చేసుకొని వెళ్ళిపోయేదట. ఇలా రోజూ ఆమె అడగడం, ఏమీ రాలేదని చెప్పడం పరిపాటయ్యిపోయిందట. ఒక రోజు పాపం ముసలమ్మకు ఎవరైనా డబ్బులు పంపిస్తారేమో అందుకే ఇలా అడుగుతుందనుకున్న సుబ్బారావు గారు జేబులో కొంత డబ్బు తీసి ఆమెకివ్వబోయారట. ఆ ముసలమ్మ “బాబు డబ్బులొద్దు బాబు, నా కొడుకు నన్నొదిలి పట్నం ఎల్లి మూన్నెళ్ళు అవుతుంది. అక్కడెలాగున్నాడో, ఎమి తింటున్నాడో ఒక ఉత్తరం ముక్క వస్తాదని ఎదురు చూస్తున్నాను బాబు” అన్నాదట. ఆ సంఘటన నేపథ్యంలో ఆయన రాసిన కథ పాఠకునికి కన్నీరు తెప్పిస్తుంది. ఆ కథలో ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం, ఉపాధి కోసం వలసలెల్లే యువతరం, అమ్మానాన్నలు పిల్లల పై పెట్టుకున్న ఆశలు మనకు కనిపిస్తాయి. ఆ కథనం మన గుండెని పిండేస్తుంది.
మధ్య తరగతి ప్రజల జీవన పోరాటం, సామాజిక కట్టుబాట్లు, సాంఘిక దురాచారాలు సుబ్బారావు గారి కథా వస్తువులు. సమస్యను ఎత్తి చూపించడమే కాకుండా దానికి పరిష్కార మార్గాన్ని కూడా రచయితా ఆయన చూపిస్తారు. సులభమైన శైలిలో సాగే ఆయన కథలు పాటకుడిని ఇట్టే చదివిస్తాయి. కథ చదివిన తర్వాత పాఠకుడిని ఆలోచింపజేస్తాయి. అందుకే ఆయన కథలు తెలుగు సాహిత్యంలో చిరస్తాయిగా నిలచి పోయాయి.
పిల్లల కథలు రాయడంలో కూడా సుబ్బారావు గారిది అందెవేసిన చేయి. బాలజ్యోతి పిల్లల మాస పత్రిక లో వీరి నవల “దారి తప్పకు” ధారావాహికంగా ప్రచురించారు. ఈ నవల అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ నవల నేటి పిల్లలకు కూడ మార్గదర్శకంగా వుంటదని చెప్పుకోవచ్చు.


1935లో తూర్పు గోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించిన ఈయన 1958లో పోస్టల్ డిపార్ట్మెంట్లో వుద్యోగం సంపాదించుకున్నారు. అప్పటినుంచి విజయనగరం లోనే ఆయన జీవితం కొనసాగింది. డిపార్ట్మెంట్లో వివిధ హోదాలలో పనిచేసి 1993లో హెడ్ పోస్ట్ మాస్టర్‌గా కొత్తవలస బ్రాంచ్ నుంచి పదవీ విరమణ చేసారు. పోస్ట్ మాస్టర్‌గా తన వుద్యోగ నిర్వహణలో తనదైన ముద్ర వేసుకొని పోస్టల్ శాఖలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎన్నో సాహితీ సంస్థలు సుబ్బారావును సన్మానించాయి. 1998లో సుబ్బారావు గారు తుది శ్వాస విడిచారు.
9 Comments
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బెహరా సుబ్బారావు గారి
రచనల గురించి మీ సమీక్ష బావుంది.ఒకానొక కాలం లో ఆయన కథలు
విరివిగా చదివిన అనుభవం నాకూ వుంది.
మా..తూ.గో.జి కి చెందిన సుబ్బారావు గారు,మీ విజయనగరం లో స్తిరపడి,మన సుబ్బారావు,మనందరి సుబ్బారావు అయ్యారు.ఆయనను ఆయన రచనలను గుర్తు చేసిన మీరు అభినందనీయులు.
____డా.కె.ఎల్.వి.ప్రసాద్
హనంకొండ.
సన్యాసి రాజు కలిగొట్ల
అవునండీ ! మనందరి సుబ్బారావు గారు..
బెహరా ఎర్రం రాజు
నాన్నగారి కథలు జీవన ఆరాటానికి జీవన పోరాటానికి ప్రతిబింబాలు, చుట్టూ జరిగే మానవీయ సంబంధాలే అయన కధా వస్తువు, చుట్టూ తిరిగే మనుష్యులు కధ లో పాత్రలు. అప్పుడప్పుడు ప్రూఫ్ రీడర్ నేనే, నాన్నగారి చేతివ్రాత అర్ధం కాక చాలా కష్టంగా ఉండేది చదవడానికి. అప్పుడప్పుడు కధ గురించి చెప్పేవారు. కొన్ని కధ లలో పాత్రల పేర్లు మనవే. రేగలో చిరంజీవి ఒక కధలో తన పేరు చూసుకొని ఎంతగా మురిసిపోయాడో.
సన్యాసి రాజు కలిగొట్ల
అవును… ఎన్నెన్నో మరపురాని అనుభూతులు.
సన్యాసి రాజు కలిగొట్ల
బాపూజీ గారూ చక్కటి విశ్లేషణాత్మక వ్యాసం. ధన్యవాదములు.
బెహరా వెంకట సుబ్బారావు గారు, మా మేనత్త గారి భర్త. నేను హైస్కూలు చదువు వారి వద్దనే ఉండి చదువుకున్నాను. వారి రచనలు చాలా వరకు అచ్చు అవకమునుపే చదివే అవకాశం వచ్చేది. మధ్యతరగతి జీవితాలు, సమాజంలో చుట్టూ జరిగే సంఘటనలు వారి కథ వస్తువులు. సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించే వారు. వారు చెప్పడమే కాకుండా , నిజ జీవితంలో కూడా విలువలు పాటిం చేవారు. వారు, సహోద్యోగులతో , క్రింది తరగతి ఉద్యోగుల తో ఎంతో సరదాగా ఉండేవారు. ఉద్యోగ రీత్యా ఏ ఊరులో పని చేసినా , వీరి చుట్టూ ఒక సత్సంగం ఏర్పడేది. కుటుంబం లో కూడా విరంటే అందరికీ ఎంతో ప్రత్యేక అభిమానం. నన్ను కూడా వారి పిల్లలతో సమానంగా చూసుకొనే వారు. సుబ్బారావు మామయ్య గారూ సర్వీస్ చివరలో కొత్తవలస పోస్ట్ మాస్టర్ గా పనిచేసిన కాలం లో , నేను కొత్తవలస స్టేట్ బ్యాంక్ లో చేసే వాడిని. అప్పుడు తరుచూ గా వారిని కలిసి, చాలా విషయములు( సామాజిక, ప్రాపంచిక, రాజకీయ) చర్చించే వారము. వీరి మిగిలిన కథలు కూడా పుస్తక రూపం లో వస్తే, ఈ తరం పాఠకులకు ఎంతో ఉపయుక్తం. వీరితో అనుభందం ఏర్పడడమనేది నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టం గా భావిస్తున్నాను.
__కలిగొట్ల సన్యాసి రాజు
బాపూజీ కానూరు
మీ ఆత్మీయ స్పందన కు ధన్యవాదాలు సార్…
బెహరా ఎర్రం రాజు
అది నీ అభిమానం. నిజమే నువ్వు అన్నట్టుగా అందరిని సమానం గానే చూసేవారు.
BSN Murty
బెహార వెంకట సుబ్బారావు గారి రెండవ అబ్బాయి గా వారి కధలు ప్రచురితమవకముందే చదివే భాగ్యము కలిగేది. చదివాక మా అభిప్రాయాలను తెలుసుకొనే వారు. వారి కధలలో 70-90 ల మధ్య ప్రభుత్వ కార్యలయాల్లో పనితీరును కళ్ళకు కట్టినట్లు చుపెంచే వారు. సునిశితముగా విమర్శించే వారు. మధ్య తరగతి మానవుల జీవన విధానము మరీ ముఖ్యముగా ఉత్తరాంధ్ర ప్రజల వ్యవహార శైలి కళ్ళకు కట్టినట్లుగా చిత్రించే వారు. కుటుంభ సభ్యులమద్య సంభంద భాంధవ్యములను, అనురాగము, ఆప్యాయతలను, అసూయా ద్వేషాలను చూపించే వారు. ప్రతి కధ ముగింపు లోను ఒక మెరుపు వుండేది. సామాజిక నీతిని ప్రత్యక్షము గా కాకుండా అంతర్లీనము గా చిత్రీకరించే వారు. వారి కదల సంపుటి చదవ గోరె వారు 9848318 204 ను సంప్రదించ గలరు.
ఇక ఇంత చక్కగా మా తండ్రి గారిని ప్రస్తుత తరము కు పరిచయము చేసిన బాపూజీ నా సహపాఠీ, మిత్రుడు కావడము నా అదృష్టము. మా తండ్రి గారి జీవితమ లో ప్రతి కోణాన్ని స్పృశించి చక్కగా వివరించిన బాపు అత్యంత శ్లాఘనీయుడు. పాత తరము లో విశేష కృషి చేసిన పెద్దల గురించి ప్రస్తుత తరానికి తెలియ జేస్తున్న అతనికి ప్రత్యెక అభినందలు మరియు కృతజ్ఞతలు. సాహిత్య రంగానికి ఆయన చేస్తున్న సేవ అమోఘము.
చాల చక్కగా స్పందించి తమ అభిప్రాయాలను తెలియ బరచిన Dr. KLV Prasad గార్కి మా కుటుంభ సభ్యులందరి తరుపున ధన్యవాదములు. మా సన్యాసి రాజు గారిని విడిగా మేము భావించ లేము. తను మా నాన్న గారిపై ప్రతి సందర్భములో ప్రకటించే అభిమానానికి పరవశులమవడము మాకు అలవాటు.
BSN Murty
ధన్యవాదాలు. మీ అభిప్రాయం మాకు ఎంతో ఆనందం కల్గించింది.