[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఖాజా హుసేనూ, ఫాతింబీ అన్నం తింటూంటారు. మస్తాను తామంటే అభిమానమని, అందుకే చేపలు తెచ్చిచ్చి ఉంటాడని అనుకుంటారు. తిన్నాకా, బొంత పరుచుకుని పడుకుంటారు. భర్త ఇంకా పెళ్ళిరోజు కయాసలోకి రాలేదని గ్రహించిన ఫాతింబీ ఏం జరిగిందని అడిగితే, జరిగినదంతా చెప్తాడు హుసేన్. ఏం పరవాలేదు, అల్లా ఏదో ఒక దారి చూపిస్తాడంటుంది ఫాతింబీ. కూతురు హసీనా ఉత్తరం రాసిందనీ, రంజాను పండుగకి అందరూ వస్తున్నారని చెబుతుంది. కుడుకు జహంగీర్ కూడా వస్తాడని అంటూ పండగకి వచ్చే కూతురు అల్లుడికి, తమకి బట్టలు కొనాలని, అందుకు ఈ నాలుగు దినాలు కష్టపడాలని అంటాడు హుసేన్. సుంకులమ్మ తిరనాళలో అరటిపళ్ల అంగడి పెడతాడు. భార్యాభర్తలిద్దరూ అమ్మితే పద్మూడు నూర్లు వస్తాయి. పండగకి రెండ్రోజులు ముందే కూతురు అల్లుడు వస్తారు. మరునాడు జహంగీర్ వస్తాడు. అందరూ కొత్తబట్టలు వేసుకుని, చక్కని వంటలు చేసుకుని పండుగ బాగా చేసుకుంటారు. అయితే వ్యాపారం ఏమవుతుందోనన్న దిగులు హుసేనును వదలదు. అది గమనించిన అల్లుడు ఏమైందని అడిగితే ఫాతింబీ విషయమంతా అల్లునికి చెప్తుంటే, కొడుకు కూడా వింటాడు. కాలం మారిపోయిందనీ, ప్రపంచంలో అరటిపళ్ల వ్యాపారమొకటే లేదని, ఈ ఇల్లమ్మేసి గద్వాల వచ్చేయమని, అందరం కలిసుందామని, అక్కడే పళ్ళ వ్యాపారం చేసుకోవచ్చని చెప్తాడు. జహంగీర్ కూడా అదే మాట చెప్తాడు. భార్య కూడా గద్వాల వెళ్ళిపోదామని అనగానే, సరేనంటాడు హుసేన్. తన భవనంలో రుక్మాంగద రెడ్డి అరుగు మీద కూర్చుని ఉంటాడు. ఇంతలో ఒక కారొచ్చి ఆగుతుంది. దాంట్లోంచి ఆయన కొడుకు నరసింహ రెడ్డి దిగుతాడు. నాయనను పలకరించి, బయటకొచ్చిన అమ్మనీ, వంటామె సునందమ్మని పలకరిస్తాడు. పిన్ని వాళ్ళు రాలేదమని తండ్రి అడిగితే మర్నాడు ఉదయానికి వస్తారని చెప్తాడు. ఈ లోపు మద్దిలేటి పెండ్లాము వచ్చి రెడ్డికి దండం పెట్టి కొంచెం డబ్బు కావాలని అడిగి, తీసుకువెళ్తుంది. మర్నాడు రుక్మాంగద రెడ్డి మరదలు సుజాతమ్మ, ఆమె కూతురు రుక్మిణి వస్తారు. మర్నాడు ఉగాది పండుగ. అంతకు ముందే తొగర్చేటి నుండి జీపుల కేశవ రెడ్డి, ఆయన పెండ్లము దమయంతి, కొడుకు నిరంజన్ రెడ్డి వచ్చారు. అందరూ కల్సి పండుగా బాగా జరుపుకుంటారు. కేశవరెడ్డి తాను -సిమెంటు, యూరియా డీలరుషిప్ తీసుకుని కర్నూలులో స్థిరపడదామని అనుకుంటున్నట్టు చెప్తాడు. తాను కూడా భాగస్వామినవుతాననీ, అందరం కర్నూలు వెళ్ళిపోదామని అంటాడు రుక్మాంగద రెడ్డి. కేశవరెడ్డి కొడుకు నిరంజన్‌ని పది అయిపోయాకా, తన దగ్గరకి పంపమంటుంది సుజాతమ్మ. వాడు వస్తానంటాడు. ఇక చదవండి.]
కొండారెడ్డి సుంకులమ్మగుడి సేను కాడ మిరపతోటకు నీల్లు బెడతాండాడు. మోటరేసి గంట గుడ్క గాల్యా. మొత్తం మిరపశెట్లు ఎకరన్నర నాటుకున్నారు. అర్దెకరం గుడ్క తడవల్యా. బోరింగు కాడ నుంచి తవ్విన మెయిను కాలవ ఎంబడి నీల్లు పారతాన్నాయి. గెనం కాడ మడవ తీసి, కాలవకు ఆ మన్ను అడ్డమేసినాడు. నీల్లు మడిలోకి పోబట్నాయి. ఇప్పటికి ఎనిమిది మల్లకు నీళ్లు కట్టడం అయిపోయినాది. ఇది తొమ్మిదో మడి. శేను కడ్డంగా మిరప మల్లు జేసినారు. రెండొరుసలు. ఒక్కోదాంట్లో పన్నెండు మల్లు, సాల్లు మాత్రం శేని పొడుగునా ఉంటాయి. శెట్లకు నీల్లు నిలబడనీకె గెసాలు నూకి మల్లు జేసినారు.
కొండారెడ్డి తలకాయ ఎత్తి పొద్దు పక్క జూసినాడు. తను పైటాల బువ్వ దిని కుంచేపు తుమ్మ సెట్టు కింద శారగిల బడి, మోటరేసినాడు. ఇంకా రెండు బారలకు పైనే పొద్దుండాది. ‘అంటే నాలుగు దాటింటాది’ అనుకున్నాడు.
‘పొద్దుగుంకే తాలికి మిరప తోటకు నీల్లు కట్టడం అయిపోతాది’ అనుకున్నాడు కొండారెడ్డి. రెండు నిమిసాలకే మెయిను కాలువెంబడి నీల్లు రావడం తగ్గిపోబట్నాది.
“తూ, దీనెమ్మ కరంటు బోయినట్టుంది!” అని పైకే అనుకున్నాడు. “పొద్దుట్నించి లేదు. అంబటి పొద్దు దాటినంక శానా సేపటికి ఇచ్చినాడు. అర్దెకరా తడిసినాది అంతే! సీకటిబడే లోపు మిరపతోట నానితే, రేపు పొద్దున టమేట తోట తడుపుకోవచ్చు అనుకోనింటి. ఈ మూడు గాసుల కరెంటు మల్లా వస్తాదో రాదో!” అని శానా ఎదారుబడినాడు కొండారెడ్డి.
బుడ్డలు గిట్టుబాటు గావడంల్యా అని మిరప, వంగ, టమేట ఏసినారు సేనంతా. ఈ పంటలకు డైరెట్టుగా ఇత్తనం ఎయ్యరు. ముందు నారుమడి జేసుకోని, నారు అడుగెత్తు ఎదిగినంక ఏర్లతో తీసి, ఏర్లు ఆరిపోకుండా ఏర్ల సుట్టూ, ఉల్లిగడ్డలు ఏసే గోనె సంచీలను తడిపి సుడతారు. ఆ సంచులు మామూలు గోనెల మాదిరి గాకుండా, సందులు ఎక్కువుండి, ఏరకు బాగా గాలి పారతాది.
మిరపనార, వంగనార, టమీటనార, ప్రతి రైతూ సొంతం పెంచుకోలేడు. దానికి శానా జోపానం (నైపుణ్యం, పోషణ) గావాల. అవిట్ని పెంచనీకె లద్దగిరి, నాగలాపురం, బింగిదొడ్డి, కోశినాపల్లె ఈ ఊర్లలో రైతులు ఉంటారు. వాండ్లు మల్లు చేసి, యిత్తనాలు జల్లి, నార పోస్తారు. ఇటుపక్కబోతే మదారుపురం, గుంటుపల్లె, అముకుదాడు, బోగోలు, గోవర్ధనగిరి గ్రామాల్లో గూడ ఈ నార పెంచుతారు. ఇదిగాక, శెండు పూల నార (బంతి), శామంతి నార, ఉల్లి నార గుడ్క బోస్తారు. వాండ్ల కాడికి బోయి యా నార ఎంతగావాలో చెప్తే, అంటే ఎకరానా అద్దెకరానా, అట్ట. కరక్టుగా నార పీకి ఉల్లిగడ్డల గోనె సంచిలో ఏర్లను చుట్టి ప్యాకింగు జేసి యిస్తారు. ఆ నార రెండుమూడు దినాలయినా సావదు, వాడుబట్టదు.
దాన్ని దీసుకొచ్చి రైతులు తమ సేన్లలో నాటుకుంటారు. ముందుగాల శేనును గొర్రుతో సాల్లు తోలుకోని, సాల్లెంబడి నీల్లిడుస్తారు. సాల్లలో బాగా బురద బురదగా ఉండంగనే నారను ఒక్క మొక్కకు అడుగున్నర వార (దూరం) ఉండేటట్టు భూమిలో రెండించుల లోతుకు గుచ్చుతారు.
ఒక దినంలోనే నార నిలదొక్కుకోని, నిక్కినిలబడతాది. ఈ పంటలకు ఎక్కువ నీల్లు పెట్టబన్ల్యా. అరుదడి సరిపోతాది. రైతు అదురుట్టం బాగుండి రెండోజుల్లో పదును వాన పడిందంటే మొక్కలు పసరుగక్కుతా పెరగబడ్తాయి. ల్యాకపోయినా బోర్లున్నోల్లు వారం పది దినాలకు నీల్లు బెడ్తారు.
శేనిని గెనాలతో మల్లుగా జేసుకుంటారు. గెనెమంటే అర్దడుగెత్తున మన్ను ఎగనూకి గట్టు మాదిరి జేస్తారు. ఎందుకంటే నీల్లు పెట్టినపుడు పారిపోకుండా నిలబడనీకె. గెనెం సగం వరకు మల్లో నీల్లు నిండినంక కాలవలో మడవ తిప్పి, ప్రక్క మడిలోకి ఇడుస్తారు నీల్లను. దీని వలన శేనికి పెట్టిన ఎరువులు గుడ్క బాగ మొక్కలకు పడతాయి.
కొండారెడ్డి ఉస్సురనుకుంటు బోరు కాడికి బోయినాడు. హోస్ పైపుల నుంచి నీల్లు సుక్కలుసుక్కలు కారుతాండాయి. బోరుకు పక్కనే మోటరు కోసరం ఒక శెడ్డు ఏసినారు. నాలుగడుగులు ఇటిక గోడ లేపి పిలెస్టరు జేసి దాని మిందకు యాజ్బెస్టాస్ రేకులు దింపినారు. రేకుల కాదారంగా మధ్యన ఒక తాటి దూలము రెండు ఇనప తంబాల మీద అడ్డంగా ఏసి దానికి గాడిలు ఏసి తాటి రీపర్లు యాటవాలుగ గోడల మిందికి దింపినారు. ఒక్కొక్క రీపరు మధ్యన రెండడుగుల వార ఉండాది. రేకులు ఎగిరిపోకుండ అవిట్ని రీపర్లకు నట్లు, బోల్టులతో బిగించినారు.
ముందు పక్క శెడ్డు లోనికి బోనీకి శెక్క తలుపుండాది. కొండారెడ్డి లోనికి బోయి మోటారు మింద చెయ్యి బెట్టి చూసినాడు. అది గోరెచ్చగానే ఉండాది. ఒక పక్క మాత్రం ఇనప తంబానికి శెక్క బలగొట్టి, దాని మింద స్టార్టరు, మూడు పీజులు, మూడు ఇరవైఐదు క్యాండిల్ల బల్బులు బిగించినారు ఓల్డర్లకు. ఆ మూడు ఎలిగితేనే కరంటు మూడు పీజుల్లో వస్తునట్లు. యా ఒక్క బల్బు మినికినా, మోటరు ఆపీయాల. ల్యాకపోతే కాలిపోతాది. మోటరు కాలిపోయిందంటే అది శాన కత అయితాది. దాన్ని రీవైండింగు జేయిచ్చనీకే కర్నూలకి దీస్కపోవాల. ఆడ మెకానిక్కు రెండు దినాలని జెప్పి వారం దినాలు జేస్తాడు. ఈ లోపల శేని ఎండి పోతుంటాది. ఇప్పదీసినారంటే, బేరింగులు అరిగినాయి, అది మార్చాల ఇది మార్చాల అని దుడ్డు గుంజుతారు మెకానికులు.
కరంటు పోతూనే అదంతకదే ఆగిపోయే స్టార్లర్లు వచ్చినాయి ఆ మజ్ఞన. అవిట్ని ‘కిల్బర్న్’ స్టార్టర్లు అంటారు. అవి కరీదెక్కువ గాని, మోటరు సేఫ్టీగ ఉంటాది. అంతకు ముందు పాత రకం ఉండేటివి. సిచ్చ ఒత్తే పద్దతి గాకుండా ఒక లివరు మాదిరి స్టార్టరు పక్కన ఉండి దానికి మనం పట్టుకున్నీకె ఒక పిలేస్టికు గుబ్బ ఉంటాది. దాన్ని పట్టుకుని పైకి లేపి పెడితే మోటరు స్టార్టయితాది.
కానీ కరెంటు పోయినప్పుడు ఒక్కసారి అది అంతకదే కిందికి రాదు. పొరపాటున రైతుగాన దాన్ని కిందికనడం మరిసిపోయి ఇంటికి పోయినాడంటే, కరెంటు వచ్చినపుడు మల్లా మోటరు ఆనయిపోయి, శేనంతా నీల్లు బారతాయి. గెనాలన్నీ తెగిపోయి, మల్లన్నీ అగమయితాయి. అంద్రీ ఏటికి వరదలొచ్చినట్లు శేనంతా నీల్లతో తాండవమాడతాది. ఈ లోపల మోటరు శానా ఏడెక్కి కాలిపోతోంది. లేదా బోరులో నీల్లు తక్కువ ఉంటే బురద రాల్లు, అన్నీ పైకి గొడ్తాది మోటరు. మల్లా ఇదంత సరిజేసుకునీకె కురుచ్చేత్ర యుద్ధం చెయ్యాల రైతు!
ఇప్పుడలాంటి స్టార్టర్లే లేవు. కాబట్టి రైతు ఆయిగా ఉండాడు. కొండారెడ్డి శెడ్డు లోకి బోయి ఒక మూలన గోడ కానించిన నులకమంచం వంచి, కోడు మిందేసిన బొంత తల కట్టున బెట్టుకుని పండుకున్నాడు.
‘కరంటు గిన వస్తే బాగుండు’ అనుకున్నాడు శానా సార్లు. వస్తే అది కరంటెట్టవుతాది. ‘వాన రాకడ పానం పోకడ సామతి దీనికి గుడ్క సరిగ్గా సరిపోతాంది’ అనుకుని నవ్వుకున్నాడు కొండారెడ్డి,
పొద్దు నీరెండకు దిరిగినాది. డోను నుంచి కర్నూలుకు బోయే లోకలు దడదడమనుకుంటూ ఎల్లిపోయినాది. కొండారెడ్డి లేసి బయటికి వచ్చి రైలును పోయేంతవరకూ సూస్తా నిలబడినాడు.
పడమటి దిక్కున సూర్యుడు నారింజ రంగుకు దిరిగినాడు. ఆ యప్పను కండ్లతోని ఆయిగ సూడనీకె అయితుంది. కుంచీపు సూర్యున్ని చూసినాడు.
‘పొద్దుగాల నుంచి ఈ యప్ప మార్సినన్ని రంగులు ఎవరూ మార్చరు’ అనుకున్నాడు. ‘ఏదెటు బోయినా ఆ యప్ప తన గతి మాత్రం మార్చుకోకుండా లోకాన్ని రచ్చిస్తాడు’ అనుకొని సూర్యునికి చేతులెత్తి దండం బెట్టుకున్నాడు. కొంచేపటికి ఆ యప్ప గుడ్క కొండ కిందికి దిగిపోయినాడు.
ఎంటనే ఎలుగు తగ్గబట్నాది. పచ్చులు కూతలు బెట్టుకుంటా సుంకులమ్మ గుడి సుట్టూ ఉన్న పెద్ద పెద్ద శెట్ల మిందకు చేరుకోబట్నాయి. కుంచేపటికి వాటి సద్దు గుడ్క మనిగింది. ‘దినమంతా తిరిగి ఆగారం సంపాచ్చుకొనీకె నానా తిప్పలు బడి, మునిమాపు యాలకు గూల్లు చేరుకున్నాయి ఎలుగులు’ అనుకున్నాడు కొండారెడ్డి. ‘మనుసులు గుడ్క అంతే గద!’ అనుకుని నవ్వుకున్నాడు. ‘ఈ యాతన ప్రతి జీవికి బెట్నాడా పరాత్పరుడు. అదే ల్యాకపోతే దానెమ్మ బతుక్కు అర్దమే ల్యాకుండ బోతది’ అనుకుని శెడ్డు లోకి బోయి శిలుక్కు తగిలించిన అంగీ తీసి ఏసుకొని, తువ్వాల భుజం మింద వేసుకున్నాడు. అడ్డపంచ కట్టుకున్నాడు.
సేనుకు నీల్లు పెట్టేప్పుడు ఉత్త డ్రాయరు బనియను మీదనే పని చేసినాడు. అది బాగుంటంది. మడవలు తిప్పే సలికె (పార) శెడ్డులో పెట్టి, రీపరుకు యాలాడుతున్న ఎంకటేసుల పటానికి మొక్కి, గూట్లోని బీగం, బీగం సెవులు తీసుకుంటాంటే సిచ్చి బోర్డుకున్న బల్బులు గుప్పున మూడు ఒకేసారి ఎలిగినాయి.
‘ఇప్పుడొచ్చినా ఏం లాబం?’ అనుకోని అవిట్ని ఆర్పేసి, శెడ్డుకు బీగమేసి ఇంటికి ఎలబారాడు కొండారెడ్డి. ‘రేపన్నా శేను తడపక పోతే రెండు దినాల కిందట సల్లిన గోమోరు ఏడికి మొక్కలు వాడుబడతాయి. రేపు సాయంత్రం వరకు జూసి, కాకపోతే నాలుగు బ్యాటరీల టార్సిలైటు తీసుకొని, నేశె ఎల్లసామిని తోడు రమ్మని రేతిరైనా పారించాల’ అనుకున్నాడు. అట్టా అనుకున్నాక ఆ యప్పకు మనుసు నిమ్మలించినాది.
***
ఇంటికి బోయే తలికి ఈది దీపాలు బెట్నారు. పాత గిత్తలు గోరంట్ల తిర్నాలలో అమ్మేసినాడు కొండారెడ్డి, బాడిక్కు ట్రాకటరు తోన సేద్దం జేయిచ్చుకుంటున్నాడు. అంతర పంట సేద్దం మటుకు ఉప్పరి రామాంజులు గెడంతో సేపిచ్చుకుంటాడు. ఇంటి ముందల ఎద్దులు ల్యాక బోసిపోయినాది. గోపెమ్మ గుడ్క చచ్చిపోయి మూడేండ్లు దాటె. ఆ యమ్మ పెయ్యదూడ మాత్రం పెద్దదయి మూడీతలు ఈనినాది. తొలిత పెయ్యది పాలిడిసినంక సెల్లెలింటికి దోలిచ్చినాడు. రెండో మలిత కోడెదూడ బుట్నాది. రెండేల్లకు రబసమైన గిత్తయినాది. దానికి జత దెచ్చుకోని మల్లా సొంత గెడం చేసుకోవాలని శానా ఇదయినాడుగాని, జత గిత్త పదేలు బెడితే గాని రాదు. శాతగాక గమ్మునుండొడు.
మూడో ఈత మల్ల పెయ్యవేసినాది. అది గుడ్క ఈమద్య ‘ఎద’ కొచ్చినాది. ఉప్పరి రామాంజులు గిత్తతోనే దాటించినాడు. ఏదో ఇంట్లో పాల సుక్కకు కరువు ల్యాకుండా ఇగ్గు కొస్తాండాయి గోపెమ్మలు.
కాలు సేతులు గోలెం కాడ కడుక్కోని లోపలికి బోయినాడు కొండారెడ్డి. నాగరత్నమ్మ పడసాలలోన గూసోని ఇసుర్రాయిలోన కందులు యిసురుతున్నాది. మొగున్ని జూసి “ఇదిగో ఐపాయ. ‘టీ’ సేసిస్తా తాళు” అన్నాది. ఆ యమ్మకు గుడ్క మునుపటి సత్తవ ఉండడముల్యా. ఇద్దురికీ అరవై దగ్గరబడుతుండాయి.
కొండారెడ్డికి గుడ్క సాయంత్రము టీ అలవాటయినాది. కాపీ కంటె టీ కర్చు అగ్గవ పడతాదని శానామంది ఈ ముద్దన టీ తాగబట్నారు. నాగరత్నమ్మ మాత్రము పొద్దున కాపీ తాగుతాది. ఆ యమ్మకు టీ అంటే గిట్టదు.
పెండ్లామిచ్చిన టీ తాగి బైటికి ఎలబార్నాడు. అవుసరమైతీ రేపు రాత్రికి శేను తడపనీకె పెద్ద టార్సి పట్టుకోనీకె నీశె ఎల్లసామినన్నా, ఆ యప్పకు బిడువు ల్యాకపోతే మాల దాసప్ప నన్నా రమ్మని సెప్పనీకె బోయినాడు. ఎల్లసామి “వస్తాలే మామా” అని జెప్పినాడు.
ఇంటికొచ్చేతలికి ఎనిమిది గాల్యా. నాగరత్నమ్మ వంటవేసి, ఈ యప్ప కోసరం చూస్తాండాది.
“పిల్లోండ్లు టూసను కాన్నించి ఇంకా రాల్యా?” అనడిగినాడు ఆ యమ్మను. “వచ్చాంటారు, టైమయినాది” అనింది ఆ యమ్మ. రెండోవాడు లింగారెడ్డి టెంతు కొచ్చిండాడు. మూడోవాడు కంబిరెడ్డి ఎనిమిది. పార్వతీశం సారని ఒక అయ్యవారు బొమ్మిరెడ్డిపల్లె లోన రెండేండ్ల నుంచి కాపరం బెట్టినాడు. సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకూ స్కూలు పిల్లోండ్లకు టూసను చెప్పుతాడా యప్ప. లెక్కలు, ఇంగ్లీషు, సైన్సు చెప్తాడు. నెలకు ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఒక్క స్టూడెంటు కాడ.
కంబిరెడ్డి శానా సురుకు సదువులోన. వానికి మంచి మార్కులు వస్తాండాయి. కానీ లింగారెడ్డికి మాత్రం సదువు మింద అంత కయాస లేదు. టెంతు పాసయితాడో తేదో అనుమానమే కొండారెడ్డికి.
బిడ్డ సుజాత డోను ఆడపిల్లల జూనియర్ కాలేజిలో ఇంటరు రెండో సమచ్చరం సదువుతాండాది. ఎంపీసి గ్రూపు. ఆ యమ్మి శానా తెలివయినది. ఎట్టయినా గాని ఇంజనీరింగు చెయ్యాలనేది సుజాత పట్టుదల.
డోనుల నాగరత్నమ్మ బందువులుండారు. వాండ్లకు ఆడ ఒక పిండిగిర్ని ఉండాది. సుజాతను వాండ్లింట్లో పెట్టినారు. వాండ్లకు గుడ్క కొనా మొదులు ఒక మనిసిని సాకాలంటే బరువై తాందని, నెలకు నూటయాభై రూపాయలు ఇస్తారు. డోనులో ఆడపిల్లలకు ఆస్టలు లేదు.
కొడుకులిద్దరూ వచ్చినారు. కాలుసేతులు కడుక్కున్నారు. సిన్నోడు నాయిన కాడికొచ్చి “రేపు పది రూపాయిలు గావాలి, కొత్తది కంపాసుపెట్టి కొనుకుంటాను” అని అడిగినాడు.
“ఆరు లోన చేరేటప్పుడే గద కొనిచ్చినా. అప్పుడే అది పనికి రాకుండబోయిందారా నాయినా” అన్నాడు తండ్రి.
“పాతదయిపోయినాది నాయినా, అది రేకుది. ఇప్పడు ప్లాస్టిక్‌వి వస్తాన్నాయి. ‘అశోకా’ కంపెనీవి ఎంత బాగుంటాయనుకున్నావు? అది కొనుక్కుంటాను యియ్యి నాయనా!” అని బంగపోబట్నాడు.
కడగొట్టాడని వాడంటే పానం తల్లికి. “ఇస్తాడులే. పాండి బువ్వ తిందాము” అనిందా యమ్మ.
“అడిగినవన్నీ కొనిచ్చి ఈ నాకొడుకును నివ్వే సెడగొడుతుండావమ్మే!” అన్నాడు కొండారెడ్డి. “ఎక్కడలేని సోకులు గావాల వీనికి. మొన్ననే గదూ సెప్పులు తెగిపోయినాయంటే ఇరవై రూపాయలిచ్చినా.”
“నా కొడుకు, నా కొడుకని తిడితే ఊరుకునేదిల్యా” అన్నాడు వాడు రోసంగా.
కొండారెడ్డికి వాని కోపం జూసి శానా నవ్వు వచ్చినాది.
“నా కొడుకువే గదరా, నా కొడుకును నా కొడుకనక యింకేమనాల?” అన్నాడు తండ్రి.
“ఏం ల్యా. అది తిట్టు అని నాకు తెలుసు” అన్నాడు వాడు. కానీ నాయిన నవ్వడం జూసి వాని కోపం తగ్గిపోయినాది. ఆ యప్పకాడ వచ్చి గూసున్నాడు. “అయితే ఇస్తావా మల్ల” అన్నాడు.
“ఇయ్యకపోతే నీవు ఊకున్నా మీ యమ్మ ఊకోదుగదా!” అన్నాడు నాయిన. అందరూ నగినారు. వారపాగు లోన బోజనానికి గూసున్నారు.
పొద్దున తీసిన గోగాకు పప్పు అయిపోతే, పెసర బ్యాడలతో పప్పుపులుసు చేసినాది నాగరత్నమ్మ. దాంట్లో ముదురు వంకాయలు తరిగి ఏసినాది. అప్పుడే తిరగమోత ఏసినాదేమో, సట్టి మూత తియ్యంగానే గుమగుమ వాసనొచ్చినది.
అందరూ స్టీలు తట్టలు బెట్టుకున్నారు. తలా రెండు అస్తాలు వరన్నం బెట్టి, పప్పు పులుసు బోసినాది. తరువాత మజ్జిగ తోన తిన్నారు. మజ్ఞగన్నం లోకి పొద్దుతిరుగుడు గింజల పొడి ఏసుకున్నారు. ఈ మధ్యన కొర్రలు, జొన్నలు తినడం తగ్గిపోయింది. కొర్ర పంట ఎయ్యడమే లేదసలు. జొన్న మాత్రం మెట్టపంటగా ఏస్తన్నారు. జొన్నరొట్టెలు మాత్రం పొద్దున టిపనుకు చేసుకుంటారు. సత్తుగిన్నెలు, మట్టి దాకలు గుడ్క పోయినాయి. అంతా స్టీలే. శానామంది కిరసిన్ స్టవ్వులు, పంపు స్టవ్వులు వాడబట్నారు. రైతులిండ్లలో మటుకు ఇంకా కట్టెల పొయ్యిలున్నాయి. అవిటి మింద స్టీలు గిన్నెలు పెట్టగూడ్దు కాబట్టి, కంచు, ఇత్తడి తప్యాలలు వాడతన్నారు. కొండారెడ్డి౦ట్లో కట్టెల పొయ్యి గాక, ఒక కిరసిన్ స్టవ్ గుడ్క ఉన్నాది. టీ, శారు జెయ్యానికె నాగరత్నమ్మ దాన్ని వాడతాది.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-13
బేరం
సినిమా క్విజ్-105
జగన్నాథ పండితరాయలు-22
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-9
కైంకర్యము-39
మానస సంచరరే-39: ‘మృత్యోర్మా అమృతంగమయ’!
వెలుతురు చిగుళ్ళు
చెన్నై సాహిత్యసభ – నివేదిక
పెద్దమ్మతల్లి కరోనా పాదాలు!!
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®